జపాన్: జోకర్‌ వేషంలో వచ్చి, రైలులో 17 మందిని గాయపర్చిన వ్యక్తి

టోక్యో నగరంలో ఒక మెట్రో రైలులో ఆదివారం సాయంత్రం జోకర్ వేషంలో వచ్చిన 24 ఏళ్ల వ్యక్తి ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో టోక్యోలో హాలోవీన్ పార్టీలకు వెళుతున్న దాదాపు 17 మంది గాయపడ్డారు.

అనుమానితుడు ఆకుపచ్చ రంగు చొక్కా, పర్పుల్ సూట్ ధరించి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఆ వ్యక్తి రైలు బోగీ చుట్టూ ఓ ద్రవాన్ని స్ప్రే చేసి, దానికి నిప్పు అంటించాడు. ప్రయాణికులు మంటల నుండి తప్పించుకోవడానికి మిగతా బోగీల గుండా పరిగెత్తుతుండగా, మరికొందరు కిటికీల నుంచి బయటకు దూకుతున్నట్టు వీడియో ఫుటేజీలో కనిపించింది.

"ఇది హాలోవీన్ స్టంట్ అని నేను అనుకున్నాను" అని ఒక సాక్షి వార్తాపత్రిక యోమియురితో దాడి గురించి చెప్పారు. "అప్పుడు, ఒక వ్యక్తి పొడవాటి కత్తిని నెమ్మదిగా ఊపుతూ వెళుతున్నట్లు చూశాను".

టోక్యోకు పశ్చిమ శివార్లలో ఉన్న కొకుర్యో స్టేషన్ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం సుమారు 20:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు) ఈ దాడి జరిగింది.

ఆ వ్యక్తిని సంఘటనా స్థలంలోనే పోలీసులు అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.

తాను బ్యాట్‌మ్యాన్ కామిక్స్‌లోని జోకర్ పాత్రను ఆరాధిస్తానని నిందుతుడు పోలీసులకు చెప్పినట్టు వార్త సంస్థ క్యోడో తెలిపింది.

కామిక్స్‌లో బ్యాట్‌మ్యాన్‌కు బద్ధ శత్రువు, సూపర్ విలన్‌ అయిన జోకర్.

2019లో భారీ విజయం సాధించిన చిత్రం జోకర్. ఈ సినిమాలో నటుడు జాక్విన్ ఫీనిక్స్ నటించాడు. రైలులో చాలా మంది పదే పదే వేధించిన తర్వాత ఒక్కసారిగా దాడికి పాల్పడే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

ఇదే ఈ చిత్రంలో కీలకమైన సన్నివేశం. విలక్షణమైన జోకర్‌ పాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది.

ఉద్యోగం మానేయడం, స్నేహితులు దూరం పెట్టడంతో "జూన్ నుండి ఎవరో ఒకరిని చంపాలనుకున్నట్టు" దాడికి పాల్పడిన వ్యక్తి చెప్పినట్టు పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది.

"జోకర్‌ పాత్రధారిలానే ఉండాలనుకున్నాడు" కాబట్టి అతను జోకర్‌లాగే దుస్తులు ధరించాడని ఎన్‌హెచ్‌కే పేర్కొంది.

తనకు మరణశిక్ష పడేందుకే, ప్రజలను చంపాలనుకుంటున్నట్లు నిందితుడు అధికారులకు చెప్పినట్లు స్థానిక మీడియా నివేదికలు చెబుతున్నాయి.

గాయపడిన వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని టోక్యో అగ్నిమాపక శాఖను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏపీ తెలిపింది. దాడిలో కత్తిపోట్లకు గురైన వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని స్థానిక మీడియా పేర్కొంది.

దాడి చేసిన వ్యక్తి నుండి దూరంగా ప్రయాణీకులు పరిగెత్తడం, అత్యవసరంగా రైలు ఆపిన తర్వాత కిటికీల గుండా బయటకు దూకుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

అవి చాలా భయంకరమైన దృశ్యాలు అని వీడియోలలో ఒకదాన్ని చిత్రీకరించిన షున్సుకే కిమురా అనే వ్యక్తి జాతీయ ఎన్‌హెచ్‌కే వార్తా సంస్థతో చెప్పారు. "రైలు డోర్లు మూసి ఉన్నాయి. ఏం జరుగుతుందో మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. దీంతో మేము కిటికీల నుండి బయటకు దూకాము" అని ఆయన చెప్పారు.

జపాన్‌లో హింసాత్మక నేరాలు చాలా అరుదు. కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి కత్తి దాడులు చాలా జరుగుతున్నాయి.

ఆగస్టులో మరో టోక్యో ప్యాసింజర్ రైలులో ఓ వ్యక్తి కత్తితో చేసిన దాడిలో పది మంది గాయపడ్డారు. 2019లో కవాసాకిలో బస్సు కోసం ఎదురుచూస్తున్న పాఠశాల విద్యార్థుల సమూహంపై ఒక వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 18 మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)