You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోదుమ ఎగుమతులను భారత్ ఎందుకు నిషేధించింది? ప్రపంచం కడుపు నింపుతామన్న నరేంద్ర మోదీ యూటర్న్ తీసుకున్నారా?
- రచయిత, పీటర్ హోస్కిన్స్
- హోదా, బిజినెస్ రిపోర్టర్
గోదుమల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో గోదుమల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
షికాగోలోని బెంచ్‌మార్క్ వీట్ ఇండెక్స్ 5.9 శాతం పెరిగింది. గత రెండు నెలల్లో ఇదే గరిష్ఠం.
భారత్‌లో గోదుమ పంటపై హీట్‌వేవ్ ప్రభావం నడుమ దేశీయ మార్కెట్లలో గోదుమ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి.
ప్రపంచ మార్కెట్లలో గోదుమ ధరలు పెరగడంతో బ్రెడ్, కేకులు, నూడుల్స్, పాస్తా ఇలా అన్నింటి ధరలూ ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్నాయి.
ఇదివరకు జారీచేసిన ‘‘లెటర్ ఆఫ్ క్రెడిట్స్’’తోపాటు ప్రజల ఆహార భద్రత కోసం అభ్యర్థిస్తున్న దేశాలకు ఎగుమతులు కొనసాగుతాయని భారత ప్రభుత్వం చెబుతోంది.
మరోవైపు ఈ నిషేధం తాత్కాలికంగానే విధించామని, త్వరలో దీన్ని తొలగించే అవకాశముందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
జీ7 దేశాల విమర్శలు
ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జర్మనీలో జరిగిన జీ7 దేశాల వ్యవసాయ మంత్రులు సమావేశంలో తప్పుపట్టారు.
‘‘ప్రతి ఒక్కరూ ఎగుమతులపై ఆంక్షలు విధించడం లేదా మార్కెట్లను మూసివేయడం లాంటి చర్యలు తీసుకుంటే ఈ ఆహార సంక్షోభం మరింత ముదిరిపోతుంది’’అని జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి సెమ్ ఒజ్‌డెమిర్ వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కూటమే జీ7. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యంలో ఈ దేశాలదే ప్రధాన పాత్ర. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా జీ7లో ఉంటాయి.
ప్రపంచంలో గోదుమల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంటుంది. అయితే, ఇక్కడ ఉత్పత్తి అయిన వాటిలో సింహ భాగం దేశీయ అవసరాలకు ఉపయోగిస్తుంటారు. దీంతో ఎగుమతులకు వెళ్లేది కాస్త తక్కువగానే ఉంటుంది.
కానీ, యుక్రెయిన్‌పై రష్యా దాడి నడుమ, యుక్రెయిన్ గోదుమ ఎగుమతులు ఒక్కసారిగా పడిపోయాయి. మరోవైపు కరవులు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. దీంతో భారత్ నుంచి వచ్చే గోదుమ ఎగుమతులు ఈ కొరతను తీరుస్తాయని నిపుణులు భావించారు.
తాజా నిషేధానికి ముందు, ఈ ఏడాది మొత్తంగా పది మిలియన్ టన్నుల గోదుమలను భారత్ ఎగుమతి చేస్తుందని అంచనాలు ఉండేవి.
యూటర్న్ తీసుకున్న భారత్
‘‘సరిగ్గా వారం రోజుల ముందే, భారత వాణిజ్య మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారులు నాతో మాట్లాడారు. ప్రపంచ అవసరాలకు తగినట్లుగా గోదుమ ఎగుమతులు పెంచుతామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచం కడుపు నింపేందుకు భారత్ సిద్ధంగా ఉందన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలను వారు మరోసారి పునరుద్ఘాటించారు’’అని బీబీసీ ఇండియా ఎడిటర్ వికాస్ పాండే చెప్పారు.
‘‘తాజా ఆంక్షలను చూస్తుంటే, భారత ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దేశీయంగా పెరుగుతున్న ధరలపై భారత్ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. అయితే, ఈ నిర్ణయంతో విదేశాంగ విధానంలో సవాళ్లు ఎదురుకావొచ్చని ఒక విదేశాంగ నిపుణుడు నాతో అన్నారు’’అని వికాస్ పాండే వివరించారు.
‘‘రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలుచేసే రిజర్వుల నుంచి ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు వీలు కల్పించేలా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నుంచి మినహాయింపు వస్తుందని భారత్ ఆశిస్తోంది. ఈ విషయంలో కొన్ని దేశాలు భారత్‌కు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఆ దేశాలే.. భారత్ చర్యల విషయంలో అసంతృప్తితో ఉన్నాయి’’అని వికాస్ విశ్లేషించారు.
రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు..
యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, మార్చిలో ఆహార ధాన్యాల ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి.
సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను అత్యధికంగా ఎగుమతిచేసే దేశం యుక్రెయిన్. యుద్ధం నడుమ ఆ దేశం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా సన్‌ఫ్లవర్‌తోపాటు ప్రత్యామ్నాయ నూనెల ధరలు కూడా పెరిగాయి.
మరోవైపు మొక్కజొన్న, గోదుమ లాంటి ఎగుమతుల్లోనూ యుక్రెయిన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.
ఏప్రిల్‌లో ఈ ధరలు కాస్త తగ్గాయని, కానీ, గత ఏడాదితో పోలిస్తే, ఈ ధరలు 30 శాతం ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
పెరుగుతున్న ఆహార ధరలతోపాటు ఇంధన ధరలు కూడా ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం అవుతున్నాయి.
ఫలితంగా అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లతోపాటు ప్రధాన దేశాల్లోని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ధరల పెరుగుదలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నాయి.
వడ్డీ రేట్లను పెంచడంతో రుణాలు మరింత ప్రియం అవుతున్నాయి. ఇప్పటికే వృద్ధి రేటులు తగ్గిపోవడంతో ఈ పరిణామాలు ఆర్థిక సంక్షోభానికి దారితీసే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చే ముప్పు ‘‘చాలా చాలా ఎక్కువ’’గా ఉంది అని గోల్డ్‌మన్ సాక్స్ సీనియర్ ఛైర్మన్ లియోడ్ బ్లాంక్‌ఫెయిన్ ఆదివారం హెచ్చరించారు.
ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాదికి కూడా అమెరికా వృద్ధి రేటును గోల్డ్‌మన్ సాక్స్ తగ్గించిన నేపథ్యంలో లియోడ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఫిన్లాండ్: పుతిన్ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఈ దేశం ఎందుకు నాటోలో చేరుతోంది?
- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఔరంగాబాద్‌లో ఎందుకు నిర్మించారు?
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
- యుక్రెయిన్ యుద్ధం: భారత్‌లో వంటనూనెకు కొరత తప్పదా?
- రోజుకు మూడు పూటలూ తినాలా? రెండు భోజనాల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)