You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాకు ఊహ తెలిసేటప్పటికీ గ్రహణం అంటే మా కొట్టంలోని గేదెలకు సున్నం పూయడం ఉండేది. ఆ రోజు ఊరిలోని ఏ గేదెను చూసినా ఒంటి మీద తెల్లతెల్లని చారలు కనిపించేవి. తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్లా ఈ ఆచారం ఉంది.
గ్రహణం రోజున సూర్యుణ్ని, చంద్రుణ్ని పాములు మింగుతాయని పెద్ద వాళ్లు చెబుతూ ఉండేవారు. ఇంట్లో ఎవరైనా గర్భంతో ఉంటే వాళ్లను బయటకు రానిచ్చేవారు కాదు.
నేడు గ్రహణం రోజు గేదెలకు సున్నాలు పూయడం తగ్గిపోయినట్లు ఉంది కానీ దాని చుట్టూ ఉండే నమ్మకాలు, విశ్వాసాలు మాత్రం చాలా వరకు అలాగే కొనసాగుతున్నాయి.
ఒకసారి యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చుట్టూ బోలెడు వీడియోలు. అది చేయండి, ఇది చేయకండి అంటూ సవాలక్ష సలహాలు.
ఈ నెల 25న సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అంటే దీపావళి మరుసటి రోజున అది వస్తుంది. ఇది చాలా అరుదైనదంటూ ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది చెప్పేస్తున్నారు.
బాగా ప్రచారంలో ఉన్న కొన్ని నమ్మకాలు, వాటిలో నిజానిజాల గురించి ప్రజలకు వివరించేందుకు బీబీసీ ప్రయత్నించింది.
విజ్ఞాన దర్శిని పేరుతో ప్రజలలో మూఢ విశ్వాసాలను పారదోలేందుకు ప్రయత్నిస్తున్న రమేశ్‌తో బీబీసీ మాట్లాడింది.
గ్రహణం సమయంలో అన్నం వండకూడదా?
నమ్మకం: గ్రహణం సమయంలో అన్నం వండటం కానీ తినడం కానీ చేయకూడదని చెబుతుంటారు. గ్రహణానికి గంటా రెండు గంటల ముందే భోజనం ముగించాలని అంటారు.
రమేశ్: ఇందులో వాస్తవం లేదు. గ్రహణం సమయంలో అన్నం వండుకోవచ్చు...తినవచ్చు... తాగవచ్చు... తినకుండా కూడా ఉండవచ్చు. ఏది చేసినా ఏమీ కాదు.
గర్భవతులు బయటకు రాకూడదా?
నమ్మకం: గ్రహణం సమయంలో బయటకు రాకూడదని, ముఖ్యంగా గర్భవతులు ఇంట్లోనే ఉండాలని చెబుతుంటారు.
రమేశ్: ఇది కూడా అవాస్తవమే. ప్రపంచవ్యాప్తంగా గ్రహణాలు వస్తుంటాయి. మరి మనుషులు బయటకు రావడం లేదా? ఒక్క భారతదేశంలోనే హాని జరుగుతుందా? గర్భవతులు బయటకు రావడం వల్ల కడుపులో బిడ్డకు హాని జరగదు.
గ్రహణానికి, గ్రహణం మొర్రికి సంబంధం ఉందా?
రమేశ్: ఇది కూడా ఒక అపోహ. గ్రహణానికి, గ్రహణం మొర్రికి అసలు సంబంధమే లేదు. మొర్రి అనేది జన్యుపరమైన వ్యాధి. మేనరిక వివాహాలు, ఒకే కులంలో జరిగే పెళ్లిళ్ల వల్ల జన్యులోపాలు తలెత్తి మొర్రి వస్తుంది. కొన్ని వ్యాధులు, కొన్ని కులాల్లోనే వస్తున్నాయని సీసీఎంబీ చేసిన పరిశోధనలో తేలింది. అందువల్ల దాన్ని మొర్రి అనాలి. గ్రహణం మొర్రి అనకూడదు.
గ్రహణం సమయంలో నిద్ర పోకూడదా? సెక్స్‌లో పాల్గొన కూడదా?
నమ్మకం: గ్రహణం వచ్చినప్పుడు నిద్ర పోకూడదని చెబుతుంటారు. ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, సెక్స్‌లో పాల్గొనకూడదని అంటూ ఉంటారు.
రమేశ్: ఇదంతా అబద్ధం. గ్రహణాలకు మనుషుల రోజూవారీ జీవిత కార్యకలాపాలకు సంబంధం లేదు. ఎవరికి ఇష్టమైన పనులు వారు చేసుకోవచ్చు. నిద్ర పోవచ్చు...కాలకృత్యాలు తీర్చుకోవచ్చు... అన్ని చేయొచ్చు.
గ్రహణం సమయంలో నెగిటివ్ ఎనర్జీ విడుదల అవుతుందా?
నమ్మకం: సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో తరచూ వినిపించే మరొక మాట నెగిటివ్ ఎనర్జీ. ఆ ప్రతికూల శక్తి వల్ల అనర్థాలు జరుగుతాయని, ఆ చెడు సమయంలో ఏ పని చేయకూడదని చెబుతుంటారు.
రమేశ్: గ్రహణం సమయంలో నెగిటివ్ ఎనర్జీ విడుదల కావడం అనేది అవాస్తవం. అసలు ఏ శక్తి రాదు. గ్రహణం అంటే ఏంటి? నీడ. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే అది సూర్యగ్రహణం.
అంటే సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి, చంద్రుని నీడ భూమి మీద పడుతుంది. ఎండలో గొడుగు వేసుకున్నప్పుడు జరిగేది కూడా అదే. అంతకు మించి గ్రహణం సమయంలో ఏం జరగదు. ఏ నెగిటివ్ ఎనర్జీ విడుదల కాదు.
ఈ నమ్మకాలకు కారణం ఏంటి?
రమేశ్: పురాణాల నుంచి ఈ నమ్మకాలు వచ్చాయి. ఆ నమ్మకాలను కొందరు తమ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నారు. గతంలో ఎక్కువగా బ్రాహ్మణులు వాటిని నమ్మి ఆచరించేవారు. గ్రహణం సమయంలో గరిక వేయడం, స్నానాలు చేయడం, పూజలు లాంటివి వారు ఎక్కువగా చేసేవారు.
కానీ, మిగతా వర్గాల వారు వాటిన్నింటినీ ఆచరించే వారు కాదు. గ్రహణం ఉందని పనికి పోకుండా పల్లెటూర్లలో ఉండగలరా? అన్నం వండుకోకుండా తినకుండా ఉండటం సాధ్యమా?
ఆ తరువాత టీవీలు, సోషల్ మీడియా రాకతో కొందరు వాటిని అందరి మీద రుద్దుతున్నారు. దాంతో చాలామంది ఆ నమ్మకాలను పాటిస్తున్నాయి.
ఇలాంటి మూఢనమ్మకాలను పెంచడంలో సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.
పురాణాలు గ్రహణం గురించి ఏం చెబుతున్నాయి?
విష్ణు పురాణం ప్రకారం దేవతలు, రాక్షసులు పాలకడలిని చిలికినప్పుడు అమృతం వస్తుంది. అమృతం తాగితే మరణం అనేది రాదు. దాని కోసం దేవతలు, రాక్షసులు పోటీ పడతారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులను మాయ చేసి అమృతాన్ని పంచడం ప్రారంభిస్తాడు.
దేవతలకు అమృతం పంచేటప్పుడు ఒక రాక్షసుడు వేషం మార్చుకొని దేవతల్లో కలిసి పోతాడు. కానీ ఆ విషయం తెలియక విష్ణువు అమృతం పోస్తాడు. అయితే అతను రాక్షసుడు అని గమనించిన చంద్రుడు, సూర్యుడు విష్ణువుకు చెబుతారు.
విష్ణువు తన చక్రంతో వెంటనే ఆ రాక్షసుని తలను నరికేస్తాడు. కానీ అప్పటికే అమృతం కొంత తాగి ఉండటం వల్ల తల, మొండెం బతికే ఉంటాయి. ఆ తల పేరు రాహువు. మొండెం పేరు కేతువు.
తన గురించి విష్ణువుకు చెప్పినందుకు పగబట్టి చంద్రుణ్ని, సూర్యుణ్ని రాహువు మింగుతాడు. దీనే గ్రహణం అని చెబుతారు. కానీ మొండం లేనందున మళ్లీ వాటిని బయటకు వదిలేస్తాడు.
ఈ రాహు కాలాన్ని అత్యంత అశుభంగా భావిస్తారు. ఈ కాలంలో దుష్ట శక్తులు యాక్టివ్‌గా ఉంటాయని నమ్ముతారు. సూర్యకాంతి ఉండదు కాబట్టి బ్యాక్టీరియా పెరుగుతుందని చెబుతారు.
సైన్స్ ఏం చెబుతోంది?
ఒక గ్రహం నీడ మరొక గ్రహం మీద పడటాన్ని గ్రహణం అంటారు. అంటే సూర్యుని వెలుగు భూమి మీద పడకుండా మధ్యలో చంద్రుడు అడ్డంగా వస్తే అది సూర్యగ్రహణం అవుతుంది. అంటే చంద్రుని నీడ భూమి మీద పడుతుంది.
సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
సూర్యగ్రహణ సమయంలో కంటికి తప్ప మరే ఎటువంటి ఇబ్బంది ఉండదని సైన్స్ చెబుతోంది. సూర్య గ్రహణాన్ని నేరుగా వీక్షించకూడదు. కంటి చూపు దెబ్బ తినే ప్రమాదం ఉంది.
చంద్రగ్రహణం కూడా మనిషి మీద చెడు ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఆధారాలు లేవని నాసా చెబుతోంది.
నమ్మేవారి వాదన ఏంటి?
గ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న నియమాలు అనాదిగా వస్తున్నాయని, వాటిని మూఢ నమ్మకాలంటూ కొట్టిపారేయడం సరికాదని ఆ నమ్మకాలను విశ్వసించే వారు చెబుతున్నారు.
నేటి సైంటిస్టుల మాదిరిగానే ఒకప్పుడు పండితులు ఎంతో పరిశీలించి తమ అనుభవంతో ఇటువంటి నియమాలను తీసుకొచ్చారని అంటున్నారు. కాబట్టి వాటిని ఆచరించడంలో తప్పులేదని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- బీటీఎస్: ఆడుతూ, పాడుతూ ఏడాదికి రూ. 800 కోట్లు సంపాదించే ఈ యువకులు రెండేళ్లు ఆర్మీలో చేరుతున్నారు, ఎందుకు?
- బ్రిటన్ ప్రధాన మంత్రిపై ఎంపీల తిరుగుబాటు ఎందుకు? లిజ్ ట్రస్ పీఎంగా ఇంకెంత కాలం మనుగడ సాగించగలరు?
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)