అబుదాబీ ఎయిర్‌పోర్టు పేలుళ్ల మృతుల్లో ఇద్దరు భారతీయులు

అబుదాబీ విమానాశ్రయంలో పేలుళ్లలో ఇద్దరు భారతీయులు మరణించినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

యూఏఈ రాజధాని అబుదాబీ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా సోమవారం దాడి జరిగింది. డ్రోన్ల సహాయంతో ఈ దాడులు చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.

కాగా మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారని యూఏఈ అధికారులను ఉటంకిస్తూ అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

మృతుల్లో మరొకరు పాకిస్తాన్‌కు చెందినవ్యక్తిగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ ఘటనకు డ్రోన్ దాడులే కారణమని పోలీసులు అనుమానిస్తుండగా... మరోవైపు ఈ దాడి తమ పనేనంటూ హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు.అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు.

అసలు హూతీలు ఎవరు?

ఇరాన్‌ మద్దతు ఉన్నట్లుగా చెప్పే హూతీ తిరుగుబాటుదారులు.. యెమెన్ ప్రభుత్వం మీద, సౌదీ సారథ్యంలోని సంకీర్ణంపైన చాలాకాలంగా పోరాడుతున్నారు.

2015లో హూతీల దాడులతో యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రాబ్బు మన్సూర్ హాదీ దేశం విడిచి పరారైనప్పటి నుంచీ ఆ దేశంలో అంతర్యుద్ధం సాగుతోంది.

యెమెన్ అధ్యక్షుడికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తూ యూఏఈ, మరికొన్ని మధ్య ప్రాచ్య దేశాలతో కలిసి హూతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడుతోంది.

సౌదీ అరేబియాతో పాటు యూఏఈ కూడా తమపై పోరాటం చేస్తుండడంతో హూతీ తిరుగుబాటుదారులు ఆ దేశం లక్ష్యంగా దాడులు చేసినట్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)