You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీ20 వరల్డ్‌కప్-NZvSCO: పోరాడి ఓడిన స్కాట్లాండ్, 16 పరుగులతో కివీస్ గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2లో భాగంగా బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ 16 పరుగులతో విజయం సాధించింది.
స్కాట్లాండ్ ఆటగాడు మిచెల్ లీస్క్ ధాటిగా ఆడటంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్న స్కాట్లాండ్‌కు చివరకు నిరాశ తప్పలేదు.
విజయానికి 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన లీస్క్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అజేయంగా 42 పరుగులు చేశాడు.
కానీ కివీస్ బౌలర్లు కీలక సమయంలో తెలివిగా బౌలింగ్ చేయడంతో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు.
స్కాట్లాండ్ ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 156 పరుగులు చేసింది.
కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఇశ్ సోధీలకు చెరో 2 వికెట్లు దక్కాయి. సౌతీకి ఒక వికెట్ పడింది.
చెలరేగిన గప్టిల్
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది.
ఓపెనర్ మార్టిన్ గప్టిల్ విజృంభించాడు. అతను 56 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 93 పరుగులు చేశాడు.
గ్రూప్ 2లో సెమీస్ బెర్తే లక్ష్యంగా ఈ మ్యాచ్ బరిలో దిగిన కివీస్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు.
అయితే ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన షరీఫ్... ఒకే ఓవర్‌లో 2 కీలక వికెట్లను పడగొట్టి న్యూజీలాండ్‌కు షాకిచ్చాడు.
జట్టు స్కోరు 35 పరుగుల వద్ద ఓపెనర్ డరైల్ మిచెల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న షరీఫ్ అదే స్కోరు వద్ద కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0)ను పెవిలియన్ పంపాడు.
ఇదే సమయంలో ఓపెనర్ గప్టిల్ జోరు పెంచాడు. ఇవాన్స్ బౌలింగ్‌లో 4, 6 బాదాడు. అయితే మరో ఎండ్‌లో డేవాన్ కాన్వే (1) వికెట్ తీసి స్కాట్లాండ్ సంబరపడింది.
ఇక ఇక్కడి నుంచి స్కాట్లాండ్ బౌలర్లకు కష్టాలు ఎదురయ్యాయి. గ్లెన్ ఫిలిప్స్ (37 బంతుల్లో 33; 1 సిక్స్) సహకారంతో గప్టిల్ చెలరేగిపోయాడు. దీంతో 10 ఓవర్లకు కివీస్ స్కోరు 70/3కి చేరింది.
ఆ తర్వాత 13వ ఓవర్ వరకు వీరిద్దరూ ఓవర్‌లో కనీసం ఒక సిక్స్ ఉండేలా బ్యాట్ ఝళిపించారు. దీంతో 11వ ఓవర్‌లో 12 పరుగులు, 12వ ఓవర్‌లో 10 పరుగులు, 13వ ఓవర్‌లో 14 పరుగులు లభించాయి.
ఈ క్రమంలో 35 బంతుల్లోనే గప్టిల్ అర్ధసెంచరీ అందుకున్నాడు. మరోవైపు 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్‌వికెట్‌లో లీస్ వదిలేశాడు.
14వ ఓవర్ బౌలింగ్ చేసిన వాట్ కట్టుదిట్టంగా బంతులేయడంతో కేవలం 4 పరుగులు మాత్రమే లభించాయి.
ఆ తర్వాత కూడా గప్టిల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వీల్ బౌలింగ్‌లో ఒక సిక్సర్ బాదిన గప్టిల్, షరీఫ్ వేసిన ఓవర్‌లో స్క్వేర్ లెగ్ దిశగా, మిడ్ వికెట్ మీదుగా మరో రెండు సిక్సర్లతో సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. ఆ తర్వాత ఎవాన్స్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా మరో సిక్సర్‌తో సెంచరీకి చేరువయ్యాడు.
కానీ 19వ ఓవర్‌లో వీల్, ఈ జోరుకు కళ్లెం వేశాడు. వరుస బంతుల్లో ఫిలిప్స్, గప్టిల్‌లను అవుట్ చేశాడు. 19వ ఓవర్ రెండో బంతికి ఫిలిఫ్స్‌ను అవుట్ చేసిన వీల్ నాలుగో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
అయితే మరుసటి బంతికే లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చిన గప్టిల్ కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
ఆ తర్వాత జేమ్స్ నీషమ్ (10 నాటౌట్), మిచెల్ శాంట్నర్ (2 నాటౌట్) చివరి ఓవర్‌లో 9 పరుగులు చేసి స్కాట్లాండ్‌కు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ప్రత్యర్థి బౌలర్లలో బ్రాడ్ వీల్, సఫ్యాన్ షరీఫ్ చెరో 2 వికెట్లు తీయగా... మార్క్ వాట్‌కు ఒక వికెట్ దక్కింది.
స్కాట్లాండ్ బ్యాటింగ్
లక్ష్యఛేదనను స్కాట్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది.
తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలతో కెప్టెన్ కైల్ కోట్జర్ (11 బంతుల్లో 17; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లు బాదిన కైల్‌ను ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో బౌల్ట్ అవుట్ చేశాడు.
బౌల్ట్ బౌలింగ్‌లో కైల్ మిడాన్‌లో సౌతీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో జార్జ్ మున్సే (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు)కు మాథ్యూ క్రాస్ జతయ్యాడు.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో క్రాస్ 5 వరుస బౌండరీలతో కదం తొక్కాడు. మిల్నే వేసిన ఈ ఓవర్ తొలి బంతిని స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ బాదిన క్రాస్, రెండో బంతిని ఫైన్ లెగ్ బౌండరీగా మలిచాడు. మూడో బంతిని కవర్స్ దిశగా ఆడిన అతను, నాలుగో బంతికి వికెట్ కీపర్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి కూడా నాలుగు పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో స్కాట్లాండ్ వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది.
ఆ తర్వాత ఇష్ సోధీ బౌలింగ్‌లో మున్సే రెండు వరుస సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కానీ అదే ఓవర్ ఐదో బంతికి లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చి మున్సే అవుటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 31 బంతుల్లో 45 పరుగులు జోడించారు. ఇక ఆ తర్వాత స్కాట్లాండ్ పరుగుల వేగం మందగించింది.
మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న మాథ్యూ క్రాస్ (29 బంతుల్లో 27; 5 ఫోర్లు)ను సౌతీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తర్వాత ఒక ఫోర్, సిక్సర్‌తో ఆశలు రేకెత్తించిన రిచీ బెరింగ్‌టన్ (17 బంతుల్లో 20)తో పాటు, క్యాలమ్ మెక్‌లాయిడ్ (12) త్వరగానే అవుటయ్యారు. దీంతో స్కాట్లాండ్ విజయ సమీకరణం చివరి 24 బంతుల్లో 65 పరుగులకు చేరింది.
ఈ దశలో చివరి బంతి వరకు మిచెల్ లీస్క్ దీటుగా పోరాడాడు. 17వ ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదిన అతను, 18వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4 కొట్టి 17 పరుగులు రాబట్టాడు.
అయితే 19 ఓవర్ బౌలింగ్ చేసిన సౌతీ 13 పరుగులే ఇవ్వడంతో, చివరి ఓవర్‌లో 26 పరుగులు చేయాల్సి వచ్చింది.
కానీ, ఒక ఫోర్ సహాయంతో లీస్క్ 9 పరుగులే రాబట్టడంతో స్కాట్లాండ్‌కు ఓటమి తప్పలేదు.
ఇవి కూడా చదవండి:
- తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాస్ లీడర్లను ఎందుకు తయారు చేసుకోవట్లేదు?
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- డాక్టర్ సుధ: బద్వేలులో భారీ విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి
- COP26: 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధిస్తామని భారత్ వాగ్దానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)