COP26: 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధిస్తామని భారత్ వాగ్దానం

కర్బన ఉద్గారాలను 2070 నాటి కల్లా నెట్ జీరోకి తీసుకువస్తామని భారతదేశం వాగ్దానం చేసింది.

కాగా, 2050 కల్లా దేశాలు కార్బన్ న్యూట్రల్‌గా మారాలన్నది COP-26 సదస్సు ప్రధాన లక్ష్యం.

భారతదేశం నెట్ జీరో లక్ష్యం గురించి మాట్లాడడం ఇదే మొదటిసారి. 2070 కల్లా భారత్ కార్బన్ న్యూట్రల్‌గా మారుతుందని గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ ప్రకటించారు.

కార్బన్ న్యూట్రల్‌గా మారడం అంటే.. ఉత్పత్తి అవుతున్న ఉద్గారాలను, నిర్మూలిస్తున్న ఉద్గారాలను సమానం చేయడాన్నే నెట్ జీరో అంటారు.

ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గార దేశం చైనా 2060 నాటికి తాము కార్బన్ న్యూట్రల్‌గా మారతామని ఇప్పటికే ప్రకటించింది.

అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు 2050 నాటికి నెట్ జీరోకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ దిశగా గ్లాస్గోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో భారత్‌తో సహా 120 దేశాల నాయకులు పాల్గొంటున్నారు. ఈ సమావేశం రెండు వారాల పాటు కొనసాగుతుంది.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో పలువురు దేశాధినేతలు వాతావరణ మార్పులు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లక్ష్యాలను నిర్దేశిస్తూ సోమవారం ఈ సదస్సులో ప్రసంగించారు.

వాతావరణ మార్పులు సమస్యలను పరిష్కరించడంలో ఎన్ని రోజులు ఆలస్యమైతే అంత భారం ప్రపంచంపై పెరుగుతుంటుందని బైడెన్ అన్నారు.

అయితే, భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అన్నది దేశాలకు లభించిన మంచి అవకాశమని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశ నెట్ జీరో ప్రతిజ్ఞ

చైనా, అమెరికా, ఈయూల తరువాత అధిక కర్బన ఉద్గారాల దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

అయితే, భారతదేశం అధిక జనాభా కలిగి ఉండడం వలన, తలసరి ఉద్గారాలు మిగతా ప్రధాన దేశాలతో పోలిస్తే తక్కువ.

2019లో భారత తలసరి కర్బన ఉద్గారాలు 1.9 టన్నులు కాగా, అమెరికాలో 15.5 టన్నులు, రష్యాలో 12.5 టన్నులుగా నమోదయ్యాయి.

నెట్ జీరో సాధించడంతో పాటు మరో నాలుగు లక్ష్యాల గురించి మోదీ ఈ సదస్సులో మాట్లాడారు.

2030 నాటికల్లా దేశ ఇంధన శక్తిలో 50 శాతాన్ని పునరుత్పాదక వనరుల నుంచి సంగ్రహించే లక్ష్యాన్ని భారత్ ప్రకటించింది.

అదే సంవత్సరానికి అంచనా వేసిన కర్బన ఉద్గారాలను వంద కోట్ల టన్నులు తగ్గించడం కూడా ఈ లక్ష్యాల్లో ఒకటి.

అయితే COP26 నిర్దేశించిన 2050 కాకుండా 2070కి నెట్ జీరో సాధిస్తామని మోదీ ప్రకటించడం గ్లాస్గోలో ప్రచార కర్తలను, నిపుణులను కొంత నిరాశపరచినా భారతదేశంలో ప్రజలు ఇందుకు హర్షం వ్యక్తం చేశారు.

పర్యావరణం విషయంలో ప్రధాని మోదీ మధ్యే మార్గాన్ని కనుగొన్నారని బీబీసీ ఇండియా ఇంగ్లిష్ న్యూస్ ఎడిటర్ వికాస్ పాండే అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలగకుండా వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడానికి మోదీ కట్టుబడి ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

'భారతదేశం బలంగా అడుగు ముందుకు వేసింది'

వాతావరణ మార్పులు సమస్యకు ఉత్తమ పరిష్కారం జీవన విధానాన్ని మార్చుకోవడమేనని భారత ప్రధాని మోదీ నొక్కి చెప్పారని, తన ప్రసంగం మొత్తం దీని గురించే మాట్లాడారని బీబీసీ ఎన్విరాన్మెంటల్ కరస్పాండెంట్ మట్ మెక్‌గ్రాత్ తెలిపారు.

"చివర్లో నెట్ జీరో లక్ష్యంతో సహా మొత్తం అయిదు లక్ష్యాలను మోదీ ప్రకటించారు. వాటిని "అయిదు సంజీవిని" ఔషధాలుగా భారత ప్రధాని అభివర్ణించారు.

2070కల్లా కర్బన్ న్యూట్రల్‌గా మారతామని ప్రకటించడం భారత్ బలంగా వేసిన ముందడుగు. ముఖ్యంగా 50 శాతం ఇంధన శక్తిని ఇంకా బొగ్గు నుంచే పొందుతున్న దేశానికి ఇది పెద్ద లక్ష్యం.

అయితే, భూతాపాన్ని తగ్గించడానికి ఈ అర్థశాతబ్దం చివరికల్లా నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు నొక్కి చెబుతున్నారన్నది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం.

కాగా, భారతదేశం స్పష్టంగా తన లక్ష్యాన్ని ప్రకటించడం పట్ల అనేకమంది హర్షం వ్యక్తం చేశారు" అని మెక్‌గ్రాత్ వివరించారు.

'మన సమాధులను మనమే తవ్వుకుంటున్నాం'

మోదీకి ముందు ఈ సదస్సులో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ ప్రసంగించారు.

"ప్రకృతిని మరుగుదొడ్డిగా భావించకూడదు, శిలాజ ఇంధనాలను వాడడం అంటే మన గోతులు మనమే తవ్వుకుంటున్నట్లు లెక్క" అంటూ ధాటిగా మాట్లాడారు.

"ఈ సదస్సులో మనం విఫలమైతే భవిష్యత్తు తరాలు మనల్ని చిన్నచూపు చూస్తాయని" బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

"ఈ క్షణంలో మనం ఉపక్రమించకపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటామో ఊహించలేం" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

కాగా, సదస్సుకు బయట గ్లాస్గోలో అనేకమంది ప్రచార కార్యకర్తలు, నిరసనకారులు గుమికూడారు. దేశాధినేతలు మరిన్ని బలమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, సత్వరమే పరిష్కార మార్గాలు అన్వేషించాలని డిమాండ్ చేశారు.

"మన భవిష్యత్తును సీరియస్‌గా తీసుకుంటున్నట్లు దేశాధినేతలు నటిస్తున్నారు" అంటూ గ్రేటా థెన్‌బర్గ్ ఆక్షేపించారు.

"ఆ లోపలి నుంచి మార్పు రాదు. అది నాయకత్వం కాదు. ఇదే నాయకత్వం. నాయకత్వం అంటే ఇలా ఉంటుంది" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)