You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆండ్రూ సైమండ్స్: ఆసీస్ కెప్టెన్‌పై డ్రింక్ పోసినప్పుడు ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, రెండుసార్లు వరల్డ్‌కప్ గెలిచిన ఆసీస్ జట్టులో కీలక సభ్యుడు ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి కారు ప్రమాదంలో కన్నుమూశారు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా కోల్పోయిన రెండో ప్రముఖ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్. దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్ ఈ ఏడాది మార్చిలో థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించారు.
ఆసీస్‌కే చెందిన మాజీ వికెట్ కీపర్ రోడ్ మార్ష్ కూడా గుండెపోటుతో ఈ ఏడాది ప్రారంభంలో చనిపోయారు.
సైమండ్స్ ఆకస్మిక మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
కారు యాక్సిడెంట్ ఎలా జరిగింది?
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలోని టౌన్స్‌విల్లేలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారని, ఘటనా స్థలంలోనే సైమండ్స్ చనిపోయారని పోలీసులు తెలిపారు.
''ప్రాథమిక సమాచారం ప్రకారం, రాత్రి 11 గంటల తర్వాత హెర్వే రేంజ్ రోడ్‌లోని ఆలిస్ రివర్ బ్రిడ్జ్ సమీపంలో ఆయన కారు బోల్తా కొట్టింది. ఆయన ప్రాణాలు కాపాడటానికి ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది ప్రయత్నించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా ఆయన కన్నుమూశారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ క్రాష్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది" అని పోలీసులు ధ్రువీకరించారు.
సైమండ్స్‌కు భార్య లారాతో పాటు కూతురు క్లోయ్ సైమండ్స్ (4), కుమారుడు బిల్లీ (2) ఉన్నారు.
''మేం ఇంకా షాక్‌లో ఉన్నాం. నేను ఇప్పుడు మా ఇద్దరు పిల్లల గురించే ఆలోచిస్తున్నా. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన లక్షణాలన్నీ మా పిల్లలకు వచ్చాయి'' అని ఆయన భార్య లారా న్యూస్ కార్ప్‌తో అన్నారని డైలీ మెయిల్ పేర్కొంది.
ఆదివారం ఉదయం పిల్లలతో కలిసి ఆమె టౌన్స్‌విల్లే చేరుకున్నారు.
ఆల్‌రౌండర్
రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా జట్టు తరఫున 26 టెస్టుల్లో 40.61 సగటుతో 1,462 పరుగులు చేశారు. 24 వికెట్లు తీశారు. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోరు 162 (నాటౌట్) పరుగులు.
198 వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధ శతకాల సహాయంతో 5088 పరుగులు సాధించారు. ఆఫ్ స్పిన్, మీడియం పేస్ బౌలింగ్‌తో 133 వికెట్లను దక్కించుకున్నారు.
ఆయన 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. 169.34 స్ట్రయిక్ రేటుతో 337 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లను పడగొట్టారు.
ప్రపంచకప్ ప్రదర్శనలు
2003, 2007 సంవత్సరాల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో సైమండ్స్ సభ్యుడిగా ఉన్నారు.
2003 ప్రపంచకప్‌లో సైమండ్స్ చాలా బాగా ఆడాడు. జొహాన్నెస్‌బర్గ్‌లో పాకిస్తాన్‌పై 125 బంతుల్లో అజేయంగా 143 పరుగులు స్కోర్ చేశాడు. ఈ ప్రదర్శన ఆ టోర్నీలో ఆస్ట్రేలియా అజేయంగా నిలవడానికి సహాయపడింది. ఏకపక్షంగా సాగిన నాటి ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కూడా సైమండ్స్ ఆడాడు. ఇందులో చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నాలుగో ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లండ్‌లో పుట్టి ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జన్మించిన ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియాలో పెరిగారు. ఇంగ్లండ్‌లో పుట్టి, ఆఫ్రో-కరీబియన్ నేపథ్యం ఉన్న సైమండ్స్... ఇంగ్లండ్ లేదా వెస్టిండీస్ జట్ల తరఫున ఆడవచ్చు. కానీ, ఆయన ఎప్పుడూ బ్యాగీ గ్రీన్ (ఆస్ట్రేలియా టెస్టు క్రికెటర్లు ధరించే క్యాప్) ధరించాలనే కల గన్నారు. 2004లో ఆయన కల నిజమైంది. 2004 మార్చి 8న శ్రీలంకతో టెస్టుతో ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు.
యూకే కౌంటీల్లో గ్లోసెస్టర్‌షైర్, కెంట్, లాంకషైర్, సర్రే తరఫున ఆడారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, దక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించారు.
2006 బాక్సింగ్ డే యాషెస్ టెస్ట్‌లో 156 పరుగులు చేయడం, 2008లో భారత్‌పై తన అత్యధిక స్కోరు 162ను నమోదు చేయడం ఆయన కెరీర్‌లో హైలైట్‌గా నిలిచే అంశాలు. 2005లో వన్డేల్లో 5/18తో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశారు. ఒక దశలో ఆయన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
సైమండ్స్ కెరీర్ ఎక్కువగా రికీ పాంటింగ్ సారథ్యంలో సాగింది. తాను చూసిన అత్యుత్తమ ఫీల్డర్ సైమండ్స్ అని రికీ ప్రశంసించారు.
ఆటతో పాటు ఆటేతర అంశాలతో సైమండ్స్ వార్తల్లో నిలిచారు
ఆయన ఒకసారి క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో మాల్కం స్పీడ్‌తో కాంట్రాక్టు సమావేశానికి చెప్పులు లేకుండా కౌబాయ్ టోపీని ధరించి వెళ్లారు. సైమండ్స్‌కు అవుట్‌డోర్ లైఫ్ అంటే ఆసక్తి. ఆట తర్వాత ఆయన ఎక్కువ భాగం చేపలు పట్టడం, వేటాడంలోనే గడిపారు.
కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు తాగి వచ్చాడని తేలడంతో 2005 ఇంగ్లండ్ పర్యటనలో రెండు వన్డే మ్యాచ్‌ల నుంచి ఆయనను తొలిగించారు.
తన సహచరుడు, మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌తో ఆయన విభేదించారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు.
2008 ఆగస్టులో తప్పనిసరిగా హాజరు కావాల్సిన టీమ్ సమావేశానికి ఎగ్గొట్టి సైమండ్స్ చేపలు పట్టడానికి వెళ్లారు. దీంతో క్లార్క్, ఆయనను బంగ్లాదేశ్ సిరీస్ నుంచి తప్పించి ఇంటికి పంపారు. ఆ తర్వాత ఇండియా టూర్‌కు కూడా ఆయనను ఎంపిక చేయలేదు. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం చెడింది. అప్పటి టెస్టు కెప్టెన్‌గా ఉన్న క్లార్క్ తనకు ద్రోహం చేశాడని సైమండ్స్ భావించారు.
2008 వెస్టిండీస్ పర్యటనలో క్లార్క్‌పై సైమండ్స్ డ్రింక్ పోయడంతో వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.
'నేను అతనిపై డ్రింక్ విసిరికొట్టాను. నన్ను ఆయన పడుకోడానికి వెళ్లమని అనలేదు, ఇంకేదో అన్నాడు. అతను నాతో మాట్లాడిన విషయం నాకు కోపం తెప్పించింది, అందుకే డ్రింక్ పోశాను. ఆ క్షణమే మా మధ్య స్నేహం ముగిసింది' అని న్యూస్ కార్ప్ సీనియర్ జర్నలిస్ట్ రాబర్ట్ క్రాడక్‌తో సైమండ్స్ చెప్పాడు.
మంకీ గేట్ వివాదం
భారత క్రికెట్ అభిమానులు అందరికీ మంకీ గేట్ వివాదం గుర్తు ఉంటుంది. 2008లో సిడ్నీ టెస్టు సందర్భంగా భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనను మంకీ అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారని ఆండ్రూ సైమండ్స్, మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది.
దీంతో రిఫరీ హర్భజన్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు టెస్టుల నిషేధం విధించారు.
అయితే, ఈ వ్యవహారంలో హర్భజన్ తప్పులేదని, నిషేధం ఎత్తివేయకుంటే సిరీస్ నుంచి తప్పుకుంటామని అప్పటి భారత ఆటగాళ్లు హెచ్చరించారు. అప్పీల్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు సచిన్, హర్భజన్‌కు మద్దతుగా నిలవడంతో ఈ శిక్షను రద్దు చేశారు.
ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఈ వివాదం తనను తాగుబోతును చేసిందని, దీంతోనే తన కెరీర్ నాశనమైందని ఓ సందర్భంలో సైమండ్స్ అన్నారు.
మంకీ గేట్ విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి సరైన మద్ధతు లేకపోవడంతో సైమండ్స్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిందని ఆసీస్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నట్లు ద హిందూ పత్రిక పేర్కొంది.
2009లో చివరి మ్యాచ్ ఆడిన సైమండ్స్ చాలాసార్లు నిబంధనలు ఉల్లంఘించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతని కాంట్రాక్టును రద్దు చేసింది. 2009లో ఆటను విడిచిపెట్టిన తర్వాత సైమండ్స్ చేపలు పట్టడం, వేటాడటం, ఆస్ట్రేలియన్ పొదల్లో తిరగడం వంటి తన ఆసక్తులను కొనసాగించారు. 2012లో ఆయన అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు.
బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా
భారత్‌లో బిగ్‌బాస్ షోలో కూడా సైమండ్స్ పాల్గొన్నారు. ముంబైలో జరిగిన ఐదో సీజన్ బిగ్‌బాస్ కార్యక్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన రెండు వారాల పాటు కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఈ షోలో పాల్గొన్న తొలి ఇంటర్నేషనల్ క్రికెటర్ కూడా ఆయనే.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ అగ్నిప్రమాదం: 'నా గర్ల్ ఫ్రెండ్ మంటల్లో చిక్కుకుంది. నాకు వీడియో కాల్ చేసింది.. రక్షించలేకపోయా'
- భారత టీవీ సిరీస్‌లలో ఉత్తరప్రదేశ్ ఎందుకు హింసా రాజ్యంగా మారిపోయింది?
- హీట్‌వేవ్: పర్యావరణ మార్పుల వల్ల మనం ఎదుర్కొంటున్న 4 పెను సమస్యలు..
- హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..
- దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్న మరో వైరస్, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)