పాకిస్తాన్: ప్రభుత్వాన్ని సైన్యం ఎలా గుప్పిట్లో పెట్టుకుంది?

    • రచయిత, సయీదా అక్తర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌ ముస్లిం లీగ్ (నవాజ్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ నాటకీయ రాజకీయ పరిణామాల తర్వాత దేశ ప్రధాని అయ్యారు. అంతకు ముందు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

ఇమ్రాన్ ఖాన్‌కు ముందు, అవిశ్వాస తీర్మానం కారణంగా ఏ పాకిస్తాన్ ప్రధాని కూడా పదవి నుంచి దిగిపోయిన పరిస్థితి రాలేదు. ఇమ్రాన్ ప్రభుత్వ పతనం తర్వాత, పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం పాత్రపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. కేవలం సైన్యం కారణంగానే ఇమ్రాన్‌ ఖాన్‌ పదవి పోయిందని పాకిస్తాన్‌లో ప్రచారం జరిగింది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే, గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ రాజకీయాలో ఏం జరిగినా, సైన్యం ప్రస్తావన వచ్చినా, తాము ఈ పరిణామాలకు దూరంగా ఉన్నామని చెప్పుకోవడంలో సైన్యం సఫలీకృతమైనట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాకిస్తాన్‌ రాజకీయాల్లో సైన్యం ప్రభావం ఎందుకుంది, ఎన్నాళ్లుగా ఇలా కొనసాగుతోంది ? అన్న సందేహాలు రావడం సహజం.

వాస్తవానికి ఇప్పుడు మాత్రమే కాదు, పాకిస్తాన్‌ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చినా అందులో సైన్యం పాత్ర అనివార్యంగా మారింది.

భద్రత బూచి

1947లో పాకిస్తాన్ కొత్త దేశంగా ఆవిర్భవించినప్పుడు, అధికారం రాజకీయ నాయకత్వం చేతిలో ఉంది. అయితే కొద్ది కాలంలోనే దేశ రాజకీయాల్లోకి సైన్యం ప్రవేశించింది.

''పాకిస్తాన్‌కు భద్రత అత్యంత ముఖ్యమైన సమస్య. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ సమస్య దానికి ముఖ్యమైనదిగా మారింది. మొదటి నుంచి సైన్యానికి ఇక్కడ ప్రాముఖ్యత రావడానికి ఇదే కారణం. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలను ప్రభావితం చేసే స్థితికి వచ్చింది" అని కింగ్స్ కాలేజ్ లండన్‌లోని మిలిటరీ స్టడీస్ విభాగంలో సీనియర్ ఫెలో, పాకిస్తాన్ వ్యవహారాలపై విశ్లేషకురాలు అయేషా సిద్ధిఖీ అన్నారు.

మొదటి నుంచీ సైన్యం రాజకీయ నాయకుల నియంత్రణలో లేదని, తనను అదుపు చేసే పగ్గాలను రాజకీయ నాయకత్వానికి ఇవ్వలేదని ఆమె అన్నారు.

"సైన్యం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. రక్షణ విషయాలకు సంబంధించిన అన్ని నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. రాజకీయ నాయకులను సైన్యానికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి లేదా జోక్యం చేసుకోవడానికి ఎప్పుడూ అనుమతించలేదు. అది స్వయంప్రతిపత్తి గల, శక్తివంతమైన సంస్థగా మారింది" అన్నారామె.

రాజకీయ నాయకత్వం వైఫల్యం

పాకిస్తాన్‌లో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా తనతో రాజీ పడకుండా మనుగడ సాగించలేనంతగా సైన్యం బలంగా మారింది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయలేదు.

పాకిస్తాన్‌లో మొదటి సైనిక తిరుగుబాటు 1956లో జనరల్ అయూబ్ ఖాన్ నేతృత్వంలో జరిగింది. అంతకుముందు, దేశ పాలనను నడపడానికి సైన్యం, రాజకీయ నాయకుల సంకీర్ణ వ్యవస్థ ఏర్పడింది. రాజకీయ నేతల చేతకానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

''పాకిస్తాన్‌లో రాజకీయ శూన్యత ఉన్నందున, పౌర-సైనిక కూటమి ఉనికిలోకి వచ్చింది, ఇందులో బ్యూరోక్రాట్ల చేతిలో చాలా అధికారం ఉండేది. కాబట్టి బ్యూరోక్రాట్లు, సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు శక్తివంతమైనవిగా మారాయి’’ అని ఢాకా యూనివర్శిటీలోని ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో లెక్చరర్ అయిన అమీనా మొహ్సిన్ అన్నారు.

పాకిస్తాన్‌లోని రాజకీయ నాయకత్వం నిరంతరం సైన్యంపై ఆధారపడి ఉంటుందని, సైన్యాన్ని, రాజకీయ నాయకత్వాన్ని విడదీయలేమని, అందుకే సైన్యం అంతగా ఆధిపత్యం చెలాయించిందని అమీనా అన్నారు.

''ఇలాంటి పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్‌ సేవలు చాలా బలంగా మారాయి. పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ చాలా బలంగా ఉంటుంది. ఒకప్పుడు రాజకీయ నేతలు ఐఎస్ఐ సేవలను వాడుకున్నారు. తర్వాత వారు దానిపై ఆధారపడ్డారు. దీంతో సైన్యం బలం గణనీయంగా పెరిగింది'' అని అమీనా చెప్పారు.

''ప్రజాస్వామ్య సంస్థలను సృష్టించకపోతే, సైన్యం బలంగా మారుతుంది. పాకిస్తాన్‌లో అదే జరిగింది'' అని ఆమె అన్నారు.

ఆర్థిక వ్యవస్థలో సైన్యం

మొదటి సైనిక తిరుగుబాటు తర్వాత, సైన్యం బ్యారక్‌లకు తిరిగి రాలేదు. దేశాన్ని నడిపించే బాధ్యత రాజకీయ నాయకత్వానికి తిరిగి వచ్చింది. కానీ సైన్యం అధికారంలో ఉంది. 65 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో సైన్యం 33 ఏళ్లు పాలించింది. సైన్యం అధికారంలో లేనప్పుడు కూడా, అది అన్ని వ్యవస్థల పైనా ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ఈ కారణంగానే సైన్యం దేశ భద్రత అనే అస్త్రాన్ని ఉపయోగించింది. పాకిస్తాన్ ఒక దేశంగా ఆవిర్భవించినప్పుడు భారత దేశంతో యుద్ధానికి దిగినందున, దేశ భద్రత అనే సమస్యను చూపించడం సైన్యానికి సులభం అయింది.

అయితే ఇందులో ఆర్థిక కారణాలు కూడా ముఖ్యమైనవేనని అయేషా సిద్ధిఖీ అన్నారు. పాకిస్తాన్ ఖర్చులో మూడింట ఒక వంతు సైన్యం ద్వారా నడుస్తుంది. సైన్యం అనేక రకాల వ్యాపారాలలో నిమగ్నమై ఉంది. వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తిలో కూడా సైన్యం పాత్ర ఉంది.

''పాకిస్తాన్‌లోని అతిపెద్ద ఆర్థిక శక్తులలో సైన్యం ఒకటి. వ్యవసాయం నుండి పారిశ్రామిక ఉత్పత్తి వరకు, సైన్యం నిమగ్నమై ఉన్న అనేక వ్యాపారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 30 శాతం సైన్యం భరిస్తుంది. ఇందులో రక్షణ బడ్జెట్ కూడా ఉంది. పెన్షన్‌ను కూడా చేర్చారు'' అని అయేషా చెప్పారు.

''వ్యవసాయం, విద్య, ఎరువుల కర్మాగారాల వ్యాపారంలో కూడా సైన్యం ఉంది. దాని ద్వారా సమాజాన్ని నియంత్రిస్తుంది. సైనిక విద్య ద్వారా, సైన్యం మాత్రమే ఈ దేశాన్ని బాహ్య శత్రువులను రక్షించే ఏకైక శక్తి అని ప్రచారం చేస్తుంది. ఇది నిజమేనని ప్రజలు నమ్ముతారు'' అన్నారామె.

విదేశాంగ విధానం నియంత్రణ

పాకిస్తాన్ సైన్యానికి దాని విదేశాంగ విధానంతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. పాకిస్తాన్ ‌కు ఒక దేశం శత్రువా, మిత్రుడా అన్నది ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ మాత్రమే నిర్ణయిస్తుందని అంటారు. పాకిస్తాన్ సైన్యం కూడా బయటి ప్రపంచంతో తమకున్న సంబంధాల గురించి బహిరంగంగానే చెబుతుంది. యుక్రెయిన్‌ పై రష్యా దాడికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా మద్దతు ఇవ్వలేదు.

అయితే, ఆ సమయంలో రష్యాకు వచ్చిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ యుద్ధం పై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని చెప్పారు.

ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ సైన్యంలోని ఉన్నతాధికారులు విదేశాంగ విధానంపై సైన్యం ప్రభావాన్ని సమర్థించుకుంటారు.

''సైన్యానికి సంబంధించిన గూఢచార సంస్థ వ్యవస్థీకృతంగా పనిచేస్తుంది. దీని ద్వారా సైన్యం వార్తలను సేకరించి విశ్లేషిస్తుంది. ఆ తర్వాత వాటిని విదేశాంగ శాఖకు పంపుతారు. తర్వాత వారు విదేశాంగ శాఖ అధికారులతో కలిసి పని చేస్తారు'' అని పాకిస్తాన్ మాజీ సైనిక అధికారి, కరాచీ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ చైర్మన్ ఇక్రమ్ సెహగల్ అన్నారు.

ఇది కొత్త విషయం కాదని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి ఇలాగే కొనసాగుతోందని సెహగల్ అన్నారు.

ప్రజాస్వామ్యానికి ప్రమాదమా?

సమాజంలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొనాలంటే సామాన్యులు ఎవరికీ భయపడకుండా బాధ్యతాయుతంగా మెలగడం అత్యంత అవసరమని విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్‌లో ఇది ఎప్పటి నుంచో ఉంది. నిజానికి ఇది దేశ రాజకీయ సంస్కృతికి సంబంధించినది. కానీ, పాకిస్తానీ సమాజం సైన్యం హక్కులను ప్రశ్నించినట్లు ఎప్పుడూ వినలేదు.

దీనికి గల కారణాన్ని విశ్లేషకురాలు అయేషా సిద్ధిఖీ వివరించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం అంశాలను సైన్యం అణచివేస్తుందని అన్నారు. పాకిస్తాన్‌లో సైన్యానికి వ్యతిరేకంగా ఎందుకు ఎప్పుడూ నిరసన ప్రదర్శనలు జరగవన్న ప్రశ్నకు పాత్రికేయులు, రక్షణ నిపుణులు నసీమ్ జెహ్రా సమాధానమిచ్చారు.

గత రెండు దశాబ్దాలుగా దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని జెహ్రా అన్నారు. ''ప్రజల ముందు ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వం ఉంది. అందుకే సామాజిక ఆర్థిక అంశాలపై ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా ఎన్నికైన ప్రభుత్వాలపై ప్రజలు తమదైన స్పష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో సైన్యంపై నిరసన వ్యక్తం చేయడంలో అర్థం లేదు’’ అన్నారామె.

మార్పు వస్తోందా?

చారిత్రకంగా, ఎనభైలలో ఆసియా, మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో సైన్యమే పాలించింది. అయితే ఈ దేశాల్లో సామాజిక వ్యవస్థ మారిన కొద్దీ రాజకీయాలు, ఆర్థికం, సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. పాకిస్తాన్ సమాజం కూడా ఇప్పుడు మునుపటిలా లేదు. రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకునే పద్ధతులు కూడా మారాయి.

ఇటీవల పాక్‌లో రాజకీయ దుమారం రేగుతున్న వేళ..ఇమ్రాన్‌ ఖాన్‌తో దూరం పాటిస్తూనే..ఆయనకు మద్దతుగాలేమని ఆర్మీ సందేశం ఇచ్చింది.

గత కొన్ని సంవత్సరాలుగా, దేశంలోని యువతరం సోషల్ మీడియాలో అనేక సామాజిక సమస్యలపై గొంతు విప్పుతోంది. వీరిలో చాలామంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఉన్నారు. వారిలో చాలామంది సైన్యం నిజాయితీని ప్రశ్నిస్తున్నారు.

ఈ యువత 'చౌకీదార్ చోర్ హై' అంటూ సైన్యంపై కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే ఈ నిరసనలు ఎంతకాలం కొనసాగుతాయన్నది ముఖ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశాధికారం పై సైన్యం పట్టు తగ్గుతుందని, లేదా సమీప భవిష్యత్తులో దాని ప్రభావం ఉండదని తాను భావించడం లేదని అయేషా సిద్ధిఖీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)