You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ‘నాపై రాళ్లు విసిరినా, రక్తం కారుతున్నా కూడా నా బాధ్యతల నుంచి తప్పుకోను’ - బీబీసీ ఇంటర్వ్యూలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
- రచయిత, భరణి ధరన్
- హోదా, బీబీసీ తమిళ్
‘నా మీద రాళ్లు రువ్వితే రక్తం కారుతున్నా కూడా నా విధి నిర్వహణ మాత్రం మానేది లేదు’ అని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ‘బీబీసీ తమిళ్’తో మాట్లాడారు.
ప్రజాజీవిత ప్రయాణంలో ఎదురైన వివాదాలు, పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తెలంగాణ గవర్నర్‌గా నియమించడం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల వాతావరణం ‘లేకపోవడం’పై ఆమె మాట్లాడారు.
‘‘నేనొక రాజకీయ నాయకురాలిని. గత రెండున్నరేళ్లుగా నేను గవర్నర్‌గా ఉన్నాను. కోవిడ్ సమయంలో నేను తెలంగాణలో చాలా సేవలందించాను. నేను గవర్నర్‌గా ఉన్న రెండున్నరేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. అందరూ ప్రేమించే గవర్నర్‌గా ప్రజలందరికీ అందుబాటులో ఉండటమే నా శక్తి. నా విధులను సక్రమంగా నిర్వర్తించడం వల్లే తెలంగాణలో నేను ఇలాంటి ప్రతిస్పందనలు ఎదుర్కొంటున్నాను’’ అన్నారామె.
మీరెలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు?
గవర్నరు కోటాలో ఎమ్మెల్సీగా నియమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ పేరు సూచించింది. ప్రభుత్వం సిఫారసు చేసిన ఆ పేరును నేను వెంటనే ఆమోదించలేదు. ఈ లోగా ప్రభుత్వం మరో పేరు సిఫారసు చేయగా నేనా వ్యక్తిని నియమించాను. ఇందులో నా వ్యక్తిగత ప్రయోజనాలేవీ లేవు.
రాష్ట్రంలో శాసన మండలికి నామినేట్ చేసిన సభ్యుడి నియామకాన్ని తిరస్కరించడంలో నాకేం లాభం ఉంటుంది? ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి. కానీ, రాజ్యాంగబద్ధంగా లేని రాష్ట్ర ప్రభుత్వం చర్యలను నేను ఆమోదించను. అలాంటి సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిఘటిస్తోంది. ఇలా అయితే కార్యనిర్వాహక వర్గం ఎలా పని చేస్తుందనే ప్రశ్నను ప్రజలనే అడిగాను. నా విధులు నేను నిర్వర్తించడానికి కూడా ఇతరుల నుంచి ద్వేషాన్ని ఎదుర్కోవాలా?
నేను గవర్నర్‌గా ఎక్కడికైనా వెళ్లినా ఆ జిల్లా సూపరింటెండెంట్ వచ్చి నన్ను కలవాలి. ఇక్కడ గౌరవం దక్కాల్సింది నా పదవికి కానీ, నాకు కాదు. ఒక గవర్నర్‌కు రాజ్యాంగబద్ధంగా కొంత గౌరవం దక్కాలి. ఆ పదవికి దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం ఎంతవరకు సబబని నేను ప్రజలను నేరుగా అడిగాను. ఇంత కంటే ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకోలేదా?
నేను ముఖ్యమంత్రి పుట్టినరోజుకు ఫ్లవర్ బొకే పంపాను. కొన్ని సార్లు ఫోన్‌లో మాట్లాడేందుకూ ప్రయత్నించాను.
అయితే, ఆయన మాత్రం ఈ విషయాన్ని మాట్లాడేందుకు ముందుకు రాలేదు.
పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ బాధ్యతలను నిర్వర్తించడం భారంగా అనిపించడం లేదా? పని భారాన్ని తగ్గించమని మోదీ, అమిత్ షాలను అడగలేదా?
నా బాధ్యతలను నిర్వర్తించేందుకు నేనెప్పుడూ అలిసిపోలేదు. నేను రెండు రాష్ట్రాల్లోనూ ఇష్టంతోనే పని చేస్తాను.
గవర్నర్ ప్రతి ఏడు రోజులకొకసారి సెలవు తీసుకుని మరో రాష్ట్రానికి వెళ్లి సొంత పనులు చూసుకోవచ్చు.
కానీ, నేను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నాను.
నేను మొదట్నుంచీ తెలంగాణ ప్రజలతో కలిసి పని చేస్తున్నాను. బోనాల పండుగ సందర్భంలోనూ అందరినీ కలిశాను.
నేను తెలంగాణ, పుదుచ్చేరీలను రెండు కళ్లలా భావిస్తాను. కవల పిల్లలిద్దరినీ ఒకేలా చూస్తాం. రెండు రాష్ట్రాలనూ నేను అలాగే చూస్తాను.
తెలంగాణాలో నేను గిరిజనుల పక్షాన మాట్లాడుతున్నాను.
మిమ్మల్ని తెలంగాణ నుంచి బదిలీ చేస్తారనే వార్తలొచ్చాయి.. నిజమేనా
నన్ను బదిలీ చేస్తారని వార్తలొచ్చాయి. నన్ను దక్షిణ రాష్ట్రాల్లోనే నియమిస్తారని కూడా అన్నారు.
కొందరు నేను కేరళ వెళతానని అన్నారు. ఇవన్నీ ఆధారం లేని వార్తలు.
మీరు గవర్నర్‌గా ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత ఎదురవుతోంది..
గవర్నర్ విధుల్లో రాజకీయాలను చూస్తున్నారు. గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని రకాల అధికారాలుంటాయని తెలుసుకోవాలి.
వాటిని కేవలం రాజ్యాంగ విధులుగా చూడాలి కానీ, వ్యక్తిగత చర్యల్లా కాదు. అన్నీ వారికి అనుగుణంగా ఉంటే గవర్నర్ అభిప్రాయంతో అంగీకరిస్తారు. లేదంటే మాకు వారితో సరిపడటం లేదని అంటారు. ఇలా అనడం ఎంత వరకు సబబు?
ఇలాంటి పరిస్థితి ఇక్కడ మాత్రమే కాదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉంది.
రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వాక్‌స్వాతంత్ర్యాన్ని కల్పిస్తోంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్ల అందరూ ఆయనను ప్రేమిస్తారు. రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాం. ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఎక్కువ, ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు తక్కువ అన్నట్లుగా కొందరు భావిస్తుంటారు. కానీ, ఎవరి విధులు వారివే. ఆ నియామకానికి మర్యాద ఎలా ఇవ్వాలో మనకి తెలియాలి. అటువంటి స్వభావం ఎందుకు లోపిస్తోంది? ఒక సాధారణ ఆహ్వానాన్ని కూడా రాజకీయంగానే చూస్తున్నారు కొందరు.
ప్రోటోకాల్ ఉల్లంఘనలపై..
ప్రతీ పదవికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. రాజ్యాంగంలో క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి. ఒక రాష్ట్రపతి లేదా గవర్నర్ వచ్చినప్పుడు పాటించాల్సిన నియమాలుంటాయి. అది కేవలం సెల్యూట్‌కి మాత్రమే పరిమితం కాదు.
ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని మార్చేందుకు చూడొద్దని నేను కోరుతున్నాను. మీ సొంత లాభాల కోసం ఇలాంటి పనులను పదేపదే చేయకండి. ఇదే నా విన్నపం.
నాకు రాజకీయ నేపథ్యం లేదు. నేను ఒక డాక్టర్‌గా పని చేసి, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను.
నా పనిని ప్రజల పనిగా, దేశానికి చేసే సేవగా భావించి రాజకీయాల్లోకి వచ్చాను. నేను చేసే పనిపై ఎవరూ బురద చల్లలేరు. నా నిజాయితీ, నిబద్ధత గురించి ఎవరూ ఒక్క మాట కూడా అనలేరు. ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా ఈ తమిళిసై ఇదే శక్తి, అంకిత భావంతో చివరి వరకు పని చేస్తుంది.
హిందీ భాషను బలవంతంగా అమలు చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి?
ఇందులో బలవంతం ఏమి లేదు. ఎన్ని కొత్త భాషలు నేర్చుకుంటే అంత మంచిది. నాకు ఈ వయసులో తెలుగు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంది. కానీ, కొత్తగా అమలు చేసిన విద్యా విధానం ఈ సమస్యను కొంత వరకు పరిష్కరిస్తుంది. భాషలు తెలిసి ఉంటే ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదనంగా ఒక భాషను నేర్చుకోవడం మాతృభాషను కించపరచడం కాదు.
మాతృ భాషపై కూడా పట్టు ఉండాలి. ఎవరూ ఎవరి భాషను బలవంతంగా రుద్దాలని చూడటం లేదు.
మన దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు. మీడియా అన్నీ తెలిసి కూడా సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయలేనప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. నేతలు వ్యక్తం చేసిన ఆలోచనలను తప్పుడు సమాచారంగా ప్రచారం చేసినప్పుడే సమస్యలు ఎదురవుతాయి.
ఇవి కూడా చదవండి:
- 'ఈ మనిషితో నేను ఎందుకు ఉండలేకపోయానంటే...' - ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు వాటి కోసం కొందరు పిచ్చెక్కిపోతారు?
- యుక్రెయిన్ యుద్ధం: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయలుదేరారు... దారిలోనే రష్యా సైనికుల కాల్పుల్లో చనిపోయారు
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు
- సూర్య కాశీభట్ల: నిజజీవితంలోనూ సెరెబ్రల్ పాల్సీ ఉన్న ఈ మహేశ్‌బాబు ఫ్యాన్‌కు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)