ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?

భారతదేశంలో జాబ్ మార్కెట్‌లో మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని తాజా రిపోర్టులో తేలింది. పురుషులతో సమానంగా అర్హతలు, అనుభవం ఉన్నా, మహిళలకు తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆక్స్‌ఫామ్ ఇండియా 'డిస్క్రిమినేషన్ రిపోర్ట్ 2022'లో వెల్లడయింది.

"సామాజికంగా చిన్నచూపు, ఉద్యోగం ఇచ్చేవారి పక్షపాత ధోరణి" ఈ వివక్షకు కారణాలని పై నివేదికలో తెలిపారు.

అలాగే, ఇతర అట్టడుగు వర్గాలు, అంటే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్నవారు, గిరిజనులు, ముస్లింలు కూడా జాబ్ మార్కెట్‌లో వివక్ష ఎదుర్కుంటున్నాయని ఈ నివేదికలో వెల్లడయింది.

"ఒకే రకమైన అర్హతలు, సామర్థ్యం ఉన్నా, గుర్తింపు, సామాజిక నేపథ్యం కారణంగా తేడా చూపించడమే వివక్ష. జాబ్ మార్కెట్‌లో మహిళలు, ఇతర సామాజిక వర్గాలు అసమానత ఎదుర్కోవడానికి కారణాలు చదువు లేకపోవడం లేదా అనుభవం లేకపోవడం కాదు. వారి పట్ల ఉన్న వివక్షే కారణం" అని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ అన్నారు.

ఆక్స్‌ఫామ్ పరిశోధకులు 2004 నుంచి 2020 వరకు వివిధ సామాజిక వర్గాలలో ఉద్యోగాలు, వేతనాలు, ఆరోగ్యం, వ్యవసాయ రుణాల యాక్సెస్‌పై ప్రభుత్వ డేటాను పరిశీలించారు. వివక్షను లెక్కించడానికి స్టాటిస్టికల్ మోడల్స్ వాడారు.

ప్రతి నెల సగటున, పురుషులు స్త్రీల కంటే రూ. 4,000 ఎక్కువగా సంపాదిస్తున్నారని, ముస్లింల కంటే ముస్లిమేతరులు రూ. 7,000 ఎక్కువగా సంపాదిస్తున్నారని, కుల వ్యవస్థలో దిగువన ఉన్నవారు, గిరిజనులు ఇతరులతో పోలిస్తే రూ. 5,000 తక్కువగా సంపాదిస్తున్నారని ఈ పరిశోధనలో తేలింది.

భారతదేశంలో మహిళల పట్ల వివక్ష కొత్తదేం కాదు. ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే కడుపులోనే బిడ్డని చంపేస్తారు. ప్రతి ఏడాది ఇలాంటివి గర్భస్రావాలు వేల సంఖ్యలో జరుగుతాయి. అందుకే లింగ నిష్పత్తిలో దారుణమైన అసమానతలు కనిపిస్తాయి. పుట్టిన తరువాత కూడా వివక్ష, పక్షపాతం, హింస, నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంటారు. అది వారి జీవితమంతా కొనసాగుతుంది.

అలాగే, శ్రామిక శక్తిలో జెండర్ అసమానతలు ఉన్నాయన్నది కూడా తెలిసిన విషయమే. లేబర్ మార్కెట్‌లో మహిళల సంఖ్య చాలా తక్కువ.

భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020-21లో శ్రామిక శక్తిలో మహిళలు 25.1 శాతం మాత్రమే ఉన్నారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా వంటి అనేక దేశాలలో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంతే కాదు, స్వదేశంలోనే ఇరవై ఏళ్ల ముందుకన్నా మహిళల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2004-05లో శ్రామిక శక్తిలో మహిళలు 42.7 శాతం ఉన్నారు. ఇప్పుడది దాదాపు సగానికి పడిపోయింది.

ఈ కాలంలో భారతదేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ, శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.

గత రెండు సంవత్సరాల్లో కరోనా మహమ్మారి కారణంగా ఈ ధోరణిని మరింత పెరిగి ఉండవచ్చు. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగాల కొరత తీవ్రమైంది. అది మహిళలను మరింత ఎక్కువగా శ్రామిక శక్తి నుంచి బయటకు నెట్టివేసి ఉండవచ్చని ఆక్స్‌ఫామ్ అభిప్రాయపడింది.

ఇంటి బాధ్యతలు లేదా సాంఘిక స్థితి కారణంగా మంచి అర్హతలున్నప్పటికీ, మహిళలు ఉద్యోగాల్లో చేరడానికి మొగ్గుచూపట్లేదని, ఈ అంశం వివక్ష తీవ్రతను తెలియజేస్తుందని ఆక్స్‌ఫామ్ రిపోర్టులో పేర్కొన్నారు.

"పితృస్వామ్య సమాజం, పురుషాధిక్యత వల్ల పురుషులతో సమానంగా లేదా అంత కంటే ఎక్కువ అర్హతలు ఉన్నప్పటికీ మహిళలు ఉపాధికి బయటే ఉంటున్నారు. కాలంతో పాటు ఇది మారట్లేదు" అని నివేదికలో రాశారు.

మహిళలే కాకుండా, "చారిత్రకంగా అణచివేతకు గురైన దళితులు, ఆదివాసీలు, ముస్లింల వంటి మతపరమైన మైనారిటీలు" కూడా ఉద్యోగాలు, జీవనోపాధి, వ్యవసాయ రుణాలను పొందడంలో వివక్షను ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది.

"కోవిడ్ 19 మహమ్మారి ప్రారంభంలో, ముస్లింలలో నిరుద్యోగం చాలా ఎక్కువగా 17 శాతం పెరిగింది."

"భారత సమాజంలో వివక్ష సామాజికంగా, నైతికంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా ఉంది. ఇది ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది" అని అమితాబ్ బెహర్ అన్నారు.

వివక్ష రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, పౌర సమాజం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)