You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
షాహీన్ అఫ్రిది: షాహిద్ అఫ్రిదీ 10 నంబర్ జెర్సీతో ఈ యువ బౌలర్‌కు ఉన్న లింకేంటి?
- రచయిత, పంకజ్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆదివారం మ్యాచ్‌కు ముందు భారత జట్టు టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో ఎప్పుడూ ఓడలేదు. క్రికెట్‌లో గణాంకాలకు ఎప్పుడూ స్థానం ఉంటుంది.
కానీ, రికార్డులు తారుమారవడం కూడా క్రికెట్‌లో సర్వ సాధారణం. ఈ మ్యాచ్ భారత్ క్రికెట్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.
భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం కాదు, ఘోరంగా ఓడిపోయింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమి అంటే ఘోర పరాజయమే అవుతుంది. ఈ ప్రపంచకప్ టైటిల్ గెలవాలనే భారత ఆశలకు ఈ ఓటమి ఒక పెద్ద షాక్ లాంటిది.
టాస్ ఓడిపోవడమే భారత్‌కు పెద్ద దెబ్బని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. దుబయి వాతావరణంలో పాకిస్తాన్ టాస్ గెలవడం కచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్. కానీ, ఆ తర్వాత ఆ జట్టు బంతితో, బ్యాట్‌తో కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చింది.
టీ20 క్రికెట్ ప్రపంచంలో అద్భుత ఓపెనర్లుగా భావించే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జోడీ భారత్‌కు చెత్త ప్రారంభం ఇచ్చింది. కానీ, ఈ రెండు వికెట్లు పడ్డానికి వారి చెత్త బ్యాటింగ్ కంటే ఎక్కువగా పాకిస్తాన్ అద్భుత బౌలింగే కారణమని చెప్పుకోవాలి.
పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరుగులేని ఫాస్ట్ బౌలర్లు ఎందరినో అందించింది. పాకిస్తాన్‌కు ఎప్పుడూ వారి ఫాస్ట్ బౌలింగే ఆయుధంగా ఉండేది. తాజా మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్ విజయానికి పునాదులు వేసింది, విజయంలో అతిపెద్ద భాగస్వామ్యం అందించింది షాహీన్ అఫ్రిదీనే అంటే అతిశయోక్తి కాదు.
షాహీన్ అఫ్రిది బౌలింగ్, అతడి వేగం, స్వింగయ్యే అతడి బంతులు భారత టాప్ బ్యాట్స్‌మెన్లనే ముప్పతిప్పలు పెట్టాయి. ఆ సమయంలోనే పాకిస్తాన్ విజయానికి పునాదులు పడ్డాయి. షాహీన్ షా అఫ్రిదీని అభిమానులు షాషా అని కూడా పిలుచుకుంటారు.
అద్భుత ప్రదర్శన
భారత్ క్యాంపులో కలకలం సృష్టించాలంటే, తొలి ఓవర్లోనే టీ20లో తిరుగులేని బ్యాట్స్‌మెన్ వికెట్ తీయడం కంటే మించింది ఏముంటుంది. ఒక అద్భుతమైన బంతికి రోహిత్ శర్మ ఏం చేయలేకపోయాడు. బంతి స్టంప్ ముందున్న అతడి వెనుక కాలికి తగిలింది. రోహిత్ శర్మకు ఆ సమయంలో రివ్యూ తీసుకునే అవకాశం ఉంది. కానీ అతడు దానికోసం వేచిచూడలేదు.
తర్వాత వంతు కేఎల్ రాహుల్‌ది. షాహీన్ అద్భుత బౌలింగ్‌కు ఆ వికెట్ ఒక ఉదాహరణ లాంటిది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఫాస్ట్ బౌలర్లు ఆ బంతిని చూసి తీరాలి. అది ఎంత వేగంగా బెయిల్స్ ఎగరగొట్టిందంటే, ఆ క్షణం పాకిస్తానీ క్రికెట్ అభిమానులకు ఒక అద్భుతంగా నిలిచిపోయింది.
ఇక గణాంకాల విషయానికొస్తే 6 అడుగుల 6 అంగుళాల ఎత్తుండే షాహీన్ అఫ్రిదీ 61 మ్యాచుల్లో 20 సార్లు తన మొదటి ఓవర్లోనే వికెట్లు తీశాడు.
మూడో ఓవర్లో రెండో వికెట్ కోల్పోయిన తర్వాత భారత్ జట్టు ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోయింది. మొత్తం ఇన్నింగ్స్ అంతా కష్టంగానే సాగింది.
అయితే, భారత్ 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. అది అంత తక్కువ స్కోరేం కాదు. కానీ పాకిస్తానీ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లకు వికెట్లు తీసే చాన్స్ కూడా ఇవ్వలేదు.
మొదటి స్పెల్‌లో మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసిన షాహీన్, తర్వాత తన చివరి ఓవర్లో విరాట్ కోహ్లీని కూడా అవుట్ చేశాడు. మొత్తం 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
షాహీన్ అఫ్రిది కెరియర్
మ్యాచ్ తర్వాత ట్వీట్ చేసిన షాహీన్ అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. పాకిస్తాన్ టీమ్‌పై నమ్మకం ఉంచాలని కోరాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ తర్వాత షాహీన్ అఫ్రిదీపై ప్రశంసలు కురిపించాడు. కొత్త బంతితో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని, తమ బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో పడేశాడన్నాడు.
2000 ఏప్రిల్ 6న పాకిస్తాన్ ఖైబర్ ఏజెన్సీలో పుట్టిన షాహీన్ అఫ్రిదీ 18 ఏళ్ల వయసులో 2018లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ప్రారంభించాడు.
అదే ఏడాది పాకిస్తాన్ తరఫున మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్, మొదటి వన్డే, మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు.
వెస్టిండీస్‌తో ఆడిన తన మొదటి టీ20లో షహీన్‌కు ఒక్క వికెట్ కూడా పడలేదు. అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో 38 పరుగులిచ్చిన అతడు రెండు వికెట్లు పడగొట్టాడు.
షహీన్ టెస్ట్ కెరియర్ న్యూజీలాండ్‌తో ప్రారంభమైంది. ఆ టెస్ట్ మ్యాచ్‌లో షహీన్‌కు మొత్తం 3 వికెట్లు లభించాయి. కానీ, ఆ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది.
షాహీన్ అఫ్రిదీని మంచి క్రికెటర్‌గా మలిచిన ఘనత అతడి అన్న రియాజ్ అఫ్రిదీకి దక్కుతుంది. రియాజ్ పాకిస్తాన్ తరఫున 2004లో ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటికి షాహీన్ వయసు నాలుగేళ్లే. కానీ ఆ తర్వాత షాహీన్‌కు కోచింగ్ ఇచ్చిన రియాజ్ అతడిని అంతర్జాతీయ క్రికెటర్ స్థాయికి తీర్చిదిద్దాడు.
షాహిద్ అఫ్రిదీతో బంధుత్వం
షాహీన్ ఇప్పటివరకూ పాకిస్తాన్ తరఫున 19 టెస్ట్ మ్యాచ్‌ల్లో అడి 76 వికెట్లు తీశాడు. వన్డేల్లో అతడి ఖాతాలో 53 వికెట్లు ఉన్నాయి. టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో 35 వికెట్లు పడగొట్టాడు.
షాహీన్ అఫ్రిదీకి, షాహిద్ అఫ్రిదీ బంధువా?
పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ కూతురు అక్సాతో షాహీన్ అఫ్రిదీకి నిశ్చితార్థం అయ్యిందని ఇదే ఏడాది వార్తలొచ్చాయి.
షాహీన్ అఫ్రిదీ కుటుంబ సభ్యులు పెళ్లికి తమను సంప్రదించారని షాహిద్ అఫ్రిదీ కూడా ట్వీట్ చేశారు.
వీరిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. షాహీన్ అఫ్రిది కూడా షాహిద్ అఫ్రిదీలాగే 10వ నంబర్ జెర్సీ ధరిస్తాడు.
ఇదే ఏడాది సెప్టెంబర్‌లో షాహీన్ 10వ నంబర్ జెర్సీ గురించి షాహిద్ అఫ్రిదీ ఒక కామెంట్ కూడా చేశాడు.
ఐసీసీ కూడా షాహీన్, షాహిద్ అఫ్రిదీ ఫొటోలతో ఒక ట్వీట్ చేసింది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా షహీన్ ప్రదర్శనను ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
- జనరల్ ఇందర్జీత్ సింగ్ గిల్: ఇందిరాగాంధీ మీటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయిన సైన్యాధికారి
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘బూతు’ సంస్కృతి
- బంగ్లాదేశ్: ‘దుర్గాపూజ మండపంలో ఖురాన్ పెట్టిన వ్యక్తిని గుర్తించాం’ - పోలీసుల ప్రకటన
- ఆర్యన్ ఖాన్ కస్టడీ అక్టోబరు 30 వరకు పొడిగింపు
- ఫేస్‌బుక్ ఇక కొత్త ప్రపంచాన్ని చూపించనుందా? ఏమిటీ మెటావర్స్
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- వైఎస్ జగన్: ‘విపక్ష నేతలు బూతులు మాట్లాడుతున్నారు.. వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు’
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)