టీ20 ప్రపంచకప్: పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ ‘ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌ మొహమ్మద్ నబీ

టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ విజయం సాధించింది.

చివరి వరకు నువ్వా నేనా అనే రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌, పాక్‌కి గట్టి పోటీనిచ్చింది. అయితే చివర్లో అసిఫ్ అలీ నాలుగు సిక్సర్లు కొట్టడంతో ఒక్కసారిగా మ్యాచ్ పాకిస్తాన్‌ వైపు మలుపుతిరిగింది.

మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడు.

"ప్రభుత్వం మారింది, పరిస్థిలు మారాయి. మీరు తిరిగి అఫ్గాన్‌ వెళ్లాక, (ఎందుకు ఓడిపోయారని) మిమ్మల్ని అడుగుతారని ఏదైనా భయంగా ఉందా? కొత్త శకం ప్రారంభమైంది. పాకిస్తాన్‌తో సంబంధాలు బాగుంటే, అఫ్గానిస్తాన్ జట్టు మరింత బలపడుతుందని భావిస్తున్నారా?" అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ నబీని అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మొహమ్మద్ నబీ నిరాకరించాడు. ఇలాంటి ప్రశ్నలను వదిలేసి క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందామా అని అన్నాడు.

"క్రికెట్ గురించి మాట్లాడగలిగితే మంచిది. వరల్డ్‌కప్‌ కోసం ఇక్కడికి వచ్చాం. పూర్తి సన్నద్ధతతో, పూర్తి నమ్మకంతో వచ్చాం. క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలుంటే మీరు అడగండి".

మళ్లీ అలాంటి ప్రశ్నే..

పాకిస్తాన్‌తో సత్సంబంధాల వల్ల భవిష్యత్తులో అఫ్గానిస్తాన్ జట్టుకు ఎంతవరకు మేలు జరుగుతుందని పాక్ జర్నలిస్ట్ మళ్లీ అలాంటి ప్రశ్నే అడిగారు.

అయితే మొహమ్మద్ నబీ మళ్లీ ఇది క్రికెట్‌కు సంబంధంలేని ప్రశ్న అని చెప్పాడు. అనంతరం విలేకరుల సమావేశం ముగించుకుని వెళ్లిపోయాడు.

మీడియా సమావేశంలో చోటుచేసుకున్న ఈ తతంగంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక క్రికెటర్‌ను రాజకీయాల గురించి ప్రశ్నించడాన్ని పలువురు తప్పుబట్టారు. మహ్మద్ నబీ సమాధానాన్ని ప్రశంసించారు.

"ఈ జర్నలిస్టు ఎవరైనా సరే జర్నలిజానికి, క్రికెట్‌కు అవమానకరం. ఇలాంటి పరిస్థితిని సమయ స్పూర్తితో ఎదుర్కొన్నందుకు మొహమ్మద్ నబీకి కృతజ్ఞతలు" అని పాకిస్తానీ జర్నలిస్టు షిరాజ్ హసన్ ట్వీట్ చేశారు.

ఘోరమైన ప్రశ్నకు నబీ చాలా మంచి సమాధానమిచ్చాడని మన్సూరీ అనే ఓ మహిళ కామెంట్‌ చేశారు.

"ఒక ఆటగాడిని ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా తెలివితక్కువతనం అవుతుంది. ఆయన క్రికెట్ ఆడటానికి మాత్రమే అక్కడికి వచ్చాడు. రాజకీయ ప్రకటనలు చేయడానికి కాదు" అని టి అహ్మద్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.

ఇలాంటి ప్రశ్నలు అడగడం అంటే గాయాలపై కారం చల్లడం లాంటిది, ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు అని సకినా సమో అనే మహిళ కామెంట్‌ చేశారు.

ముందుగా బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నారు?

ప్రెస్ కాన్ఫరెన్స్‌ సందర్భంగా మొహమ్మద్ నబీని మరిన్ని ప్రశ్నలు అడిగారు. దానికి ఆయన సమాధానమిచ్చారు.

ప్రశ్న : దుబాయ్ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేవారికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది కదా, మరి ఎందుకు ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నారు?

జవాబు : తొలుత బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం అంత చెడ్డదైతే కాదు. పిచ్‌పై కాస్త నిలదొక్కుకోవడంతో, తర్వాత దూకుడుగా ఆడాము. ఇలాంటి పిచ్‌పై 148 పరుగుల లక్ష్యం నిర్దేశించడం అంటే మంచి స్కోర్‌ చేసినట్టే

ప్రశ్న : ఈ మ్యాచ్‌లో మీరు బౌలింగ్‌ లేదా బ్యాటింగ్‌ రెండింటిలో దేనిలో వెనుకబడి ఉన్నారు?

జవాబు : బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సమానంగా ఉన్నాము. అయితే మేము బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టి ఉండాల్సింది. ఈ పరిస్థితుల్లో 150-160 పరుగుల లక్ష్యం ఉంటే, మా స్పిన్నర్లు బౌలింగ్‌ చేసిన విధానం సరిపోయేది.

ప్రశ్న : రషీద్ ఖాన్‌కు 10వ ఓవర్ వరకు బౌలింగ్‌ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ నిర్ణయం ప్రేక్షకులను, మీడియాను చాలా ఆశ్చర్యపరిచింది.

జవాబు : రషీద్‌ ఖాన్‌ చాలా బాగా బౌలింగ్ చేసి, బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. చివరికి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి రావడం అంటే రషీద్‌ చాలా పరుగులు ఆపివేసినట్టే కదా.

శుక్రవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

అఫ్గానిస్తాన్ తొలుత తడబడినా చివరకు పుంజుకుంది. ఓపెనింగ్ జోడీ మొహమ్మద్ షహజాద్, హజ్రతుల్లా జజాయ్ ఎక్కువసేపు నిలవలేకపోయారు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ (0) డకౌట్ కాగా, మరుసటి ఓవర్‌లో మొహమ్మద్ షహజాద్ (8) మిడాన్‌లో బాబర్ ఆజమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 76/6తో కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ మొహమ్మద్ నబీ (35 నాటౌట్‌), గుల్బదిన్ నయీబ్(35 నాటౌట్‌) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 45 బంతుల్లో 71 పరుగులు జోడించారు. దీంతో అఫ్గానిస్తాన్‌ ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

148 పరుగుల లక్ష్య ఛేదనతో పాక్ బరిలో దిగింది. ముజీబుర్ రహహాన్ బౌలింగ్‌లో ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ (8) అవుటయ్యాడు. తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఫఖర్ జమాన్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ కుదురుగా ఆడుతూ జట్టు స్కోరును 10 ఓవర్లకు 72/1కు చేర్చారు. రెండో వికెట్‌కు 52 బంతుల్లో 63 పరుగుల్ని జోడించాక నబీ బౌలింగ్‌లో ఫఖర్ జమాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 18వ ఓవర్లు ముగిసే సరికి పాక్‌ 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.

అఫ్గానిస్తాన్ విజయం సాధిస్తుందేమో అన్న స్థితిలో ఉన్న మ్యాచ్‌ను... ఆసిఫ్ అలీ (7 బంతుల్లో 25 నాటౌట్; 4 సిక్సర్లు) తన మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ వశం చేశాడు.

చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా ఆసిఫ్ అలీ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)