కేరళ: ముస్లిం అమ్మాయి కాబట్టి హిందూ ఆలయాల్లో భరతనాట్యం చేయొద్దన్నారు

    • రచయిత, శరణ్య హ్రిషికేష్
    • హోదా, బీబీసీ న్యూస్

"కళలకు మతం ఉండదు" అని భరతనాట్య కళాకారిణి మాన్సియా వీపీ అన్నారు. ముస్లిం అనే కారణంతో కేరళలోని ఒక దేవాలయంలో శాస్త్రీయ నృత్యం చేసేందుకు ఆమెకు అనుమతిని ఇవ్వలేదు.

భరతనాట్యం కొన్ని శతాబ్దాల చరిత్ర నృత్యరూపం. మాన్సియాకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడే తల్లి ఆమెకు భరతనాట్యం శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు.

ముస్లిం మతానికి చెందిన వారు ఈ నాట్యాన్ని నేర్చుకోవడం చాలా అరుదు. కేరళలోని మలప్పురానికి చెందిన మాన్సియా తల్లి తన పిల్లలకు డాన్స్ నేర్పించాలని పట్టుదలతో ఉండేవారు.

అందుకే, ఆమె తన ఇద్దరు పిల్లలకు భరతనాట్యంతో పాటు కథకళి, మోహిని అట్టం కూడా నేర్పించారు.

హిందూ మతానికి చెందిన శాస్త్రీయ నృత్యాలను ముస్లిం అమ్మాయిలు నేర్చుకోకూడదని ముస్లిం సంప్రదాయవాదులు విమర్శించారు. ఆ విమర్శలనేమీ పట్టించుకోకుండా నృత్యం నేర్చుకోవడం అంత సులభమేమీ కాదు. వారు ఎలాగైనా డాన్స్ నేర్చుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.

కానీ, 24 ఏళ్ల తర్వాత గత వారం మాన్సియా భరతనాట్యం చేసేందుకు కాలికి గజ్జెలు కట్టుకోగానే ఆమె పేరు మళ్ళీ వార్తల్లో కనిపించింది. కేరళలోని ఒక దేవాలయంలో నాట్యం చేసేందుకు ఆమెను అనుమతించకపోవడమే అందుకు కారణం.

ఈ విషయాన్ని వివరిస్తూ ఆమె ఫేస్‌బుక్ పోస్ట్ రాశారు. ఆ పోస్ట్ వైరల్ అయింది. హిందూ మతస్థురాలు కాకపోవడం వల్లే ఆమెను నాట్యం చేసేందుకు అనుమతించలేదు.

ఆలయ నిర్వాహకులు తొలుత నాట్యం చేయడానికి ఆమె చేసుకున్న దరఖాస్తును ఆమోదించారు. కానీ, దేవాలయ అధికారులు మాత్రం ఆమెను నాట్యం చేయడాన్ని అభ్యంతరపెట్టారు. ఆలయ సంస్కృతిని పాటించాలంటూ తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.

దీనిపై మాన్సియా, "నేను చాలా వివక్షను అనుభవించిన తర్వాత ఈ దశకు చేరుకున్నాను. నేను అనుభవించిన వాటితో పోలిస్తే ఇది నాకేమి పెద్ద విషయం కాదు" అని అన్నారు.

తొలి ఆటంకం

"మాకు ఆర్ధిక సమస్యలున్నాయి. కానీ, సంతోషంగా ఉన్నాం" అని 27 ఏళ్ల మాన్సియా చెప్పారు. ఆమె ఇప్పుడు భారతనాట్యంలో పి.హెచ్‌డి చేస్తున్నారు.

ఆమె తన బాల్యం గురించి వివరించారు. వాళ్ళ అమ్మ టీవీలో డాన్సులు, ఆ నృత్యకారులు ధరించే రంగు రంగుల ప్రత్యేకమైన దుస్తులు చూసి భరతనాట్యం పట్ల ఆకర్షితులయ్యారని చెప్పారు. ఆమె తండ్రి అలవికుట్టి కూడా పిల్లలకు భరతనాట్యం నేర్పించేందుకు అంగీకరించారు. అప్పట్లో ఆయన సౌదీ అరేబియాలో పని చేసేవారు.

అమీనా తన కూతుళ్లు మాన్సియా, రుబాయాలను రోజూ డాన్స్ క్లాస్‌కు తీసుకెళ్లేవారు. వాళ్లిద్దరూ రోజూ నాట్య సాధన చేసేలా చూసుకునేవారు.

వారి జీవితమంతా స్కూలు, నాట్యం, ఆధ్యాత్మిక విద్య చుట్టూ తిరిగేది. అమీనా ముస్లిం మతాన్ని చాలా కచ్చితంగా పాటిస్తారు.

ఆమె భర్తకు మాత్రం మతవిశ్వాసాల పట్ల అంత పట్టింపు లేదు. అయితే, తన భార్య, పిల్లల మత విశ్వాసాలను ఆయన ఎప్పుడూ వ్యతిరేకించేవారు కాదు.

వాళ్ళు ప్రతిరోజూ స్కూలు అయిపోయిన తర్వాత, వారాంతాల్లోనూ వివిధ నాట్య రీతులను నేర్చుకోవడం కోసం బస్సులో వెళ్లి వస్తూ ఉండేవారు. వారిద్దరూ ఆరు రకాల నాట్య రీతులను నేర్చుకునేవారు.

డాన్స్ నేర్చుకోవడం కోసం కొన్ని సార్లు కొన్ని వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయవలసి వచ్చేది. "మాకు టైమ్ సరిపోయేది కాదు. కానీ, నాట్యం అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే, కష్టమైన సరే ఎలాగోలా వీలు చేసుకుని నేర్చుకోవడం అలవాటైపోయింది."

ఈ ఇద్దరు పిల్లలు దేవాలయాల్లో, యూత్ ఫెస్టివల్స్‌లో నాట్యం చేస్తూ ఉండేవారు. కానీ, స్థానిక మసీదు కమిటీ సభ్యులు వీళ్లు డాన్స్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఇకపై నాట్యం చేయం' అని హామీ ఇవ్వాలని స్థానిక మసీదు కమిటీ సభ్యులు, మదరసా టీచర్లు వారిని అడుగుతూ ఉండేవారు.

ఈ పరిస్థితిని అర్ధం చేసుకునే వయసు మాన్సియాకు లేదు. రుబాయా మాత్రం ఎప్పుడూ ఏడుస్తూ ఇంటికి వచ్చేది.

కానీ, అమీనా, అలవికుట్టి మాత్రం తమ పిల్లలను డాన్స్ చేసేందుకే ప్రోత్సహించారు.

"వాళ్లెలా మమ్మల్ని ప్రోత్సహించారో తెలియదు. వారు తమలోని విచారాన్ని మాకెప్పుడూ కనపడనిచ్చేవారు కాదు" అని మాన్సియా అన్నారు.

అలవి కుట్టి కూడా చిన్నతనంలో వీధి నాటకాలు వేసేవారు. ఇందులో తప్పేమీ లేదనే వారు తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.

కానీ, 2006లో అమీనాకు క్యాన్సర్ అని నిర్ధరణ కావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆమె చికిత్స కోసం చాలా డబ్బు సమకూర్చాల్సి వచ్చేది. విదేశాల నుంచి విరాళాలు తీసుకునేందుకు మసీదు కమిటీ సభ్యులు వారి అభ్యర్ధనను ఆమోదించలేదు.

"మసీదు కమిటీ సభ్యులను సహాయం కోసం అడగడానికి వెళ్ళేటప్పుడు, నేను మా అమ్మతో కలిసి రోజూ వెళ్లేదానిని. ఈ వేదన అంతా ఆమెను మతంతో ఉన్న సంబంధం గురించి తిరిగి ఆలోచించుకునేలా చేసింది" అని మాన్సియా చెప్పారు.

అమీనా 2007లో మరణించారు. అప్పుడు స్థానిక శ్మశానంలో అంత్యక్రియలను చేసేందుకు మత పెద్దలు అనుమతించలేదు.

ఆ తర్వాత రోజులు చాలా ఒంటరిగా, కష్టంగా గడిచాయి. రుబాయా చదువు కోసం తమిళనాడుకు వెళ్లిపోయారు. మాన్సియా మాత్రం డాన్స్ చేయడం మానలేదు.

మతపరమైన చిక్కులు

భారతదేశంలో మత విశ్వాసాల వల్ల కొన్ని సంక్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి. విభిన్న మతస్తుల్లో మత సహనాన్ని సమర్థించే వారితో పాటు మత వైరుధ్యాలను పట్టుకునే వేలాడే వారూ ఉంటారని 2021లో జరిగిన ప్యూ అధ్యయనం పేర్కొంది.

ఈ దేశంలో భిన్న మతాల సహజీవనం రోజువారీ జీవితం, సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ, ఈ సమైక్యతకున్న సరిహద్దులు ఒక్కోసారి సమస్యలను సృష్టిస్తుంటాయి.

భారతదేశంలోని సంగీత కళాకారుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, అల్లావుద్దీన్ ఖాన్ లాంటి సంగీతకారులు వారి మతాన్ని అనుసరిస్తూనే సరస్వతిని ఆరాధించేవారు.

మాన్సియా, రుబాయాలు కూడా చిన్నప్పుడు మలప్పురం జిల్లాలోని అన్ని దేవాలయాల్లోనూ నాట్యప్రదర్శనలు ఇచ్చారు.

వారు నాట్యం చేసిన ప్రతి చోటా ప్రశంసలు లభించేవి. వారిని అందరూ ప్రేమగా చూసేవారు.

అయితే, ముస్లింలు కాబట్టి ఆలయంలో డాన్స్ చేయకూడదని ఒకసారి ఒక దేవాలయ కమిటీ సభ్యుడు తమకు అడ్డుపడ్డారని మాన్సియా చెప్పారు. "కానీ, మా నాట్య ప్రదర్శన చూసిన తర్వాత ఆయన మా దగ్గరకు వచ్చి కౌగలించుకున్నారు" అని ఆమె గుర్తు చేసుకున్నారు.

త్రిసూర్ జిల్లాలో కూడల్ మాణిక్యం దేవాలయంలో వార్షిక ఉత్సవానికి దరఖాస్తుల కోసం ఆహ్వానించినప్పుడు ఆమె నిర్వాహకులను సంప్రదించినట్లు చెప్పారు. ఆమె వ్యక్తిగత వివరాలను పంపమని అడిగినట్లు చెప్పారు. అయితే, ఆ వివరాల్లో ఆమె మతం ఏమిటన్నది అడగలేదని చెప్పారు.

కానీ, ఆ ఆలయంలో నాట్యం చేసేందుకు కొన్ని వారాల పాటు సాధన చేసిన తరువాత హిందూ దేవాలయంలో డాన్స్ చేసేందుకు అనుమతి లేదని నిర్వాహకులు కాల్ చేసి చెప్పారని ఆమె విచారం వ్యక్తం చేశారు.

భారతదేశంలో చాలా హిందూ దేవాలయాలు అన్ని మతాల వారిని లోపలికి అనుతిస్తాయి. కొన్ని మాత్రం హిందూయేతరులను ఒక పరిధి దాటి వచ్చేందుకు అనుమతించవు.

మాన్సియా ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్‌గా మారిన తర్వాత దేవాలయ నిర్వాహకులు స్పందించారు. ప్రస్తుతం దేవాలయంలో అమలులో ఉన్న ఆచారాలను పాటించాల్సిన నియమం ఉండటంతో మాన్సియా దరఖాస్తును తిరస్కరించినట్లు చెప్పారు.

మాన్సియాకు రాజకీయ నాయకులు, కళాకారుల నుంచి మద్దతు లభించింది. ఆమెకు మద్దతుగా చాలా మంది ఆ ఆలయ ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. ఆమె కుటుంబం కూడా ఆమెకు అండగా నిలబడింది. ఆమె భర్త కూడా హిందూ మతానికి చెందినవారే. ఆయన కుటుంబ సభ్యులు తరచుగా ఆలయాలకు వెళుతూ ఉంటారు.

"ఈ మొత్తం వివాదం గురించి అలవకుట్టి అసలు పట్టించుకోవడం లేదు. మతం పేరుతో మేం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. వాటితో పోల్చితే ఇది చాలా చిన్న విషయం" అని అన్నారు.

మాన్సియా తాను ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడానికి ఒకే ఒక్క కారణం ఉందన్నారు. "కనీసం ఒకరైనా ఈ పోస్ట్ చదివి కళకు మతం లేదని గ్రహిస్తే నేను చాలా సంతోషిస్తాను" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)