శ్రీలంక సంక్షోభం: ‘పార్లమెంటులో ఉన్న నేతలెవరూ పనికొచ్చేవాళ్లు కాదు.. దేశాన్ని నాశనం చేశారు’

    • రచయిత, రజినీ వైద్యనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభంపై జనాగ్రహం పెరగడంతో శ్రీలంక ప్రభుత్వలోని కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంలో చేరాలంటూ అధ్యక్షుడు గొటబయ రాజపక్ష పిలుపునిచ్చారు.

అయితే, ఆగ్రహంతో ఉన్న ప్రజలు వీధుల్లోకి వచ్చి రాజపక్ష దిగిపోయే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కువమంది నిరసనకారుల చేతుల్లోని ప్లకార్డులు డిమాండ్ చేస్తున్న విషయం ఒక్కటే. గో..గో.. గోటాబయ..గో...గో

గోటా అనేది అధ్యక్షుడు గోటాబయ రాజపక్షకు సంక్షిప్త నామం. ప్రస్తుత సంక్షోభానికి ఆయనే కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ''ఆయన తక్షణం దిగిపోవాలి. మమ్మల్ని దోచుకున్నారు'' అని నాధి వందుర్గలా అనే మహిళ ఆరోపించారు.

ఆదివారం నాడు దేశవ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆమె పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి తన భర్త, పిల్లలతో కలిసి ఆందోళనలలో పాల్గొన్నారు.

ఒక హ్యాండ్ మేడ్ పోస్టర్ పట్టుకుని వీధుల్లోకి వచ్చిన ఆమె, ఆర్ధిక సంక్షోభం కారణంగా తన కుటుంబం ఎలా ఇబ్బందులు పడిందో వివరించారు. వంట వండుకోవడానికి గ్యాస్ లేదని, రోజుకు 17 గంటలకు విద్యుత్ కోత ఉండేదని, పెట్రోలు కొనుక్కోవడానికి పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సి వచ్చేదని ఆమె చెప్పారు.

''ఆఖరికి ఆసుపత్రుల్లో కూడా మందుల కొరత ఏర్పడింది. స్కూళ్లలో ఎగ్జామ్ రాయడానికి పేపర్లు దొరకలేదు. రాజకీయ నాయకులకు మాత్రం నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుంది. వాళ్లు ఎక్కడా క్యూలో నిలబడాల్సిన పని లేదు '' అని నాధి వందుర్గలా అన్నారు.

వందుర్గలా గతంలో ఎప్పుడూ ఇలా ఆందోళనల్లో పాల్గొనలేదు. ఆమె స్థానిక చర్చిలో పని చేస్తారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ, ఇప్పుడామె ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.

దేశంలో మతాలు, నేపథ్యాలకు, నమ్మకాలు, వయస్సులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు ఆమె నిదర్శనంగా కనిపిస్తున్నారు.

విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో శ్రీలంక ప్రభుత్వం ఇంధనం లాంటి అత్యవసర వస్తువులును శ్రీలంక దిగుమతి చేసుకోలేకపోతోంది. కరోనా మహమ్మారి కారణంగా టూరిజం దెబ్బతినడం కూడా ఇందుకు మరో కారణం.

అయితే ఈ సమస్యలను మేనేజ్ చేయడంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్ష విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలలో పన్నుల కోత, దిగుమతులపై నిషేధాల్లాంటివి సమస్యను మరింత తీవ్రం చేశాయి.

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి రుణాలు తీసుకోవడానికి ఆయన విముఖత చూపడం కూడా సమస్యను మరింత పెంచింది. గత ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ఈ సమస్యకు కొంత వరకు కారణమని రాజపక్ష వాదించగా, వందుర్గులా కుమార్తె అంజలిలాంటి వారు మాత్రం దీనికి రాజపక్ష బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ దాన్ని అణచివేసేందుకు గోటబయ ప్రయత్నాలు చేశారు. ఆదివారం నాడు ఎక్కువమంది జనం గుమిగూడకుండా నిరోధించేందుకు కర్ఫ్యూ విధించారు. అలాగే సోషల్ మీడియాపై ఆంక్షలు అమలు చేశారు. జనం రోడ్ల మీదకు, పార్కులకు, రైల్వే స్టేషన్ లకు, బీచ్ లకు రాకుండా ప్రత్యేకంగా ఆంక్షలు విధించారు.

''ఇవి క్రూరమైన నియంతృత్వ, నిరంకుశ పోకడలని నా అభిప్రాయం''అని ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస ఆదివారం జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రేమదాస, ఆయన పార్టీకి చెందిన ఇతర సభ్యులు నగరంలోని ఇండిపెండెంట్ స్క్వేర్ లో ప్రవేశించడానికి ప్రయత్నించగా, పోలీసు అడ్డుకున్నారు.

"ఈ దేశపు అత్యున్నత చట్టం ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, ప్రదర్శించడానికి, శాంతియుత ప్రజాస్వామ్య కార్యకలాపాలలో పాల్గొనడానికి గల హక్కులను రక్షిస్తుంది'' అని అన్నారాయన.

తన అన్న ప్రధాని మహింద రాజపక్సేతో కలిసి దేశాన్ని నడిపిస్తున్న అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించారని ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.

మహీంద రాజపక్ష రెండుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు. అయితే శ్రీలంక అంతర్యుద్ధం చివరి దశలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు గోటాబయ రాజపక్ష రక్షణ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని అణచివేయడంలో ఇద్దరూ క్రూరంగా వ్యవహరిస్తారన్న పేరుంది.

"వారిద్దరూ మాకు భద్రత కల్పిస్తారని దేశ ప్రజలు భావించారు. కానీ వారు అలా చేయలేదు. అన్ని విషయాలలో విఫలమయ్యారు" అని రోషింత అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను గోటాబయకు ఓటు వేయలేదని ఆమె చెప్పారు

"ఈ కుటుంబం కోసం దేశం నాశనం కావడం నాకు ఇష్టం లేదు. వాళ్లిద్దరూ మొండి వాళ్లే కాదు, పదవీకాంక్ష ఉన్నవారు" అని విమర్శించారామె.

అయితే, ఈ ఆదేశాలను ధిక్కరించిన వందలమంది ప్రజల్లో నాధి, ఆమె కుమార్తె కూడా ఉన్నారు. ''నేను ఇవాళ రోడ్డు మీదకు వచ్చాను. ఎందుకంటే నా హక్కులను నా నుంచి లాగేసుకున్నారు. నేను ఇప్పుడు కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు'' అన్నారు నాధీ.

''కర్ఫ్యూ ఎందుకు పెట్టారో అర్ధం కావడం లేదు. దీని వల్ల ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? ఇది ఒక అర్థం లేని పని'' అని అంజలి వ్యాఖ్యానించారు.

రాజపక్ష పై ప్రజల ఆగ్రహం ఆయన ఇంటి దాకా చేరింది. గురువారం, కొలంబోలోని అధ్యక్ష నివాసం వెలుపల నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్‌లు ప్రయోగించారు.

డజన్ల కొద్దీ నిరసనకారులతో పాటు ఈ సంఘటనను కవర్ చేస్తున్న కొంతమంది జర్నలిస్టులను కూడా అధికారులు అరెస్టు చేశారు.

నిర్బంధంలో ఉన్నవారిని తీవ్రంగా హింసించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సహా అనేక మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి. గురువారం నాటి నిరసనలు తర్వాత శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని విధించారు. అరెస్టులు, నిర్బంధంలోకి తీసుకోవడానికి భద్రతా దళాలకు అధికారాలు ఇచ్చారు.

శని, ఆదివారాలలో కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 600 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. '' నా జీవితంలో ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇది నా ఆఖరి అస్త్రం'' అని శతసార అనే యువకుడు అన్నారు.

''జీవితంలో చాలా కీలకమైన దశలో ఉన్నాం. పరిస్థితులు ఇలా ఉంటే మా కలలు నెరవేర్చుకోవడం ఎలా?'' అని ఆయన ప్రశ్నించారు. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసే ప్రభుత్వం రావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజల బాగోగుల గురించి పట్టింపు లేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలలో ఎక్కువమంది యువత పాల్గొంటున్నారు. సుచిత్ర అనే యువకుడు తన 15 నెలల బాబును ఎత్తుకుని ఆందోళనలో పాల్గొంటూ కనిపించారు. విద్యుత్ కోతల కారణంగా తన కొడుకు రాత్రి పూట నిద్రపోవడం లేదని సుచిత్ర అన్నారు.

''ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న నేతలెవరూ పనికొచ్చేవాళ్లు కాదు. దేశాన్ని నాశనం చేశారు'' అని సుచిత్ర ఆరోపించారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)