You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్మార్ట్‌ఫోన్‌ను పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి?
- రచయిత, కెల్లీ ఓక్స్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
నేడు మనల్ని వెంటాడుతున్న ప్రధాన ప్రశ్నల్లో ఇదీ ఒకటి. పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వాలా? లేదా ఫోన్ల నుంచి వారిని వీలైనంత దూరం పెట్టాలా?
పిల్లల చేతుల్లో స్మార్ట్‌ఫోన్ కనిపించినప్పుడు చాలా మంది తల్లిదండ్రులుగా ఆందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా పిల్లలపై ఫోన్లు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయనే వార్తలు, కథనాలు వారిని గందరగోళానికి గురిచేస్తుంటాయి. అయితే, ఇలా ఆందోళనపడేది మీరు ఒక్కరు మాత్రమే కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మడోన్నా కూడా తన టీనేజీ పిల్లలకు ఫోన్లు ఇచ్చి పెద్ద తప్పు చేశానని, ఇలాంటి తప్పుకు మరోసారి అవకాశం ఇవ్వబోనని అన్నారు.
అయితే, ఈ ఆలోచనల్లో మరో కోణం కూడా ఉంది. ఈమెయిల్స్, ఆన్‌లైన్ షాపింగ్ లాంటి పనులకు మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం తప్పనిసరి. అయితే, మీ పిల్లల స్నేహితుల ఫోన్‌లు, వారు పంపే మెసేజ్‌లతో మీ ఫోన్ నిండిపోతే మీకు కూడా చికాకుగానే ఉంటుంది. దీంతో వారికి ఒక ఫోన్ ఇచ్చేస్తే మేలని కూడా అనిపించొచ్చు.
నిజానికి ఈ విషయంలో ఎన్నో ప్రశ్నలు.. సమాధానాలు లేకుండానే మిగిలిపోయాయి. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాతో పిల్లలపై దీర్ఘ కాలంలో ఎలాంటి ప్రభావాలు చూపుతాయనే అంశంలో చాలా అస్పష్టత ఉంది. కొన్ని పరిశోధనలు ఫోన్‌లతో పిల్లలకు పొంచివున్న ముప్పుల గురించి చెబుతుంటే, మరికొన్ని ప్రయోజనాలను వివరిస్తున్నాయి.
ఫోన్ లేదా సోషల్ మీడియాతో పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని పక్కాగా చెప్పే ఆధారాలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే, ఇంకేం పిల్లలకు ఫోన్ ఇస్తే తప్పేముంది అనుకోవడానికి కూడా వీల్లేదు. ప్రస్తుతం చాలా పరిశోధనలు పిల్లలపై కంటే టీనేజర్లపై స్మార్ట్‌ఫోన్ ప్రభావంపై దృష్టిసారిస్తున్నాయి. ఎదుగుదలలో భాగంగా పిల్లలు కొన్ని దశలకు వచ్చినప్పుడు పిల్లలపై స్మార్ట్‌ఫోన్లు ప్రతికూల ప్రభావం చూపే ముప్పు ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే, పిల్లలు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వయసుకు వచ్చారో లేదో తెలుసుకోవడానికి కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో స్మార్ట్‌ఫోన్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు చేయాల్సిన పనుల గురించీ వారు సూచనలు ఇస్తున్నారు.
ఏది నిజం?
బ్రిటన్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ ఆఫ్‌కామ్ సమాచారం ప్రకారం, దేశంలో తొమ్మిదేళ్లలోపు వయసున్న పిల్లల్లో 44 శాతం మంది దగ్గర, 11ఏళ్ల లోపు వయసున్న వారిలో 91 శాతం మంది దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇక అమెరికా విషయానికి వస్తే, తొమ్మిది నుంచి 11ఏళ్లలోపు మధ్య వయసున్న 37 శాతం మంది పిల్లల దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. యూరప్‌లో నిర్వహించిన అధ్యయనంలో తొమ్మిది నుంచి 16ఏళ్లలోపు వయసున్న 80 శాతం మంది పిల్లల దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వీరు స్మార్ట్‌ఫోన్‌ను రోజూ ఉపయోగిస్తున్నారని వెల్లడించారు కూడా.
‘‘టీనేజీ వయసు వచ్చే సరికి 90 శాతం పిల్లల దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి’’అని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైకలాజికల్ సైన్స్ ప్రొఫెసర్ కెండిస్ ఆడ్జెర్స్ చెప్పారు.
పుట్టినప్పటి నుంచి ఎనిమిదేళ్ల వయసు మధ్య పిల్లలపై డిజిటల్ టెక్నాలజీతో తక్కువ ముప్పు లేదా అసలు ముప్పు లేదని ఒక యూరప్ నివేదిక వెల్లడించింది.
పిల్లలు, టీనేజీ యువత మానసిక ఆరోగ్యంపై డిజిటల్ టెక్నాలజీ చూపిస్తున్న ప్రభావం మీద నిర్వహించిన ఆరు అధ్యయనాలను ఆడ్జెర్స్ విశ్లేషించారు. ఆమె కూడా టీనేజీ యువత ఆరోగ్యాన్ని టెక్నాలజీ ప్రభావితం చేస్తుందనే స్పష్టమైన సంకేతాలు కనిపించడంలేదని వివరించారు.
‘‘సోషల్ మీడియా వినియోగం, మానసిక ఆరోగ్యాల మధ్య స్పష్టమైన సంబంధాలు ఈ అధ్యయనాల్లో కనిపించడం లేదు’’అని ఆడ్జెర్స్ చెప్పారు. అయితే, సంబంధంముందని చెబుతున్న అధ్యయనాల్లో ఒకవైపు సానుకూల, మరోవైపు ప్రతికూల.. రెండు రకాల సంబంధాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. ‘‘టీనేజీ యువతతోపాటు అందరూ నమ్మేదానికి ఈ అధ్యయనాల్లో బయటపడేదానికి చాలా తేడా ఉంటోంది’’అని ఆడ్జెర్స్ వివరించారు.
మరోవైపు బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్‌పెరిమెంటల్ సైకాలజిస్టు ఎమీ ఆర్బెన్ కూడా ఇలానే ఇదివరకు చేపట్టిన అధ్యయన ఫలితాలను సమీక్షించారు. మొత్తంగా చూస్తే స్వల్ప మొత్తంలో పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలుస్తోంది. అయితే, కచ్చితంగా పిల్లల ఆరోగ్యం ప్రభావితం అవుతుందని చెప్పడానికి ఈ అధ్యయనాలు సరిపోవని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘ఈ అధ్యయన ఫలితాలను ఒకదానితో మరొకటి పోల్చినప్పుడు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యంపై ప్రభావం అనేది ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది. నిజానికి మన చుట్టుపక్కల ఉండేవారే స్మార్ట్‌ఫోన్‌తో మన ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని గుర్తించగలరు’’అని ఆర్బెన్ అన్నారు.
నిజానికి అధ్యయనాల్లో ఏం తేలిందనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పటికీ కొంత మంది చిన్నారులు సోషల్ మీడియా లేదా కొన్ని యాప్‌ల వాడకంతో ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. వారికి తల్లిదండ్రుల నుంచి సాయం అవసరం.
ఇది లైఫ్‌లైన్
కొంతమంది టీనేజీ పిల్లలకు ఫోన్ లైఫ్‌లైన్‌గా మారుతుంటుంది. ఇంటర్నెట్ ఉపయోగం, సోషల్ నెట్‌వర్కింగ్, తమ ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం లాంటి అంశాల్లో స్మార్ట్‌ఫోన్లు వారికి మెరుగ్గా ఉపయోగపడుతుంటాయి.
‘‘ముఖ్యంగా టీనేజీలో శరీరంలో వచ్చే మార్పులపై ఆందోళన పడటం, తమ లైంగిక ఇష్టాఇష్టాలు మిగతావారి కంటే భిన్నంగా ఉండటం, వాతావరణ మార్పులపై ఆందోళన లాంటి ప్రశ్నలకు చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ సమాధానం చూపగలదు’’అని బ్రిటన్‌లోని అండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లోని సోషల్ సైకాలజీ ప్రొఫెసర్, పేరెంటింగ్ ఫర్ ఎ డిజిటల్ ఫ్యూచర్ పుస్తక రచయిత సోనియా లివింగ్‌స్టోన్ చెప్పారు.
కమ్యూనికేషన్ విషయానికి వస్తే, పిల్లలు ఎక్కువగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతుంటారు. ‘‘ఆన్‌లైన్ పిల్లల సంభాషణలను మనం గమనిస్తే, వీటికి వారి ఆఫ్‌లైన్ కార్యకలాపాలతో సంబంధం ఉంటుంది’’అని ఆడ్జెర్స్ చెప్పారు. ‘‘అయితే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే.. ఫోన్‌లో పడి పిల్లలు మనకు దూరం అవుతున్నారా? కొంతమంది పిల్లల విషయంలో ఇదే అసలైన ముప్పు. కానీ, చాలా మంది పిల్లల విషయంలో ఇది కనెక్షన్లు, షేరింగ్‌కు తోడ్పడుతుంది’’అని ఆమె వివరించారు.
స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరుబయట సమయం గడపడం తగ్గిపోతోందని తల్లిదండ్రులు చెబుతుంటారు. అయితే, దీనిపై 11 నుంచి 15ఏళ్ల పిల్లలపై డెన్మార్క్‌లో ఒక అధ్యయనం నిర్వహించారు. దీంతో పరిచయంలేని ప్రాంతాల్లో పిల్లలు అవగాహనతో ముందుకు వెళ్లేందుకు, తల్లిదండ్రులకు భరోసారి ఇచ్చేందు స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడుతున్నాయని తేలింది. హాయిగా సంగీతం వినడం, తల్లిదండ్రులు, స్నేహితులతో మాట్లాడటం లాంటి పనులతో స్మార్ట్‌ఫోన్లు తమ అనుభూతిని రెట్టింపు చేస్తున్నాయని దీనిలో పాల్గొన్న పిల్లలు వివరించారు.
ముప్పులు కూడా ఉన్నాయి
అయితే, ఎక్కువసేపు ఇలా కమ్యూనికేషన్ పేరుతో ఫోన్లపై గడపడంతో ముప్పులు కూడా ఉన్నాయి.
‘‘చాలా మంది ఆన్‌లైన్‌లో సెలబ్రిటీలను అనుకరించాలని చూస్తుంటారు. అలా ఉండేందుకు చాలా కష్టపడుతుంటారు. ఫలితంగా వారు చుట్టుపక్కల సమాజంలో ఇమడలేకపోతుంటారు’’అని లివింగ్ స్టోన్ అన్నారు. ఇటీవల చేపట్టిన ఒక అధ్యయనాన్ని ఆమె ప్రస్తావించారు.
పది నుంచి 21ఏళ్ల మధ్య వయసున్న 17,000 మందిపై ఈ అధ్యయనం చేపట్టారు. 11 నుంచి 13ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, 14 నుంచి 15ఏళ్ల వయసున్న అబ్బాయిలు ఎక్కువగా సోషల్ మీడియా వేదికలపై గడపడంతో వారి జీవితంలో జీవింతపై సంతృప్తి స్థాయిలు పడిపోతున్నాయని వెల్లడైంది. అదే సమయంలో సోషల్ మీడియా తక్కువగా ఉపయోగించడంతో ఆ తర్వాత ఏడాది మళ్లీ వారిలో సంతృప్తి స్థాయిలు పెరిగినట్లు వెల్లడైంది.
అబ్బాయిలతో పోల్చినప్పుడు అమ్మాయిల్లో యవ్వన దశ కాస్త త్వరగానే మొదలవుతోందని చెప్పే వాదనకు ఈ పరిశోధన బలం చేకూరుస్తోంది. అయితే, ఈ విషయాన్ని కచ్చితత్వంతో చెప్పేందుకు ఈ అధ్యయన ఫలితాలు సరిపోవని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఇదే అధ్యయనంలో 19ఏళ్ల వయసులో ఎక్కువగా ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు ఇద్దరూ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారని తేలింది.
పిల్లల వయసుకు సంబంధించి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో ఎదుగుదలతోపాటు పిల్లల్లో వచ్చే మార్పుల వల్ల వారు సోషల్ మీడియాతో వచ్చే నెగిటివ్ ప్రభావాలకు చాలా సెన్సిటివ్‌గా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు టీనేజీ వయసులో మెదడు వేగంగా మారుతుంటుంది. దీంతో పిల్లల్లో ప్రవర్తనా పరమైన మార్పులు కూడా వస్తాయి. ఇది వారి సామాజిక బంధాలపై ప్రభావం చూపుతుంది.
‘‘టీనేజీ వయసు అనేది ఎదుగుదలలో కీలకమైన దశ’’అని ఆర్బెన్ చెప్పారు. ‘‘ఈ దశలో చుట్టుపక్కల పిల్లల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతావారు తమ గురించి ఏం అనుకుంటారోనని వారు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు సోషల్ మీడియా వారిలో మరింత ఒత్తిడికి కారణం అవుతుంటుంది’’అని ఆమె వివరించారు.
చాలా అంశాలే ప్రభావితం చేస్తాయి
పిల్లల సోషల్ మీడియా వినియోగంలో వయసుతోపాటు ప్రభావం చూపించే అంశాలు చాలా ఉంటాయి. అయితే, ప్రస్తుతం వీటిలో ఒక్కొక్క అంశంపై పరిశోధకులు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం చాలా అధ్యయనాలు ఈ అంశాల చుట్టూ జరుగుతున్నాయని ఆర్బెన్ చెప్పారు. ‘‘కొంతమంది పిల్లలు ప్రతికూలంగా ప్రభావితం అవుతుంటే, మరికొందరిపై సానుకూలంగా ప్రభావం పడుతోంది. ఎందుకంటే వారి జీవితాలు భిన్నమైనవి. వారి ఎదుగుదల స్థాయిలు కూడా భిన్నమైనవి. వారు సోషల్ మీడియాను కూడా భిన్నంగా ఉపయోగిస్తుంటారు. వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి’’అని ఆర్బెన్ అన్నారు.
ఈ పరిశోధనలతో తల్లిదండ్రుల అవగాహన కొంతవరకు పెరుగుతుంది. అయితే, మొత్తంగా పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు కొనాలి అనేది ఆచితూచి తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రశ్నకు అందరికీ ఒకే సమాధనం ఉండదు.
‘‘ఎందుకంటే ఈ అంశాలు చాలా క్లిష్టమైనవి. దీనికి సమాధానం సదరు చిన్నారి తల్లిదండ్రులే వెతుక్కోవాల్సి ఉంటుంది. అయితే, ఇందులో అంత గందరగోళం పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చిన్నారి పరిస్థితిని బట్టి వారు నిర్ణయం తీసుకోవచ్చు’’అని ఆడ్జెర్స్ అన్నారు.
ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. స్మార్ట్‌ఫోన్‌తో పిల్లలు, కుటుంబం ఎలా ప్రభావితం అవుతోంది? అని ఆడ్జెర్స్ వివరించారు.
చాలా మంది పిల్లలకు ఒక ఫోన్ కొనిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని తల్లిదండ్రులు భావిస్తారు. ‘‘చాలా కేసుల్లో పిల్లలకు ఫోన్ ఇవ్వడానికి తల్లిదండ్రులే కారణం. ఎందుకంటే పిల్లలతో తరచూ మాట్లాడటానికి, వారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఫోన్ అవసరమని వారు భావిస్తారు’’అని ఆడ్జెర్స్ చెప్పారు.
యవ్వన దశలో అడుగుపెడుతున్నారని చెప్పడానికి స్మార్ట్‌ఫోన్‌ను ఒక మైలురాయిగా కూడా చెప్పొచ్చు. ‘‘ఎందుకంటే ఈ ఫోన్లతో పిల్లలకు బాధ్యత, స్వాతంత్ర్యం వస్తాయి’’అని వియాన్నా యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిశోధకురాలు అంజా స్టెవెక్ అన్నారు. ‘‘అందుకే స్మార్ట్‌ఫోన్ వాడే బాధ్యతను సరిగ్గా నిర్వహించే వయసు పిల్లలకు వచ్చిందా? అని తల్లిదండ్రులు ఎవరికివారే బేరీజు వాసుకోవాల్సి ఉంటుంది’’అని ఆమె వివరించారు.
పిల్లలతో యుద్ధాలు
పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారనే విషయం కూడా ఇక్కడ చాలా ముఖ్యం. కొంతమంది పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులకు ఎలాంటి నియంత్రణా లేకుండా పోతోందని స్టెవిక్ బృందం చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. స్మార్ట్‌ఫోన్ల వల్ల తమ కుటుంబాల్లో పెద్దపెద్ద యుద్ధాలే జరుగుతున్నట్లు దీనిలో పాల్గొన్న వారు చెప్పారు.
ఇక్కడ మరో విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ ఉంటే అన్ని యాప్‌లు, అన్ని గేమ్‌లు మన చేతిలో ఉన్నట్లు కాదు. ‘‘పిల్లలతో మాట్లాడేటప్పుడు వారు కొన్ని విషయాలు మాకు చెబుతున్నారు. తమ ఫోన్లలో ఏ యాప్స్ వాడుతున్నారో తల్లి దండ్రులు చెప్పాలని అడుగుతున్నారని వారు అంటున్నారు. నిజంగా ఇది చాలా తెలివైన పని’’అని లివింగ్‌స్టోన్ అన్నారు.
నిజానికి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా గేమ్స్ ఆడొచ్చు. దీంతో ఫోన్‌ల కంటెంట్‌పై వారికి కూడా అవగాహన వస్తుంది.
‘‘దీని వల్ల పిల్లల ఫోన్ వాడకాన్ని మనం పర్యవేక్షించినట్లు అవుతుంది. అదే సమయంలో ఈ విషయంపై వారితో మాట్లాడాలి. అప్పుడే ఇద్దరికీ మంచిది’’అని ఆడ్జెర్స్ చెప్పారు.
వారికి వద్దని చెప్పి.. మీరు చేయకూడదు
రాత్రిపూట బెడ్‌రూమ్‌లో ఫోన్ ఉపయోగించకుండా చూడటం లాంటి నిబంధనల విషయంలోనూ తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.
‘‘ద్వంద్వ వైఖరులను పిల్లలు అస్సలు ఒప్పుకోరు. వారికి వద్దని చెప్పి, మీరు అదే పని చేయకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా భోజనం చేసేటప్పుడు లేదా రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ఉపయోగించకూడదు’’అని లివింగ్‌స్టోన్ అన్నారు.
పిల్లలంతా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. పుట్టినప్పటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసున్న పిల్లలు డిజిటల్ టెక్నాలజీని తమ తల్లిదండ్రుల తరహాలోనే ఉపయోగించాలని చూస్తారని ఒక యూరోపియన్ నివేదిక వెల్లడించింది. దీనిలో పాల్గొన్న కొంతమంది తల్లిదండ్రులు.. పిల్లలకు తమ పాస్‌వర్డ్‌లు కూడా తెలుసని, తమ ప్రమేయం లేకుండా పిల్లలు ఫోన్లు ఉపయోగిస్తున్నారని వారు తెలిపారు.
అయితే, ఇక్కడ పిల్లల్లో నైపుణ్యాల మెరుగుకు కూడా స్మార్ట్‌ఫోన్లను తల్లిదండ్రులు ఉపయోగించొచ్చు. ‘‘ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్లు ఎలా పనిచేస్తాయి? వీటితో ఏం చేయొచ్చు?’’లాంటి అంశాలను వారికి మనం నేర్పించొచ్చని స్టెవిక్ చెప్పారు.
మొత్తానికి పిల్లలకు ఫోన్ ఎప్పుడు కొనాలనే అంశం తల్లిదండ్రుల విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఇప్పుడు వద్దని భావించొచ్చు. అయితే, కాస్త సృజనాత్మకతతో స్మార్ట్‌ఫోన్ లోటును మనం భర్తీ చేసుకోవచ్చు కూడా.
‘‘ఆత్మవిశ్వాసంతో ఉండే పిల్లలు, ఇతరులతో వేగంగా కలిసిపోయేవారికి అయితే అసలు ఎలాంటి సాయమూ అవసరంలేదు. సాధారణంగా పిల్లలు స్కూలులోనే వారికి కావాల్సిన సామాజిక సంబంధాలను ఏర్పరచుకుంటారు’’అని లివింగ్‌స్టోన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
- జ్ఞాన్వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
- SCO Summit: ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఏం మాట్లాడబోతున్నారు?
- బీజేపీ నేత, మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు అయిదేళ్ల జైలు శిక్ష, ఆమె భర్తకు కూడా...అసలు కేసు ఏంటి?
- ఊబకాయులు తెలంగాణలో ఎక్కువా, ఆంధ్రలో ఎక్కువా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏం చెప్పింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)