ఉత్తర కొరియా: చరిత్రలోనే అతిపెద్ద సైనిక కవాతు.. చిన్న పొరపాటు దొర్లినా సహించరు

    • రచయిత, లారా బికర్
    • హోదా, బీబీసీ న్యూస్, సియోల్

ఉత్తరకొరియా చరిత్రలోనే అతిపెద్ద సైనిక కవాతు నిర్వహించేందుకు ఆ దేశం సన్నాహాలు చేస్తోంది.

ప్రతి అడుగు కచ్చితంగా పడేలా, దద్దరిల్లే తమ అరుపులు సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్‌కి వినిపించేలా వేల మంది సైనికులు కొన్ని నెలలుగా నిత్య అభ్యాసం చేశారు. సైనిక పటాటోపం చూపించడానికి, నాయకత్వంపై తమ నిబద్ధత ప్రదర్శించుకోవడానికి ఎప్పటికప్పుడు నిర్వహించే ఇలాంటి కవాతుల్లో చిన్న పొరపాటు దొర్లినా సహించరు.

అయితే, రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా కూడా ఇలాంటి కవాతులు నిర్వహిస్తారు. కఠినమైన ఆర్థిక ఆంక్షలు ఉన్నా సమకూర్చుకున్న కొత్త ఆయుధాలు, క్షిపణులను ప్రదర్శించడానికీ ఈ కవాతులను ఉపయోగిస్తారు.

2018లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య తొలి భేటీ జరిగిన తరువాత ఉత్తరకొరియా ఇంతవరకు ఎలాంటి బాలిస్టిక్ క్షిపణిని తన కవాతులలో ప్రదర్శించలేదు.

ఆ తరువాత 2019లో హనోయిలో ట్రంప్, కిమ్‌ల మధ్య చర్చలు అర్ధంతరంగా ముగిసిన తరువాత ఉత్తరకొరియా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను వరుసపెట్టి పరీక్షించింది.

ఉత్తరకొరియాలోని పాలక ‘వర్కర్క్ పార్టీ’ 75వ వార్షికోత్సవమైన అక్టోబరు 10 సందర్భంగా ఈ కవాతు నిర్వహిస్తున్నారు.

అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్దివారాల ముందు నిర్వహిస్తున్న ఈ కవాతును అమెరికాను ఢీకొట్టే సామర్థ్యం, ఆయుధాలు తమకున్నాయన్న సంకేతం పంపించడానికి ఉత్తరకొరియా ఉపయోగించుకోనుందా? సియోల్ కేంద్రంగా నడిచే ‘డైలీ ఎన్‌కే’ వెబ్‌సైట్ చీఫ్ ఎడిటర్ చెబుతున్న ప్రకారం ఈ కవాతు భారీ స్థాయిలో ఉండబోతుంది.

32 వేల మంది సైనికులను కవాతు కోసం సిద్ధం చేయాలని ప్యాంగ్యాంగ్(ఉత్తరకొరియా ప్రభుత్వ కేంద్రం) మార్చిలోనే సైన్యాన్ని ఆదేశించింది. దాంతో ఆ సైనికులు కవాతు చేయాల్సిన స్థలాన్ని కూడా విస్తరించాల్సి వచ్చిందని ‘డైలీ ఎన్‌కే’ వెబ్‌సైట్ చీఫ్ ఎడిటర్ లీ సాంగ్ యోంగ్ చెప్పారు.

‘‘ప్యాంగ్యాంగ్ మిరిమ్ విమానాశ్రయంలో ఇప్పుడు కొత్తగా 10 భవనాలు, రెండు రోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈసారి మేం కవాతులో ప్రదర్శించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను చూసే అవకాశం ఉందని భావిస్తున్నాను’’ అన్నారు లీ సాంగ్.

‘‘కిమ్ ఇల్-సుంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన 600 మంది విద్యార్థులు, పరిశోధకులూ ఈ కవాతులో పాల్గొంటారు. క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కోసం కొత్త నిపుణులను తయారుచేస్తుందీ యూనివర్సిటీ’’ అని చెప్పారు.

అయితే ఉత్తరకొరియా బయటి ప్రపంచం ముందు తన సత్తా చూపించడం కోసం ఇలాంటి ప్రదర్శనలు చేయదని జియాంగ్‌మిన్ కిమ్ అనే విశ్లేషకుడు ఎన్‌కే న్యూస్‌తో చెప్పారు.

‘‘దేశ ప్రజలను పాలించడానికి తమకున్న చట్టబద్ధతను పదేపదే నిరూపించుకునే వంశపారంపర్య నియంతృత్వ పాలకులను మేం సదా స్మరించుకోవాలి’’ అన్నారాయన.

‘‘కాబట్టి అక్టోబర్ 10 నాటి ఈ కవాతు కూడా సరిగ్గా అదే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు’’

కొత్త క్షిపణులు కనిపిస్తాయా

ఈ కవాతులో కొత్తగా ఎలాంటి క్షిపణులు ప్రదర్శిస్తారనే ఆసక్తి కొందరిలో ఉండగా మరికొందరిలో మాత్రం 2.5 కోట్ల ఉత్తరకొరియా ప్రజల సంక్షేమం గురించి ఆందోళన ఉంది.

2020 చాలా దేశాలకు అత్యంత కష్టమైన సంవత్సరం కాగా ఉత్తరకొరియాకు మాత్రం అంతకంటే ఎక్కువగా నష్టం చేసిన సంవత్సరం.

‘‘అనాథలుగా మారిన పిల్లల సంఖ్య, నిరాశ్రయులైనవారి సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగిందని నేను విన్నాను’’ అన్నారు లీ సాంగ్ యోంగ్.

‘‘దక్షిణకొరియాలో అలాంటివి అస్సలు ఊహించలేం కానీ ఉత్తరకొరియాలో మాత్రం ఎంతోమంది ఆకలితో చచ్చిపోతున్నారు’’పొరుగునే ఉన్న చైనా నుంచి కరోనావైరస్ వ్యాపించకుండా ఉత్తరకొరియా తన అన్ని సరిహద్దులనూ మూసేసింది.

సరిహద్దుల నుంచి కొంత బఫర్ జోన్ ప్రకటించి అది దాటి తమ దేశంలోకి ఎవరు వచ్చినా కాల్చిచంపేసేలా ఉత్తరకొరియా ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది.

దేశంలో కరోనా కేసులు లేవని ఉత్తరకొరియా చెబుతున్నప్పటికీ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఇంకా అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ దేశంలో కరోనా వ్యాపించకుండా కఠిన చర్యలకు ఆదేశిస్తున్నారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా

ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఉత్తరకొరియాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

దేశంలోని రాష్ట్రాల మధ్య ప్రయాణాలు కూడా లేవు. ‘‘సముద్ర, వాయు మార్గాల్లో కూడా మనుషులు, వస్తు రవాణా పూర్తిగా ఆగిపోయింది’’ అన్నారు లీ సాంగ్.

‘‘క్వారంటైన్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. అత్యున్నత స్థాయి అధికారి అయితేనో.. మిలటరీకి చెందినవారు అయితేనో మాత్రమే దేశంలోపల ప్రయాణాలకు కూడా అనుమతి ఉంటుంది’’ అన్నారు.

‘‘‘ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. దేశంలో కోవిడ్ కేసులు లేనట్లయితే ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతూ కఠిన ఆంక్షలు ఎందుకు కొనసాగిస్తున్నారని సరిహద్దుల్లోని వ్యాపారులు, స్మగ్మర్లు ప్రశ్నిస్తున్నారు.

’’గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి 8 ఎనిమిది నెలల్లో పొరుగునే ఉన్న చైనాతో వ్యాపారం 70 శాతం తగ్గిపోయింది.

అసలే కష్టాల్లో ఉన్న ఉత్తరకొరియాను వాతావరణ పరిస్థితులు మరిన్ని చిక్కుల్లోకి నెట్టాయి.

వరుస టైఫూన్‌లు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి.ప్రస్తుతం ‘80 రోజుల యుద్ధం’ పేరుతో కిమ్ జోంగ్ ఉన్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలకు ఉపక్రమించారు.

దేశవ్యాప్తంగా మొదలుపెట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రజలంతా తమ పొలాల్లో, కర్మాగారాల్లో, ప్రతి పని ప్రదేశంలో అదనంగా పనిచేయాల్సి ఉంటుంది.

స్వావలంబన సాధనకు ప్రజలు ఉపక్రమించాలని అక్కడి ప్రభుత్వ టీవీ చానల్‌లో సందేశాలు వస్తున్నాయి.దక్షిణ కొరియాలో పొలాల్లో ప్రస్తుతం వరి సీజన్ నడుస్తోంది.

మరి ఉత్తర కొరియాలో పరిస్థితి ఏమిటో తెలియదు. ఆ దేశ వ్యవసాయ రంగం ఎంతగా దెబ్బతిన్నదో తెలుసుకోవడం కూడా కష్టం. అయితే, 1.1 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రతకు దూరంగా ఉన్నారని మాత్రం తెలుస్తోంది.

వర్షాలు, టైఫూన్ల కారణంగా కొద్ది ప్రాంతంలో పొలాలు దెబ్బతిన్నా కూడా వేల మందికి ఆహారం కరవవుతుంది.

రెండు కొరియాల కథ

మా బృందం తూర్పు తీరంలోని జియోసోంగ్ సమీపంలోని డీమిలటరైజ్డ్ జోన్‌కి వెళ్లింది. తెల్లని ఇసుక ఉన్న సముద్రతీరం వెంబడి ఎత్తైన ఇనుప ముళ్ల కంచెల పక్కగా ప్రయాణించాం.

కంచెలకు ఆవల దూరంగా ఉత్తరకొరియాలోని పర్వతాలు కనిపిస్తున్నాయి.

వాటిపై అక్కడక్కడా చెక్ పాయింట్లు కూడా స్పష్టంగా కనిపించాయి.

ప్యాంగ్యాంగ్ జూన్‌లో సియోల్‌తో అన్నిరకాల కమ్యూనికేషన్లనూ తెంచుకుంది.

ఈ నెల ప్రారంభంలో దక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తి రెండు దేశాల మధ్య వివాదాస్పద జలాల్లోకి రావడంతో ఉత్తరకొరియా బలగాలు కాల్చి చంపేసి శవాన్నీ దహనం చేశాయి.

దక్షిణకొరియా వాసులకు అది షాక్‌కు గురిచేసింది. అయినా, ఉత్తరకొరియాకు దక్షిణకొరియాలో ఇంకా మిత్రులున్నారు.

70 ఏళ్లుగా సాగుతున్న ఈ వైరానికి ముగింపు దొరుకుతుందని చాలామంది ఆశిస్తున్నారు. ఉత్తరకొరియా నేత తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఈ ఏడాది చాలా నెమ్మదిగా కనిపిస్తున్నారు.

ఈ పరేడ్‌తో మళ్లీ తన దూకుడు స్వభావాన్ని చూపుతారని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)