డోనల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు..

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు.. అధ్యక్ష పత్రాలకోసం వెతికారన్న ట్రంప్ కుమారుడు..

ఫ్లోరిడాలోని తన ఇంటిపైన ఎఫ్‌బీఐ దాడి చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనన్నారు. పెద్ద సంఖ్యలో ఏజెంట్లు సెర్చ్ వారెంట్‌తో తన కాంపౌండ్‌లోకి ప్రవేశించారని, తన ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారని అన్నారు.

డోనల్డ్ ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా పనిచేశారు.

"ఇలాంటి దాడిని వ్యవస్థ లోపించిన, మూడో ప్రపంచ దేశాల్లోనే చూడగలం. ఇప్పుడు అమెరికా కూడా అలాంటి దేశంగా మారిపోవడం విచారకరం. ఈ స్థాయిలో అవినీతిని ముందెన్నడూ చూడలేదు. వాళ్లు నా బీరువాను కూడా బద్దలుకొట్టారు" అని ట్రంప్ అన్నారు.

ఫ్లోరిడాలో మాజీ ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్ ఇంటిపైన ఎఫ్‌బీఐ చేపట్టిన సోదాల్లో ఆయన నిర్వహించిన అధికారిక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

''దీని అర్థం ఏంటంటే, అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన కన్జర్వేటివ్ నేత, మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు అధ్యక్షపదవికి అభ్యర్థి కాగల వ్యక్తిపైన తీవ్రస్థాయి నేర విచారణ జరుపుతున్నారన్న మాట. ఇది గతంలో ఎన్నడూ చూడనిది'' అని షికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్డ్ పేప్ బీబీసీతో అన్నారు.

ఉదయం 10 గంటలప్పుడు, వారంట్ ఇవ్వడానికి కాస్త ముందుగా, ట్రంప్‌కు భద్రత కల్పిస్తున్న సీక్రెట్ సర్వీసుకు విషయం తెలిపామని ఒక భద్రతా అధికారి సీబీఎస్‌తో చెప్పారు. ట్రంప్‌కు భద్రత కల్పించే ఏజెంట్లు ఎఫ్‌బీఐ ఏజెంట్లకు సహకరించారని కూడా ఆయనన్నారు.

డోనల్డ్ ట్రంప్ నివాసం నుంచి ఎఫ్‌బీఐ ఏజెంట్లు చాలా పెట్టెలను పట్టుకెళ్లారనే రిపోర్టులు కూడా ఉన్నాయి. అయితే, తలుపులను పగులగొట్టలేదని, సాయంత్రం వరకూ రెయిడ్ కొనసాగిందని కూడా చెబుతున్నారు.

ఆ సమయంలో డోనల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

ట్రంప్ ఓ ప్రకటనలో ఈ దాడిని ఖండించారు. ఇది అప్రకటిత రెయిడ్ అని, దేశంలో ఇదో చీకటి అధ్యాయమని, తాను అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయకుండా న్యాయవ్యవస్థను ఆయుధంగా మల్చుకున్నారని ఆయన అన్నారు. వ్యవస్థ లోపించిన, మూడో ప్రపంచ దేశాల్లో మాత్రమే ఇలాంటి దాడుల్ని చూడగలమని, అమెరికా కూడా అలాంటి దేశంగా మారిపోవడం విచారకరమని, ఈ స్థాయి అవినీతిని ఎన్నడూ చూడలేదని ట్రంప్ ఆరోపించారు. తన బీరువాను కూడా పగులగొట్టారని ఆయనన్నారు.

''హిల్లరీ క్లింటన్‌కు ప్రెసిడెంట్ ట్రంప్ అది పెద్ద విమర్శకుడిగా ఉన్నారు. విదేశాంగ మంత్రిగా ఆమె తన వ్యక్తిగత ఈమెయిల్‌ను ఉపయోగించుకోవడం ద్వారా, కొన్ని చట్ట ఉల్లంఘనలకు పాల్పడి ఉండొచ్చని కొందరు భావిస్తారు. చట్టాల ప్రకారం డాక్యుమెంట్లన్నీ రికార్డులుగా ఉండేలా అధికారిక ప్రభుత్వ ఈమెయిల్స్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ బహుశా అంతకన్నా ఎక్కువే చేశారనుకోవచ్చు'' అని విదేశాంగశాఖ మాజీ అధికారి డేవిడ్ తఫూరీ చెప్పారు.

వైట్ హౌస్ నుంచి ఆయన ఏయే క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను తీసుకెళ్లి ఉండొచ్చనే అంశంపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొందరు మాత్రం ఈ చట్టపరమైన ప్రక్రియనే తప్పు పడుతున్నారు.

అయితే, ఈ సోదాకు రాజకీయ ప్రాముఖ్యం ఉందనుకోవచ్చు.

ఒక క్రిమినల్ లా ప్రకారం అధికారిక రికార్డులను తొలగించడం నిషేధం. దీని ఫలితంగా ఒక వ్యక్తిని అధ్యక్ష పదవికి పోటీపడకుండా అనర్హులుగా ప్రకటించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)