You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంటార్కిటికాలో పెంగ్విన్ల ఆకలి చావులు! ఆహారం కోసం 120 కి.మీ ప్రయాణం!
తూర్పు అంటార్కిటికాలో ఎటుచూసినా కనుచూపుమేర మంచే. ఈసారి అసాధారణ స్థాయిలో మంచు కురవడమే దానికి కారణం.
ఈ పరిస్థితి అక్కడున్న అడేలీ పెంగ్విన్లకు తీరని నష్టం కలిగిస్తోంది.
ఇది అడేలీ పెంగ్విన్ల సంతానోత్పత్తి కాలం. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య అవి గుడ్లు పొదుగుతాయి. కానీ అసాధారణ మంచు వల్ల నీరు గడ్డకట్టుకుపోతోంది. ఆహారం దొరకడం కష్టంగా మారుతోంది.
ఆహారం కోసం ప్రతీరోజు పెంగ్విన్లు 50నుంచి 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
సరైన సమయంలో ఆహారం అందక బేబీ పెంగ్విన్లు మృత్యువాత పడుతున్నాయి. తల్లి తీసుకొచ్చే ఆహారం కోసం ఎదురుచూసీ చూసీ తనువు చాలిస్తున్నాయి. 36000 పెంగ్విన్లు ఉన్న కాలనీలో కేవలం రెండంటే రెండే బేబీ పెంగ్విన్లు బతికి బయటపడ్డాయి.
ఈ ప్రాంతంలో చేపల వేట పెరగడంతో పెంగ్విన్లకు ఆహారం దొరకడం లేదు. పెంగ్విన్ల సంతానోత్పత్తి సమయంలో ఇలాంటి విపత్తు రావడం ఐదేళ్లలో ఇది రెండోసారి.
పెంగ్విన్ల ఆకలి కేకలు జంతు ప్రేమికుల మనసును కలిచివేస్తున్నాయి. తూర్పు అంటార్కిటికాలో సుమారు 36000 పెంగ్విన్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రమాదం అంచున ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రక్షించాలని జంతు ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
క్రిల్ చేపల వేటను నిషేధించకపోతే ఈ ప్రాంతంలోని జీవరాశుల మనుగడ సాధ్యం కాదని పర్యావరణ పరిరక్షణ సంస్థ WWF అభిప్రాయపడింది. 2010 నుంచి ప్రెంచ్ శాస్త్రవేత్తలతో కలిసి వాళ్లిక్కడి పెంగ్విన్లపై పరిశోధనలు చేస్తున్నారు.
అడేలీ పెంగ్విన్ల సంతానోత్పత్తి విశేషాలు
- అడేలీ పెంగ్విన్లు అంటార్కిటిక్ తీరప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి.
- ఇవి అక్టోబర్ -ఫిబ్రవరి మధ్య సంతానోత్పత్తి చేస్తాయి.
- రాళ్లతో గూడుకట్టుకుని అందులో గుడ్లు పెడతాయి.
- ఆ తర్వాత గుడ్లను పొదుగుతాయి.
- పిల్లల కోసం ఆహారం సేకరించడానికి ఇవి 50 నుంచి 120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
ఆధారం: నేషనల్ జియోగ్రఫిక్ అండ్ అంటార్కిటికా వెబ్‌సైట్
పెంగ్విన్ల గురించి మనకు తెలిసిన దానికి, అక్కడున్న పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని WWF పోలార్ ప్రోగ్రామ్స్ హెడ్ రాడ్ డౌనీ అన్నారు.
ఇక్కడ క్రిల్ చేపల ఫిషరీస్‌కి అనుమతి ఇస్తే అడేలీ పెంగ్విన్ల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెబుతున్నారు. పెంగిన్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)