పాకిస్తాన్-ఇమ్రాన్ ఖాన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఎందుకు వాయిదా పడింది... అసలు జరుగుతుందా, లేదా?

పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం మీద శనివారం రాత్రి 8 గంటల తర్వాత ఓటింగ్ జరగవచ్చునని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి మాట్లాడుతుండగా.. అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే చేపట్టాలని పట్టుపడుతూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో పార్లమెంటు సమావేశాన్ని వాయిదా వేసినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

దీనికి ముందు.. అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టడానికి శనివారం మొదలైన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశానికి అధ్యక్షత వహించిన స్పీకర్ అసద్ ఖైసర్.. ‘‘అంతర్జాతీయ కుట్ర’’ అంశం మీద కూడా సభలో చర్చ జరగాలని పేర్కొన్నారు.

ఈ పరిణామాన్ని అవిశ్వాస తీర్మానాన్ని ఆలస్యం చేయటానికి అధికార తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు.

స్పీకర్ సూచనకు ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం సభాకార్యక్రమాలకు కట్టుబడి ఉండాలని అధ్యక్ష స్థానాన్ని కోరారు. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా మీరు ఈ రోజు సభా కార్యక్రమాలను నిర్వహిస్తారని నేను ఆశిస్తున్నాను. రాజ్యాంగానికి, చట్టానికి మద్దతుగా నిలవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

మంత్రి ఖురేషి మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం ప్రతిపక్షానికి గల రాజ్యాంగ హక్కు. ప్రభుత్వం తనను రక్షించుకోవటం ప్రభుత్వ విధి’’ అని చెప్పారు.

నేషనల్ అసెంబ్లీ అధికారులు జియో న్యూస్‌కు వివరించిన దాని ప్రకారం.. అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించిన తర్వాత ఏడు రోజుల్లోగా దాని మీద ఓటింగ్ జరగాలి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని గత ఆదివారం నాడు (ఏప్రిల్ 3వ తేదీ) సమర్పించారు.

సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం.. ఏప్రిల్ 3వ తేదీ నాటి అజెండాను పునరుద్ధరించి, అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌కు ఆదేశించింది. కాబట్టి ఈ తీర్మానం మీద ఓటింగ్‌కు ఈ రోజు, అంటే శనివారం చివరి రోజు అవుతుంది. కాబట్టి ఈ రోజే అజెండాను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గితే.. సభకు కొత్త నాయకుడిని (కొత్త ప్రధానమంత్రిని) ఎన్నుకునే ప్రక్రియను పూర్తి చేయటానికి సమావేశాలను ఆదివారం రోజుకు కూడా పొడిగిస్తారని జాతీయ అసెంబ్లీ అధికారులు చెప్పారు.

ఒకవేళ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను ఆలస్యం చేయటానికి, వాయిదా వేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించినపుడు.. అలా జరిగే పక్షంలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఆదేశాలను స్పీకర్ ఉల్లంఘించినట్లవుతుందని, ఆయన ఐదేళ్ల పాటు అనర్హతకు, కోర్టు ధిక్కారానికి సిద్ధపడాల్సి ఉంటుందని నేషనల్ అసెంబ్లీ అధికారులు చెప్పారు.

సభా కార్యక్రమాలను అడ్డుకుని, ఓటింగ్ ప్రక్రియను జాప్యం చేయటానికి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రధానమంత్రి భవిష్యత్తును జాతీయ శాసనసభ ఈ రోజే నిర్ణయించనుంది.

ఇదిలావుంటే.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను అడ్డుకుని, అది తర్వాతి వారానికి వాయిదా పడేలా చేయటానికి అధికార పార్టీ వ్యూహాన్ని రూపొందించినట్లు జియో న్యూస్ పేర్కొంది. ‘విదేశీ కుట్ర’ అంశం మీద సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చేలా తమ పార్టీ ఎంపీలకు నిర్దేశించటం ఈ వ్యూహంలో భాగంగా చెప్పింది.

సమాచార మంత్రి ఫవాద్ చౌదరి దీనిని ధ్రువీకరించారు. ఆయన జియో న్యూస్‌తో మాట్లాడుతూ జాతీయ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి తన ప్రసంగంలో ‘‘బెదిరింపు లేఖ’’ గురించి వివరిస్తారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరగకుండా, అది వచ్చే వారానికి వాయిదా పడేలా ఈ ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)