You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు ఎందుకు తగ్గుతాయి? టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచే ఆహారం ఏది?
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
శైలజ(పేరు మార్చాం)కు 48 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆమె భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రతి చిన్న మాటకు విసుక్కోవడం పెరిగిపోయింది.
పడక గదిలో శైలజపై చేయి కూడా వేయడం లేదు. దాంపత్య జీవితంలో సమస్యలు రావడం మొదలైంది.
మొదట్లో ఇదంతా వయసు వల్ల కలుగుతున్న మార్పు అని భావించారు. కానీ, ఆయనలో అసహనం రోజురోజుకీ పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.
"ఆయనకు దగ్గరగా వెళ్లి చేయి వేసినా కూడా కోరిక లేదని పక్కకు తిరిగి పడుకుంటున్నారు. నేనంటే ఇష్టం లేదా? సెక్స్ అంటేనే ఇష్టం లేదా అనేది నాకు అర్ధం కావడం లేదు" అంటూ బాధపడ్డారు శైలజ.
"సాధారణ సమయంలో నాతో బాగానే ప్రవర్తిస్తున్నప్పటికీ, పడక గదిలో మాత్రం ఆయన పూర్తిగా కొత్త వ్యక్తిలా మారిపోయారు. చేయి వేస్తే కూడా నాపై మండి పడుతున్నారు" అని శైలజ చెప్పారు.
50 ఏళ్ల ఈ వయసులో భర్త వివాహేతర సంబంధాలేమైనా పెట్టుకున్నారా అనే అనుమానం శైలజను వేధిస్తోంది.
ఇది డాక్టర్ దగ్గరకు వెళ్లి చర్చించాల్సిన విషయమా? మానసిక సమస్యా అనేది ఆమె తేల్చుకోలేకపోతున్నారు. ఆఫీసులో ఏమైనా ఒత్తిడి ఎక్కువై ఇలా మారిపోయారా అనేదీ ఆమెకు అర్థం కావడం లేదు. ఏ విషయమూ ఆయన శైలజ చర్చించడం లేదు.
ఈ సమస్య ఎవరికి చెప్పాలో ఆమెకు అర్ధం కావడం లేదు. ఈ మధ్యనే ఆయనకు డయాబిటిస్ కూడా ఉన్నట్లు తెలిసింది. అందుకు మందులు వాడుతున్నారు. మధుమేహం సోకిన వారంతా ఇలాగే ప్రవర్తిస్తారా?
మరో వైపు శైలజకు మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి శైలజ, ఆమె భర్త మధ్య నెలకోసారి కూడా శృంగారం ఉండడం లేదు.
"నా ఆరోగ్య విషయం చూసుకోవాలా, లేదా భర్త విసుగును, అసహనాన్ని భరించాలో అర్థం కావడం లేదు" అని శైలజ అన్నారు.
మహిళల్లో మెనోపాజ్ వస్తుందని, ఆ సమయంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయని విన్నారు కానీ, పురుషులు కూడా ఇలాంటి దశ ఎదుర్కొంటారనే విషయం గురించి ఆమె ఎప్పుడూ వినలేదు.
ఇక ఈ మనోవేదన భరించలేక ఆమె తన డాక్టర్ స్నేహితురాలితో ఈ విషయాన్ని చర్చించారు. ఆమె ఇది ఆండ్రోపాజ్ కావచ్చనే సందేహాన్ని వ్యక్తం చేసి వైద్యున్నిలను సంప్రదించమని సలహా ఇచ్చారు.
ఈమధ్య నెట్ ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్ పై విడుదల అయిన బాంబే బేగమ్స్ వెబ్ సిరీస్ కూడా మహిళల మెనోపాజ్ గురించి ప్రస్తావించింది. కానీ, ఆండ్రోపాజ్ గురించి జరిగే చర్చ చాలా అరుదుగా వినిపిస్తుంది.
పురుషులకు మెనోపాజ్ లాంటి దశ ఉంటుందా? ఈ విషయం అసలు బహిరంగంగా చర్చిస్తారా? వైద్య పరిభాషలో దానినెలా పిలుస్తారు?
ఆండ్రోపాజ్
పురుషుల్లో వచ్చే మెనోపాజ్ లాంటి దశను ఆండ్రోపాజ్ అంటారని వైద్య నిపుణులు చెబుతారు. ఇది సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుందని మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి.
ఆండ్రోపాజ్‌ను మేల్ మెనోపాజ్ అంటూ మహిళల్లో ఏర్పడే మెనోపాజ్‌తో పోల్చడం సరికాదని రాజమండ్రికి చెందిన డయాబెటాలజిస్ట్, ఎండోక్రైనాలజీ నిపుణులు డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం అన్నారు.
"స్త్రీలందరిలోనూ మెనోపాజ్ ఏర్పడుతుందని కానీ, ఆండ్రోపాజ్ పురుషులు అందరిలోనూ కనిపించదు. కొందరికి మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది" అని చెప్పారు.
లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన లోపం వల్ల కానీ, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యల వల్ల కానీ, ఊబకాయం వల్ల కానీ ఆండ్రోపాజ్ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.
ఆండ్రోపాజ్ లక్షణాలెలా ఉంటాయి?
ఆండ్రోపాజ్ వయసు పెరిగిన వారందరిలోనూ కనిపించదు. వయసుతో పాటూ పురుషుల హార్మోన్లలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఆండ్రోపాజ్ ఏర్పడుతుంది.
పొగ తాగడం, నిద్ర లేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపం వల్ల ఆండ్రోపాజ్ లక్షణాలు కనిపిస్తాయని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
ఇదే విషయాన్ని డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం సమర్ధించారు.
జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా ఇలాంటి లక్షణాలు మధ్య వయస్సు ఉన్న వారిలో కూడా కనిపించవచ్చని చెప్పారు.
టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గడం, ఆండ్రోజెన్ నిల్వలు తగ్గడం, హైపోగోనాడిజమ్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పురుషుల్లో లైంగిక ఆసక్తిని పెంచేందుకు, యుక్త వయస్సులో వచ్చే మార్పులకు, మానసిక శారీరక శక్తి వృద్ధికి, కండరాల పటుత్వానికి, ఇతర శారీరక పరిణామ వృద్ధికి టెస్టోస్టిరాన్ దోహదం చేస్తుంది.
హార్మోన్ల స్థాయిలు తగ్గిపోవడం వల్ల లైంగిక సామర్ధ్యం పై ప్రభావం చూపడంతో పాటు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు:
శరీరంలో శక్తి తగ్గినట్లు అనిపించడం
మానసిక ఒత్తిడి, విచారం
ఉత్సాహం లేకపోవడం
ఆత్మవిశ్వాసం లోపించడం
ఏకాగ్రత తగ్గడం
శరీరంలో కొవ్వు స్థాయిలు పెరగడం
కండరాలలో పటుత్వం తగ్గడం
రొమ్ములో పెరుగుదల కనిపించడం
ఎముకల బలహీనత
లైంగిక సామర్ధ్యం, కోరిక తగ్గడం
నిద్ర లేమి
శరీరంపై ఉన్న రోమాలు రాలిపోవడం
వృషణాల పరిమాణంలో తగ్గుదల
హాట్ ఫ్లాషెస్
"అయితే, 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ ఈ పరిస్థితి రాదు. పునరుత్పత్తి అవయవాల సామర్ధ్యం కూడా పూర్తిగా తగ్గదు" అని డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం చెప్పారు.
సాధారణంగా మధుమేహం, ఊబకాయం ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయని అన్నారు.
సాధారణంగా టెస్టోస్టిరాన్ స్థాయిలు ప్రతీ డెసీ లీటర్‌కు 250 - 1100 నానోగ్రాములు ఉండాలని కాలిఫోర్నియాకు చెందిన ఫెసీ మెడికల్ గ్రూప్ చెబుతోంది. అయితే, వీటి స్థాయి గురించి వివిధ వైద్య సంస్థలు చెప్పే ప్రమాణాల మధ్య వ్యత్యాసాలున్నాయి.
పురుషులకు 30 సంవత్సరాలు వచ్చిన తరువాత నుంచి ప్రతి ఏడాది సగటున టెస్టోస్టెరోన్ స్థాయి ఒక శాతం తగ్గుతూ వస్తుందని 'మయో క్లినిక్' చెబుతోంది.
దీనికి చికిత్స ఏంటి?
ఈ లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్యుల దగ్గరకు వేరే రకమైన సమస్యలతో సంప్రదిస్తారని చెప్పారు.
కొంత మంది మహిళలు, "ఈ మధ్య ఆయన దగ్గరకు రావడం లేదు" అని మాత్రమే చెబుతారని చెప్పారు. అలాంటి సమయంలో సమస్యకు మూల కారణం తెలుసుకుని చికిత్స చేయడం అవసరమని చెప్పారు.
దీనిని గుర్తించేందుకు, టెస్టోస్టిరాన్ స్థాయిలు తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేయిస్తారు.
టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గినట్లు కనిపించగానే, ఆండ్రోపాజ్ అని తేల్చేయకుండా ఆ లక్షణాలకు మూలకారణాలను తెలుసుకోవడం అవసరమని డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం అంటున్నారు.
దీనికి రకరకాల జెల్స్, పాచెస్, హార్మోన్ ఇంజెక్షన్స్ లాంటివి ఇచ్చి వైద్యం చేస్తామని చెప్పారు.
అయితే, హార్మోన్ ఇంజెక్షన్లను వాడటం వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
సరైన వ్యాయామం, తగినంత విశ్రాంతి కూడా ఈ లక్షణాలకు చికిత్సలా పని చేస్తాయని, మధుమేహం ఉన్న పక్షంలో ముందుగా దానిని నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు.
ఊబకాయం ఉన్న వారు వ్యాయామం, నడక మొదలుపెట్టి, డైట్ మార్చుకోవాలని చెప్పారు.
"ఇలాంటి లక్షణాలు కనిపించగానే తమ జీవితం అయిపోయిందనీ దాంపత్య సంబంధాలకు పనికిరాననీ భావించనవసరం లేదు" అని చెప్పారు.
ఆండ్రోపాజ్ లేకపోయినప్పటికీ కూడా కొంత మంది నకిలీ వైద్యులు అనవసరమైన వైద్యం చేసి రోగులను మోసం చేస్తూ ఉంటారు. యూకేలో కొంత మంది వైద్యులు ఆండ్రోపాజ్ లేకుండానే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి కోసం అనవసరంగా మందులు ఇస్తున్నట్లు 2012లో బ్రిటన్‌లో చేసిన ఒక అధ్యయనంలో తెలిసింది.
లైంగిక సమస్యలకు యునాని మందులతో చికిత్స చేస్తామంటూ రోగులను మోసం చేసిన నకిలీ క్లినిక్ వ్యవహారం 2019లో మీరట్‌లో బయటపడినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇలాంటి క్లినిక్‌లు చాలా పట్టణాలు, గ్రామాల్లో కనిపిస్తూ ఉంటాయి.
ఆండ్రోపాజ్ లక్షణాలు కనిపించినప్పుడు, సిగ్గుపడి నకిలీ సెక్స్ క్లినిక్‌లకు వెళ్లకుండా ఎండోక్రైనాలజిస్ట్ లేదా గుర్తింపు పొందిన వైద్యున్ని సంప్రదించడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ లక్షణాలను లైఫ్ స్టైల్, డైట్ మార్పుల ద్వారా కూడా తగ్గించుకోవచ్చని ముంబయికి చెందిన డైటీషియన్ డాక్టర్ శుభశ్రీ బీబీసీ తెలుగుకు వివరించారు.
ఒత్తిడిని అదుపులో పెట్టుకుంటూ, సమతులాహారాన్ని తీసుకోవడం, వ్యాయామాన్ని చేయడం, తగినంత సమయం నిద్రపోవడం ద్వారా ఆండ్రో పాజ్ లక్షణాలను నియంత్రణలో పెట్టవచ్చని శుభశ్రీ సూచించారు.
దీంతో పాటు, పొగ తాగడం, మద్యపానం లాంటి అలవాట్లను కూడా మానాలని అన్నారు.
మాంసం అధికంగా తీసుకోవడం, చక్కెరతో చేసిన తీపి పదార్ధాలు, కూల్ డ్రింకులు తీసుకోవడం వల్ల కూడా ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
కాయగూరలు, పండ్లు అధికంగా తీసుకోవాలి.
బాదం, ఖర్జూరం, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్2ను తినాలి.
కాల్షియం, జింక్, ఒమేగా 3, విటమిన్ డి , యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఈ ఉన్న ఆహారపదార్ధాలను తీసుకోవాలి.
కొవ్వు తక్కువగా ఉండే పాలు, పెరుగు, చీజ్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవాలి.
పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరలు తీసుకోవాలి. కేరట్, ఎరుపు, పసుపు సిమ్లా మిర్చి, టమాటో, క్యాబేజీ, బీట్ రూట్ లాంటివి తీసుకోవాలి.
శరీరంలో తగినంత జింక్ లేకపోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
చేపలు, చికెన్ లివర్, డార్క్ చాకొలేట్ లాంటి ఆహార పదార్ధాలు హార్మోన్ల సమతుల్యాన్ని మెరుగు చేస్తాయి.
ఒమేగా 3 లభించే సాల్మన్, ట్యూనా , గుమ్మడి గింజలు, అవిసె, సబ్జా గింజలలాంటివి ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.
కేవలం ఆహారం ద్వారా మాత్రమే విటమిన్ డి లభించదు. ఇందు కోసం ప్రతీ రోజూ మధ్యాహ్నపు ఎండలో 30-40 నిమిషాల సేపు నిల్చోవాలని. విటమిన్ డి ను కృత్రిమంగా చేర్చిన బలవర్ధక ఆహారాన్ని కూడా డైట్ లో చేర్చుకోవాలని సూచించారు.
టెస్టోస్టెరోన్ ఉత్పత్తికి విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
ఆలివ్ నూనె వాడటం ఉత్తమమని అన్నారు.
ప్రతీ రోజూ ఆహారంలో కచ్చితంగా పండ్లు ఉండేటట్లు చూసుకోవాలని చెప్పారు.
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం మానాలని సూచించారు.
శైలజ తన స్నేహితురాలితో మాట్లాడిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించేందుకు ఆమె భర్తను ఒప్పించారు. డాక్టర్‌తో చర్చించిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్‌ను సవరించుకున్నారు. వ్యాయామం మొదలుపెట్టారు.
సరైన డైట్, లైఫ్ స్టైల్ మార్పులు చాలా తేడాను చూపించాయని, ఆమె భర్త చికాకు పడటం తగ్గిందని శైలజ ఊపిరి పీల్చుకున్నారు.
"ఇప్పుడు నా సెక్స్ లైఫ్ కూడా యాక్టివ్‌గా మారింది. గతంలోలా దగ్గరకు వెళ్తే నాపై విసుక్కోవడం లేదు. ఇదంతా లైఫ్ స్టైల్ లో చేసిన మార్పుల వల్లే అని అనిపిస్తోంది" అని చెప్పారు.
"జీవితంలోకి తిరిగి సినిమాలు, షికార్లు వచ్చాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే" అంటూ నవ్వారు శైలజ.
ఇవి కూడా చదవండి:
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది కానీ ఎక్కువ మంది తినడం లేదు
- స్ట్రాబెర్రీల్లో సూదులు.. ముక్కలుగా కోసుకుని తినండి - హెచ్చరించిన ప్రభుత్వం
- మల దానం: మీకు 'సూపర్ పూ' అంటే తెలుసా?
- యూరిన్ థెరపీ: వాళ్ల మూత్రం వాళ్లే తాగుతున్నారు. మంచిదేనా?
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- ఎవరు ఎక్కువ ఆరోగ్యవంతులు.. మగవాళ్లా లేక ఆడవాళ్లా?
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా
- అన్నం ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా? బియ్యంలో ఉండే ఆర్సెనిక్ ఎంత ప్రమాదకరం?
- పిల్లల్లో పోషకాహార లోపానికి బ్యాక్టీరియాతో పరిష్కారం దొరుకుతుందా
- ఈ కీటకాలతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మేలు అంటున్న చెఫ్
- భారత్‌లోనే అత్యంత ఘాటైన రాజా మిర్చి కథ ఇది
- బ్రిటన్‌లో భారతీయ వంటకాల వ్యాపారం చేస్తున్న 76 ఏళ్ళ బామ్మ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)