బిహార్: బ్రిడ్జ్‌ని దొంగలు ఎత్తుకుపోయారు

    • రచయిత, సీటూ తివారీ
    • హోదా, బీబీసీ కోసం

బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో చిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడి దేహ్రీ ప్రాంతంలోని 150 ఏళ్ల కిందటి సూర్య గడియారాన్ని(సన్ డయల్) దొంగలు ఎత్తుకెళ్లారు. తాజాగా దొంగలు ఏకంగా ఓ వంతెనలోని కొంత భాగాన్ని కట్టర్లతో కోసి లారీల్లో ఎత్తుకెళ్లిపోయారు.

జల వనరుల శాఖ ఉద్యోగులమంటూ వచ్చి దర్జాగా వంతెన ఇనుప భాగాలను కట్ చేసి లారీల్లో తరలించేశారు.

వంతెన చోరీ విషయంలో రోహ్‌తాస్ సూపరింటెండెంట్ ఆశిష్ భారతి 'బీబీసీ'తో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించామని, త్వరలోనే నిందితులను పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ చెప్పారు.

కాగా ఇప్పటివరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ దొంగతనంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో జలవనరుల శాఖలో కాలువల నిర్వహణ విభాగానికి చెందిన ఓ కార్మికుడినీ అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో తుక్కు సేకరించేవారు నలుగురు ఉన్నారు.

ఇంతకీ ఏమిటీ కేసు

రోహ్‌తాస్‌లోని విక్రమ్‌గంజ్ సబ్‌డివిజన్‌లోని నసరీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోన్ నది కాలువపై ఓ వంతెన ఉంది. దీన్ని స్థానికంగా ఆరా కెనాల్ అని పిలుస్తారు.

12 అడుగుల ఎత్తు, 60 అడుగుల పొడవు గల ఈ వంతెన అమియావార్ గ్రామ సమీపంలో ఉంది.

ఈ వంతెన చోరీకి గురవడంతో కాలువల నిర్వహణ విభాగ ఇంజినీర్ అర్శాద్ కమాల్ నసరీగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ మొత్తం ఉదంతాన్ని ఆయన బీబీసీకి వివరించారు. ''జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం ఉంటుంది. వంతెన నిర్వహణ బాధ్యత వీరే చూస్తారు. ఈ విభాగం సిబ్బంది వంతెనను తనిఖీ చేయడానికి వెళ్తుంటారు. దీన్ని అవకాశంగా తీసుకుని దొంగలు మెకానికల్ సిబ్బందిమంటూ వెళ్లారు. జలవనరుల శాఖ ఆదేశాలతో వంతెనను తొలగిస్తున్నామని స్థానికులతో చెప్పి కట్టర్లతో వంతెనను కోసేశారు'' అని చెప్పారు అర్శాద్.

వంతెను శిథిలావస్థకు చేరడంతో దానిమీదుగా వెళ్లే తమ పశువులు, ఇతర జంతువులు గాయపడే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ గతంలో స్థానికులు అర్జీలు పెట్టారు.

దీంతో దొంగలు ఇలా గ్యాస్ కట్టర్లతో వంతెనను కట్ చేస్తున్నా, జేసీబీలు, వ్యాన్‌లు తీసుకొచ్చినా స్థానికులకు అనుమానం రాలేదు.

దొంగలు మూడు రోజులపాటు వంతెన కట్ చేశారని స్థానికులు బీబీసీతో చెప్పారు.

మరి అర్శాద్ కమల్‌కు ఇదంతా ఎలా తెలిసింది?

''మరో వంతెన నిర్మాణ పనులు చూడడానికి నేను వెళ్లాను. అక్కడ ప్రజలు ఈ వంతెన తొలగింపు పనులు జరుగుతున్నాయని మాట్లాడుకోవడం విన్నాను. వెంటనే నేను అక్కడికి వెళ్లి చూశాను. అప్పటికే దొంగలు వంతెనను ఎత్తుకెళ్లారు. దాంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను'' అని చెప్పారు అర్శాద్.

చోరీకి గురైన వంతెన శిథిలావస్థలో ఉంది. 1972 ప్రాంతంలో దీన్ని నిర్మించారు. అమియావర్, చితోఖర్, ఘోంఘా, మనౌలీ, పడ్డీ గ్రామాల మధ్య రాకపోకలకు వీలుగా అప్పట్లో ఈ వంతెనను నిర్మించారు.

ఇది పాడవడంతో దీనికి సమాంతరంగా మరో వంతెన నిర్మించారు. ప్రస్తుతం ప్రజలు ఆ కొత్త వంతెన మీదుగానే రాకపోకలు సాగిస్తున్నారు.

కాగా ఈ చోరీపై స్థానిక జిల్లా పరిషత్ సభ్యుడు గాంధీ చౌధరి మాట్లాడుతూ... నీటిపారుదల శాఖ సిబ్బంది అండదండలతోనే ఇదంతా జరిగిందన్న అనుమానం వ్యక్తంచేశారు.

ఈ వంతెనలో 500 టన్నుల ఇనుము ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంజినీర్ అర్శాద్ మాత్రం.. శిథిలావస్థకు చేరడంతో అంత మొత్తంలో ఇనుము ఉండకపోవచ్చని చెప్పారు.

ఈ వంతెనకు 200 మీటర్ల దూరంలోనే జర్నలిస్ట్ జితేంద్ర కుమార్ ఇల్లు ఉంది. ఆయనతోనూ బీబీసీ మాట్లాడింది.

'' అది చాలా ఇరుకైన వంతెన. దానిపై సైకిళ్లు, బైక్‌లతో వెళ్లగలం కానీ అంతకంటే పెద్ద వాహనాలు వెళ్లవు. 500 టన్నుల ఇనుము ఉండకపోవచ్చు. ఏప్రిల్ 5న మార్నింగ్ వాక్‌కు వెళ్లినప్పుడు వంతెనను కొందరు కట్ చేస్తుండడం చూశాను. నాలాగే మార్నింగ్ వాక్‌కు వచ్చినవారు కూడా చూసినా జలవనరుల శాఖ సిబ్బందే ఇది కట్ చేస్తున్నారని అనుకున్నారు. వంతెన శిథిలమవడంతో దానిపై వెళ్లే జంతువులు అందులో చిక్కుకుని చనిపోవడం, వాటి కళేబరాలు కుళ్లి దుర్వాసన వ్యాపిస్తుండడంతో స్థానికులకూ ఇది తలనొప్పిగా మారింది' అని జితేంద్ర చెప్పారు.

ఈ చోరీపై బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. ''45 ఏళ్ల కిందటి 500 టన్నుల పురాతన వంతెనను 17 ఏళ్ల 'బీజేపీ-నితీశ్' ప్రభుత్వం పట్టపగలే దోచుకుంది'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సన్ డయల్‌ను రూ. 2 వేలకు తుక్కు కింద అమ్మేసిన దొంగలు

రోహ్‌తాస్ జిల్లాలోని డెహరీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 150 ఏళ్ల కిందటి సూర్య గడియారంలోని లోహపు శంకు భాగాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. నీటిపారుదల శాఖ క్యాంపస్‌లోనే ఈ దొంగతనం కూడా జరిగింది.

బ్రిటిషర్ల కాలంలో 1871లో ఈ సూర్య గడియారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దొంగలు ఎత్తుకెళ్లిన కొన్నాళ్లుకు పోలీసులు దీన్ని స్థానిక తుక్కు వ్యాపారి మాణిక్‌చంద్ గుప్తా నుంచి స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఈ విలువైన సూర్య గడియారాన్ని 2 వేల రూపాయలకు తనకు విక్రయించినట్లు మాణిక్ చంద్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)