You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'చనిపోయిన నిందితుడి'ని కోర్టుకు తెచ్చి 14 ఏళ్ల శిక్ష వేయించిన అత్యాచార బాధితురాలి తల్లి, అసలేం జరిగింది?
బిహార్‌లోని ఒక కుగ్రామానికి చెందిన ఓ మహిళకు, తన కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మరణించాడని సమాచారం అందింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ వ్యక్తిపై ఉన్న రేప్ కేసును పోలీసులు క్లోజ్ చేశారు.
కానీ, నిందితుడు చనిపోయాడంటే ఆ తల్లికి నమ్మకం కలగలేదు. అందుకే ఆమె నిజాలను కనుక్కునే ప్రయత్నం ప్రారంభించారు. చివరకు కేసును మళ్లీ తెరిపించి, తన కూతురుకు న్యాయం జరిగేలా చేశారు.
బిహార్‌లో జరిగిన ఈ కేసును బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిస్వాస్ పరిశోధించారు.
అది 2022 ఫిబ్రవరి నెల. ఒక రోజు ఉదయం గంగానది ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు వారు అక్కడికి చేరుకున్నారు. ఆ ఇద్దరు కట్టెలు పేర్చారు. అయితే విచిత్రంగా అక్కడ శవం లేదు.
ఆ ఇద్దరూ శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత అక్కడ చాలా విచిత్రాలు జరిగాయి.
ఇద్దరిలో ఒకరు చితిని పేర్చడం పూర్తి చేశారు. మరొకరు దానిపై పడుకుని, తెల్లటి ముసుగు కప్పుకుని, కళ్లు మూసుకున్నారు.
చితిపై పడుకున్న వ్యక్తి తల మాత్రం కనిపించేలా రెండో వ్యక్తి చితిని పూర్తిగా పేర్చారు.
ఈ దృశ్యాలతో రెండు ఫొటోలు కూడా తీసుకున్నారు. అయితే, ఇద్దరూ ఫొటోలో కనిపించడంతో మరి ఈ ఫొటోలు ఎవరు తీశారు, అక్కడ మూడో వ్యక్తి ఉన్నారా అన్నది స్పష్టంగా తెలియరాలేదు.
చితి మీద పడుకుని ఉన్న వ్యక్తి పేరు నీరజ్ మోదీ. వయసు 39 ఏళ్లు. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అవతలి వ్యక్తి ఆయన తండ్రి అరవై ఏళ్ల రాజారాం మోదీ , ఆయనొక రైతు.
అంత్యక్రియలు ముగిశాక రాజారాం మోదీ 100 కి.మీ. దూరంలో ఉన్న ఒక న్యాయవాదితో కలిసి కోర్టుకు వెళ్లారు.
తన కుమారుడు నీరజ్ మోదీ 2022 ఫిబ్రవరి 27న తమ గ్రామంలో ఉన్న ఇంట్లో మరణించాడంటూ సంతకాలున్న ఒక అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు.
దహన సంస్కారాల వద్ద తీసిన రెండు ఫొటోలను, కర్మ కోసం కొనుగోలు చేసిన కట్టెల రశీదులను సాక్ష్యంగా అందించారు.
నీరజ్ మోదీపై పోలీసుగు అత్యాచార అభియోగాలు నమోదైన ఆరు రోజుల తర్వాత ఇది జరిగింది.
అసలేం జరిగింది?
2018 అక్టోబర్‌లో తన విద్యార్థిని అయిన 12 ఏళ్ల బాలికపై నీరజ్ మోదీ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. చెరుకు తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెపై అఘాయిత్యం జరిగింది.
అత్యాచార ఘటనను చిత్రీకరించానని, ఎవరికైనా చెబితే ఫుటేజీని ఆన్‌లైన్‌లో విడుదల చేస్తానని బాలికను బెదిరించారు నీరజ్.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నీరజ్ మోదీని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే రెండు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు నీరజ్.
గతేడాది ఫిబ్రవరిలో నీరజ్ మోదీ "మరణం" తర్వాత చాలా విషయాలు వేగంగా జరిగిపోయాయి.
తన కొడుకు మరణించాడంటూ ఆయన తండ్రి కోర్టుకు తెలియజేసిన 2 నెలల తర్వాత, స్థానిక అధికారులు నీరజ్ మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు.
కేసులో ఉన్న ఏకైక నిందితుడు చనిపోయినందున గతేడాది మే నెలలో కోర్టు విచారణను క్లోజ్ చేసింది.
అయితే ఒక్క వ్యక్తి మాత్రం నిందితుడి మరణాన్ని నమ్మలేదు. నేరం నుంచి తప్పించుకోవడానికి నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడని అనుమానించారు. ఆమె మరెవరో కాదు, బాధితురాలి తల్లి.
'' నీరజ్ మోదీ చనిపోయాడని తెలిసిన క్షణమే అది అబద్ధం అనిపించింది. ఆయన బతికే ఉన్నాడని నాకు తెలుసు'' అని బాధితురాలి తల్లి చెప్పారు.
బాధితురాలి తల్లికి ఎందుకు అనుమానం వచ్చింది?
దేశంలోని 10 మరణాలలో ఏడు గ్రామాల్లోనే సంభవిస్తున్నాయి. అంతేకాదు ఇంట్లో చనిపోతున్న వారి సంఖ్య నగరాల కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. చట్టం ప్రకారం జనన, మరణాలపై వాస్తవాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అయితే మరణానికి కారణాలు అవసరం లేదు.
బిహార్‌లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులు మృతుడి బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యను సమర్పించాలి. మరణాన్ని ధృవీకరించడానికి అయిదుగురు గ్రామస్తుల సంతకాలను నమోదు చేయించాలి.
వీటిని స్థానిక పంచాయతీ లేదా గ్రామసభకు సమర్పించాలి. స్థానిక రిజిస్ట్రార్‌తో సహా దాని సభ్యులు పత్రాలను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే వారంలోపు మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.
"మా గ్రామాలు దగ్గరిగానే ఉన్నాయి. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. అతను మరణించాడని ఎవరికీ తెలియదు" అని బాధితురాలి న్యాయవాది జై కరణ్ గుప్తా చెప్పారు.
రాజారాం మోదీ అయిదుగురు గ్రామస్తుల సంతకాలు, బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యలు, తన కుమారుడు చనిపోయినట్లు అఫిడవిట్ సమర్పించి, మరణ ధృవీకరణ పత్రాన్ని పొందారు.
అయితే మరణానికి గల కారణాలను దానిలో పేర్కొనలేదు. కట్టెల దుకాణం రసీదులో మాత్రం "జబ్బు" కారణంగా చనిపోయినట్లు ఉంది.
గతేడాది మే నెలలో ఒకరోజు నీరజ్ మోదీ చనిపోయాడని అతనిపై కేసును మూసివేసినట్లు బాధితురాలి తరఫు లాయర్ బాధితురాలి తల్లికి చెప్పారు.
''కానీ ఉపాధ్యాయుడి మరణం గురించి ఎవరికీ తెలియలేదు? మరణానంతరం ఎందుకు కర్మలు నిర్వహించలేదు? మరణం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడలేదు?'' అని ఆమె ప్రశ్నించారు.
ఆమె ఇంటింటికి వెళ్లి నీరజ్ మోదీ చనిపోయాడా లేదా అని వాకబు చేశారు. అయితే, ఎవరూ తమకు ఆ విషయం తెలుసని చెప్పలేదు. దీంతో ఆమెకు విషయం పూర్తిగా అర్ధమైంది.
నిందితుడు బతికే ఉన్నాడంటూ కోర్టుకెక్కిన తల్లి
అత్యాచారం కేసు నిందితుడు బతికే ఉన్నాడని, దీనిపై దర్యాప్తు చేయాలంటూ బాధితురాలి తల్లి మళ్లీ కోర్టుకు వెళ్లారు. అయితే న్యాయమూర్తులు మాత్రం ఉపాధ్యాయుడు సజీవంగా ఉన్నాడని నిరూపించడానికి సాక్ష్యాలను కోరారు.
గ్రామ కౌన్సిల్ నకిలీ పత్రాల ఆధారంగా మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిందని, దానిపై దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి స్థానిక సీనియర్ అధికారి వద్ద పిటిషన్ వేశారు. దీంతో కేసులో వేగం పెరిగింది.
ఆ అధికారి విచారణకు ఆదేశించి గ్రామసభకు సమాచారం అందించారు. గ్రామ సభ సభ్యులు రాజారాం మోదీ నుంచి అతని కుమారుడి మరణానికి సంబంధించి మరిన్ని సాక్ష్యాలను కోరారు.
నీరజ్ మరణం తర్వాత తీసిన ఫోటోలు, దహన సంస్కారాలు, మండుతున్న చితి, అంత్యక్రియలు, తాజాగా అయిదుగురు సాక్షుల వాంగ్మూలాలను గ్రామ సభ కోరింది.
అంతే కాకుండా 250 ఇళ్లు ఉన్న ఆ గ్రామంలో పలువురిని కౌన్సిల్ సభ్యులు కలిశారు. నీరజ్ మోదీ మరణం గురించి వాకబు చేశారు. కానీ, ఆ విషయం తాము వినలేదని అందరూ చెప్పారు.
ఇంట్లో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గుండు కొట్టించుకోవడం హిందూ సంప్రదాయం. అయితే నీరజ్ మోదీ కుటుంబ సభ్యులెవరూ గుండు కొట్టించుకోలేదు.
‘‘నీరజ్ మోదీ బంధువులకు కూడా ఆయన మరణం గురించి లేదా ఆచూకీ గురించిన సమాచారం తెలియదు. ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉంటే ఇంట్లోనే అంత్యక్రియలు నిర్వహించి ఉండేవారని చెప్పారు'' అని పోలీసు అధికారి రోహిత్ కుమార్ పాశ్వాన్ వివరించారు.
దీంతో గ్రామసభ సభ్యులు రాజారాం మోదీని మళ్లీ ప్రశ్నించారు. అయితే తన కుమారుడి మరణానికి సంబంధించిన తాజా సాక్ష్యాధారాలను అందించడంలో ఆయన విఫలమయ్యారు.
"మేం రాజారాంను మరిన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, అతను సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు" అని కౌన్సిల్ కార్యదర్శి ధర్మేంద్ర కుమార్ అన్నారు.
నీరజ్ మోదీ మరణం అసత్యమని, మరణ ధ్రువీకరణ పత్రం కోసం తండ్రీ కొడుకులిద్దరూ నకిలీ పత్రాలను రూపొందించారని దర్యాప్తులో తేలింది.
తండ్రి అరెస్టుతో దిగివచ్చిన కొడుకు
ఉపాధ్యాయుడైన నీరజ్ తన అయిదుగురు విద్యార్థుల తల్లిదండ్రుల బయోమెట్రిక్ గుర్తింపు నంబర్లను సంపాదించారు. తన మరణ ధృవీకరణ పత్రం కోసం వారి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తాను ఏర్పాటు చేస్తున్న స్కాలర్‌షిప్‌ల కోసం తల్లిదండ్రుల గుర్తింపు నంబర్లు అవసరమని విద్యార్ధులతో నమ్మబలికి వారి ఐడెంటిటీ నంబర్లను సేకరించారు నీరజ్.
2022 మే 23న నీరజ్ మోదీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేశారు. పోలీసులు ఆయన తండ్రిని అరెస్టు చేసి ఫోర్జరీ కేసు పెట్టారు. "నా కెరీర్‌లో ఇలాంటి కేసును నేనెప్పుడూ విచారించలేదు" అని పాశ్వాన్ గుర్తుచేసుకున్నారు.
2022 జూలైలో కోర్టు కేసును మళ్లీ ప్రారంభించింది. కేసు తప్పుదారి పట్టిందని, నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోవాలనుకున్నాడని కోర్టు భావించింది. నీరజ్ మోదీని వెంటనే అరెస్టుచేయాలని బాధితురాలి తల్లి కోర్టును కోరారు. చనిపోయినట్లు ప్రకటించిన తొమ్మిది నెలల తర్వాత 2022 అక్టోబర్‌లో నీరజ్ మోదీ కోర్టులో లొంగిపోయారు.
అయితే విచారణ సందర్భంగా అత్యాచారం ఆరోపణలను ఖండిస్తూ నీరజ్ తనను సమర్థించుకున్నారు.
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నీరజ్ మోదీని దోషిగా నిర్ధారించిన కోర్టు, గత నెలలో అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది.
మరోవైపు రాజారాం మోదీ కూడా మోసం, కుట్ర అభియోగాలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నారు. ఈ ఆరోపణల ప్రకారం ఆయనకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
మరణ ధృవీకరణ పత్రానికి సంబంధించిన కేసును కూడా తండ్రి, కొడుకులు ఎదుర్కొంటున్నారు.
''నా కూతురిపై అఘాయిత్యం చేసిన వ్యక్తికి శిక్ష పడేలా చేసేందుకు మూడేళ్లకు పైగా కోర్టుకు తిరిగాను. ఒక రోజు ఆయన తరఫు లాయర్ వచ్చి నిందితుడు చనిపోయాడని చెప్పారు. మనిషి అలా గాలిలో ఎలా అదృశ్యమవుతాడు?" అని అత్యాచార బాధితురాలి తల్లి ప్రశ్నించారు.
"నిందితుడు చనిపోలేదని నిరూపించడానికి, కొత్తగా కేసులో పోరాటానికి చాలా డబ్బు ఖర్చవుతుందని న్యాయవాది చెప్పారు. నిందితులు జైలు నుంచి బయటకు వచ్చి ప్రతీకారం తీర్చుకుంటారని మరికొందరు భయపెట్టారు. నేను పట్టించుకోలేదు. డబ్బు సమకూర్చుకుంటానని చెప్పాను. భయపడేది లేదని న్యాయమూర్తికి, అధికారులకు చెప్పాను. నిజం తెలుసుకొమ్మన్నాను" అని బాధితురాలి తల్లి చెప్పారు.
పేదరికంలో బతుకీడుస్తున్న బాధిత కుటుంబం
భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రాలలో బిహార్ ఒకటి . ఆ రాష్ట్రంలోని బాధితుల గ్రామాన్ని చేరుకోవడానికి గుంతలు పడిన రోడ్లపై ఓపెన్ మురుగు కాలువలు, గుడిసెలు, పొలాలు, పొగలు కక్కుతున్న ఇటుక బట్టీల మీదుగా గంటల తరబడి ప్రయాణించారు బీబీసీ ప్రతినిధులు.
బాధితురాలి తల్లి ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి కిటికీలు లేని చిన్న ఇటుక గదిలో ఉంటున్నారు. ఆమె పెద్ద కూతురికి వివాహం అయింది.
చీకటిగా ఉన్న గదిలో కేవలం సామాన్లు మాత్రమే ఉన్నాయి. ఆ గదిలో మంచం, ధాన్యాలు నిల్వ చేయడానికి ఒక ఉక్కు పాత్ర, మట్టి స్టవ్, దుస్తులు చిందరవందరగా పడి కనిపించాయి. ఆ కుటుంబానికి భూమి కూడా లేదు.
గ్రామానికి పైపుల ద్వారా నీరు, విద్యుత్ సౌకర్యం ఉంది. ఉద్యోగం లేదు కాబట్టి అమ్మాయి తండ్రి 1,700 కి.మీ.కి పైగా దూరం ఉన్న ఒక దక్షిణాది రాష్ట్రానికి వలస వెళ్లారు. అక్కడ ఆయన మూటలు మోసే పని చేస్తూ ఇంటికి డబ్బు పంపిస్తుంటారు.
2019లో ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రభుత్వం చేపట్టిన భారీ మరుగుదొడ్డి నిర్మాణ కార్యక్రమం తర్వాత దేశంలోని 100 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించుకున్నాయని చెప్పారు. అయితే ఈ బాధితురాలి ఇంటితో సహా చాలా ఇళ్లల్లో ఇప్పటికీ మరుగుదొడ్డి లేదు.
అందుకే పక్కనే ఉన్న చెరకు తోటను మరుగుదొడ్డిగా ఉపయోగించుకునేందుకు కూతురు వెళ్లారు. ఆ సమయంలో నీరజ్ మోదీ వెనుక నుంచి బాలిక వద్దకు వెళ్లి ఆమె నోరు మూసి అత్యాచారం చేశాడని న్యాయమూర్తి లాకుష్ కుమార్ తన తీర్పులో వెల్లడించారు. దానిని నిందితుడు వీడియో తీసి ఎవరికైనా చెబితే వైరల్ చేస్తానని బెదిరించాడని తీర్పులో పేర్కొన్నారు.
భయపడి చదువు మానేసిన బాలిక
నిందితుడు బెదిరించడంతో మొదట భయపడిన బాలిక అత్యాచారం జరిగిన పది రోజుల తర్వాత విషయాన్ని తన తల్లికి చెప్పారు. దీంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. కుమార్తె కూడా సాక్ష్యం ఇచ్చారు. స్కూల్‌లో నీరజ్ మోదీ తనను తరచూ కొట్టేవాడని బాలిక పోలీసులకు తెలిపారు.
నీరజ్ మోదీని అరెస్టు చేసిన తర్వాత బాలిక తిరిగి పాఠశాలకు వెళ్లడం ప్రారంభించారు. అయితే అతను బెయిల్‌పై బయటకు రాగానే వెళ్లడం స్కూలు మానేశారు. నాలుగేళ్లుగా ఆమె పాఠశాలకు వెళ్లడం లేదు. తన పుస్తకాలను పాత పేపర్లు కొనే వ్యక్తికి అమ్మేశారు. ఆమె ఇప్పుడు చీకటి గదిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
"విద్యార్థిగా ఆమె జీవితం ముగిసింది, ఆమెను బయటకు పంపడానికి నాకు చాలా భయమేస్తోంది. పెళ్లి చేయాలని అనుకుంటున్నాం" అని ఆమె తల్లి అంటున్నారు.
అయితే చాలా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలించకుండా గ్రామసభ సర్టిఫికెట్ ఎలా ఇచ్చింది?
"సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని అడిగితే, తప్పు జరిగిందని వారు నాతో అన్నారు" అని తల్లి గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)