You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోజుకు మూడు పూటలూ తినాలా? రెండు భోజనాల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి
- రచయిత, రవి పాణంగిపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అసలు ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా అన్నాడు ఓ సినీ కవి.
షడ్రసోపేతమైన భోజనానికి, నోరూరించే రుచులకు పుట్టినిల్లైన తెలుగు రాష్ట్రాల్లోనైతే 3 పూటలా తినడం సర్వ సాధారణమైన విషయం.
తీసుకునే ఆహారంలో తేడా ఉండవచ్చు లేదా కొన్ని సార్లు సమయాల్లో తేడా ఉండవచ్చు కానీ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి... రోజులో మూడుసార్లు తినడం విషయంలో మాత్రం అప్పుడూ - ఇప్పుడూ ఎప్పుడూ తేడా లేదు.
అయితే అసలు 3 సార్లు తినడం మంచిదేనా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
అల్పాహారం - ఘనాహారం – ఫలహారం... ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఆహారం తీసుకునే తీరు. అదే పాశ్చాత్య దేశాల విషయానికి వచ్చే సరికి వాళ్లు కూడా మూడు పూట్లా ఆహారం తీసుకున్నప్పటికీ తీసుకునే పరిమాణంలో తేడా ఉంటుంది.
అంటే మనం మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేస్తే వాళ్లు రాత్రి సప్పర్ పేరుతో కడుపు నిండా తింటారు. మన వాతావరణ పరిస్థితులకు మన అలవాటు సరైనదనుకుంటే వారి వాతావరణ పరిస్థితులకు వారి అలవాటు సరైనదే అంటారు ప్రముఖ ఫుడ్ హిస్టోరియన్ డాక్టర్ పూర్ణ చందు.
మన వరకు వస్తే మనం ఎప్పుడెప్పుడు ఎంత మేరకు ఆహారం తీసుకోవాలో తెలియజెప్పేలానే పేర్లు పెట్టారు మన వాళ్లు.
ఉదయాన్నే పేరుకు తగ్గట్టే ఆహారాన్ని అల్పంగా తీసుకోవాలి. మధ్యాహ్నం ఘనాహారాన్ని కాస్త ఘనంగానే తీసుకోవాలి. ఇక రాత్రయ్యే సరికి ఫలహారం... అంటే కేవలం ఫలాలను మాత్రమే తీసుకోవాలి. అయితే ప్రస్తుతం ఫలహారాన్ని అన్న పదానికి మనం అర్థం మార్చేసి.. ఇంగ్లిష్ టిఫిన్లకు తెలుగీకరణ రూపంలో వాడేస్తున్నామని డాక్టర్ పూర్ణ చందు అన్నారు.
పనిబట్టే భోజనం..
అయితే చేసే పనిని బట్టి తీసుకునే ఆహారం పరిమాణంలో తేడా ఉంటుందని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక పరిశోధకులు, రచయిత సాయి పాపినేని అభిప్రాయపడ్డారు.
కాయకష్టం చేసే వ్యక్తి తీసుకునే ఆహార పరిమాణం ఒకలా ఉంటే... వైట్ కాలర్ ఉద్యోగి తీసుకునే ఆహార పరిమాణం మరోలా ఉంటుంది. శారీరక కష్టం చేసే వాళ్ల ఉదయపు ఆహారం ఒకలా ఉంటే... పెద్దగా శారీరక శ్రమ లేని వాళ్లు తీసుకునే ఉదయపు ఆహారం మరోలా ఉంటుంది.
మొత్తంగా 3 పూటలా ఆహారం తీసుకోవడం తెలుగు వారికి అప్పుడూ – ఇప్పుడూ అలవాటేనని, ఈ ఆహారపు పద్ధతులు శ్రీనాథుడు రచించిన (వినుకొండ వల్లభరాయుడు కూడా రచించాడన్న భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి.) క్రీడాభిరామంలోనూ, శ్రీ కృష్ణ దేవరాయులు రచించిన ఆముక్త మాల్యదలోనూ, అన్నమయ్య పదాలలోనూ కనిపిస్తాయని సాయి పాపినేని చెప్పుకొచ్చారు.
సరే ఇదంతా బాగానే ఉంది... 3 పూటలా తినడం మనకు ఈనాటి అలవాటు కాదు. కానీ ఇప్పటి పరిస్థితులకు, ఇప్పటి మన శారీరక కష్టానికి ముప్పొద్దులా తినడం మంచిదేనా..? వైద్యులు ఏం చెబుతున్నారు ఓ సారి చూద్దాం.
ఎప్పుడు తినడం మానేయాలి?
అయితే ఎప్పుడెప్పుడు తినాలి అన్న ప్రశ్న కన్నా ... అసలు ఎప్పుడు తినడం మానేయాలి అన్న ప్రశ్నవేసుకోవడం ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు.
అందుకే ఇప్పుడు 8 గంటల ఉపవాసం, అంటే ఒక్కో భోజనానికి మధ్య కనీసం 8 గంటలు గ్యాప్ ఇస్తే ఎలా ఉంటుదన్న అంశంపై పెద్ద ఎత్తునే పరిశోధనలు జరుగుతున్నాయి.
మన జీర్ణ వ్యవస్థకు తగినంత విశ్రాంతి ఇవ్వాలంటే 12 గంటలకు ఓసారి ఆహారం తీసుకోవాలన్నది కాలిఫోర్నియాలోని సాల్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ స్టడీస్‌లో క్లినికల్ రీసెర్చర్‌గా పని చేస్తున్న ఎమిలీ మెనుజన్ మాట. అసలు మనం ఏం తినాలి అన్న అంశంపై 2019లో ఆమె ఓ పరిశోధన పత్రాన్ని కూడా సమర్పించారు.
రోజులో ఆహారం తీసుకునే వేళల్లో వీలైనంత ఎక్కువ సమయం గ్యాప్ ఉండటం వల్ల చాలా లాభాలు ఉంటాయంటున్నారు విస్కాన్సిన్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోజలిన్ ఆండర్సన్.
నిర్ణీత సమయాన్ని పాటిస్తూ తినడం వల్ల వచ్చే శక్తిని అవసరమైన భాగాలకు అందించే సమయం శరీరానికి దొరుకుతుందని ఆండర్సన్ అభిప్రాయపడ్డారు.
ఎన్నిసార్లు తినాలి?
సరే... తగినంత విరామం తీసుకొని భోజనం తినడం మంచిదైతే.. మరి రోజుకు ఎన్ని సార్లు తినాలి... ?
న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీలోని కాలేజీ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డేవిడ్ లెవిట్‌స్కీ వంటి వాళ్లయితే రోజుకు ఒక్కసారి తింటే చాలంటున్నారు. ఈ సూత్రాన్ని ఆయన స్వయంగా పాటిస్తున్నారు కూడా.
పురాతన రోమన్లు రోజుకి ఒక్కసారే భోజనం చేసేవారని అంటున్నారు ప్రముఖ ఫుడ్ హిస్టారియన్ సెరెన్ షెర్రింగ్టన్ హోలియన్స్.
అయితే ఒక్కసారి భోజనం చేయడం వల్ల రోజంతా ఆకలిగా ఉండదా అంటే... అలాంటిదేం ఉండదు అన్నది లెవిట్‌స్కీ వాదన. ఆయన దృష్టిలో ఆకలి అన్నది ఓ మానసిక అనుభూతి మాత్రమే. 3 పూటలా భోజనం చెయ్యకపోతే కొంపలేం మునిగిపోవంటారాయన. విందు భోజనం ఆరగించేందుకు-ఉపవాసం చేసేందుకు రెండింటికీ అనుగుణంగానే మన శరీరం నిర్మాణమై ఉంటుందని లెవెట్‌స్కీ అభిప్రాయం. అయితే డయాబెటిస్‌తో బాధపడే వారికి మాత్రం ఒక్క పూట భోజనం పనికి రాదని ఆయన తేల్చి చెప్పారు.
అయితే మెనుజన్ మాత్రం రోజుకు ఒక్కసారే భోజనం అన్న ఆలోచన సరికాదంటారు. మనం సుదీర్ఘ సమయం తినకుండా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజు నిల్వలు పెరిగే ప్రమాదం ఉంది. దీన్నే ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటారు. దీర్ఘకాలం పాటు ఫాస్టింగ్ గ్లూకోజ్ నిల్వలు ఎక్కువగా కొనసాగడం టైప్ 2 డయాబెటిస్‌కి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రక్తంలో గ్లూకోజు నిల్వలు తక్కువ స్థాయిలో కొనసాగాలంటే రోజులో ఒక్క సారి మాత్రమే తింటే సరిపోతుందన్న కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి 2 సార్లు లేదా 3 సార్లు తినడం మంచిదన్నది ఆమె వాదన.
గ్లూకోజ్ పెరిగిపోతుంది..
రాత్రి వేళల్లో నిద్రపోయేందుకు వీలుగా మన శరీరం మెలటొనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే మెలటొనిన్ ఇన్సులిన్ తయారవడాన్ని నిరోధిస్తుంది. ఒక వేళ మీరు మెలటోనిన్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకుంటే ఒక్కసారిగా మీ శరీరంలో గ్లూకోజు లెవెల్స్ పెరిగిపోతాయి. ఇన్సులిన్ నిద్రాణ స్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటే అది శరీరానికి సవాలుగా నిలుస్తుంది. మీ శరీరం సరైన రీతిలో గ్లూకోజును నిల్వ చేసుకోలేదు. ఎప్పటిలాగే హైలెవవ్ గ్లూకోజు దీర్ఘ కాలం కొనసాగడం వల్ల అది టైప్ 2 డయాబెటిస్‌కి దారి తీస్తుంది.
అంటే మొత్తానికే మనం బ్రేక్ ఫాస్ట్ మానేయాలని కాదు. అప్పుడప్పుడు నిద్ర లేచిన వెంటనే టిఫిన్ ప్లేటు కోసం ఆవురావురు మంటూ ఎదురు చూడకుండా ఒకటి రెండు గంటలు వెయిట్ చెయ్యవచ్చన్నది నిపుణుల మాట.
పాశ్చాత్య దేశాల్లో మొదట్లో అల్పాహారం తీసుకోవడం కేవలం ఉన్నత వర్గాల్లో మాత్రమే కనిపించేది. అంటే దాదాపుగా 17వ శతాబ్దంలో ఇది ప్రారంభమయ్యింది. అప్పట్లో ఉదయాన్నే తగిన సమయం ఉండి, తినడానికి లోటు లేని వాళ్లు ప్రారంభించిన అలవాటు ఈ బ్రేక్ ఫాస్ట్ అని షెర్రింగ్టన్ హొలియన్స్ అంటారు.
ఆ తర్వాత 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత పని వేళల్ని పరిచయం చేసిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ అన్న కాన్సెప్ట్ సర్వ సాధారణమైపోయింది. అప్పటి నుంచే పాశ్చాత్య దేశాల్లో 3 పూట్ల ఆహారం తీసుకోవడం అలవాటయ్యిందన్నది హొలియన్స్ వాదన. అప్పట్లో అల్పాహారం చాలా సింపుల్‌గా ఉండేదని, రోడ్డు పక్కన దొరికే రొట్టె ముక్కలతో సరిపుచ్చుకునే వారని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఆ తర్వాత వచ్చిన యుద్ధం కారణంగా ఆహార కొరత ఏర్పడటంతో చాలా మంది అల్పాహారానికి దూరంగా ఉండే వాళ్లట. మళ్లీ 1950 తర్వాత నాలుగైదు రకాల పదార్థాలతో అల్పాహారం తీసుకోవడం అలవాటయ్యిందని హొలియన్స్ అన్నారు.
ఎంత గ్యాప్ ఉండాలి?
రోజుకు 2 నుంచి 3 సార్లు తింటే ఆరోగ్యం అన్న వరకు బాగానే ఉంది.
రాత్రి భోజనానికి ఉదయం అల్పాహారానికి మధ్య సుదీర్ఘ సమయం ఉండాలన్న సంగతి బాగానే ఉంది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే వైట్ కాలర్ ఉద్యోగులకు ఈ ఫుడ్ స్టైల్ ఇంకా బాగుంటుంది. మరి నైట్ షిఫ్ట్‌లు చేసే వారి పరిస్థితేంటి..? వారికి ఈ తరహాలో ఆహారం తీసుకోవడం కుదురుతుందా?
అందుకే రాత్రి 7 తర్వాత తినొద్దు... ఈ టైంలో మాత్రమే తింటే మంచిది.. ఇలాంటి సలహాలు ఇవ్వద్దంటారు ప్రొపెసర్ మెనుజన్. అన్నింటికీ మించి రాత్రి భోజనం భారీగా ఉండకుండా చూసుకోండని ఆమె సూచిస్తున్నారు. రోజులో తొలిసారి తీసుకునే ఆహారాన్ని కాస్త ఆలస్యంగా, చివరి సారి తీసుకునే ఆహారాన్ని కాస్త త్వరగా తీసుకుంటే మీలో గొప్ప మార్పును గమనించవచ్చని ఆమె అంటారు. అలాగే ఈ పద్ధతిలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించినట్టయితే మీ శరీరంపై గొప్ప ప్రభావం చూపుతుందన్నది మెనుజన్ అభిప్రాయం.
నిజానికి నిన్న మొన్నటి వరకు భారతీయులు అనుసరించిన విధానాలపైనే ఇప్పుడు పాశ్చాత్య దేశాలు పరిశోధనలు చేస్తున్నాయన్నది విశాఖపట్నానికి చెందిన క్లినికల్ డైట్ కన్సల్టెంట్ నీతా దిలీప్ అభిప్రాయం. ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం మంచి భోజనం, రాత్రి ఫలహారం అంటే పళ్లు లేదా మితాహారం తీసుకోవడం భారతీయులకు అలవాటని, అది కూడా రాత్రి వీలైనంత త్వరగా తినేవారని అన్నారు.
ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల్లోనూ అదే విషయం స్పష్టమవుతోందని ఆమె చెప్పారు. అంతే కాదు.. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయేందుకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం ఉండాలి. అంటే మనం తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగిపోయి కడుపు ఖాళీగా ఉండాలి. ఆ తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి.
అన్నింటికీ మించి నెలకు ఒక్కసారైనా ఉపవాసం చెయ్యడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని ఆమె అన్నారు. ఇక ఇప్పుడు పరిశోధకులు చెబుతున్న ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్న పదం వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ భారతీయులు మొదటి నుంచి అనుసరిస్తున్నది అదే పద్ధతని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక చివరిగా చెప్పొచ్చేదేంటంటే మీరు మీ ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేసినా వాటిని స్థిరంగా కొనసాగించడం ముఖ్యమన్నది మెజార్టీ వైద్య నిపుణులు చెబుతున్న మాట.
ఇవి కూడా చదవండి:
- ‘శ్రీలంకలో అర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో మిగిలిన చిట్టచివరి జనం’
- నవనీత్ కౌర్ రానా: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఢీకొడుతున్న తెలుగు మాజీ హీరోయిన్
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)