ఉదయ్‌పుర్: కన్నయ్యలాల్ హత్య కేసులో పాకిస్తాన్‌లోని 'దావత్-ఎ-ఇస్లామ్' పేరు ఎందుకు వినిపిస్తోంది?

    • రచయిత, షుమాయిలా జాఫరీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్

రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌లోని కన్నయ్యలాల్ హత్య కేసులో పాకిస్తాన్‌కు చెందిన దావత్-ఎ-ఇస్లామ్ పేరు వినిపిస్తోంది.

ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన గౌస్ మహమ్మద్ ఎనిమిదేళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లాడని రాజస్థాన్ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌లోని వ్యక్తులతో గౌస్ మహమ్మద్ తరచూ మాట్లాడుతుండేవాడని పేర్కొన్నారు.

మరోవైపు కరాచీలోని దావత్-ఎ-ఇస్లామ్ కార్యాలయానికి కూడా గౌస్ మహమ్మద్ వెళ్లివచ్చాడని రాజస్థాన్ డీజీపీ ఎంఎల్ లాఠర్ చెప్పారు.

దావత్-ఎ-ఇస్లామ్.. ఒక సున్నీ ముస్లిం సంస్థ. 1981లో పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ ఇల్యాస్ అత్తార్ కాదరీ దీన్ని ఏర్పాటుచేశారు.

కరాచీకి చెందిన ఈ సంస్థ రాజకీయేతర సంస్థగా చెప్పుకుంటోంది. తాము ఖురాన్‌తోపాటు మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన ముస్లిం పవిత్ర గ్రంథాలను ప్రజలకు బోధిస్తామని చెబుతోంది.

ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కరాచీలో ఉంది. దీన్ని ఇల్యాస్ అత్తార్ ఏర్పాటుచేసినట్లు సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అల్లా చూపిన బాటలో ప్రజలను తీసుకెళ్లడం, ఇస్లాంను బోధించడం తమ లక్ష్యమని వివరించారు.

సున్నీ ముస్లింలలోని బరెల్వీ వర్గానికి చెందిన వేల మందికి ఈ సంస్థ ఇస్లాంను బోధిస్తోంది. టీవీ ఛానెళ్లు, మ్యాగజైన్‌ల సాయంతో దావత్-ఎ-ఇస్లామ్ వ్యవస్థాపకులు ప్రసంగాలు ఇస్తుంటారు. మరోవైపు స్వచ్ఛంద సేవకుల సాయంతో సామాజిక కార్యక్రమాలను కూడా దావత్-ఎ-ఇస్లామ్ చేపడుతుంది.

పాకిస్తాన్‌లోని 820 పాఠశాలలకు చెందిన 55,000 మందికిపైగా విద్యార్థులకు ఇస్లామిక్ కోర్సు దర్స్-ఎ-నిజామీని బోధించినట్లు దావత్-ఎ-ఇస్లామ్ చెబుతోంది.

మరోవైపు 3,500 మదర్సాలకు చెందిన 1.75 లక్షల మందికి కూడా ఖురాన్ బోధించినట్లు సంస్థ చెబుతోంది. అమెరికా, బ్రిటన్, కెనడాలతోపాటు చాలా దేశాల్లో సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి.

బరెల్వీ సంస్థ..

ఇదివరకు ఎలాంటి హింసాత్మక ఘటనలతోనూ దావత్-ఎ-ఇస్లామ్‌కు సంబంధంలేదని వ్యూహాత్మక, రాజకీయ విశ్లేషకుడు మహమ్మద్ ఆమిర్ రాణా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రాంచీలు ఉన్న ఈ సంస్థ ఎలాంటి హింసను ప్రోత్సహించదని ఆయన అన్నారు.

''ఈ సంస్థకు చెందిన ప్రముఖులు.. రాజకీయాలు, హింసకు దూరంగా ఉంటారు. ఇది పూర్తిగా మతపరమైన సంస్థ. సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతుంది''అని రాణా వివరించారు.

''జమాతే ఇస్లామీలాంటి సంస్థల్లో చేరడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ, దావత్-ఎ-ఇస్లామ్‌లో అలా కాదు. ఎవరైనా ఈ సంస్థలో చేరొచ్చు''అని ఆయన చెప్పారు.

బరెల్వీ కమ్యూనిటీ ప్రజల సంస్థగా దీన్ని చెబుతారు. అయితే కొన్ని అతివాద బరెల్వీ సంస్థలు కూడా ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్తను అవమానిస్తూ వ్యాఖ్యలుచేసే వారిపై ఆ సంస్థలు హింసకు కూడా పాల్పడ్డాయి.

పెరుగుతున్న అతివాదం..

మహమ్మద్ ఆమిర్ రాణా చెప్పిన అంశాలతో కరాచీకి చెందిన జియావుర్ రెహమాన్ కూడా అంగీకరించారు. రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో మతపరమైన అంశాలపై రెహమాన్ వార్తలు రాస్తున్నారు.

''చిన్నప్పుడు నేను ఎక్కువగా కరాచీలోనే గడిపాను. అప్పుడే దావత్-ఎ-ఇస్లామ్ గురించి తెలుసుకున్నాను. మా ఇంటి చుట్టుపక్కల ఈ సంస్థకు చెందిన మదర్సాలు ఉండేవి. ఎలాంటి వివాదాల్లోనూ ఈ సంస్థకు సంబంధం ఉండేది కాదు''అని రెహమాన్ చెప్పారు.

''బరెల్వీ వర్గం శాంతికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. కానీ, గత కొన్నేళ్లుగా ఈ వర్గంలోనూ కొంతమంది యువత అతివాదం బాట పడుతున్నారు. మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడితే హింసకు తెగబడుతున్నారు''అని ఆయన వివరించారు.

''బరెల్వీ సంస్థల్లో అతివాదం క్రమంగా పెరుగుతోంది. పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తాసిర్ హత్య కేసులో ముంతాజ్ కాదరీని ఉరితీసిన తర్వాత ఈ అతివాదం మరింత పెరిగింది. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన విషయాల్లో వారు చాలా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు''అని రెహమాన్ తెలిపారు.

పంజాబ్ గవర్నర్ అయిన సల్మాన్ తాసిర్‌కు ముంతాజ్ కాదరీ బాడీగార్డుగా పనిచేసేవారు. అయితే, మహమ్మద్ ప్రవక్తను అవమానిస్తూ వ్యాఖ్యలుచేశారనే ఆరోపణలపై తాసిర్‌ను కాదరీ 2011లో హత్య చేశారు. దీంతో 2016లో కాదరీని ఉరితీశారు. కాదరీ అంత్యక్రియలకు వేల మంది బరెల్వీ వర్గం ప్రజలు హాజరయ్యారు.

కాదరీ కోసం చేసిన ప్రార్థనల్లో దావత్-ఎ-ఇస్లామ్‌ కూడా పాలుపంచుకొంది.

అయితే, నేరుగా సంస్థపై ఎలాంటి ఆరోపణలూ రాలేదని రెహమాన్ చెప్పారు. సంస్థకు చెందిన కొంతమంది అతివాదం బాట పట్టి ఉండొచ్చని ఆయన అన్నారు.

పాకిస్తాన్ ఏమంది?

రాజస్థాన్ ఉదయ్‌పుర్‌కు చెందిన టైలర్ కన్నయ్యలాల్‌ను మంగళవారం మహమ్మద్ రియాజ్, గౌస్ మహమ్మద్ హత్య చేశారు. మహమ్మద్ ప్రవక్తను అవమానించే వారిని ఇలానే హత్య చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ హత్యను తామే చేసినట్లు ఇద్దరు నిందితులూ అంగీకరించారు. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో కన్నయ్యలాల్ పోస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.

గత మే నెలలో ఓ టీవీ ఛానెల్‌లో మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.

నిందితులతో సంబంధాలపై వస్తున్న ఆరోపణలపై దావత్-ఎ-ఇస్లామ్‌ అధికార ప్రతినిధిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, వార్త రాసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.

అయితే, ఈ ఘటనతో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధమూలేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

''ఉదయ్‌పుర్ ఘటనతో పాకిస్తాన్‌కు సంబంధముందని భారత మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నిరాధారమైన వార్తలను మేం ఖండిస్తున్నాం. భారత్‌లోని బీజేపీ-ఆరెస్సెస్ ప్రభుత్వం.. ఇలాంటి ఘటనల్లో పాకిస్తాన్ పాత్ర ఉందని మావైపు వేలు చూపిస్తోంది. ఇలాంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరు''అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)