You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇక్కడి కుక్కలు ‘మ్యాన్ ఈటర్లు’గా మారుతున్నాయా?
- రచయిత, విష్ణు నారాయణ
- హోదా, బెగూసరాయ్ నుంచి బీబీసీ కోసం
‘‘నాకు నాన్నమ్మ ఉండేది. కుక్కల మంద ఆమెను చంపేసింది. ఆమెను చంపేసిన కుక్కలు శరీర భాగాలను కూడా తినేశాయి. మిగిలిన శరీర భాగాలను సేకరించి వాటికి అంత్యక్రియలు చేశాం.’’
‘‘మా అమ్మ ఉదయం 10-11 గంటల మధ్య గడ్డి కోయడం కోసం పొలానికి వెళ్లింది. కుక్కలు ఎవరినో కరిచాయని అందరూ చెప్తుంటే విని మేం కూడా చూడటానికి వెళ్లాం. చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకునేసరికే అవి బాగా కరిచాయి. మేం అక్కడికి చేరుకునేసరికి అంతా జరిగిపోయింది.’’
బిహార్ రాష్ట్రం బేగూసరాయ్ జిల్లా కైదరాబాద్ పంచాయతీలో నివసించే 26 ఏళ్ల వికాస్, 33 ఏళ్ల లక్ష్మణ్ సావ చెప్పిన మాటలు ఇవి. కుక్కల దాడిలో ఒకరు తమ అమ్మను, మరొకరు తమ నాన్నమ్మను కోల్పోయారు.
ఆ మహిళలు ఇద్దరూ పని మీద పొలానికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.
వీధి కుక్కల కాటుకు సంబంధించిన ఎక్కువ సంఘటనలు బేగూసరాయ్ జిల్లా బఛ్వాడా నియోజకవర్గంలోని కైదరాబాద్, అర్వా, రూదౌలీ, రానీ పంచాయతీల్లో నమోదయ్యాయి.
బఛ్వారా బ్లాక్‌లోని వేర్వేరు పంచాయతీల్లో కుక్క కాటు కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించారని కైదరాబాద్ చీఫ్ టున్‌టున్ పాసవాన్ చెప్పారు.
మరో డజను మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. టున్‌టున్ పాసవాన్ చెప్పిన దాని ప్రకారం, ఆయన పంచాయతీలోనే కుక్క కాటు కారణంగా ఇద్దరు మృతి చెందారు. రూదౌలీ, అర్వా, రానీ, భికంచక్ గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్కరు చనిపోయారు.
వేర్వేరు గ్రామ పంచాయతీల్లో కుక్క కాటు కారణంగా ఆరుగురు మరణించారని బఛ్వాడా గ్రామ పంచాయతీ ప్రధాన ప్రతినిధి రాజీవ్ చౌదరీ కూడా చెప్పారు.
అయితే, బేగూసరాయ్ జిల్లా మెజిస్ట్రేట్ మాత్రం రెండు మరణాలు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు.
ఈ ప్రాంతాల్లోని జంతువులతో పాటు మనుషుల్ని కూడా వీధి కుక్కలు వదలట్లేదు. ఈ కారణంగా ఇక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జనం తమ పిల్లల్ని పాఠశాలలకు కూడా పంపించట్లేదు. వారు పొలాలకు వెళ్లట్లేదు.
ఐదారు నెలల క్రితం కూడా ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. స్థానిక ప్రజలు, అటవీ శాఖ అధికారుల సహాయంతో స్థానిక యంత్రాంగం అప్పుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. కానీ, ఈసారి మాత్రం ఈ ఘటనలు ఆగడం లేదు.
కుక్కల భయానికి ప్రజలంతా చేతుల్లో కర్రలతో తిరగాల్సి వస్తోంది. ఎటైనా వెళ్లాలంటే ఒంటరిగా కాకుండా అందరూ గుంపుగా వెళ్లాల్సి వస్తోంది.
కైదరాబాద్ గ్రామ పంచాయతీకి చెందిన సీతాదేవి త్రుటిలో వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆ భయంకర క్షణాలను గుర్తు చేసుకుంటూ ‘‘తెల్లవారుజామున మేం పొలం వైపు వెళ్లాం. అప్పుడు నాలుగైదు వీధి కుక్కలు మమ్మల్ని చుట్టుముట్టాయి. మొదట అవి మామూలుగా తిరుగుతున్నాయని అనుకున్నాం. కానీ, తర్వాత అవి కరవడం మొదలెట్టాయి. అక్కడినుంచి ఎలాగోలా తప్పించుకున్నాం. అవి పెంపుడు కుక్కలు కావు. వాటి నోటిలో రక్తం ఉంది’’ అని సీతాదేవి ఆ ఘటన గురించి వివరించారు.
మరోవైపు, కైదరాబాద్ రెండో వార్డు సభ్యుడు ధనంజయ్ నిషద్ మాట్లాడుతూ, గతంలో కూడా వీధి కుక్కలు కరిచేవని, కానీ ఇప్పుడు అవి నరమాంస భక్షకులుగా మారుతున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు.
కైదరాబాద్ గ్రామ పంచాయతీలోని పలు గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గతంలో కుక్కకాటు ఘటనలు నమోదైనట్లు టున్‌టున్ పాసవన్ చెప్పారు.
‘‘నా గ్రామ పంచాయతీలో కూడా వీధి కుక్కల మంద దాడి చేసిన ఏడెనిమిది కేసులు నమోదయ్యాయి. కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారి మృతదేహాలను చూసినప్పుడు, ఎవరో నరమాంస భక్షకులు దాడి చేసినట్లుగా అనిపించింది’’ అని టున్‌టున్ పాసవాన్ తెలిపారు.
‘‘ఈ పరిస్థితి గురించి పాలకులకు సమాచారం ఇచ్చాం. మొదటి నుంచి ఇక్కడ జరుగుతున్న ఘటనలన్నీ స్థానిక యంత్రాంగం దృష్టిలో ఉన్నాయి. చనిపోయినప్పుడు కూడా స్థానిక అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. ‘ఇవి పెంపుడు జంతువులు. అడవి జంతువులైతే వాటిని ఎక్కడికైనా తరలించేవాళ్లం’ అన్నారు’’ అని టున్ టున్ పాసవాన్ చెప్పుకొచ్చారు.
నరమాంస భక్షకులుగా మారిన వీధి కుక్కల కారణంగా ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. దీంతో అక్కడ వ్యవసాయ కూలీలు దొరకడం లేదు.
రుదౌలీ గ్రామపంచాయతీకి చెందిన బాసిందె గుడ్డూ అనే రైతు వార్డు సభ్యుడిగా ఉన్నారు. కుక్కల కారణంగా వ్యవసాయానికి తలెత్తుతున్న సమస్యల గురించి ఆయన మాట్లాడారు.
‘‘మేం పడే కష్టాల గురించి మీకు ఏం చెప్పాలి? రైతులకు ఇది పొలం పనులు చేసుకునే కాలం. పొలానికి ఎరువులు చల్లాల్సిన సమయం ఇది. కానీ, ఇక్కడ కుక్కల బెడద తీవ్రంగా పెరిగింది. అందుకే వ్యవసాయ కూలీలెవరూ పనులకు రావడానికి ఇష్టపడట్లేదు. తద్వారా వ్యవసాయానికి నష్టం రావడం ఖాయం’’ అని ఆయన చెప్పారు.
కుక్కలు, నరమాంస భక్షకులుగా మారడానికి కారణం?
ఈ ప్రాంతంలో పెంపుడు లేదా వీధి కుక్కలు, నరమాంస భక్షకులుగా మారడానికీ మనుషులపై దాడి చేయడానికీ గల కారణాలపై ఎలాంటి దర్యాప్తు జరగలేదు.
కానీ, స్థానిక ప్రజలు మాత్రం అవి ఇలా ప్రవర్తించడానికి కొన్ని కారణాలను చెబుతున్నారు.
కుక్కలు ఇలా ప్రవర్తించడం వెనుక దేశీ మద్యం లేదా మాంసం తినడం వంటివి కారణమై ఉండొచ్చని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాంతంలో మహువా అనే దేశీ మద్యాన్ని తయారు చేసే అక్రమ వ్యాపారం రహస్యంగా కొనసాగుతుంది. పోలీస్ శాఖ వారు ఈ ప్రాంతంలో చాలా సార్లు మందుబట్టీలను ద్వంసం చేశారు. అయినప్పటికీ, ఈ మద్యం తయారీ దందా మాత్రం ఆగలేదు.
రూదౌలీ గ్రామ పంచాయతీకి చెందిన పప్పూ సింగ్ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రాంతంలో కొంతమంది అక్రమ మద్యం వ్యాపారం చేస్తారు. ఈ మద్యం తయారీలో వాడి పడేసిన వ్యర్థాలు, డ్రై ఫ్రూట్స్‌ను తిన్న తర్వాత కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తుంటాయి. వాటిని తిన్న తర్వాతే ఎదురైన వారిపై దాడికి దిగుతాయి’’ అని చెప్పారు.
అక్రమ మద్యం తయారీలో మిగిలిపోయిన వ్యర్థాలను తిన్న తర్వాతే కుక్కలు ఇలా అసాధారణంగా ప్రవర్తిస్తాయనే వాదనను జిల్లా మెజిస్ట్రేట్ రోషన్ కుష్వాహా పూర్తిగా ఖండించారు.
‘‘అక్రమ మద్యం తయారు చేస్తున్నట్లు తెలియగానే మద్య నిషేధ అధికారుల, పోలీసు విభాగానికి చెందిన వారు తక్షణమే మద్యాన్ని తయారు చేసే వారిపై చర్యలు తీసుకుంటారు. ఆ మందుబట్టీలోని వస్తువులను, పదార్థాలను ద్వంసం చేస్తారు. కుక్కల ప్రవర్తనకు సంబంధించిన ఇలాంటి వాదనలు బయటకు వస్తుంటాయి. కానీ, వాటిని ధ్రువీకరించడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు’’ అని అన్నారు.
జిల్లా యంత్రాంగం ఏం చెబుతోంది?
బేగూసరాయ్ జిల్లా మెజిస్ట్రేట్ రోషన్ కుష్వాహా మాట్లాడుతూ, ‘‘బఛ్వాడా బ్లాక్‌లోని కొన్ని పంచాయతీల్లో నరమాంసాన్ని తినే కుక్కలు మందగా వచ్చి స్థానిక ప్రజలపై దాడి చేస్తున్నాయనే కేసులు వచ్చాయి. ఇటీవల అందులో రెండు మరణాలు కూడా నమోదయ్యాయి.
ఐదారు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. అప్పుడు అటవీ, పశుసంవర్థక శాఖ అధికారులు, స్థానిక ప్రజల సహకారంతో అలాంటి కుక్కలను చంపేసి వాటి పీడ వదిలించుకున్నాం. ఇప్పుడు కూడా స్థానిక ప్రజల సహాయంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా వెళ్తున్నాం’’ అని అన్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
మనుషుల ప్రాణాల తీయడం, నరమాంస భక్షకుల్లాగా కుక్కలు వ్యవహరించడం వెనుక ఉన్న కారణాల గురించి పాట్నాలోని పశుసంవర్థక శాఖకు చెందిన డాక్టర్ రమేశ్ కుమార్ వివరించారు.
‘‘కుక్కలు మాంసాహార జంతువులు. అవి అడవిలో పెరుగుతాయి. వేటాడటం వాటి ప్రధాన స్వభావం. మరోవైపు ఇప్పుడు చలి పెరిగిపోయింది. చలికాలంలో ఏ జంతువుకైనా వ్యాయామం, ఆహారం చాలా అవసరం. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం వాటికి ఎక్కువ ఆహారం అవసరం. వీధికుక్కలకు సులభంగా ఆహారం దొరక్కపోవచ్చు. అందుకే అవి వేటాడుతాయి’’ అని అన్నారు.
మద్యం తయారీలోని వ్యర్థాలు, కుళ్లిపోయిన పదార్థాలు తినడం వల్లే కుక్కలు ఇలా ప్రవర్తిస్తున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘‘ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. కుక్కలు మామూలుగా మాంసాహారులు. మద్యం తయారీలో మిగిలిపోయిన, కుళ్లిపోయిన పదార్థాలను అవి తినవు. అవి వాటి ఆహారం కాదు. మద్యం వ్యర్థాలే కాదు పాచిపోయిన అన్నం కూడా అవి తినవు’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్‌ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్‌బాల్ పిచ్‌ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)