You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డ్రోన్ టెక్నాలజీ: ఆధునిక యుద్ధతంత్రాన్ని డ్రోన్‌లు ఎలా మార్చేస్తున్నాయి, వాటిని ఎదుర్కోవడం కష్టమా
యుద్ధాలకు ఉపయోగించే డ్రోన్‌లు ఒకప్పుడు సైనికపరంగా అగ్రగామిగా ఉన్న దేశాల చేతుల్లోనే ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చిన్నదేశాల నుంచి ఆఖరికి ఎక్కడో కొండల్లో, అడవుల్లో సంచరించే తిరుగుబాటు దారులకు కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి.
ఆధునిక యుద్ధతంత్రంలో డ్రోన్‌లు శక్తి ఏ స్థాయిలో ఉందో జోనాథన్ మార్కస్ వివరిస్తున్నారు .
సైనిక చరిత్రను పరిశీలిస్తే ఒక ఆయుధం యుద్ధం మొత్తానికి చిహ్నంగా మారిన సందర్భాలను చూడవచ్చు. మధ్య యుగంలో బ్రిటీష్ ఆర్చర్లు ఉపయోగించిన పొడవాటి విల్లు, రెండో ప్రపంచ యుద్ధంలో పదాతిదళ పోరాటానికి ఉపయోగపడిన ఆర్మీ ట్యాంకులను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.
అమెరికా మిలిటరీ ఉపయోగించే మానవరహిత ఎంక్యూ-1 ప్రిడేటర్, లేదా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (యూఏవీ) అఫ్గానిస్తాన్, ఇరాక్ సహా అనేక యుద్దాలలో ఆ దేశానికి ఎలా సహాయపడిందో చూశాం
కోల్డ్‌వార్ ముగిసిన తర్వాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా మిగిలిన సందర్భం ఇది. ఈ సమయంలో ఆ దేశం ఉపయోగిస్తున్న ప్రిడేటర్ డ్రోన్‌కు హెల్‌ఫైర్ మిసైల్ జత చేసి ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత అది ఐకానిక్ ఆయుధంగా మారింది.
తరువాత వచ్చిన రీపర్‌ను హంటర్-కిల్లర్‌గా డెవలప్ చేశారు. ఇది అంతకు ముందు వచ్చిన డ్రోన్‌ల కంటే ఎక్కువ పరిధిలో పని చేయగలుగుతుంది. యుద్ధానికి సంబంధించిన వస్తువులను మోసుకెళ్లగలదు.
ఎవరూ వెళ్లలేని, ఊహించలేని ప్రదేశాలలో ఉన్న శత్రువులను అమెరికా తన రీపర్ డ్రోన్‌ల ద్వారా చంపగలిగింది.
2020 జనవరిలో బాగ్దాద్ విమానాశ్రయం వెలుపల ఇరాన్ ఆర్మీ జనరల్ ఖాసిం సులేమానీని లక్ష్యంగా చేసుకుని హతమార్చింది రీపర్ డ్రోనేనని చెబుతారు.
చాలా తక్కువ సమయంలోనే ఈ టెక్నాలజీని డెవలప్ చేసి వాడటంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇందులో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాయి. ఈ కాలాన్ని వార్‌డ్రోన్‌ల ఆరంభ యుగంగా చెప్పవచ్చు.
అనేక దేశాలు, సంస్థలు డ్రోన్ తయారీ రంగంలోకి ప్రవేశించడంతో వార్‌డ్రోన్ వ్యవస్థ కొత్త యుగంలోకి ప్రవేశిచింది. యూఏవీల వినియోగం కేవలం తీవ్రవాద వ్యతిరేక యుద్ధం నుంచి సంప్రదాయ యుద్ధంలోకి మారింది.
ప్రస్తుతం వార్‌డ్రోన్ థర్డ్ జనరేషన్ ఆఖరి భాగంలో ఉన్నాయి. ఇప్పటి టెక్నాలజీ చాలా క్లిష్టమైంది. ఇదంతా కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) తో ముడిపడి ఉంది.
హంటర్ కిల్లర్ - ఎంక్యూ-9 రీపర్ ఎలా ఉంటుంది?
- ముందువైపు పై భాగంలో ఒక కెమెరా, కింది భాగంలో సెన్సర్‌తో కూడిన కెమెరా ఉంటాయి.
- మెరుగైన స్థిరత్వం కోసం వి-ఆకారపు టెయిల్ ఉంటుంది.
- క్షిపణులు, బాంబులు మోసుకెళ్లగులుతుంది. జీపీఎస్, లేజర్ గైడ్ ఆధారంగా పని చేస్తుంది.
- పొడవు: 10.97 మీటర్లు (36 అడుగులు)
- ఎత్తు: 3.66 మీ (12 అడుగులు)
- రెక్కలు: 21.12 మీ (69 అడుగుల 3 అంగుళాలు)
- గరిష్ట వేగం: 463kph (287 mph)
టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (TPLF) తిరుగుబాటుదారులపై ఇథియోపియా ప్రభుత్వం డ్రోన్లతో విరుచుకుపడటం సంచలనంగా మారింది. టర్కీ, ఇరాన్‌ల నుంచి ఆ దేశం సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ద్వారా చైనా వింగ్ లూంగ్-2 అనే డ్రోన్ తయారీ సంస్థతో కూడా ఇథియోపియా సంబంధాలు కొనసాగిస్తోందని చెబుతారు.
లిబియా అంతర్యుద్ధంలో తన మిత్రపక్షమైన జనరల్ ఖలీఫా హఫ్తార్ ప్రభుత్వానికి చైనా తయారీ డ్రోన్‌లను యూఏఈ సరఫరా చేసినట్లు చెబుతారు.
కీలక పాత్రలోకి డ్రోన్లు
2020 ఫిబ్రవరిలో సిరియాలో ఆపరేషన్ స్ప్రింగ్ షీల్డ్ సమయంలో, లిబియాలోని ఖలీఫా హఫ్తార్ తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా టర్కీ ఇప్పటికే ఈ డ్రోన్‌లను ఉపయోగించింది.
లిబియా అంతర్యుద్ధ సమయంలో సాయుధ డ్రోన్‌ల ప్రభావం చాలాసార్లు కీలకంగా మారినట్లు కనిపించింది. ఇది లిబియా ప్రభుత్వ మనుగడకు దోహదపడింది.
టర్కీ నుండి అందిన డ్రోన్ల కారణంగా అజర్‌బైజాన్ సైన్యం వివాదాస్పద ఆర్మేనియా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోగలిగింది.
అయితే డ్రోన్ దాడులు తరచుగా చట్టపరమైన, నైతికపరమైన వివాదాలను సృష్టిస్తున్నాయి. వాటి మందుగుండు సామగ్రి వినియోగం దాని నడిపించే వ్యక్తి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది.
అమెరికా తన సన్నిహిత మిత్రదేశాలకు తప్ప మరే ఇతర దేశానికి ఈ సాంకేతికతను అందించడానికి ఇష్టపడదు.
ఇక యూఏవీల వినియోగాన్ని ఆపడం కూడా కష్టమే. ఎందుకంటే 100 కంటే ఎక్కువ దేశాలు, ఇంకా అనేక గ్రూపులు ఈ డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి. వీటిలో చాలా వరకు సాయుధ డ్రోన్లు ఉన్నాయి.
"డ్రోన్‌ల పెరుగుదల కొనసాగుతోంది" అని సెంటర్ ఫర్ న్యూ అమెరికా సెక్యూరిటీ రీసెర్చ్ విభాగం డైరెక్టర్ పాల్ షెరెర్ అన్నారు.
"ప్రపంచంలోనే అతిపెద్ద సాయుధ డ్రోన్‌ల ఎగుమతిదారు చైనా. ఇరాన్, టర్కీ వంటి దేశాలు కూడా డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నాయి. ఆయా దేశాలు తమ టెక్నాలజీని ఇతర దేశాలకు అమ్ముతున్నాయి'' అని షెరెర్ అన్నారు.
"కమర్షియల్ డ్రోన్ టెక్నాలజీ చాలా సులభంగా అందుబాటులో ఉంది. కేవలం కొన్ని వందల డాలర్లతో ఈ డ్రోన్‌లను తయారు చేయవచ్చు. వీటిలో ఇప్పటికే కొన్ని తీవ్రవాద సంస్థల చేతుల్లో ఉన్నాయి'' అని అన్నారాయన.
డ్రోన్‌ల ప్రభావం ఎంత
యుద్ధ విమానాలను కొనుగోలు చేయలేని దేశం, లేదా గ్రూపులు డ్రోన్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు.
"ఈ డ్రోన్‌లు ఫైటర్ జెట్‌ల మాదిరిగా పోరాట సామర్థ్యం కలిగి ఉండకపోవచ్చు. కానీ, అవి కొన్నిసార్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. డిజిటల్ టెక్నాలజీ సహాయంతో టార్గెట్‌ను కచ్చితంగా చేరుకోవడం ద్వారా శత్రువును దెబ్బతీయగలవు. చాలాసార్లు ప్రాణాంతకంగా మారతాయి'' అని షెరెర్ అన్నారు.
అయితే అంతర్యుద్ధాలలు, ప్రాంతీయ సంఘర్షణలలో ఈ డ్రోన్లను ఉపయోగించడం భవిష్యత్ యుద్ధాలలో డ్రోన్‌లు పోషించబోయే పాత్రకు ఒక చిన్న రూపం మాత్రమే.
అమెరికా, దాని మిత్రదేశాలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమైన సమయంలో, రష్యా ఈ ఆయుధాన్ని సిరియాలో ఉపయోగించడానికి ప్రయత్నించింది. ఒకరకంగా రష్యా సిరియాను ఈ డ్రోన్ల పరీక్షకు లేబరేటరీగా వాడుకుంది.
"సిరియాలోని రష్యా డ్రోన్ దళం క్లిష్టమైన నిఘా కార్యకలాపాలను నిర్వహించింది" అని సెంటర్ ఫర్ నేవల్ అనాలిసిస్‌లో రష్యన్ స్టడీస్ ప్రోగ్రామ్ సభ్యుడు శామ్యూల్ బెండెట్ చెప్పారు.
డ్రోన్ సర్వేలు రష్యన్ ఆయుధాలు, రాకెట్ ప్రయోగ వ్యవస్థలకు రియల్ టైమ్ యాక్సెస్‌ను ఎనెబుల్ చేశాయని ఆయన అన్నారు.
రష్యా-డ్రోన్ టెక్నాలజీ
యుక్రెయిన్ తో పోరాటంలో రష్యా ఈ డ్రోన్‌లను ఒక పద్ధతి ప్రకారం ఉపయోగిస్తోంది. తూర్పు యుక్రెయిన్‌లో అనేక రష్యా తయారీ డ్రోన్‌లు కూల్చివేతకు గురయ్యాయి.
గూఢచర్యం చేయడం డ్రోన్ ప్రధాన లక్ష్యాలలో ఒకటని బెండెట్ చెప్పారు. ''అధునాతన సాంకేతికత విషయంలో అమెరికా కన్నా రష్యా వెనకబడి ఉండొచ్చు. కానీ రష్యా సైన్యం తన వారియర్స్ టీమ్‌లో డ్రోన్‌లను చాలా వేగంగా ఉపయోగిస్తోంది'' అని ఆయన అన్నారు.
డ్రోన్‌లతో పోటీపడటం అసాధ్యమా?
వాస్తవానికి యుక్రెయిన్‌లో టర్కీ తయారీ డ్రోన్‌లు కూడా ఉన్నాయి. వీటిని వారు డోన్‌బాల్ అనుకూల రష్యా వేర్పాటువాదులపై ఉపయోగించారు. డ్రోన్‌లను అసలైన యుద్ధాలలో వాడే విధానానికి ధీటుగా తిరుగుబాటుదారులు, మిలీషియా యూనిట్లు ఉపయోగిస్తున్నాయి.
డ్రోన్‌ల వల్ల ప్రమాదాన్ని బాగా గుర్తించినప్పటికీ, వాటిని ఎదుర్కోవడం అంత సులభం కాదు.
"ఈ రోజు వాడుకలో ఉన్న చాలా డ్రోన్‌లు సంప్రదాయక విమానాల కంటే చాలా చిన్నవి. చాలా నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ఎగురుతాయి. అంటే అన్ని వాయు రక్షణ వ్యవస్థలకు వాటిని కూల్చగలిగే శక్తి ఉండక పోవచ్చు'' అని పాల్ షెరెర్ అన్నారు
డ్రోన్ దాడులు పెద్ద సంఖ్యలో జరిగినప్పుడు ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో డ్రోన్ ఎటాక్ జరిగినప్పుడు వాటిని ఆపడం ఒక సవాల్ వంటిదని ఆయన అంటారు.
"2018లో సిరియన్ తిరుగుబాటుదారులు 13 డ్రోన్ల సహాయంతో రష్యా వైమానిక స్థావరాలపై దాడి చేశారు'' అని పాల్ షెరెర్ తెలిపారు.
అయితే, ఇలా గుంపులుగా వచ్చే డ్రోన్‌లతో జరిగే ప్రమాదం అన్ని వేళలా ఒకేలా ఉండదని, ఇక్కడ డ్రోన్‌ల సంఖ్య కన్నా, మనిషి ప్రమేయం లేకుండా అవి ఆయుధాలను ప్రయోగించే సామర్ధ్యం ద్వారా వాటి శక్తిని పరిగణించాల్సి ఉంటుందని షెరెర్ అన్నారు.
మొత్తం మీద, ఆధునిక యుద్ధతంత్రంలో డ్రోన్లను తక్కువ అంచనా వేసే పరిస్థితి మాత్రం లేదని షెరెర్ స్పష్టం చేశారు.
( జోనాథన్ మార్కస్ బీబీసీ మాజీ డిఫెన్స్ కరస్పాండెంట్. ఆస్టర్ యూనివర్సిటీలోని స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్‌లో గౌరవ ప్రొఫెసర్)
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో హిందూ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు, దైవదూషణ కేసులో కోర్టు తీర్పు
- ములాయం సింగ్, కాన్షీరాం ఏకమై కల్యాణ్ సింగ్‌ను చిత్తు చేశాక ఏం జరిగింది
- కుష్: యువతను సర్వ నాశనం చేస్తున్న కొత్త మాదక ద్రవ్యం, గొంతు కోసుకుంటున్న బాధితులు
- ‘గంటకు 417 కిలోమీటర్ల స్పీడుతో కారు నడిపాడు..’ ఆ తర్వాత ఏమైందంటే..
- ఆటలు ఆడట్లేదా? అయితే, మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)