ప్రిన్సెస్‌ హయా: దుబయి రాజుతో విడాకుల కేసులో ఆరో భార్యకు రూ. 5,500 కోట్ల పరిహారం.. ఇంకా ఆ సెటిల్మెంట్‌ లో ఏమేం ఉన్నాయంటే

    • రచయిత, ఫ్రాంక్‌ గార్డెనర్‌
    • హోదా, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

ఇది సాదాసీదా కేసు కాదు. దుబయి పాలకులతో సంబంధం ఉన్న కేసు. బ్రిటన్‌ చరిత్రలోనే అతి పెద్ద విడాకుల కేసుగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

దుబయి ప్రిన్స్‌ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్, ఆయన ఆరో భార్య ప్రిన్సెస్‌ హయా మధ్య విడాకుల కేసు విచారణ అనంతరం యూకే హైకోర్టు ఆమెకు 550 మిలియన్‌ పౌండ్ల (సుమారు రూ. 5,500 కోట్లు)కు పైగా విలువైన సెటిల్మెంట్‌ను ప్రకటించింది.

జోర్డాన్ మాజీ రాజు హుస్సేన్ కుమార్తె అయిన 47 ఏళ్ల ప్రిన్సెస్‌ హయా బింత్ అల్-హుస్సేన్‌కు సుమారు 251.5 మిలియన్‌ పౌండ్లు ( సుమారు రూ. 2500 కోట్లు) ఏక మొత్తంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ ఆరుగురు భార్యలలో ప్రిన్సెస్‌ హయా అందరికన్నా చిన్నవారు. మొహమ్మద్ బిన్ రషీద్ దుబయి రాజుగాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రిన్సెస్ హయాకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన రెండు స్థిరాస్తుల పరిరక్షణ, నిర్వహణ ఖర్చులను కూడా భరించాలని కోర్టు ఈ సెటిల్మెంట్‌ తీర్పులో పేర్కొంది. ఈ రెండు స్థిరాస్తులు లండన్‌లో ఉన్నాయి.

ఇందులో ఒకటి కెన్సింగ్టన్‌ ప్యాలస్‌ పక్కనే ఉండగా, రెండోది సర్రేలోని ఏగామ్‌లో ఉన్న ప్రిన్సెస్‌ హయా నివాసం.

వీటితోపాటు హయా కుటుంబానికి అవసరమైన భద్రతకు, ఒక నర్సు, ఒక ఆయాకు అయ్యే జీతభత్యాల ఖర్చులనూ ప్రిన్స్‌ భరించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కోసం వాహనాలు, గుర్రాలు, పెంపుడు జంతువుల నిర్వహణ ఖర్చులనూ సెటిల్మెంట్‌లో చేర్చారు.

ప్రిన్సెస్‌ హయా ఇద్దరు పిల్లలకు ఏటా 5.6 మిలియన్‌ పౌండ్ల (సుమారు రూ. 56 కోట్ల)ను సెక్యూరిటీ పేమెంట్స్‌ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ 290 మిలియన్‌ పౌండ్ల(సుమారు రూ. 2900 కోట్లు) గ్యారెంటీని ఇవ్వాల్సి ఉంటుంది.

'ప్రాణ భయం'

ప్రిన్సెస్‌ హయా, ప్రిన్స్‌ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్‌ మధ్య విడాకులు కేసు చాలాకాలంగా నడుస్తోంది. 2019లో హయా తన పిల్లలను తీసుకుని దుబయి నుంచి బ్రిటన్‌కు పారిపోయారు. షేక్ మొమమ్మద్ గతంలో తన ఇద్దరు కుమార్తెలు షేక్ లతీఫా, షేఖా షమ్సాలను కిడ్నాప్‌ చేసి వారి ఇష్టానికి విరుద్ధంగా దుబయి రప్పించారని తెలిసిన తర్వాత తన ప్రాణాలకు ప్రమాదముందని భయపడ్డానని హయా ఓ సందర్భంలో వెల్లడించారు.

అయితే, కుమార్తెలను కిడ్నాప్‌ చేయించానన్న ఆరోపణలను షేక్ మొహమ్మద్ ఖండించారు. కానీ, ఆయన వాదనలను తాము నమ్మడం లేదని 2020లో జరిగిన విచారణలో యూకే హైకోర్టు పేర్కొంది.

ప్రిన్స్‌ షేక్ మొహమ్మద్ "యు లివ్డ్, యు డైడ్" అనే పేరుతో ఓ కవితను ప్రచురించారు. ఇది ప్రిన్సెస్‌ హయాను బెదిరించడానికి రాసిన కవితగా అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రిన్సెస్‌ హయాకు బ్రిటీష్ ఆర్మీకి చెందిన ఆమె మాజీ బాడీగార్డ్‌తో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత, ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయని చెబుతారు.

ప్రిన్సెస్‌ హయా బ్రిటన్‌ వెళ్లిన తర్వాత కూడా ఈ బెదిరింపులు కొనసాగాయి. " మీరు ఎక్కడున్నా మిమ్మల్ని చేరుకోగలం" అంటూ వచ్చే మెసేజ్‌లతో ఆమె మరింత భయపడ్డారు. పిల్లలను అపహరిస్తారన్న భయంతో వారి భద్రత కోసం ఆమె బాగా ఖర్చు చేసినట్లు చెబుతారు.

ప్రిన్సెస్‌ హయా, ఆమె బాడీగార్డ్‌, ఇంకా ఆమె లాయర్ల బృందంలోని కీలక సభ్యుల మొబైల్‌ ఫోన్‌లను షేక్ మొహమ్మద్ చట్టవిరుద్ధంగా హ్యాక్ చేశారని ఆరోపణలున్నాయి.

ఇజ్రాయెల్ తయారు చేసిన పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రిన్సెస్‌ హయా ఫోన్‌ను హ్యాక్‌ చేసినట్లు ఆరోపణలు రాగా, తమ వద్ద హ్యాకింగ్ చేసే టెక్నాలజీ ఏదీ లేదని, ఎవరిపైనా నిఘా పెట్టలేదని ప్రిన్స్‌ మొహమ్మద్‌ తరఫు లాయర్లు వాదించారు. అయితే, యూకే హైకోర్టు వారి వాదనకు విరుద్ధంగా తీర్పుచెప్పింది.

విడాకుల కేసుపై తుది తీర్పు చెబుతూ, ప్రిన్సెస్‌ హయాతోపాటు ఆమె ఇద్దరు పిల్లల ప్రాణాలకు ఇంకా ముప్పు పొంచే ఉందని, అది దుబయి రాజు నుంచేనని న్యాయమూర్తి అన్నారు. వారికి పూర్తి భద్రత కల్పించాలని ఆయన సూచించారు.

ప్రిన్సెస్ హయా, ఆమె పిల్లలకు "తీవ్రమైన" ప్రమాదం కలిగించే అంశాల గురించి లాయర్లు కోర్టుకు వివరించగా, సెక్యూరిటీకి సంబంధించిన వాహనాలు, ఇతర ఖర్చులను కూడా జడ్జి తన సెటిల్మెంట్‌ తీర్పులో చేర్చారు.

''ఈ పిల్లలు అనుభవిస్తున్న అసాధారణమైన సంపద, అద్భుతమైన జీవన ప్రమాణాలను" దృష్టిలో ఉంచుకుని, సెటిల్మెంట్‌ విషయంలో ఒక సహేతుకమైన నిర్ణయానికి రావడానికి తనవంతు ప్రయత్నం చేశానని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. ఈ కేసును ఒక అసాధారణమైనదిగా ఆయన అభివర్ణించారు.

"ఇంత విలాసమా?"

భవిష్యత్‌ అవసరాల కోసం ప్రిన్సెస్‌ హయా రాజు నుంచి ఎలాంటి పరిహారం కోరలేదని ఆమె తరఫు న్యాయవాదులు తెలిపారు. అయితే, ఆమె విలాసవంతమైన లైఫ్‌ స్టైల్‌ గురించి, విచారణ సందర్భంగా అనేక విమర్శలు వినిపించాయి. తన తొమ్మిదేళ్ల కొడుకుకు కార్లను గిఫ్ట్‌గా ఇచ్చే అలవాటు ఉన్నందున ఆమె ఆ పిల్లవాడికి మూడు ఖరీదైన కార్లు ఇచ్చారు. దీనిపై స్పందించిన జడ్జ్‌, ఈ విమర్శలో న్యాయముందని అన్నారు.

భద్రతా సిబ్బందిలో ఒకరితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా మిగిలిన వారి నుంచి తాను బ్లాక్‌ మెయిలింగ్‌ను ఎదుర్కొన్నట్లు ఇచ్చిన ఆధారాలను కూడా కోర్టు తీర్పులో పేర్కొన్నారు. ఈ బ్లాక్‌ మెయిలింగ్‌ నుంచి బయటపడేందుకు ఆమె ఆ సిబ్బందికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. ఇందుకోసం పిల్లల ఖాతాల నుంచి కూడా డబ్బును డ్రా చేశారు.

ఈ డబ్బును తిరిగి బ్యాంకులో వేయడం కోసం తాను 1 మిలియన్‌ పౌండ్లు(సుమారు రూ. 10 కోట్లు) విలువైన ఆభరణాలను అమ్ముకోవాల్సి వచ్చినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి తాను అనేక ఆభరణాలను అమ్ముకోవాల్సి వచ్చినట్లు కోర్టుకు చెప్పారు.

తన మాజీ భార్యకు దక్కాల్సిన వారసత్వపు సంపదను ఆమెకు ఇచ్చేస్తానని షేక్‌ మొహమ్మద్‌ వెల్లడించారు. ప్రిన్సెస్‌ను బెదిరించినట్లుగా ఉన్న తన కవితను ఆన్‌లైన్‌ నుంచి తొలగించినట్లు కూడా ఆయన వెల్లడించారు. ప్రిన్సెస్‌కు హాని కలిగించే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)