You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
న్యూజీలాండ్: ఈ అరుదైన అంటార్కిటికా పెంగ్విన్ 3 వేల కిలోమీటర్లు ఎందుకు ప్రయాణించింది?
ఒక పెంగ్విన్ తను సహజంగా నివసించే అంటార్కిటికా నుంచి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూజీలాండ్ తీరానికి చేరుకుంది.
దారి తప్పి తమ తీరానికి చేరిన ఈ అడెలీ పెంగ్విన్‌ను స్థానికులు ముద్దుగా 'పింగూ' అని పిలుచుకుంటున్నారు.
హారీ సింగ్ అనే స్థానికుడు ఆ పెంగ్విన్‌ను గుర్తించారు. మొదట దాన్ని ఒక సాఫ్ట్ టాయ్ అనుకున్నానని ఆయన చెప్పారు.
చరిత్రలో న్యూజీలాండ్ తీరంలో ఒక అడెలీ పెంగ్విన్ కనిపించడం ఇది మూడోసారి మాత్రమే.
చాలా రోజుల తర్వాత క్రైస్ట్‌చర్చ్ నగరానికి దక్షిణంగా బర్డ్‌లింగ్స్ దగ్గరున్న బీచ్‌లో లాంగ్ వాక్‌కు వచ్చిన సింగ్, ఆయన భార్య మొదట ఈ పెంగ్విన్‌ను చూశారు.
"మొదట నేను దాన్ని ఒక సాఫ్ట్ టాయ్ అనుకున్నా... హఠాత్తుగా ఆ పెంగ్విన్ తల కదిలించింది. దాంతో నాకు ఇది నిజమైనదేనని అర్థమైంది" అని సింగ్ బీబీసీకి చెప్పారు.
హారీ సింగ్ ఆ పెంగ్విన్ దృశ్యాలను తన ఫేస్‌బుక్ పేజిలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దారితప్పినట్లు అక్కడికి చేరినట్లు కనిపిస్తున్న ఆ పెంగ్విన్ ఒంటరిగా ఉంది.
"అది గంటపాటు కదల్లేదు. అలిసిపోయినట్లు కనిపించింది" అన్నారు సింగ్.
ఆ పెంగ్విన్ ఎంతకూ నీళ్లలోకి వెళ్లకపోవడంతో... తీరంలో తిరిగే మిగతా జంతువులు దాన్ని తినేస్తాయేమోనని భయపడ్డ ఆయన పెంగ్విన్ రెస్కూయర్స్‌కు కాల్ చేయాలనుకున్నారు.
"అది కుక్కలకో, పిల్లులకో ఆహారం కావాలని మేం అనుకోలేదు" అంటారు హారీ సింగ్.
ఆయన చివరకు దాదాపు పదేళ్లుగా న్యూజీలాండ్ దక్షిణ ద్వీపంలో పెంగ్విన్లకు పునరావాసం కల్పిస్తున్న థామస్ స్ట్రేక్‌కు ఆ పెంగ్విన్ గురించి చెప్పారు.
స్ట్రేక్ ఆ పెంగ్విన్‌ను చూడగానే అదిరిపడ్డారు. ఎందుకంటే, అదొక అడెలీ పెంగ్విన్. ఆ జాతి ప్రత్యేకంగా అంటార్కిటికా ఖండంలోనే నివసిస్తుంది.
అదే రోజు సాయంత్రం ఆయన ఒక పశు వైద్యుడితో కలిసి దాన్ని కాపాడారు. అప్పటికే బరువు తగ్గిన అది బాగా నీరసించిపోయింది.
డాక్టర్లు పింగూకు బ్లడ్ టెస్టులు చేశారు. ఆ పరీక్షల్లో అది కాస్త బరువు తగ్గినట్లు, నీరసంతో ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత దానికి ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ఫ్లూయిడ్స్ అందించారు.
చివరకు కోలుకున్న ఆ పెంగ్విన్‌ను కుక్కలు, వేరే ఏ జంతువుల ప్రమాదం లేని న్యూజీలాండ్‌లోని ఒక సురక్షితమైన తీరంలో వదిలిపెట్టారు.
ఇప్పటివరకూ అడెలీ పెంగ్విన్ న్యూజీలాండ్ తీరంలో మొదట 1962లో, ఆ తర్వాత 1993లో కనిపించాయి. ఇప్పుడు అది మళ్లీ కనిపించడం మూడోసారి.
అడెలీ పెంగ్విన్ న్యూజీలాండ్‌లో కనిపించడం అనేది చాలా అరుదైన విషయం. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగితే వాటిని ఆందోళనకరమైన సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
"మనకు ప్రతి ఏటా తీరంలో అడెలీ పెంగ్విన్స్ కనిపించడం మొదలైతే.. నిజానికి మహా సముద్రంలోనే ఏవో మార్పులు వచ్చినట్లు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది" అని ఒటాగో యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ ఫిలిప్ సెడాన్ ది గార్డియన్ వార్తాసంస్థతో అన్నారు.
"దీనిపై మరిన్ని అధ్యయనాలు చేయడం వల్ల ఈ పెంగ్విన్లు ఎక్కడికెళ్తున్నాయి, ఏం చేస్తున్నాయి, వాటి జనాభా సరళి ఎలా ఉంది అనేదానిపై మనం ఇంకా బాగా తెలుసుకోవచ్చు. సముద్ర పర్యావరణ వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉందనేది అవి మనకు వివరించబోతున్నాయి" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- జుల్ఫికర్ అలీ భుట్టో: 47 ఏళ్ల కిందటి ఒక హత్య కేసు ఈ నేత మెడకు ఉరి తాడులా ఎలా చుట్టుకుంది?
- టీ20 ప్రపంచకప్ ఫైనల్: న్యూజీలాండ్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరిది పైచేయి...
- బంగ్లాదేశ్ హిందువుల ఉపవాస దీక్ష, ఇజ్రాయెల్‌లో పెలికాన్ల సందడి, కొలంబోలో వరద బీభత్సం - ఈ వారం ప్రపంచ చిత్రాలు ఇవీ
- దిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్... అవసరమైతే లాక్డౌన్ విధించాలని సూచన
- టీ20 ప్రపంచకప్: వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడం వల్లే పాకిస్తాన్ సెమీస్‌లో ఓడిందా?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
- ఆనందం లేదా భయం కలిగినప్పుడు మనం గట్టిగా ఎందుకు అరుస్తాం?
- హిందుత్వను ఐసిస్, బోకోహరామ్లతో పోల్చిన సల్మాన్ ఖుర్షీద్... కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)