ఐపీఎల్ ఈసారి ఎలా జరుగుతుంది.. మైదానంలో ప్రేక్షకులు ఉంటారా

    • రచయిత, శివకుమార్ ఉలగనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చాలా రంగాల్లానే క్రీడా రంగానికి కూడా 2020 ఒక గడ్డు సంవత్సరం. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది చాలా క్రీడా ఈవెంట్లు రద్దయ్యాయి. కొన్ని వాయిదా పడ్డాయి.

ఈ ఏడాది జులైలో టోక్యోలో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ మెగా ఈవెంట్‌ను వచ్చే ఏడాది నిర్వహించాలని నిర్ణయించారు. క్రికెట్ పరిస్థితి కూడా ఇంతే. చాలా సిరీస్‌లు రద్దయ్యాయి, వాయిదా పడ్డాయి.

ఇక ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) విషయానికి వస్తే, నిజానికి ఈ టోర్నీ ఈ ఏడాది మార్చి 29న మొదలవ్వాలి. మొదట ప్రారంభ తేదీని ఏప్రిల్ 25కు మార్చిన బీసీసీఐ... ఆ తర్వాత లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది.

చివరికి ఆగస్టు 2న క్రికెట్ అభిమానులను సంతోషపెట్టే విషయం చెప్పింది బీసీసీఐ. ఐపీఎల్ ఈ సారి సెప్టెంబర్ 19న మొదలవుతుందని, నవంబర్ 10న ముగుస్తుందని ప్రకటించింది. ఐపీఎల్‌కు ఇది పదమూడో సీజన్.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. దుబాయ్, షార్జా, అబుదాబీల్లో మ్యాచ్‌లు జరగుతాయి. భారత ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు పొంది ఈ టోర్నీ నిర్వహించనున్నారు.

ఒకవేళ ముందు అనుకున్నట్లుగా టోర్నీ సెప్టెంబర్ 19న మొదలైతే, తొలి మ్యాచ్ ఏ జట్ల మధ్య జరుగుతుంది?

ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఎప్పుడూ ఇదివరకటి సీజన్ ఫైనలిస్టుల మధ్య జరుగుతుంది. పోయిన సీజన్‌లో ఫైనల్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగింది. అప్పుడు టైటిల్‌ను ముంబయి జట్టు గెలుచుకుంది.

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఎంఎస్ ధోని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌కు అతడే కెప్టెన్.

ధోని రిటైర్మెంట్ సందర్భంగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘’19న ఐపీఎల్‌లో మైదానంలో కలుద్దాం’’ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

ప్రేక్షకులు ఉంటారా?

టోర్నీ సెప్టెంబర్ 19న ప్రారంభం అవుతుందా? లేక ఏమైనా మార్పులు ఉంటాయా? అన్న విషయాలపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రావొచ్చు.

మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తారా? లేదా? అన్నదానిపై కూడా బీసీసీఐ, యూఏఈ క్రికెట్ బోర్డు, యూఏఈ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ స్టేడియం సామర్థ్యంలో 20-25 శాతం మేర ప్రేక్షకులను అనుమతించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అధికారికంగా దీని గురించి ఎలాంటి ప్రకటనా రాలేదు.

బయో బబుల్

షెడ్యూల్, మైదానాల తర్వాత టోర్నీకి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం టోర్నీ నిర్వహణకు సంబంధించిన నియమావళి.

కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరి వ్యాపించే ముప్పును తగ్గించేందుకు టోర్నీలో జట్లను ‘బయో సెక్యూర్ బబుల్’లో ఉంచుతారని చర్చ జరుగుతుంది.

ఈసారి ఐపీఎల్ సీజన్‌ను సురక్షితంగా, విజయవంతంగా జరిపేందుకు ‘బయో సెక్యూర్’ వాతావరణం నెలకొల్పడం కోసం వివిధ సంస్థలతో ఐపీఎల్ పాలక మండలి సంప్రదింపులు జరిపిందని, టోర్నీ నిర్వహణకు సంబంధించిని నియమావళి గురించి కూడా చర్చించిందని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జయ్ షా తెలిపారు.

ఈ నియమావళి ఎలా ఉంటాయన్నదానిపై అందరి ఆసక్తి ఉంది. టోర్నీ నిర్వహణలో ఇది కీలకం కానుంది.

బయో బబుల్‌లో ఉంచడం అంటే, జట్లను వీలైనంత వరకు బయటి ప్రపంచంతో కలవకుండా విడిగా ఉంచుతారు.

ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య ఇటీవల సిరీస్ జరిగినప్పుడు ఈ విధానాన్ని మొదటగా అమలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించి, తన స్నేహితుడిని కలిశాడు. దీంతో అతడిని ఓ టెస్టు మ్యాచ్ నుంచి పక్కనపెట్టారు.

అయితే, బయో బబుల్ విధానం ఆచరణాత్మకంగా సాధ్యమవుతుందా అన్న విషయమై మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అనుమానాలు వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం ఈ విధానాన్ని పాటించడం కుదరకపోవచ్చని అన్నారు. ఆటగాళ్లను, జట్టు అధికారులను, ఇతర సిబ్బందిని నెలలపాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా విడిగా ఉంచడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

స్టేడియంలో అభిమానులను లైవ్‌లో చూపించే భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయొచ్చని చర్చ జరుగుతోంది. ఇటీవల ఇంగ్లిష్ ప్రిమియర్ ఫుట్‌బాల్ లీగ్‌లో ఈ సాంకేతికతను ఉపయోగించారు.

మొత్తానికైతే, ఈసారి ఐపీఎల్ విభిన్నంగా ఉండబోతుందన్నది సుస్పష్టం. ఇన్ని ఆంక్షలు, అవరోధాల మధ్య కూడా ఐపీఎల్ ఎప్పటిలాగే ఓ పండుగలా జరగాలని క్రికెట్ అభిమానులు, నిపుణులు ఆశిస్తున్నారు. అదే జరిగితే, ఈ సంక్షోభ సమయంలో మరిన్ని క్రీడా ఈవెంట్ల నిర్వహణకు ఐపీఎల్ ఓ మార్గం చూపవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)