You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉత్తర కొరియాలో రహస్య ప్రాంతానికి వెళ్లిన అమెరికా యువకుడు.. ఆ తర్వాత ఏమైంది..
- రచయిత, మేఘా మోహన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియా ప్యాంగ్‌యాంగ్‌లోని యాంగ్‌గాక్డో హోటల్‌లో బస చేయడమే అమెరికా విద్యార్థి ఒట్టో వార్మ్‌బియర్‌కి శాపంగా మారింది. తొలుత అరెస్టై ఆ తర్వాత ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది.
అమెరికాకు చెందిన డాక్టర్ కాల్విన్ సన్ హోటల్‌లోని రహస్య అంతస్తులో తనకు జరిగిన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఆ హోటల్‌లో బస చేసే ప్రయాణికులు ఐదో అంతస్తుకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కాల్విన్ సన్, ఆయన స్నేహితులు దేశం దాటి వెళ్లడానికి ప్యాంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మినీ బస్సులో వెళుతుండగా ఉత్తర కొరియా గార్డులు ఒక్కసారిగా అడ్డుకుని బస్సు ఎక్కారు.
ఏదో సమస్యను గుర్తించామని అధికారులు తెలిపారు. దీనికి పరిష్కారం లభించే వరకు మిగతా వారందరూ దేశం విడిచిపెట్టి వెళ్లడానికి వీలు లేదని వారు తేల్చి చెప్పారు.
ఆ సమయంలో బస్సులో నిశ్శబ్ధం ఆవరించింది.
బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధంలేని దేశంలో తన ఒక వారం విహారయాత్ర గురించి కాల్విన్ సన్ నెమరువేసుకున్నారు. ఇది ఆయనకు మరపురాని పర్యటనలలో ఒకటి.
"మేము ఉత్తర కొరియాలో ఆ వారం రోజుల్లో చేసిన అన్ని పనుల్లో, హోటల్ ఐదవ అంతస్తులో చేసిన మా బస సమస్యగా మారుతుందని నాకు ఎప్పుడూ అనిపించలేదు" అని కాల్విన్ సన్ చెప్పారు.
మినీ బస్సు నుంచి బయటకు దిగాల్సిందిగా ట్రావెల్ బృందాన్ని గార్డులు కోరారు.
అమెరికాకు వలస వెళ్లిన చైనా సంతతికి చెందిన కాల్విన్ సన్ న్యూయార్క్ నగరంలో పుట్టి పెరిగారు. తనకు 20 ఏళ్లు వచ్చేవరకు కూడా ఎప్పుడూ న్యూయార్క్ కూడా దాటి వెళ్లలేదు. దూరం వెళ్లడానికి ఇష్టం లేక, ఇంటికి 20 నిమిషాల దూరంలో ఉన్న కొలంబియా విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించారు.
కానీ, 2010లో అనుకోకుండా ఈజిప్టు పర్యటనకు వెళ్లి రావడంతో ప్రపంచాన్ని చుట్టిరావాలన్న ఆశ ఆయనలో కలిగింది. కాల్విన్ సన్, ది మాన్‌సూన్ డైరీస్ అనే ట్రావెల్ బ్లాగ్‌ను ఏర్పాటు చేసి, ట్రావెల్‌ని అమితంగా ఇష్టపడే ఫాలోయర్లను సంపాదించారు.
కాల్విన్ సన్ విరామం చిక్కినప్పుడల్లా లేక వారాంతాల్లో వివిధ దేశాలను అన్వేషించేవారు. చూసిన ప్రదేశాన్నే మళ్లీ చూడకూడదనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు.
వైద్య విద్యను అభ్యసించేటప్పుడు రెండో ఏడాదికి ముందు వేసవి సెలవుల్లో, మధ్యప్రాచ్యంలో ఏదో ఒక చోట పర్యటన ప్రారంభించి ఆసియాలో ఎక్కడో ఒక చోట ముగించేలా యాత్ర చేయాలని కాల్విన్ సన్ నిర్ణయించుకున్నారు.
ప్యాంగ్‌యాంగ్‌లోని యాంగ్‌గాక్డో హోటల్‌లోని రహస్య ఐదవ అంతస్తు వీరి యాత్ర ప్రణాళికల్లో లేదు. అంతెందుకు అసలు ఉత్తర కొరియానే వీరి ప్రణాళికలో లేదు.
2011లో ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే పాశ్చాత్య పర్యాటకులకు ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల సహాయం అవసరం. దాదాపు అర డజను మంది అంతర్జాతీయ ట్రావెల్ ఏజెంట్లు చైనా ద్వారా ఉత్తర కొరియాకు గ్రూపులుగా వచ్చే వారికి కోరుకున్న గైడెడ్ టూర్‌లను అందించేవారు. ఈ సందర్శనల నియమాలు 2017లో కఠినతరం చేశారు. యాంగ్‌గాక్డో హోటల్‌లోని నిషేధించిన ఐదవ అంతస్తుకి పాశ్చాత్య విద్యార్థి వెళ్లడం వల్లే ఇలా నియమాలు కఠినతరమయ్యాయని చాలా మంది భావిస్తున్నారు.
బీజింగ్‌లో ఉన్నప్పుడు, కాల్విన్ సన్ అమెరికాకు తిరిగి వెళ్లడానికి మరో వారం సమయం దొరికింది. దీంతో టూర్ ఆపరేటర్లలో ఒకరిని కలిసి వారి ప్రయాణ ప్రణాళికల్లో మార్పులను ఆశిస్తూ, కొత్త ప్రదేశాల కోసం వెతికారు. బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధంలేని ఉత్తరకొరియా వారిని అమితంగా ఆకర్షించింది. దీంతో మంచి డీల్‌గా భావించి ఉత్తరకొరియాను ఎంచుకున్నారు.
"నేను నింపిన సులభమైన వీసా ఫారమ్‌లలో ఉత్తర కొరియా ఒకటి. అప్పుడు ప్రవేశానికి దరఖాస్తు చేయడానికి పాస్‌పోర్ట్‌ను కూడా ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఉత్తర కొరియా ప్రయాణించడానికి ఎక్కువ మంది ప్రయత్నించకపోవడం వల్ల ఈ విషయం చాలా మందికి తెలియదు".
న్యూయార్క్‌కు తిరిగొచ్చే ముందు సన్ వెళ్లిన చివరి దేశం ఉత్తర కొరియానే.
కాల్విన్ సన్‌తోపాటూ ఎక్కువగా 20 ఏళ్ల వయసున్న 20 మంది బృందం బీజింగ్‌లో వారి పర్యటన నిర్వాహకులను కలిశారు. వీరిలో అమెరికన్, యూరోపియన్, చైనీస్ యాత్రికులు ఉన్నారు.
ముందుగా నిర్వహించిన ఓరియంటేషన్ సెషన్‌లో, గ్రూప్ సభ్యులు వారి గైడ్‌లు చెప్పేది వినాలని, ఉత్తర కొరియా సంస్కృతికి ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వాలని సూచనలు ఇచ్చారు.
వారు రాజధానిలోని యాంగ్‌గాక్డో హోటల్‌లో బస చేయనున్నారు. అయితే అందులోని ఐదవ అంతస్తు గురించి ఎవరూ ప్రస్తావించలేదు.
ప్యాంగ్‌యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే, చైనాకు ఉత్తరకొరియాకు భారీగా తేడా ఉన్నట్టు అనిపించింది.
"భగవంతుడు ఒక్కసారిగా రంగును తీసేసినట్టుగా అనిపించింది" అని ఆయన చెప్పారు. "బీజింగ్ చాలా రంగులమయంగా ఉంటుంది. ప్యాంగ్యాంగ్‌తో పోల్చితే, బీజింగ్ అందంగా ఉంది".
"భవనాలు, పోస్టర్లు, చిహ్నాలు, బట్టలు కూడా తెలుపు, బూడిదరంగు, నలుపు రంగులో కొద్దిగా ఎరుపు రంగులో ఉన్నాయి. ఎటు చూసినా కమ్యూనిస్ట్ పార్టీ రంగులు కనిపించాయి. నేను టైమ్ మెషీన్‌లోకి ప్రవేశించి 1970ల్లో సోవియట్ టీవీ షోలోకి వెళ్లినట్లుగా అనిపించింది".
టూర్ గైడ్‌లకు 40 ఏళ్ల వయస్సుంటుంది. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఈ టూర్ నిర్వహించే బాధ్యత వీరిపైనే ఉంది. తాము డిపిఆర్‌కె మిలిటరీలో అధికారులుగా ఉండేవారమని వారు మా బృందానికి తెలియజేశారు.
"ప్రారంభంలో పర్యవేక్షణ లేకుండా వీధులను దాటవద్దని లేదా కొన్ని భవనాల ఫోటోలు తీయవద్దని చెబుతూ వారు కొంచెం కఠినంగా కనిపించినప్పటికీ మేము వారితో తొందరగానే మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్నాము" అని కాల్విన్ సన్ చెప్పారు.
"గైడ్‌లు మద్యపానాన్ని ఆస్వాదించేవారు. కొరియన్ సంస్కృతిలో ఆల్కహాల్ ప్రధాన భాగమని మేము తెలుసుకున్నాము. ప్రతిరోజూ సాయంత్రం వారితో కలివిడిగా ఉండాలని మమ్మల్ని ప్రోత్సహించారు"
1968లో ఉత్తర కొరియా తన ఆధీనంలోకి తీసుకున్న యూఎస్ఎస్ ప్యూబ్లో, డిమిలిటరైజ్డ్ జోన్‌ను మా బృందం సందర్శించింది. ప్యూబ్లో ఇప్పటికీ కమిషన్డ్ రోస్టర్‌లో ఉన్న ఏకైక అమెరికన్ నేవీ షిప్. పర్యాటక ప్రాంతాలైన జూచే టవర్, వర్కర్స్ మెమోరియల్‌లను కూడా సందర్శించారు. ఇంటర్నెట్, టీవీని కూడా ప్రభుత్వమే నియంత్రిస్తున్న ఆ దేశంలో అక్కడ మద్యం సేవించడం, ప్రజలు ఒకరితో ఒకరు గడపడం లాంటి సంఘటనలను కాల్విన్ సన్ చూశారు.
"టూరిస్టు గైడ్స్ మమ్మల్ని మైఖేల్ జాక్సన్ గురించి పదేపదే అడిగారు. ఆయన ఎయిడ్స్‌తో చనిపోయారా అని ప్రశ్నించారు. అమెరికాలో పోలీసుల క్రూరత్వం గురించి కూడా మమ్మల్ని చాలా అడిగారు. కాప్స్ అనే అమెరికన్ రియాలిటీ షో ఉత్తర కొరియా టీవీలో ప్రసారమవుతుంది. వారు దాని గురించి కూడా చాలా ప్రశ్నలు వేశారు".
అయితే వారు అడిగిన ప్రశ్నలు మాత్రమే కాదు, వారు అడిగిన తీరు కూడా కాల్విన్ సన్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది.
"ఇది ఉత్సుకత కంటే ఎక్కువగా అనిపించింది. అమెరికా గురించి వారికి ఉన్న ప్రత్యేకమైన అభిప్రాయాన్ని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించినట్లు అనిపించింది".
ఉత్తర కొరియా గ్రామీణ ప్రాంతంలోని ఓ షూటింగ్ రేంజ్‌లో కాల్విన్ సన్ మొదటిసారిగా తుపాకీ పేల్చారు. బృందంలోని చాలా మంది సరిగా గురి చూసి కాల్చలేకపోయారు. అమెరికన్లు తుపాకీలు చేత బూని హింసకు పాల్పడతారని భావించిన టూరిస్టు గైడ్స్.. మేము షూటింగ్‌లో విఫలం కావడంతో ఆశ్చర్యపోయారు.
వారం గడిచేకొద్దీ, ప్రారంభంలో ఉన్న కఠిన నియమాలు కాస్తా మరుగునపడ్డాయి. పర్యవేక్షణలేకుండా మా బృందం రోడ్లు దాటినా గైడ్స్ పట్టించుకోలేదు. ఫొటోలు తీయకూడదని అడ్డుపడలేదు.
ఇది మరపురాని వారం. కాల్విన్ సన్ తన ప్రయాణ సహచరులతో తొందరగా స్నేహం ఏర్పరచుకున్నారు. గైడ్‌లతో కలిసిపోయేవారు. వారం చివరి రాత్రి బృందం.. డిప్లో అనే నైట్‌క్లబ్‌కు వెళ్లి 1980ల నాటి సంగీతానికి, ప్రధానంగా మైఖేల్ జాక్సన్ పాటలకు స్టెప్పులు వేశారు.
తిరిగి యాంగ్‌గాక్డో హోటల్‌కు చేరుకున్నాక, గైడ్‌లు మరోసారి తాగడానికి తమతో రావాలని మా బృందాన్ని ఆహ్వానించారు. ఆ వారం చాలా బిజీగా గడవడంతో అప్పటికే అలసిపోయిన వారు, అందుకు సున్నితంగా తిరస్కరించారు.
పడుకునే ముందు అందరూ ఒకే గదిలో సమావేశమవడం సరదాగా ఉంటుందని కొందరు నిర్ణయించారు. సంబంధిత గదికి వెళ్లడం ప్రారంభించారు.
అప్పుడు ఎవరో హోటల్‌లోని మిగతా ప్రదేశాలను కూడా ఓసారి చుట్టొద్దామని సూచించారు.
47 అంతస్తులు కలిగిన యాంగ్‌గాక్డో ఇంటర్నేషనల్ హోటల్ ఉత్తర కొరియాలోని ఎత్తైన భవనాలలో ఒకటి. ఇది టైడాంగ్ నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉంది. నాలుగు రెస్టారెంట్లు, ఒక బౌలింగ్ అలే, మసాజ్ పార్లర్‌లు ఉన్నాయి. బెడ్‌రూమ్‌లలోని టీవీల్లో అప్పుడప్పుడు బీబీసీ వరల్డ్ న్యూస్‌కి సంబంధించిన పాత కార్యక్రమాలు వచ్చేవి.
ఇది ఉత్తరకొరియాలో పర్యాటకులు బస చేయడానికి అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. ఉత్తర కొరియా టూరిస్ట్ బోర్డు దీనిని ఫైవ్ స్టార్ హోటల్‌గా చూపుతూ బిల్లులు వసూలు చేస్తోంది. అయితే, ట్రావెల్ సైట్‌లలోని టూరిస్ట్ రివ్యూల ప్రకారం హోటల్ స్థాయి మూడు స్టార్లకు దగ్గరగా ఉంది.
"ఇది దాదాపు 1984లో వేగాస్‌కు ఎవరినైనా పంపి, 'వారు ఎలా నిర్మించారో చూసి, ఇక్కడకు తిరిగి వచ్చి అలాగే నిర్మించండి' అని చెప్పినట్లుగా ఉంది. వారు అలాగే చేశారు. కానీ కొన్ని చోట్ల తప్పుగా నిర్మించారు" అని ఒక బ్లాగర్ రాశారు.
హోటల్‌లో ఐదు రోజులు బస చేసిన సమయంలో, కాల్విన్ సన్ బృందాన్ని వారి గైడ్స్ పర్యవేక్షించారు. ఒంటరిగా భవనంలో కలియ తిరగడానికి వారికి దొరికిన చివరి అవకాశం ఇదే. అన్నింటికంటే ఎక్కువగా, హోటల్‌లో తిరగొద్దని నియమాలు ఏవీ లేవు.
లిఫ్ట్‌లో కిందికి దిగడానికి ముందు ఈ బృందం తెరిచివున్న రూఫ్ టాప్‌కు వెళ్లి, తర్వాత పైఅంతస్తులో ఉన్న రివాల్వింగ్ రెస్టారెంట్‌కి వెళ్లింది.
లిఫ్ట్‌లో ఐదో అంతస్తుకు సంబంధించిన బటన్ కనిపించకపోవడాన్ని ఎవరో గమనించారు. నాలుగు తర్వాత నేరుగా ఆరు ఉంది.
"మనం ఐదో అంతస్తును తనిఖీ చేయాలి. వారు మూఢ నమ్మకంతో ఉన్నందున నిజంగానే దాన్ని నిర్మించలేదా లేక ఐదో అంతస్థును కూడా నిర్మించారా అనే సంగతి తెలుసుకుందాం" అని మరొకరు అన్నారు.
రహస్య ఐదో అంతస్తులోని మిస్టరీపై ఇప్పటికే ట్రావెల్ బ్లాగర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. కాల్విన్ సన్ బృందంలోని ఒకరు దీని గురించి గతంలోనే విన్నారు. కానీ కాల్విన్ సన్‌కి దీని గురించి అసలు తెలియదు.
"మేం ఐదో అంతస్తుకి వెళ్ళిన మొదటి బృందమో లేక చివరి బృందమో కాదు. 2011లో మా బృందంలో ఎవరిని ఉత్తరకొరియా నిర్బంధించలేదు. మేం ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో, మాకు అప్పుడు తెలియలేదు".
ఈ రోజు యంగ్ పయనీర్ టూర్స్(కాల్విన్ సన్‌కి సేవలు అందించిన టూర్ ఆపరేటర్) వెబ్‌సైట్‌లో ఐదో ఫ్లోర్‌కి టూరిస్టులకు అనుమతిలేదని పేర్కొంటూ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఒక పేజీనే ఉంది. 2011లో అలాంటి ఆన్‌లైన్ హెచ్చరిక లేదు. ఆఫ్‌లైన్‌లో కూడా లేదు.
"గైడ్స్ ఏ దశలోనూ ఐదో అంతస్తుకు వెళ్లొద్దని మాకు చెప్పలేదు. అసలు దాని గురించి ఎక్కడా ప్రస్తావనే లేదు" అని కాల్విన్ సన్ చెప్పారు.
ఐదో అంతస్థు సాంకేతికంగా లేనందున, అక్కడ ఉండడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది కలగదని, అప్పటికే అక్కడకు వెళ్లి వచ్చిన మరో ప్రయాణికుడు కూడా వారికి సమాచారం అందించారు.
ఈ బృందం నాల్గవ అంతస్తులో దిగి, హోటల్ వెనుక ఉన్న మెట్ల దారి వైపు మళ్ళింది. వారు బయటకు ఉల్లాసంగా కనిపించినా, ఆందోళనతో ఉన్నారని కాల్విన్ సన్ చెప్పారు.
"కారిడార్‌లో ముందు వైపున వెళుతున్న ఓ వ్యక్తి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. 'లేదు ఈ వైపు కాదు’ అనే అరుపులు తాను విన్నట్టు ఆ వ్యక్తి చెప్పారు.
అయితే తాను ఎలాంటి అరుపులు వినలేదని, కాల్విన్ సన్ అన్నారు. "మేమంతా దిశను మార్చుకుని ఆరవ అంతస్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అక్కడ నుండి ఐదో అంతస్తుకి నడవాలని నిర్ణయించుకున్నాం".
మెట్లు దిగుతుండగానే ఐదో అంతస్తులోకి ప్రవేశించే చిన్న తలుపు తెరిచే ఉండటం, అక్కడ ఎవరూ లేకుండా ఉండటంతో బృందం ఆశ్చర్యపోయింది. కెమెరాలు బయటకు తీసి లోపలికి అడుగుపెట్టారు.
కాల్విన్ సన్ మనసుని తాకిన మొదటి విషయం పైకప్పు ఎత్తు చాలా తక్కువగా ఉండటం. ఇది ఇతర అంతస్తులతో పోల్చితే దాదాపు సగం ఎత్తులో ఉంది. కొందరు తమ తలలను కిందికి వంచారు. లోపల ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తితో బృందం విడిపోయింది.
కాంక్రీట్ బంకర్ లాంటి నేల గుండా మసక వెలుతురులో కాల్విన్ సన్ నడవడం ప్రారంభించారు. సీలింగ్ ఎత్తు మినహా, మిగతాది ఓ సాధారణ హోటల్ బెడ్‌రూమ్ కారిడార్‌లానే ఉంది. ఇరువైపులా గదులు ఉన్నాయి.
చాలా గదులకు తాళం వేసి ఉంది. కానీ, ఒకటి తెరిచి ఉంది. తెరిచిన తలుపు పక్కన ఒక జత బూట్లు ఉన్నాయి. వాళ్లు చూసే సరికి లోపల ఎవరూ కనిపించలేదు.
"గదుల లోపలి నుండి లైట్ల వెలుతురు వస్తోంది. మేం సెక్యూరిటీ కెమెరాలను చూశాము. బెడ్‌రూముల లోపలి భాగాన్ని చూపించే టీవీ స్క్రీన్‌లు, నిఘా సామగ్రిని చూశాం. ఈ అంతస్తులో హోటల్ సిబ్బంది అతిథులను పర్యవేక్షించడానికి పరికరాలను ఉంచినట్లు నేనప్పుడు భావించాను".
కాల్విన్ సన్ ఫొటోలు తీస్తుండగా.. బృందంలోని కాల్విన్ సన్ స్నేహితుల్లో ఒకరు వీడియో చిత్రీకరించడం ప్రారంభించారు. అందరూ ఒకరితో ఒకరు హుషారుగా మాట్లాడుకున్నారు.
"మేం అనుకోకుండా ఫ్లాష్ ఫొటోగ్రఫీని ఉపయోగించాం. కాని ఎవరూ మమ్మల్ని గుర్తించలేదు".
గోడలు ముదురు రంగులో ఉన్నాయి. వాటిపై అమెరికా, జపాన్ వ్యతిరేక ప్రచార చిత్రాలు వున్నాయి. అనేక చిత్రాలు మాజీ సుప్రీం నాయకుడు కిమ్ జోంగ్ ఇల్‌ను కీర్తిస్తూ ఉన్నాయి.
"ఈ బాంబు అమెరికన్లు తయారు చేసింది. అమెరికన్ల ప్రతి ఉత్పత్తి మన శత్రువు. అమెరికన్లపై వెయ్యి వందల సార్లు ప్రతీకారం తీర్చుకోండి" అని ఒక చోట రాసి ఉంది.
కొద్ది నిమిషాల తర్వాత గుర్తు తెలియని వ్యక్తి, బృందం దగ్గరికి వచ్చాడు.
"తప్పిపోయారా?" అని శాంతంగా ఇంగ్లీషులో అడిగాడు.
ఎవరో అవును అని అన్నారు. ఆ వ్యక్తి తల ఊపి వారికి మెట్లపైకి దారి చూపించాడు.
"ఆయన మమ్మల్ని తిరిగి మా గదులకు తీసుకెళ్లలేదు. కోపంగా మావైపు చూడలేదు".
గదులకు తిరిగి వచ్చాక, హోటల్ అధికారుల నుంచి వారికి ఎలాంటి బెదిరింపు రాలేదు. దీంతో మరికొంత మంది మళ్లీ కిందికి వెళ్లి రావాలని నిర్ణయించుకున్నారు.
ఐదో అంతస్తులోకి వెళ్లాక, బృందంలోని వ్యక్తులలో ఒకరు అక్కడున్న ఓ తలుపు తెరిచి చూశారు. ఆయనకు ఎదురుగా ఉన్న ఇటుక గోడ మినహా ఏమీ కనిపించలేదు. మరొకరు ఇంకో తలుపు తెరవగా, మరో అంతస్తుకు వెళ్లే మెట్ల మార్గం కనిపించింది.
"అక్కడ ఒక అంతస్తులోనే మరో అంతస్తు ఉంది".
అక్కడ తాళం వేసి ఉన్న గదులు, గోడకు వేలాడదీసిన ప్రచార పోస్టర్లు ఎక్కువగా ఉన్నాయి. కాల్విన్ సన్‌కి కొరియన్ చదవడం రాదు. కానీ, యూట్యూబ్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత, ఆయన కొన్ని సందేశాల అర్థాన్ని తెలుసుకున్నారు. వారు అమెరికాపై ప్రతీకారం, కిమ్ కుటుంబ శక్తి గురించి కీర్తిస్తున్నట్టు అందులో ఉంది. ఒక పోస్టర్, 1980ల ప్రారంభ నాటి మోడల్ కంప్యూటర్ గురించి చెబుతుంది. 21వ శతాబ్దాన్ని సాంకేతిక యుగంగా పేర్కొన్నట్టు అందులో ఉంది.
మరోసారి వేరొక హోటల్ అధికారి ఈ బృందాన్ని సంప్రదించి, వారి గదులకు తిరిగి వెళ్లాలని మర్యాద పూర్వకంగా కోరారు.
కొందరు మూడోసారి తిరిగి వచ్చారు. ఈ సారి మరింత రిలాక్స్‌గా, బృందంలోని ఇద్దరు సభ్యులు ఏకాంతంగా ముద్దు కూడా పెట్టుకున్నారు (ఈ విషయం కొన్ని సంవత్సరాల తర్వాత, వీరందరూ తిరిగి కలుసుకున్నప్పుడు వెల్లడించారు). మరోసారి, వారిని వారి గదులకు తిరిగి వెళ్లాలని మరో గార్డు వారికి చెప్పారు.
"అప్పుడు మా వయసు 20కి దగ్గరలో ఉంది. మేమంతా మూర్ఖంగా వ్యవహరించాం. మేమంతా కల్లాకపటం తెలియని వాళ్లం. ఆ అనుభవం మాకు ఉత్సాహంగానూ, అమాయకంగానూ అనిపిస్తుంది. అప్పట్లో చేసినట్టుగా, ఇప్పుడు బాధ్యతలు తెలిసాక కచ్చితంగా అలా చేయను".
కాల్విన్ సన్, ఆయన బృందం చివరికి ఐదు గంటలకు వారి వారి గదులకు తిరిగి వెళ్లారు. వారి మినీ బస్సు మరో రెండు గంటల్లో వస్తుందనడంతో, ప్యాంగ్యాంగ్ నుండి విమానంలో బయల్దేరడానికి అన్నీ ప్యాక్ చేశారు.
ఏడు గంటలకు, ప్యాంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి మినీ బస్సు కోసం వేచిచూస్తున్న బృందం ఉత్సాహంతో ఉంది. అయితే హోటల్ అధికారులు, గార్డులు బస్సు ఎక్కిన వారిని దిగాలని ఆదేశించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.
గ్రూప్‌లోని ఒక సభ్యుడు ఏం చేశారో తమకు తెలుసని, ఇప్పుడే ఒప్పుకోవడం వివేకం అని గైడ్స్ చెప్పారు. దాంతో బృందం మౌనంగా ఉండిపోయింది.
ఓ అధికారి మాట్లాడారు. యాంగ్‌గాక్డో హోటల్‌లోని ప్రైవేట్ గదుల నుండి ఎంబ్రాయిడరీ టవల్స్ అనుమతి లేకుండా తీశారు. బృందం వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలనుకుంటే, వారు టవల్స్‌ని ఖచ్చితంగా తిరిగివ్వాల్సిందే అన్నారు. అయితే ఎవరూ ఆ నేరాన్ని అంగీకరించలేదు.
టూర్ గైడ్స్ హోటల్ అధికారులతో చర్చించి ఓ అంగీకారానికి వచ్చారు. వాళ్ళు తిరిగి బస్సులోకి వెళ్లి, టవల్స్‌ను అక్కడే కింద పెట్టాలి. నేరస్తుడిని గుర్తించకుండానే, సమస్యను పరిష్కరించడానికి ఇదే వేగవంతమైన మార్గం అని వారు వాదించారు.
గార్డులు అందుకు అంగీకరించారు. దొంగను గుర్తించకుండా దొంగిలించిన టవల్స్‌ను కనుగొన్నారు.
ఈ బృందం విమానాశ్రయానికి చేరుకుంది. రూల్స్ ప్రకారం, వారి ఉత్తర కొరియా వీసాలను గేట్ల వద్ద తిరిగి ఇచ్చేశారు. వారి అధికారిక పాస్‌పోర్ట్‌లపై ఎలాంటి స్టాంప్ లేకుండానే దేశం నుండి వెళ్లిపోయారు.
కాల్విన్ సన్ మరుసటి రోజు తన వైద్య విద్యను ప్రారంభించారు. ఆయన ఐదో అంతస్తు గురించి చాలా మామూలుగానే అనుకున్నారు. కానీ, నాలుగేళ్ల తర్వాత జరిగిన ఓ సంఘటన ఆయన ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది.
2015లో అమెరికా యూనివర్శిటీ విద్యార్థి ఒట్టో వార్మ్‌బియర్, కాల్విన్ సన్‌లానే ఉత్తరకొరియా పర్యటన ప్రణాళికను చేసుకున్నారు. యంగ్ పయనీర్ టూర్స్‌కి చెందిన అదే నిర్వాహకుల సహకారంతో పర్యటించాలనుకున్నారు. వార్మ్‌బియర్ కూడా యాంగ్‌గాక్డో హోటల్‌లోనే బస చేశారు. వార్మ్‌బియర్ హోటల్‌లో ఓ పోస్టర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించాడని ఉత్తర కొరియా అధికారులు చెప్పారు.
వార్మ్‌బియర్‌ను ఒక బూటకపు విచారణతో, బలవంతంగా నేరాన్ని అంగీకరించేలా చేశారు. కోర్టు దోషిగా నిర్ధారించి, కఠిన శ్రమతో కూడిన 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. జైలులో వార్మ్‌బియర్‌కు తీవ్రగాయాలై, కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి తిరిగి ఆయన కోమాలోంచి బయటకు రాలేదు. 2017 జూన్‌లో ఒట్టో వార్మ్‌బియర్ మరణం అంతర్జాతీయ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
సాధారణ ప్రజలకు సంబంధంలేని హోటల్‌లోని ఒక భాగంలో వార్మ్‌బియర్ ఉన్నట్లు నిఘా ఫుటేజీ సూచించింది. ప్యాంగ్యాంగ్ హోటల్‌ను సందర్శించిన కొందరు ఈ 21 ఏళ్ల విద్యార్థి నిస్సందేహంగా ఐదవ అంతస్తులోకి ప్రవేశించి గోడపై నుండి ప్రచార పోస్టర్‌ను తీసివేసినట్లు చెప్పారు. ఉత్తర కొరియా ప్రభుత్వం కానీ, యాంగ్‌గాక్డో హోటల్ కానీ ఐదవ అంతస్తు ఉనికి వివరాలను ఇప్పటికీ ధృవీకరించలేదు.
"మేము అక్కడికి వెళ్లినప్పుడు తీసివేసేలా ఉన్న పోస్టర్లు లేవు. చిత్రాలన్నీ పెయింట్ చేసినవి, గోడకు వేలాడదీసి ఉన్నాయి" అని కాల్విన్ సన్ చెప్పారు. "మేము ఏదైనా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ ముట్టుకోవడానికి ఏమీ లేవు. మేము అక్కడ నుండి దొంగిలించగలిగేది ఏమీ లేదు. నిఘా గది వెలుపల నేలపై ఉన్న చెప్పులు తప్ప".
వార్మ్‌బియర్ మరణం ఉత్తర కొరియా పర్యాటక రంగంపై ప్రభావం చూపింది. యంగ్ పయనీర్స్ టూర్స్‌తో సహా అనేక మంది టూర్ ఆపరేటర్లు తాము ఇకపై అమెరికా పౌరులను ఉత్తరకొరియాకి తీసుకెళ్లబోమని చెప్పారు.
చాలామంది పాశ్చాత్య పర్యాటకుల కోసం తమ విధానాల్లో మార్పులు చేస్తామని చెప్పారు. వారి వెబ్‌సైట్‌లలో అదనపు సమాచారంతో పేజీలను జోడించి, ఐదవ అంతస్తు సర్వీస్ ఫ్లోర్ అని, అక్కడికి ప్రవేశించడానికి కచ్చితంగా అనుమతి లేదని పేర్కొంటున్నాయి.
కాల్విన్ సన్ తనకు లభించే ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రయాణాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో తన బ్లాగ్‌కు ఫాలోయర్లు పెరుగుతూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు తాను చేసే పనులపై మరింత జాగ్రత్తగా ఉంటున్నారు.
"ఒట్టోకు జరిగింది తెలుసుకున్నప్పుడు భయానకంగా అనిపించింది. ఇప్పుడు మనం ఏం తెలుసు కోవాలంటే, పర్యటకులు సందర్శించాలనుకునే దేశ ఆచారాలను గౌరవించాలని, నేను కచ్చితంగా ప్రయాణికులందరికీ సలహా ఇస్తాను. కానీ నాడు మేము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని నాకు అర్థం కాలేదు లేదా మా చర్యలు కూడా ఒట్టో వంటి విషాదకరమైన, దారుణమైన ఫలితానికి దారితీసే అవకాశం ఉండేది".
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)