No Time to Die: నిజమైన గూఢచారులు జేమ్స్‌బాండ్‌లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు

    • రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనా కారణంగా ఆలస్యం కావడం, మధ్యలో దర్శకుడు మారిపోవడం లాంటి పరిణామాల తర్వాత చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న జేమ్స్‌బాండ్ మూవీ 'నో టైమ్ టు డై' విడుదలైంది. బాండ్ సిరీస్‌లో ఇది 25వ సినిమా. కాగా, జేమ్స్‌బాండ్‌గా డేనియల్ క్రెగ్‌కు ఆఖరి చిత్రం.

బాండ్ సినిమా రిలీజైంది. బాగానే ఉంది. కానీ, అసలు జేమ్స్‌బాండ్‌కు, బ్రిటన్ గూఢచార సంస్థ ఎంఐ6 ( దీనినే సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ -ఎస్ఐఎస్ అని కూడా అంటారు)లోని వాస్తవిక పరిస్థితులకు ఏదైనా సంబంధం ఉందా ? ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో గూఢచార సంస్థలతో ప్రయోజనం ఎంత?

''సినిమాల్లో చూపించేదానికి, మాకు పోలికే ఉండదు'' అన్నారు శామ్. ( ఇది నిజం పేరు కాదు). బాండ్ సినిమాల్లో చూపించే దానికన్నా మేం పరస్పర సహకారంతో పని చేస్తుంటాం. మేం ఒంటరిగా బయటకు వెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అసలు ఉండదు కూడా. మా చుట్టూ ఎప్పుడూ ఒక సెక్యూరిటీ టీమ్ పని చేస్తుంటుంది'' అన్నారాయన.

శామ్ బ్రిటన్ గూఢచార ఏజెన్సీ ఎంఐ6లో పని చేస్తుంటారు. బాండ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో నేను ఆయనను ఇంటర్వ్యూకు ఒప్పించాను. ఆయన చెప్పినదాని ప్రకారం బాండ్ పాత్రలో చూపించే దానికి, నిజంగా ఎంఐ6లో పని చేసే వారికి పోలిక లేకపోతే, మరి నిజంగా వారి పని ఎలా ఉంటంది? వాళ్లు కేవలం ఆఫీసు నుంచే పని చేస్తారా లేక విదేశాలలో కూడా తిరుగుతుంటారా?

''అక్కడ రకరకాల పనులు ఉంటాయి'' అన్నారు టారా. ఇది కూడా ఆమె నిజమైన పేరు కాదు.

'' ఏజెంట్లకు ప్లాన్‌లు వివరించాలి. కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవారు అవసరం ఉంటుంది. ముందుండి నడిపించే వారు చాలా చురుకుగా వ్యవహరించాలి. ఇది ఒక వ్యక్తి పని కాదు. సినిమాల్లో చూపించేదానికి, వాస్తవికతకు తేడా ఉంటుంది. ఎవరైనా ఏదో సాధిద్దామని ఇక్కడకు వస్తే, ఇది మనవల్ల అయ్యేపని కాదని కొద్దిరోజుల్లోనే వారికి అర్థమవుతుంది'' అన్నారామె.

పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పడేస్తారా?

ఎంఐ6లో పని చేసే వారి దగ్గర ఆయుధాలు ఉంటాయా? ఇదే విషయాన్ని అధికారికంగా తెలుసుకుందామని ప్రయత్నించాను. ''ఉంటాయని చెప్పలేం, ఉండవనీ చెప్పలేం'' అని అటునుంచి జవాబు వచ్చింది

''మనుషుల్ని కాల్చిపడేసే ఆలోచన ఉన్నవారు మా ఆఫీసులో ఉంటారని ఊహించలేను. వారు మా గడప కూడా తొక్కలేరు''అని మరో అధికారి వెల్లడించారు.

అయితే, విదేశాలలోని కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలలో పని చేస్తున్న బ్రిటన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయుధాలు లేకుండా ఉండటం కష్టం. వారికి దగ్గర్లో ఉన్నవారు ఆయుధాలు పట్టుకుని, ఒక కంట కనిపెడుతుంటారని ఆ అధికారి వెల్లడించారు.

వాస్తవానికి ఎంఐ6లో పని చేసేవారు ఏజెంట్లు కాదు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు. ప్రభుత్వం తరఫున వారు కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, దేశభద్రతకు భంగం కలిగించే అల్‌ఖైదా లాంటి తీవ్రవాద సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుంటుంటారు.

ఎంఐ6 కోసం పని చేసేవారిలో ఏజెంట్లు అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తుంటారు. ఉద్యోగులు మాత్రం తమవి, తమ కుటుంబీకుల వివరాలు బయటపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు.

మరి ఎంఐ6 ఆఫీసర్లు ఏజెంట్లకు ఎంత సన్నిహితంగా పని చేస్తుంటారు? వాళ్లు ఫ్రెండ్స్‌లాగా కలిసి తిరుగుతుంటారా? అని అడిగాను.

''వాళ్లు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. మనం అవతలి వ్యక్తి ప్రాణానికి ముప్పు రాకుండా చూడాలి. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. ఇవన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుని జాగ్రత్త పని చేసుకోవాలి'' అని మరో ఎంఐ6 అధికారి వెల్లడించారు.

''మాతో కలిసి పని చేసే ఏజెంట్లు కొన్నిసార్లు ప్రాణాలను రిస్క్ చేస్తుంటారు. కొందరు మాత్రం రిస్క్ తీసుకోరు. మా కోసం పని చేయడానికి గర్వపడే వాళ్లు కూడా ఉంటారు. వారు మాతో ఉన్నారంటే ప్రమాదంలో ఉన్నట్లే లెక్క. ప్రాణాలు కూడా పోవచ్చు. మేం వారికి ఈ విషయం ముందే చెబుతాం'' అన్నారు టారా

ప్రపంచం మారిపోయింది

చివరి జేమ్స్‌బాండ్ సినిమా 2015లో విడుదలైంది. దాని తర్వాత పరిణామాలు చాలా మారిపోయాయి. ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకున్న స్వీయ రాజ్యం కుప్పకూలింది. ఇరాన్ అణు కార్యక్రమాలు విచ్ఛిన్నమయ్యాయి. తైవాన్ గురించి చైనా గడబిడ చేస్తోంది. ఎంఐ6 బిజీగా ఉండటానికి ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి.

ఇక, అంతా డిజిటల్‌మయం అయిన ఈ రోజుల్లో ఇతరుల సమాచారం దొంగిలించుకు రావడానికి ఓ వ్యక్తి అవసరం నేటికి ఉందా అన్నది ప్రశ్న. ఒక విధంగా ఇది పాత కాలపు ఐడియా.

''డేటా సేకరణ ప్రతిదశలోనూ వ్యక్తులు పని చేస్తారు. ఈ కోణంలో మేం సంబంధాలు ఏర్పరుచుకుంటాం. ఫీల్డులో పని చేసే ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు సహకరించేందుకు టెక్నాలజీని వాడుకుంటాం'' అన్నారు ఎమ్మా. ఆమె ఎంఐ6లో ఇన్-హౌస్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆమెది కూడా నిజమైన పేరు కాదు.

అంటే మీ లండన్ ఆఫీసు వివిధ రకాల గాడ్జెట్లు, యంత్ర సామాగ్రితో నిండి ఉంటుంది. అవునా? అని నేను అడిగాను.

''సినిమాల్లో చూపించినదానికి, వాస్తవానికి ఏం సంబంధం ఉండదు. మా దగ్గర పెద్ద ఇంజినీరింగ్ టీమ్ ఉంటుంది. సినిమాల్లో చూపించినట్లుగా మా వాళ్లంతా తెల్లడ్రెస్సులు వేసుకుని ఉండరు. అలాగని పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోరు. ఇక గాడ్జెట్లు విషయానికి వస్తే, ఆఫీసర్లకు కావాల్సిన సమాచారం కోసం అన్ని మార్గాలను వెతుక్కుంటాం'' అన్నారు ఎమ్మా.

అర్థం మారిన గూఢచర్యం

జేమ్స్‌బాండ్ పాత్రతో తొలి సినిమా వచ్చి 60 సంవత్సరాలు దాటింది. 1962లో మొదటి బాండ్ సినిమా డాక్టర్ నో వచ్చింది. ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన ఈ పాత్ర ఆ తర్వాత పదేళ్లకు గూఢచర్యం అనే మాటకు అర్థం మార్చేసింది.

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా రాక ముందు నుంచే ఎంఐ6లో పని చేసిన వారున్నారు. అప్పట్లో రికార్డులన్నీ భౌతికంగా ఉంచేవారు. వాటిని స్టీల్ ఫైలింగ్ క్యాబినెట్లలో దాచేవారు. అప్పటికి బయోమెట్రిక్ డేటా అందుబాటులో లేదు. అసలు ఎంఐ6 ఒక ఏజెన్సీగా ఉనికిలోకి రావడమే 1994 వరకు జరగలేదు.

అప్పట్లో దొంగ గుర్తింపు కార్డులు, గడ్డాలు, మీసాలు, గాజులు వేసుకుని వేరే దేశంలో తమకు కావాల్సిన ప్రదేశానికి వెళ్లడం సులభంగా ఉండేది.

ఈ రోజుల్లో అది కష్టంగా మారినా అసాధ్యమేమీ కాదు. ఉదాహరణకు రష్యా గూఢచార సంస్థ జీఆర్‌యు కు చెందిన టీమ్ ఒకటి 2018లో ఇంగ్లాండ్‌లోని శాలిస్‌బరిలోకి ప్రవేశించి మాజీ కేజీబీ ఆఫీసర్‌ సెర్గీ స్క్రిపాల్‌లను హత్య చేసిందని శాలిస్‌బరి సిటీ పోలీసులు ఆరోపించారు.

అయితే, డేటా రివల్యూషన్‌లో భాగంగా ఐరిస్, బయోమెట్రిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ఎన్‌క్రిప్షన్, క్వాంటం కంప్యూటింగ్ తదితర సాంకేతికతలు పెరగడంతో గూఢచర్యం కష్టతరమైంది.

కానీ, మనిషి తెలివి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. ''ఈ ప్రపంచం మనం స్పందించడానికన్నా వేగంగా మారిపోతోంది'' అన్నారు అలెక్స్ యాంగర్.

ఆయన ఎంఐ6లో ఆరు సంవత్సరాలు పని చేశారు. అలెక్స్ యాంగర్‌ను స్ఫూర్తిగా తీసుకుని 'నో టైమ్ టు డై' సినిమాలో 'ఎం' అనే పాత్రను సృష్టించారు.

ఇక చివరగా చెప్పే విషయం ఏంటంటే, నిజ జీవితంలో ఎంఐ6లాంటి సంస్థలో స్త్రీలు, పురుషులు తమ లక్ష్యాల కోసం కలిసి పని చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)