పాకిస్తాన్: కోర్టుకు హాజరైన గాడిదలు.. ఎందుకంటే

    • రచయిత, అజీజుల్లా ఖాన్
    • హోదా, బీబీసీ ఉర్దూ

కోర్టులలో సాధారణంగా మనుషులను హాజరుపరుస్తుంటారు. కానీ, పాకిస్తాన్‌లోని ఒక కోర్టులో అక్టోబర్ 20న గాడిదలను హాజరుపరిచారు.

దీంతో గాడిదలపై ఏం కేసు పెట్టారనే చర్చ అక్కడ మొదలైంది.

పాకిస్తాన్‌లోని చిత్రాల్ జిల్లా దరోశ్ అసిస్టెంట్ కమిషనర్ కోర్టులో వీటిని హాజరుపరిచారు. కలప స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో వీటిని తీసుకొచ్చారు.

చిత్రాల్ జిల్లా సహా పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో కలప పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోంది. స్మగ్లింగ్ కారణంగా ఆ ప్రాంతంలో అడవులు కూడా వేగంగా క్షీణిస్తున్నట్లు అక్కడ నివేదికలున్నాయి.

ఈ కేసులో 5 గాడిదలను దరోశ్ అసిస్టెంట్ కమిషనర్ తౌసిఫుల్లా కోర్టులో హాజరుపరిచారు. స్మగ్లర్లు కలపను తరలించడానికి వీటిని వినియోగించారని ఆరోపణలన్నాయి.

విచారణ తరువాత ఈ గాడిదలను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

అసిస్టెంట్ కమిషనర్ తౌసిఫుల్లా దీనిపై మాట్లాడుతూ కలప అక్రమ రవాణాలో గాడిదలను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వేకువజామున కలప అక్రమ రవాణా జరుగుతోందని తెలిసి అసిస్టెంట్ కమిషనర్ ఆ సమయంలో దాడులు చేసి పట్టుకున్నారు. అక్రమ రవాణాదారులు ముగ్గురిలో ఇద్దరు తప్పించుకోగా ఒకరు దొరికారు. గాడిదలపై కలప రవాణా చేస్తుండడంతో వాటినీ పట్టుకుని ఒక అటవీ అధికారికి అప్పగించారు అసిస్టెంట్ కమిషనర్.

అక్కడికి రెండు రోజుల తరువాత మరోసారి దాడులు చేసి మరో కలప అక్రమరవాణాదారులతో పాటు మరో మూడు గాడిదలనూ పట్టుకున్నారు. అందులో రెండు కొత్తవి కాగా ఇంకోటి అంతకుముందు పట్టుకున్న గాడిదల్లోనే ఒకటి.

తొలుత పట్టుకున్నప్పుడు ఆ మూడు గాడిదలను అటవీ అధికారికి అప్పగించగా ఆయన వాటి బాగోగులు చూసుకోవడానికి ఒక స్థానికుడికి వాటిని అప్పగించారు. అయితే, అందులో ఒకటి మళ్లీ స్మగ్లర్ల చేతిలో పడింది.

దీంతో కలప అక్రమ రవాణా కేసులో పట్టుకున్న గాడిదలు ఎన్నో కచ్చితంగా తెలియాలని అసిస్టెంట్ కమిషనర్ ఆదేశించడంతో మొత్తం 5 గాడిదలను కోర్టులో హాజరుపరిచారు.

కేసులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తులుగా వాటిని పరిగణిస్తున్నారు.

అయితే, గాడిదలను పోలీస్ కస్టడీలో ఉంచడం కష్టం కాబట్టి అటవీ శాఖకు వాటిని అప్పగించారు.

'అక్రమ రవాణాలో మనుషులు దొరకరు.. గాడిదలే దొరుకుతాయి'

పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల నుంచి గాడిదలపై కలప దుంగలు అక్రమంగా తరలిస్తుంటారు. నిత్యం గాడిదలను ఈ పనికి వినియోగించడంతో వాటికి దారి అలవాటైపోతుంది.

దాంతో గాడిదలకు కలప దుంగలు కట్టేసి వదిలితే అవి తమంతట తామే వెళ్లాల్సిన చోటికి చేరుతాయి. అక్కడ కలప అక్రమ రవాణా ముఠాలోని వారు దుంగలను తీసుకుంటారు.

అక్రమ రవాణా ఈ పద్ధతిలో సాగుతుండడంతో అధికారులు దాడులు చేసినా గాడిదలు, కలప దుంగలు దొరుకుతాయి కానీ వాటిని తరలిస్తున్నవారు సాధారణంగా దొరకరు.

మరోవైపు స్మగ్లింగ్ వెనుక పెద్దపెద్దవారు ఉంటారని, వారు అధికారులను ప్రభావితం చేసి తప్పించుకుంటారనీ ఆరోపణలున్నాయి.

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో గాడిదలపై జరిగే కలప స్మగ్లింగ్ అంతా తక్కువ స్థాయిలో జరుగుతుందని.. భారీ ఎత్తున వ్యవస్థీకృతంగా సాగే కలప స్మగ్లింగ్ మార్గాలు వేరని, ట్రక్కులలో తరలిస్తారని స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)