క్రిస్టియానో రొనాల్డో కొడుకు మృతి: 'ఏ తల్లిదండ్రులకైనా ఇంతకుమించిన బాధ ఉండదు'

మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, ఆయన భాగస్వామి జార్జినా రోడ్రిగెజ్‌ల నవజాత శిశువు కన్నుమూశారు. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''ఏ తల్లిదండ్రులకైనా ఇంతకుమించిన బాధ ఉండదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

పోర్చుగల్‌కు చెందిన 37 ఏళ్ల రొనాల్డో, 28 ఏళ్ల రోడ్రిగెజ్‌కు కవలలుగా పాప, బాబు జన్మించారు.

పాప ఆరోగ్యం నిలకడగా ఉంది. ''ఈ క్షణాన్ని కొంత ఆశతో, సంతోషంగా జీవించడానికి తగిన శక్తిని పాప ద్వారా పొందుతున్నాం'' అని వారు అన్నారు.

''బాబూ, నువ్వు మా ఏంజెల్. నిన్ను మేమెప్పుడూ ప్రేమిస్తాం'' అని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాశారు.

బాబు మరణానికి సంబంధించి సోషల్ మీడియాలో రొనాల్డో, జార్జినా పేరు మీద ఒక ప్రకటన విడుదల చేశారు. ''చాలా బాధాతప్త హృదయాలతో మా బాబు మరణం గురించి మీకు చెబుతున్నాం. ఈ ఘటనతో మేమంతా కుంగిపోయాం. ఈ కఠిన పరిస్థితుల్లో మా ప్రైవేసీకి భంగం కలిగించొద్దని కోరుతున్నాం'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ జంట, అక్టోబర్ నెలలో ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించింది.

రొనాల్డో ట్వీట్‌పై మాంచెస్టర్ యునైటెడ్ స్పందించింది. '' క్రిస్టియానో, మీ బాధ మాకు కూడా బాధను కలిగిస్తోంది. ఈ సమయంలో మీరు, మీ కుటుంబం ధైర్యంగా ఉండాలి'' అని ట్వీట్ చేసింది.

రొనాల్డో సహచరుడు మార్కస్ రష్‌ఫోర్డ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ''సోదరా, నా ఆలోచనలన్నీ మీ చుట్టే తిరుగుతున్నాయి. జరిగిన దానికి చింతిస్తున్నా'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రియల్ మాడ్రిడ్ క్లబ్, ప్రగాఢ సంతాపం తెలియజేసింది. గతంలో రొనాల్డో, రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మాంచెస్టర్ సిటీ, లీడ్స్ యునైటెడ్‌లతో పాటు ది ప్రీమియర్ లీగ్ కూడా తమ సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్లు చేశాయి.

రొనాల్డోకు క్రిస్టియానో జూనియర్ అనే కుమారుడు ఉన్నారు. క్రిస్టియానో జూనియర్ 2010లో జన్మించారు. తర్వాత 2017లో ఆయనకు ఈవా, మతియో అనే కవలలు జన్మించారు. అదే సంవత్సరంలో జార్జినా రోడ్రిగెజ్ ద్వారా అలానా మార్టినా అనే కూతురు కలిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)