ఉభయ కొరియాల చర్చలతో శాంతి నెలకొంటుందా?

    • రచయిత, డాక్టర్ జాన్ నిల్సన్-రైట్
    • హోదా, ఛాతమ్ హౌస్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-యిన్‌ల మధ్య మార్చి 27వ తేదీ శుక్రవారం జరిగిన సమావేశం నిస్సందేహంగా రెండు దేశాల మధ్య సంబంధాలలో ఒక నూతన అధ్యాయం.

అయితే ఈ సమావేశంలో ప్రకటించిన నూతన శాంతి ఒప్పందం ప్రకారం, నిర్దిష్టమైన చర్యల ద్వారా ఏ మేరకు చిరకాల శాంతిని సాధిస్తారు అన్నదే ప్రశ్నార్ధకం.

ఉత్తరకొరియా పాలకుడు దక్షిణకొరియా నేలపై అడుగుపెట్టడమనే సంఘటన ప్రభావాన్ని తక్కువగా చూడలేం.

కిమ్ ఎంతో ధైర్యంతో తమ పట్ల వ్యతిరేక ధోరణి కలిగిన భూభాగంలోకి అడుగుపెట్టడం, ఆయన ఆత్మవిశ్వాసాన్ని, రాజకీయ పరిణితిని సూచిస్తోంది.

కిమ్‌పై అభిప్రాయాలను చెరిపేసిన పర్యటన

కిమ్ ఒక అడుగు వెనక్కి వేసి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ను కూడా తమ భూభాగంలోకి ఆహ్వానించడం - తాము కూడా దక్షిణకొరియాతో సమానమన్న విషయాన్ని స్పష్టం చేసేందుకే.

పాత జ్ఞాపకాలను పక్కన బెట్టి షేక్‌హ్యాండ్‌లు, నవ్వులు, కౌగిలింతలు ఉభయ కొరియాల భవిష్యత్‌కు సూచికగా నిలిచాయి.

అంతే కాకుండా అంతర్జాతీయ మీడియా ఎదుట ఇరువురు నేతల ప్రకటన సందర్భంగా కిమ్ ప్రపంచవ్యాప్తంగా తనకు ఉన్న ఇమేజ్‌ను చెరిపివేసే ప్రయత్నం చేశారు.

ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆయన చేసిన ప్రకటన - కిమ్ బిగుసుకుపోయి ఉంటారని, నియంత అన్న అభిప్రాయాన్ని చెరిపేసి, ఆయన కూడా సాధారణ మానవుడే అని, ఆయనలోను ఒక మంచి దౌత్యవేత్త ఉన్నారని, ఆయన కూడా అంతర్జాతీయ శాంతి పరిరక్షణకు కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని చాటి చెప్పడానికి ఉపయోగపడింది.

ఉత్తర కొరియా పర్యటనకు దక్షిణ కొరియా అధ్యక్షుడు

ఉమ్మడి సంబంధాలు, మిలటరీ, పరస్పర విశ్వాసం పెంచుకునే చర్యలు, ఆర్థిక సహకారం, ఇరుదేశాల పౌరుల మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం గురించి ఉభయ కొరియాలు గతంలోనూ చర్చించాయి.

అయితే శుక్రవారం జరిగిన చర్చల్లో వీటిపై నిర్దిష్టంగా చర్చించారు. చర్చల అనంతరం ఇరువురు నేతలూ పరస్పర వ్యతిరేక చర్యలను నిలిపివేయాలని, శాంతి సంబంధాల పునరుద్ధరణ కోసం నిర్దిష్ట కాలమాన పట్టికను అనుసరించాలని నిర్ణయించుకున్నారు.

దీని ప్రకారం మే 1 నుంచి మిలటరీరహిత ప్రాంతానికి సమీపంలో రెచ్చగొట్టే చర్యలన్నిటినీ నిలిపివేస్తారు. 2018 ఆసియన్ క్రీడలలో కలిసి పాల్గొనాలని, 15 ఆగస్టు నాటికి కుటుంబాల కలయికను పునరుద్ధరించాలని, ఈ ఏడాది చివరిలోగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ ఉత్తర కొరియాలో పర్యటించాలని నిర్ణయించడం జరిగింది.

ఈ సమావేశం సందర్భంగా 'ఒకే జాతి, ఒకే భాష, ఒకే రక్తం' అంటూ కిమ్ చేసిన ప్రకటన, రెండు కొరియా దేశాల మధ్య భవిష్యత్తులో ఘర్షణను నివారించాలన్న ఆకాంక్ష - దక్షిణ కొరియాలో కిమ్‌కు మంచి మార్కులే సంపాదించి పెట్టాయి.

దాంతోపాటు భవిష్యత్తులో జరిగే శాంతి చర్చలలో ఉత్తర, దక్షిణ కొరియాలతో పాటు చైనా, అమెరికాలలో ఒకటి కానీ, రెండూ కానీ కలిసి చర్చించాలని తీర్మానించారు.

ఈ ఘనత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌దేనా?

ఉభయ కొరియాలు తమ ఉమ్మడి భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలనుకుంటున్నా, అమెరికా ప్రాధాన్యతను మాత్రం విస్మరించలేం.

ఈ సమావేశాల్లో అధ్యక్షుడు మూన్ చాలా తెలివిగా ఉభయ కొరియాల మధ్య శాంతియత్నాల క్రెడిట్‌ను ట్రంప్‌కే కట్టబెట్టారు. ఈ చర్యతో అమెరికా అధ్యక్షుడి అహాన్ని తృప్తిపరచడం వల్ల యుద్ధ ప్రమాదం తగ్గుతుందని, ఉత్తర కొరియాతో చర్చల్లో ఆయనను కూడా భాగస్వామిని చేయాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.

మే లేదా జూన్ ప్రారంభంలో ట్రంప్, కిమ్‌ల మధ్య జరగనున్న సమావేశాల సందర్భంగా కిమ్‌లో ఎంత నిబద్ధత ఉందన్న విషయం బయటపడుతుంది.

ఉభయ కొరియాల సమావేశం దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేకున్నా, ఇది ఉభయ కొరియా నేతల రాజకీయ సూక్ష్మబుద్ధి, దౌత్యపరమైన చాకచక్యం, వారి దార్శనికతను తెలియజేసింది.

వ్యక్తిత్వం, నాయకత్వం అన్నవి చారిత్రక మార్పులకు చాలా ముఖ్యమని శుక్రవారం నాటి నాటకీయ పరిణామాలు చాటి చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)