SCO సదస్సు: 'రక్తపాత యోధుడు' తైమూర్‌కు, సమర్‌కండ్‌కు ఉన్న సంబంధం ఏంటి?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్ చేరుకున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా అక్కడే ఉన్నారు. అయితే, ఈ సదస్సు తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అవుతారా? లేదా? అనే అంశంపై భారత్‌లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

2020 ఏప్రిల్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఎల్‌ఏసీ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక సమావేశంలో ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే తొలిసారి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రయిసీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జీయోయెవ్‌లతో వేర్వేరుగా ప్రధాని మోదీ సమావేశమవుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, చైనా అధ్యక్షునితో మీటింగ్ గురించి ఇంకా ఎలాంటి అధికారం సమాచారం రాలేదు.

2001లో ఆరు దేశాలతో ఎస్‌సీఓ ఏర్పాటైంది. అప్పుడు చైనా, రష్యా తప్ప మిగతావన్నీ మధ్య ఆసియా దేశాలే. కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్‌లు ఈ కూటమిలో మిగతా సభ్య దేశాలు.

2017లో ఈ కూటమిని మొదటిసారిగా విస్తరించారు. భారత్, పాకిస్తాన్‌ ఇందులో చేరాయి. ఇప్పుడు ఇరాన్ కూడా ఎస్‌సీఓ సభ్యత్వాన్ని తీసుకోనుంది.

గతంలో ఉజ్బెకిస్తాన్‌ వేదికగా మూడు సార్లు ఎస్‌సీఓ సదస్సు జరిగింది. అయితే ఈ మూడు సార్లు కూడా దేశ రాజధాని తాష్కెంట్‌లో ఈ కూటమి సమావేశమైంది. కానీ, ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎస్‌సీఓ సదస్సును సమర్‌కండ్‌లో నిర్వహిస్తున్నారు.

సమర్‌కండ్ అనేది ఒక చరిత్రాత్మక నగరం. దాని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

సమర్‌కండ్ ఎందుకు ప్రత్యేకం?

చరిత్ర పుటల్లో సమర్‌కండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

దండయాత్రలు, రక్తపాతాలకు పేరుగాంచిన తైమూర్ అలియాస్ తైమూర్‌లంగ్, సమర్‌కండ్‌లోనే జన్మించారు.

చరిత్రలోని గొప్ప యోధులు, విజేతల గురించి ఆలోచిస్తే చెంఘిజ్ ఖాన్, అలెగ్జాండర్ ది గ్రేట్ వంటి వారి పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ, మీకు మధ్య ఆసియా, ముస్లిం దేశాల గురించి కూడా తెలిసి ఉంటే వెంటనే తైమూర్‌లంగ్ పేరు కూడా చెబుతారు.

1336లో సమర్‌కండ్‌లో తైమూర్‌లంగ్ జన్మించారు. ఇప్పుడు ఈ ప్రాంతం, ఉజ్బెకిస్తాన్‌గానే అందరికీ తెలుసు. చాలా కోణాల్లో అలెగ్జాండర్ ది గ్రేట్, చెంఘిజ్ ఖాన్‌ల కంటే తైమూర్‌లంగ్ వ్యక్తిత్వం మరింత ఉన్నతమైనది.

తైమూర్‌లంగ్ చరిత్రలో రక్తపాత యోధుడిగా ప్రసిద్ధి చెందారు. 14వ శతాబ్ధంలో యుద్ధ క్షేత్రంలో ఆయన అనేక రాజ్యాలను గెలుపొందారు. తన శత్రువుల తల నరికి వాటిని సేకరించడం తైమూర్‌కు చాలా ఇష్టమని చెబుతుంటారు.

'తైమూర్‌లంగ్: ద స్వర్డ్ ఆఫ్ ఇస్లాం, ద వరల్డ్ కాంకరర్' అనే పుస్తకాన్ని జస్టిన్ మారోజ్జీ రాశారు.

జస్టిన్ మారోజ్జీ చెప్పినదాని ప్రకారం... ఆ కాలంలో యుద్ధాలు బాంబులు, తుపాకులతో కాకుండా కండబలంతో జరిగేవి. అలాంటి పరిస్థితుల్లో తైమూర్‌లంగ్ సాధించిన విజయాలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి అని మారోజ్జీ పుస్తకంలో రాశారు.

తైమూర్‌లంగ్ చిన్న దొంగ

అలెగ్జాండర్ తరహాలో తైమూర్‌లంగ్ ఒక రాజ కుటుంబంలో పుట్టలేదు. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన ఒకప్పుడు చిన్నతరహా దొంగతనాలు చేసేవారిని చెబుతుంటారు. మధ్య ఆసియా మైదానాలు, కొండల నుంచి గొర్రెలను దొంగిలించేవారిని అంటుంటారు.

చెంఘిజ్‌ ఖాన్‌కు ఉన్నట్లు తైమూర్‌లంగ్ వద్ద సైనికులు కూడా ఉండేవారు కాదు. కానీ, ఆయన సాధారణంగా దూకుడుగా, గొడవలకు దిగే స్వభావం ఉండే వ్యక్తులతో భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

1402లో సుల్తాన్ బాయాజిద్‌తో యుద్ధం కోసం కదన రంగంలో అడుగుపెట్టినప్పుడు తైమూర్ వద్ద భారీ సైన్యం ఉంది. అందులో అర్మేనియా నుంచి అఫ్గానిస్తాన్ వరకు, సమర్‌కండ్ నుంచి సెర్బియా వరకు ప్రాంతాలకు చెందిన సైనికులు ఉన్నారు.

తైమూర్ తనకు ఎదురైన అవరోధాలన్నింటినీ అధిగమించారు. కానీ, ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటి ఉంది. అదేంటంటే ఆయన వికలాంగుడు. ఆయన శరీరంలోని కుడివైపు భాగం సరిగా ఉండేది కాదు.

ప్రమాదం కారణంగా వైకల్యం

పుట్టుకతో ఆయనకు తైమూర్ అనే పేరు పెట్టారు. తైమూర్ అంటే 'ఇనుము' అని అర్థం. అయితే, తర్వాత ప్రజలు ఆయనను తైమూర్-ఎ-లంగ్ (కుంటి ఇనుము) అని పిలుస్తూ జోక్ చేసేవారు.

యువకునిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో ఆయన శరీరంలోని కుడి భాగం మొత్తం తీవ్రంగా గాయపడిన తర్వాత ప్రజలు ఆయనను ఇలా సరదాగా పిలవడం మొదలుపెట్టారు. కాలక్రమంలో ఈ పేరు 'తైమూర్‌లంగ్'‌గా స్థిరపడింది.

రాజకీయంగా అధికారం సంపాదించడానికి శారీరక దారుఢ్యం కూడా అవసరమైన ఆ కాలంలో, తైమూర్‌లంగ్ ప్రయాణానికి ఆయన శారీరక వైకల్యం అడ్డు రాలేదు.

తైమూర్ కేవలం ఒక చేత్తోనే కత్తిని పట్టుకునేవాడని చెబుతుంటారు. అయితే గుర్రపు స్వారీ, విలువిద్య, చేయి చేయి కలిపి చేసే యుద్ధాల్లో తైమూర్ ఎలా కలబడేవాడు అనే సంగతి ఓ పట్టాన అర్థం కాదు.

తీవ్రంగా గాయపడిన తర్వాతే తైమూర్‌లంగ్, వికలాంగుడిగా మారాడని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయి. అయితే, ఆయనకు ఎలా ప్రమాదం జరిగింది అనే దానిపై స్పష్టత లేదు.

ఈ ప్రమాదం 1363లో జరిగి ఉంటుందని అంచనా వేశారు. ఖుర్షాన్ గనుల్లో కిరాయి కూలీగా పని చేసే రోజుల్లో తైమూర్ ఈ ప్రమాదానికి గురై ఉంటారని చెబుతారు.

ఈ గాయం గురించి 15వ శతాబ్దానికి చెందిన సిరియా చరిత్రకారుడు ఇబ్నే అరబ్ షా పేర్కొన్న మరో వివరణ కూడా ఉంది. తైమూర్ ఒకసారి గొర్రెను దొంగిలిస్తుండగా కాపలాదారు విసిరిన బాణాల్లో ఒకటి ఆయన భుజానికి, మరొకటి ఆయన తుంటి భాగానికి గాయం చేశాయని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా ''తీవ్రంగా గాయపడిన సమయంలోనే తైమూర్‌లంగ్ పేదరికం కూడా పెరిగిపోయింది. ఇది ఆయనలో కోపాన్ని, కసిని రగిల్చింది'' అని ఆయన రాశారు.

స్పానిష్ రాయబారి క్లావిజో 1404లో సమర్‌కండ్‌ను సందర్శించారు. గుర్రపు దళాన్ని ఎదుర్కొనే సమయంలో తైమూర్‌లంగ్ గాయపడ్డారని ఆయన రాశారు.

''శత్రువులు, తైమూర్‌లంగ్‌ను గుర్రం నుంచి కిందపడేసి ఆయన కుడికాలును గాయపర్చారు. దీంతో ఆయన మిగిలిన జీవితకాలం కుంటివారిలాగే బతికారు. తర్వాత ఆయన కుడి చేతికి కూడా గాయమైంది. ఆయన కుడి చేతి రెండు వేళ్లను కోల్పోయారు'' అని క్లావిజో రాశారు.

మైఖేల్ గెరిసిమోవ్ నేతృత్వంలోని సోవియట్ పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం 1941లో సమర్‌కండ్‌లోని తైమూర్‌లంగ్ అందమైన సమాధిని తవ్వింది. తైమూర్ కుంటివాడైనప్పటికీ, ఆయన శరీరం చాలా ఫిట్‌గా ఉందని, ఆయన 5 అడుగుల 7 అంగుళాలు ఉన్నారని కనుగొంది.

కుడికాలులో తొడ ఎముక, మోకాలు కలిసే చోట గాయం ఉందని గుర్తించింది. దీని కారణంగానే ఆయన ఎడమ కాలు కంటే కుడి కాలి పొడవు కాస్త తక్కువగా ఉందని చెప్పింది.

వైకల్యం, అడ్డంకిగా మారలేదు

నడిచే సమయంలో తైమూర్, తన కుడి కాలిని లాగాల్సి వచ్చేది. అంతేకాకుండా, ఆయన ఎడమ భుజం కూడా కుడి భుజం కంటే బాగా పైకి ఉండేది. తర్వాతి కాలంలో ఆయన కుడి చేతికి, మోచేతికి కూడా గాయాలయ్యాయి.

ఈ వైకల్యం కారణంగా ఆయన శత్రువులైన టర్కీ, బాగ్దాద్, సిరియా పాలకులు తైమూర్‌ను అవహేళన చేస్తుండేవారు. కానీ, యుద్ధంలో తైమూర్‌ను ఓడించడం అవహేళన చేసినంత సులభం కాదని వారికి తెలుసు.

తైమూర్‌లంగ్‌ను తీవ్రంగా విమర్శించే అరబ్‌షా కూడా తైమూర్‌లంగ్‌ చాలా ధైర్యస్థుడని, చాలా బలవంతుడని ఒప్పుకున్నారు. ఆయన్ను చూడగానే శత్రువుల్లో భయం కలిగేదని చెప్పారు.

ఓటమి లేదు

18వ శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు ఎడ్వర్డ్ గిబ్బన్ కూడా తైమూర్‌లంగ్‌ను ప్రశంసించారు. తైమూర్‌లంగ్ సైనిక సామర్థ్యాలను ఎప్పుడూ ఎవరూ అంగీకరించలేదని ఆయన అన్నారు.

''తైమూర్‌లంగ్ విజయ పతాకం ఎగరేసిన దేశాల్లో కూడా తెలిసో తెలియకో తైమూర్ పుట్టుక, పేరు, వ్యక్తిత్వం గురించి తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

కానీ, నిజానికి ఆయన ఒక యోధుడు. రైతు నుంచి ఆసియా సింహాసనాన్ని అధిష్టించిన యోధుడు. వైకల్యం ఆయన స్ఫూర్తిని, వైఖరిని ప్రభావితం చేయలేకపోయింది. తన బలహీనతలపై కూడా ఆయన విజయం సాధించారు'' అని చెప్పారు.

1405లో తైమూర్‌లంగ్ చనిపోయారు. చైనా రాజు మింగ్‌తో యుద్ధం కోసం వెళ్తూ దారిలో ఆయన మరణించారు. అప్పటివరకు ఆయన 35 ఏళ్లపాటు యుద్ధ క్షేత్రంలో విజయాలనే సాధించారు.

శారీరక వైకల్యాలను అధిగమించి విశ్వ విజేత అయిన వారిలో తైమూర్ తప్ప మరొకరు కనిపించరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)