You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Babushka Z: సోవియట్ జెండా పట్టుకున్న ఈ యుక్రెయిన్ వృద్ధ మహిళ రష్యా ప్రచారాస్త్రంగా ఎలా మారారు?
- రచయిత, సోఫియా బెటిజా, సివటోస్లావ్ ఖోమెంకో
- హోదా, బీబీసీ న్యూస్
సోవియట్ యూనియన్ జెండాను చేతిలో పట్టుకున్న యుక్రెయిన్ సైనికులకు ఎదురెళ్ళిన ఈ యుక్రెయిన్ వృద్ధ మహిళ ఇప్పుడు రష్యా ప్రచారానికి ఒక తిరుగులేని అస్త్రంగా మారిపోయారు.
యుక్రెయిన్ సైనికులతో ఆమె మాట్లాడుతున్న వీడియో వైరల్ కావడంతో ఆమె చాలా పాపులర్ అయిపోయారు. ఆమె పేరు బాబుష్కా-Z.
వీడియోలో జరిగిన ఘటన వెనుక ఉన్న నిజాన్ని నిర్ధారించడానికి "బాబుష్కా-Z"తో బీబీసీ మాట్లాడింది.
''వారు నన్ను పొగడాల్సిన అవసరం లేదు. నేనొక రైతును మాత్రమే. నేను ఉన్నట్లుండి ఎందుకు సెలెబ్రిటీ అయిపోయానో నాకు అర్థం కావడం లేదు'' అని ఆమె అన్నారు.
'బాబుష్కా జడ్'గా ఆమె ప్రాచుర్యం పొందారు. బాబుష్కా అంటే రష్యన్ భాషలో అమ్మమ్మ. 'జడ్' అనే ఇంగ్లిష్ అక్షరం, రష్యా సాయుధ వాహనాలపై తరచుగా కనిపిస్తుంది.
కొత్తగా ఆమెకు దక్కిన ఫేమ్‌కు సంబంధించిన ఫొటోలను చూపించగానే ఆవిడ ఆశ్చర్యపోయారు. ''వీటిని నేను ఇప్పటివరకు చూడలేదు'' అని ఆమె బీబీసీకి చెప్పారు.
వైరల్ అయిన వీడియోలో... ఎర్రటి సోవియట్ జెండాను పట్టుకొని ఆమె, యుక్రెయిన్ సైనికుల వైపుకు వెళ్లడం కనిపిస్తుంది. అప్పుడు సైనికులు... మీకు సహాయం చేయడానికి, ఆహారం సంచిని ఇవ్వడానికి వచ్చామని ఆమెతో అంటారు. తర్వాత ఆమె చేతిలోని జెండాను తీసుకొని నేలపై విసిరికొట్టి తొక్కుతారు. దాంతో అవమానంగా భావించిన ఆమె ఆహారాన్ని తిరిగి ఇచ్చివేసి... ''ఈ జెండా కోసమే నా తల్లిదండ్రులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చనిపోయారు'' అని కోపంగా చెబుతారు.
క్రెమ్లిన్‌కు ఇది బంగారు క్షణం. సాధారణంగా అక్కడ రష్యా అనుకూల ప్రచారం కనిపించదు. కానీ, సోవియట్ యూనియన్ పతనానికి చింతించే అరుదైన యుక్రెయిన్ పౌరురాలిగా ఈమెను అందరూ చూస్తున్నారు.
చాలా మంది యుక్రెయిన్లు, రష్యా దాడిని స్వాగతించలేదు. ఇప్పుడు ఆమె సోవియట్ జెండాను పట్టుకోవడాన్ని... రష్యా చర్యకు స్థానికుల్లోనూ మద్దతు ఉందనడానికి రుజువుగా చెబుతున్నారు.
రెండో ప్రపంచయుద్ధంతో పరిచయం ఉన్న ప్రతీ రష్యన్‌ను బాబుష్కా ప్రతిబింబిస్తున్నారు.
క్రెమ్లిన్ ప్రచార తంత్రం పని చేసింది. సోవియట్ కాలం నాటి ఒక సాధారణ రైతును ప్రతిబించేలా ఉన్న ఆమె చిత్రాలు కొద్ది రోజుల్లోనే మాస్కో, సైబీరియా నుంచి దూరంగా తూర్పున ఉన్న సఖాలిన్ ద్వీపం వరకు ప్రతీచోటా కనిపించడం ప్రారంభమైంది.
ఇప్పుడు ఆమె చిత్రాలు... ప్లకార్డులు, పోస్ట్ కార్డ్‌లు, కుడ్యచిత్రాలు, శిల్పాలు, బంపర్ స్టిక్కర్ల రూపంలో వచ్చాయి. పాటలు, పద్యాలను ఆమెకు అంకితం చేశారు. మరియుపూల్‌లో రష్యా అధికారులు ఆమె విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
కానీ ఇప్పటివరకు, బాబుష్కా జడ్ నిజమైన గుర్తింపు ఎవరికీ తెలియదు. నిజానికి, ఆమె బతికి ఉన్నారో లేదో కూడా ఎవరికీ కచ్చితంగా తెలియదు.
కానీ ఆమె నిజంగానే ఉన్నారు. ఆమె నిజమైన పేరు అన్నా ఇవనోవ్నా. ఖార్కియెవ్ సమీపంలోని విలికా డానిలివ్కా అనే గ్రామంలో ఆమెను మేం కనుగొన్నాం. అక్కడ ఆమె తన భర్త, పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు, కుందేళ్లతో ఉంటున్నారు.
ఆమె రూపంతో ఏర్పాటు చేసిన విగ్రహం ఫొటోలను చూపించినప్పుడు 69 ఏళ్ల ఆ మహిళా చాలా ఆశ్చర్యపోయారు. ''నేను, నిజంగానే బాగా వయస్సు మీదపడినట్లుగా కనిపిస్తున్నానా? ఎవరో తెలియని వ్యక్తి నన్ను చూస్తున్నట్లుగా ఉంది'' అని అన్నారు.
కానీ ఆమె కథ, రష్యన్ మీడియా చిత్రీకరించిన దానికి చాలా భిన్నంగా ఉంది. ఆమె యుద్ధానికి మద్దతు ఇవ్వట్లేదు.
''మా ప్రజలు చనిపోవడాన్ని నేను ఎలా సమర్థించగలను? నా మనుమలు, మునిమనుమలు బలవంతంగా పోలాండ్‌కు వెళ్లాల్సి వచ్చింది. మేం ఇక్కడ భయం భయంగా బతుకుతున్నాం'' అని ఆమె అన్నారు.
మరి సోవియట్ జెండాతో ఎందుకు ఆమె, సైనికులను పలకరించారు? అయితే దీనికి ఆమె సమాధానం చెప్పారు. ఆహారాన్ని పంచుతోన్న యుక్రెయిన్ సైనికులను తాను రష్యా సైనికులుగా పొరబడినట్లుగా ఆమె తెలిపారు.
అన్నా మాట్లాడుతున్నప్పుడు సమీపంలో ఫిరంగుల దాడులు, పోరాటాల శబ్ధాలు వినిపించాయి. కానీ, వాటి శబ్ధానికి ఆమె ఒక్కసారి కూడా అదరలేదు. ఆమె వాటికి అలవాటు పడ్డారు.
''ఒకవేళ నాకు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడగలిగే అవకాశం వస్తే... మీరు పొరపాటు చేశారని చెబుతాను. యుక్రెయిన్ పౌరులుగా మేం ఏం చేశాం? ఇలాంటి పరిస్థితి మాకు కల్పించారు. మాకు చాలా నష్టం జరిగిందని చెబుతాను'' అని ఆమె అన్నారు.
కానీ, రష్యన్ నాయకుడిని బహిరంగంగా విమర్శించడానికి ఆమె ఇష్టపడలేదు.
''పుతిన్ ఒక అధ్యక్షుడు. ఒక రాజు, ఒక చక్రవర్తి" అని అన్నారు.
మాస్కోలో ఆమె ప్రముఖ వ్యక్తిగా మారినప్పటికీ పుతిన్ దళాలు, అన్నా గ్రామాన్ని వదల్లేదు. ఆ గ్రామంపై చాలా సార్లు బాంబు దాడులు చేశారు.
మేం ముందుకు వెళుతుండగా, కొన్ని ఇళ్లకు మంటలు కనిపించాయి. మరికొన్ని కాలి బూడిదైపోయాయి. ఆమె ఇల్లుపై కూడా షెల్లింగ్ జరిగింది. కిటికీలు, ఇంటి పైకప్పు కూడా ధ్వంసమయ్యాయి.
''వారు యుక్రెయిన్‌లోని ప్రజల గురించి పట్టించుకోరు. కేవలం భూభాగాలను స్వాధీనం చేసుకోవడంపైనే శ్రద్ధ చూపుతారు'' అని ఆమె అన్నారు.
యుక్రెయిన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన దిమిత్రో గాల్కో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
''వారు నిజాన్ని పట్టించుకోరు. నిజమైన వ్యక్తులను లెక్క చేయరు. వారికి అన్నా ఎవరో అక్కర్లేదు. వారు తలుచుకుంటే ఆమెను సమాధి కూడా చేయగలరు'' అని ఆయన అన్నారు.
అన్నా ఇప్పుడు తన భద్రత గురించి భయపడుతున్నారు. ఆన్‌లైన్‌లో రష్యన్ అనుకూల వ్యక్తిగా కనిపిస్తుండటంతో యుక్రెయిన్‌లో ఆమెపై దాడి చేస్తున్నారు.
పొరుగువారు ఆమెకు దూరంగా ఉంటున్నారు.
''వారు నన్ను ఫేమస్ చేసినందుకు నాకు సంతోషంగా లేదు. ఎందుకంటే యుక్రెయిన్‌లో ఇప్పుడు నన్ను దేశద్రోహిగా పరిగణిస్తున్నారు'' అని చెప్పారు.
ఇంటర్వ్యూ ముగిస్తూ మేం ఆమెకు వీడ్కోలు చెప్పినప్పుడు... తన ప్రియమైన ఎర్రటి జెండాను మాకు ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో భారత్‌కు అమెరికా పూర్తిగా మద్దతు ఇస్తుందా? ఇస్తే ప్రతిఫలంగా ఏం కోరుకుంటోంది?
- ప్రభుత్వం బుల్డోజర్తో ఇళ్లను కూల్చేయవచ్చా? చట్ట ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా?
- పాకిస్తాన్: 'దేశ ప్రజలారా.. టీ తాగడం తగ్గించండి.. ఆర్థికవ్యవస్థను కాపాడండి' - ప్రభుత్వం విజ్ఞప్తి
- స్టాక్ మార్కెట్: బేర్ మార్కెట్ అంటే ఏంటి? ఇది ఆర్థిక సంక్షోభానికి సంకేతమా?
- గాలిలేని, పంక్చర్లు పడని టైర్లు వచ్చేస్తున్నాయి.. ఇవి ఎలా పనిచేస్తాయంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)