పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి భారత్‌కన్నా మెరుగ్గా ఉందన్న ఇమ్రాన్‌ఖాన్.. కేంద్ర మంత్రి రియాక్షన్ ఇది

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి భారత్‌కన్నా మెరుగ్గా ఉందంటూ ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు.

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ట్వీట్ చేసిన రాజీవ్ చంద్రశేఖర్ ''అవును..మీకు సిద్ధూ ఉన్నాడు. మా దగ్గర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెద్ద సంఖ్యలో స్టార్టప్‌ కంపెనీలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే ఉన్నాయి'' అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

మంగళవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంబర్స్ సమ్మిట్-2022లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు.

''పాకిస్తాన్ ఇప్పటికీ చౌకైన దేశాలలో ఒకటి. మీరు మమ్మల్ని అసమర్ధులు అని తిట్టి పోయవచ్చు. కానీ, మేం అనేక కష్టాల నుంచి దేశాన్ని రక్షించామన్నది నిజం. ఇతర దేశాలకంటే పాకిస్తాన్‌లో ఆయిల్ ధర చాలా తక్కువ'' అన్నారు.

ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థపైనా పాకిస్తాన్ ప్రధాని కామెంట్లు చేశారు.

''భారత్ మనకన్నా ఏమాత్రం ముందుంది? వారి వృద్ధిరేటు మైనస్‌కు చేరుకుంది. కోవిడ్ కారణంగా 10లక్షల మంది చనిపోయారని అధికారికంగా చెబుతున్నారు. కానీ, 30 లక్షలమంది వరకు చనిపోయారని కొందరంటున్నారు. దేవుడు ఎంత పని చేశాడో చూడండి'' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)