You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ అగ్ని 5: అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ క్షిపణిని చైనా లక్ష్యంగా తయారు చేసిందా?
- రచయిత, నియాజ్ ఫరూఖీ
- హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
5,000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలపై దాడిచేయగలిగే బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను ఇటీవల భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు.
‘‘నైట్ ఆపరేషన్ మోడ్’’లో ఈ పరీక్ష నిర్వహించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. క్షిపణి దిశ, వేగాలను పరీక్షించినట్లు పేర్కొన్నాయి. 15 నిమిషాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి ఢీకొట్టినట్లు తెలిపాయి.
5,000 కి.మీ. పరిధి గల ఈ క్షిపణి ఖండాంతర క్షిపణి (ఇంటర్‌కాంటినెంటల్) శ్రేణికి దగ్గరలో ఉంది. ఖండాంతర క్షిపణి శ్రేణి 5,500 కి.మీ. నుంచి మొదలవుతుంది.
తాజా పరీక్షల అనంతరం, సైన్యం వినియోగానికి అగ్ని-5 పూర్తిగా సిద్ధమైంది.
భారత్-చైనాల ఉద్రిక్తతల నడుమ ఈ క్షిపణి అభివృద్ధిని కీలకమైన పరిణామంగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇంతకీ ఏమిటీ క్షిపణి?
భారత రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇది ఉపరితలం నుంచి వాయుతలంలోకి (సర్ఫేస్ టు ఎయిర్) ప్రయోగించగలిగే దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. 5,000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలపై దీని సాయంతో దాడిచేయొచ్చు.
అంటే చైనా మొత్తంతోపాటు ఆఫ్రికా, ఐరోపాలలోని కొన్ని ప్రాంతాల్లోని లక్ష్యాలపై ఈ క్షిపణి సాయంతో దాడులు చేసేందుకు వీలుపడుతుంది.
50 వేల కేజీల బరువుండే ఈ క్షిపణి.. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. 1,500 కేజీల అణు వార్‌హెడ్‌తో ఇది దాడులు చేయగలదు.
దీంతో అగ్ని-5ను భారత్‌లోని అత్యంత శక్తిమంతమైన క్షిపణుల్లో ఒకటిగా చెబుతున్నారు.
రెండు మార్గాల్లో తరలించొచ్చు
ఈ క్షిపణిని కెనస్టరైజ్డ్ క్షిపణిగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. అంటే కెనస్టర్ (గొట్టం లాంటి పరికరం) నుంచి కూడా దీన్ని ప్రయోగించేందుకు వీలు పడుతుంది. ఫలితంగా దీన్ని రోడ్డు లేదా రైలు మార్గాల్లో తరలించి ప్రయోగించొచ్చు.
అన్ని రకాల వాతావరణాల్లోనూ ఈ క్షిపణిని తరలించి, ప్రయోగించేందుకు కెనస్టరైజేషన్ ఉపయోగపడుతుంది.
అగ్ని-5ను మొదట 2012లో పరీక్షించారు. ఆ తర్వాత ఆర డజనుకుపైగా పరీక్షలు జరిగాయి.
తాజా పరీక్ష మాత్రం కీలకమైనది. ఎందుకంటే, దీన్ని ఎలాంటి విదేశీ సాయం అవసరం లేకుండా ‘‘స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్’’ పరీక్షించింది.
భారత్‌లోని అణ్వాయుధాలు ‘‘స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్’’ పర్యవేక్షణలో ఉంటాయి.
1989 నుంచీ...
భారత్‌లో అగ్ని శ్రేణి క్షిపణుల పరీక్షలు 1989 నుంచి మొదలయ్యాయి. ఆ ఏడాదిలో తొలిసారిగా మధ్య శ్రేణి క్షిపణి అగ్ని-1ను పరీక్షించారు.
ఆ సమయంలో కేవలం అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, ఫ్రాన్స్‌ల దగ్గర మాత్రమే బాలిస్టిక్ క్షిపణులు ఉండేవి.
ప్రస్తుతం భారత సైన్యం దగ్గర 700 కి.మీ. శ్రేణి గల అగ్ని-1 క్షిపణులు; 2,000 కి.మీ. శ్రేణి గల అగ్ని-2 క్షిపణులు; 2,500 కి.మీ. శ్రేణిగల అగ్ని-3 క్షిపణులు; 3,500 కి.మీ. శ్రేణిగల అగ్ని-4 క్షిపణులు ఉన్నాయి.
అగ్ని-5 మాత్రం అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే దీర్ఘశ్రేణి క్షిపణి. చైనాను దృష్టిలో ఉంచుకునే ఈ క్షిపణిని తయారుచేసినట్లు నిపుణులు చెబుతున్నారు.
పాకిస్తాన్‌లో లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఇదివరకటి అగ్ని క్షిపణులు సరిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎలాంటి ప్రభావం ఉంటుంది?
‘‘క్రిటికల్ మినిమమ్ డిటెరెన్స్’’ విధానంలో భాగంగానే అగ్ని-5 క్షిపణిని పరీక్షించామని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విధానంలో భాగంగా భారత్ మొదట అణ్వాయుధాలను ప్రయోగించదు. ఎవరైనా దాడి చేసినప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తుంది.
ఆత్మరక్షణ కోసం మాత్రమే అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నామని భారత్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. తాము మొదటగా ఈ అణ్వాయుధాలతో దాడులు చేయబోమని వివరిస్తోంది.
తాజా పరీక్షపై చైనా అధికారికంగా స్పందించలేదు. అయితే, గత సెప్టెంబరులో అగ్ని-5 క్షిపణిని ప్రయోగించినప్పుడు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షియావో లిజియాన్ స్పందించారు.
‘‘ఈ ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణ, సుస్థిరతకు అన్ని దేశాలు కలిసి పనిచేయాస్తాయని ఆశిస్తున్నాం. అన్ని దేశాలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’’అని షియావో అన్నారు.
భారత్‌లో తాజా క్షిపణి ప్రయోగంపై సానుకూల స్పందనలు వస్తున్నాయి. కొందరు రక్షణ రంగ నిపుణులు మాత్రం పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
నిపుణులు ఏం అంటున్నారు?
‘‘తాజా అగ్ని-5 పరీక్ష చాలా కీలకమైనది. ఎందుకంటే ఇప్పుడు ఇది సైన్యం ప్రయోగించేందుకు సిద్ధమైంది’’అని రక్షణ రంగ నిపుణుడు, ‘డ్రాగన్ ఆన్ అవర్ డోర్‌స్టెప్: మేనేజింగ్ చైనా థ్రూ మిలిటర్ పవర్’ పుస్తక రచయిత ప్రవీణ్ సాహ్నీ అన్నారు.
‘‘అయితే, చైనాను నిలువరించడానికే ఈ క్షిపణిని అభివృద్ధి చేశారని అంటున్నారు. కానీ దీని సాయంతో చైనాను అడ్డుకోగలమా?’’అని ఆయన ప్రశ్నించారు.
‘‘నాకు తెలిసినంతవరకు అలా జరగదు. ఎందుకంటే మే 2020లో ఏం జరిగిందో చూశాం. మన భూభాగంలోకి చైనా చొరబడింది. వెనక్కి వెళ్లేందుకు మోరాయించింది.’’
‘‘ఎవరైనా అణుదాడి చేస్తే, తిరిగి దాడి చేసేందుకు అగ్ని-5 ఉపయోగపడుతుంది. అంటే ఇది సెకండ్ స్ట్రైక్ లేదా ఆత్మరక్షణ కోసమే. ఈ విధానం పనిచేయదు. ఎందుకంటే చైనా దగ్గర మన కంటే చాలా ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి.’’
‘‘ఈ క్షిపణి సైన్యం చేతికి అందడం కొంతవరకు సంతోషమే. అయితే, మొదట మనం అణ్వాయుధ విధానాలను సమీక్షించుకోవాలి. అప్పుడే మన లక్ష్యాలు నెరవేరతాయి’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచకప్: పాకిస్తాన్ జర్నలిస్ట్ ‘ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ నబీ
- ‘తాలిబాన్లు ఇంటింటికీ తిరిగి డబ్బు వసూలు చేస్తున్నారు, వితంతువులను చెరబడుతున్నారు’
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పోలీసులు ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చాట్ చెక్ చేయొచ్చా
- టీ20 వరల్డ్ కప్: జాస్ బట్లర్ మెరుపులు, ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: ఆర్థర్ రోడ్ జైలు అత్యంత ప్రమాదకరమని ఎందుకంటారు?
- కరోనావైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యంకాకపోవచ్చు – అమెరికా నిఘా సంస్థలు
- టీ20 వరల్డ్ కప్: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ
- అప్గానిస్తాన్: తాలిబాన్లు ఐఎస్‌కు వ్యతిరేకంగా రహస్య యుద్ధం చేస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)