You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లండన్: ‘సెక్స్‌కు ఒప్పుకోలేదని’ 20 ఏళ్ల అమ్మాయిని రంపంతో కోసి చంపిన 64 ఏళ్ల వృద్ధుడు
- రచయిత, జూన్ కెల్లీ
- హోదా, బీబీసీ న్యూస్
ఎలక్ట్రిక్ రంపంతో యువతిని హత్య చేసి లండన్‌లోని ఓ పార్కులో పాతిపెట్టిన వృద్ధుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
ఈ కేసులో హత్యకు గురయింది ఆగ్నస్ అకోమ్(20) కాగా.. ఆమెను 64 ఏళ్ల వృద్ధుడు నెకులాయి పైజన్ చంపేశారనేది ఆరోపణ.
తాను ఈ హత్య చేయలేదని నెకులాయి చెప్పినప్పటికీ ఆధారాలను పరిశీలించిన ఓల్డ్ బెయిలీ న్యాయస్థానం ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది.
ఆగ్నస్ తలపై నెకులాయి 20 సార్లు రంపంతో దాడిచేసినట్లు పోలీసులు చెప్పారు.
నెకులాయి ఆమెపై దారుణంగా హింసకు పాల్పడ్డారని, తనతో సెక్స్‌కు అంగీకరించకపోవడంతోనే ఆయన దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
నెకులాయికి కనీసం 22 ఏళ్ల యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
డోరా అని అందరూ పిలుచుకునే ఆగ్నస్ అకోమ్ 2021 మే 9 నుంచి కనిపించకుండాపోయారు. ఆ రోజున నార్త్ లండన్‌లోని బ్రెంట్‌లో ఉన్న తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఆ తరువాత తిరిగి రాలేదు.
తొలుత ఆమెది అదృశ్యం కేసుగా పోలీసులు రికార్డ్ చేశారు. లండన్ మెట్రోపాలిటిన్ పోలీసులకు రోజుకు సుమారు 100 మిస్సింగ్ కేసులొస్తాయి. ఆగ్నస్ కేసు కూడా అలాంటిదిగానే చూశారు తొలుత.
సాధారణంగా మిస్సింగ్ కేసులు వారంపదిరోజుల తరువాత కొలిక్కి వస్తాయి. కానీ, ఆగ్నస్ జాడ మాత్రం తెలియలేదు. దీంతో మెట్రోపాలిటన్ పోలీసులు ఈ కేసును స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్‌కు అప్పగించారు.
'ఆగ్నస్ తన భాగస్వామితో కానీ, కుటుంబసభ్యులతో కానీ, స్నేహితులతో కానీ ఫోన్ కాంటాక్ట్‌లోకి రాలేదు' అని చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫోలీస్ నీల్ జాన్సన్ చెప్పారు. ఆయనే ఈ కేసును దర్యాప్తు చేశారు.
'ఆవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలాంటిది కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాలోనూ ఏమీ పోస్ట్ చేయలేదు. ఆమె బ్యాంక్ ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలూ జరగలేదు' అని పోలీసులు చెప్పారు.
ఆమె కనిపించకుండాపోయినరోజునే చివరిసారిగా ఆమె తన బ్యాంక్ కార్డును ఉపయోగించారు. ఒక కాఫీ షాప్‌లో ఆమె తన కార్డు వినియోగించారు.
దీంతో పోలీసులు అక్కడి నుంచే దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. నెకులాయి పైజాన్ ఉన్న కారులో ఆమె ఎక్కినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు.
లారీ డ్రైవరుగా పనిచేసే నెకులాయి బ్రెంట్‌లో ఒక షిప్పింగ్ కంటెయినర్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నెకులాయిని పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయన తనకు ఆగ్నస్ తెలుసనే చెప్పారు.
ఆమె ఒక చోట యాచిస్తున్నప్పుడు తొలిసారి కలిశానని, ఆ తరువాత అప్పుడప్పుడు తాము శారీరకంగా కలిశామని చెప్పారు.
ఆమె కనిపించకుండాపోయిందని చెబుతున్న రోజున కూడా తనతో కంటెయినర్‌కు వచ్చిందని, కానీ, ఆ తరువాత ఇద్దరం అక్కడినుంచి వెళ్లిపోయామని దర్యాప్తు అధికారులకు నెకులాయి తెలిపారు.
అయితే, ఆ ప్రాంతంలోని సీసీ కెమేరాల ఫుటేజ్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కంటెయినర్‌లోకి ఇద్దరూ వెళ్లినప్పటికీ అక్కడి నుంచి నెకులాయి ఒక్కరే తిరిగి బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
నెకులాయి కంటెయినర్‌లోకి వెళ్తున్నప్పుడు సీసీ కెమేరావైపు చూశారని కూడా చీఫ్ ఇన్‌స్పెక్టర్ నీల్ జాన్సన్ చెప్పారు.
ఇద్దరూ లోనికి వెళ్లిన గంట తరువాత నెకులాయి ఒక్కరే బయటకు వచ్చారని.. ఆ తరువాత నుంచే ఆగ్నస్ కనిపించలేదని పోలీసులు తేల్చారు.
'మేం కంటెయినర్‌ను మా స్వాధీనంలోకి తీసుకున్నాం. ఆగ్నస్ లోపల ఎక్కడైనా ఉన్నారేమో అని అంతటా వెతికాం. ఆ కంటెయినర్‌లో ఫ్లోర్, గోడలు, పైకప్పు అన్ని తీసేసి చూశాం. ఆ తరువాత ఇంకో విషయం తెలిసింది. కంటెయినర్ పక్కనే ఉన్న బిల్డింగ్‌ను నెకులాయి లీజుకు తీసుకున్నారని.. కంటెయినర్ నుంచి ఆ బిల్డింగులోకి వెళ్లడానికి మార్గం ఉంది' అని పోలీసులు చెప్పారు.
ఆగ్నస్ మిస్సయిన రోజునే ఆ బిల్డింగ్ వెనుక నుంచి నెకులాయి ఒక సంచిని ఈడ్చుకుంటూ వెళ్తుండడం సీసీ కెమేరాలలో కనిపించింది.
అందులోనే ఆగ్నస్ మృతదేహాన్ని నెకులాయి తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ తరువాత రోజున బ్యాగు నుంచి డెడ్‌బాడీని ఒక చక్రాల డబ్బాలోకి మార్చి దాన్ని పాతిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ ఆధారాలన్నీ దొరికిన తరువాత రొమేనియా జాతీయుడైన నెకులాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెకులాయి కారు, ఆయన కంటెయినర్, ఆయన లీజుకు తీసుకున్న భవనంలో ఆగ్నస్ డీఎన్‌ఏ ఆధారాలు పోలీసులకు లభించాయి.
హత్యకు వాడిన ఎలక్ట్రిక్ రంపం, ఆగ్నస్ దుస్తులు లభించాయి. కానీ, అప్పటికి ఇంకా ఆమె మృతదేహం పోలీసులకు దొరకలేదు.
నాలుగు రోజులైనా పోలీసులకు ఆగ్నస్ మృతదేహం దొరకలేదు. దీంతో నెకులాయి సాధారణంగా ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించారు.
చివరకు ఆగ్నస్ కనిపించకుండా పోయినప్పటి నుంచి 36 రోజుల తరువాత నీస్డెన్ రిక్రియేషన్ గ్రౌండ్ దగ్గర పోలీసు జాగిలాలు పసిగట్టాయి. పడిపోయిన ఒక చెట్టు కొమ్మలు, ఆకుల మధ్య పాతిపెట్టిన ఆగ్నస్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.
ఆధారాలన్నీ సేకరించిన తరవాత ఆమె మృతదేహాన్ని దహనం చేసి అస్తికలను హంగరీలోని ఆమె కుటుంబీకులకు అప్పగించారు.
నెకులాయితో వెళ్లిన ఆగ్నస్ సెక్స్‌కు నిరాకరించడం వల్లే ఆయన హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కాగా ఆగ్నస్ జీవిత సహచరుడు పీటర్ లెనార్ట్ ఆమె లేని లోటును తలచుకుని ఆవేదన చెందారు. ఆగ్నస్ చనిపోవడానికి ముందు తామిద్దరం తమ చిన్న కుమారుడికి లేఖ రాస్తున్నామని.. ఇప్పుడు ఆమె లేకుండా తాను ఆ లేఖను ఎలా పూర్తి చేయాలంటూ ఆయన బాధపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- మీర్ సుల్తాన్ ఖాన్: ఒక భారతీయ సేవకుడు బ్రిటన్ సామ్రాజ్య చెస్ ఛాంపియన్ ఎలా అయ్యాడు?
- మనీషా రూపేటా: పాకిస్తాన్లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ
- ఎలాన్ మస్క్: అఫైర్ వివాదంలో టెస్లా అధినేత
- పాకిస్తాన్ ఆదాయంలో 40 శాతం వడ్డీలకే... ఈ దేశం మరో శ్రీలంక అవుతుందా?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)