కోవిడ్ 19: యూరప్‌లో మరో మూడు నెలల్లో 5 లక్షల మరణాలు నమోదు కావచ్చు- WHO

యూరప్ మరోసారి కరోనా మహమ్మారికి కేంద్రంగా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ హెచ్చరించారు.

జర్మనీలో గత 24 గంటల్లో దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అత్యధికం. దీంతో "వ్యాక్సీన్ వేసుకోనివారికి ఇది భారీ మహమ్మారి అవుతుంది" అని ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి అన్నారు.

జర్మనీలో ఇంకా కోటీ 60 లక్షల మంది టీకా వేసుకోలేదు. అయితే గతంతో పోలిస్తే ఐసీయూ వరకూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది.

యూరప్‌లో ఫిబ్రవరిలోపు కరోనా వ్యాప్తి వల్ల మరో 5 లక్షల మరణాలు నమోదు కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ డైరెక్టర్ హాన్స్ క్లూగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజారోగ్యం పట్ల తీసుకోవాల్సిన చర్యలను సడలించడం కూడా యూరప్‌లో కేసుల పెరుగుదలకు ఒక కారణం అని ఆయన అన్నారు.

ఇందులో మధ్య ఆసియా సహా 53 దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ 14 లక్షల మరణాలు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా కేసులు యూరప్‌లో వెలుగులోకి వచ్చాయి. దాదాపు సగం మరణాలు సంభవించాయి. యూరప్‌లోని 53 దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తిస్తున్న వేగం ఆందోళనకరంగా ఉందని క్లూగ్ అన్నారు.

వ్యాక్సినేషన్ వేగం పెంచాలని, కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోడానికి సామాజిక దూరం కొనసాగించాలని, మాస్క్ ధరించడం ముఖ్యమని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)