తాలిబాన్: ‘మహిళలతో ఎలా మాట్లాడాలో మా వాళ్లకు తెలియదు, అందుకే స్త్రీలంతా ఇళ్లలోనే ఉండండి’

వీడియో క్యాప్షన్, తాలిబాన్: ‘‘మహిళలతో ఎలా మాట్లాడాలో మా వాళ్లకు తెలియదు, అందుకే లేడీస్ ఇళ్లలోనే ఉండండి’’

భద్రతా కారణాల రీత్యా మహిళలు కొంతకాలం పాటు ఇళ్లలోనే ఉండాలని తాలిబాన్ సూచించింది.

అఫ్గానిస్తాన్‌లో పాలన చేపట్టిన తాలిబాన్లు దేశంలో పలు సంస్థలకు, రాష్ట్రాలకు పాలనాధికారులను నియమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అఫ్గానిస్తాన్‌ను వీడి విదేశీ సైన్యాలు ఆగస్టు 31వ తేదీ నాటికల్లా వెళ్లిపోవాలన్న గడువును అమెరికాయే విధించిందని, కాబట్టి దానిని తాము పొడిగించబోమని స్పష్టం చేశారు. ఆ గడువును పొడిగించడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.

అమెరికాకు అన్ని వనరులూ, అవకాశాలూ ఉన్నాయని.. కాబట్టి అమెరికన్లను వాళ్లు గడువులోపే వెనక్కు తీసుకెళ్లొచ్చని చెప్పారు.

అయితే, అఫ్గాన్ పౌరులు దేశం నుంచి వెళ్లిపోవడాన్ని మాత్రం తాము అనుమతించబోమని చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న పరిపాలన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, త్వరలోనే తాము సమగ్ర ప్రణాళికలతో ముందుకొస్తామన్నారు.

ఇప్పుడు భద్రతా బలగాలు కూడా పనిచేయట్లేదని, తాలిబాన్ ఫైటర్లే శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారని గుర్తు చేశారు.

తాలిబాన్ ఫైటర్లకు మహిళలతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో వారికి శిక్షణ లేదని, కొందరికైతే మహిళలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదని చెప్పారు. అందుకే పూర్తి భద్రతా వ్యవస్థ ఏర్పాటయ్యే వరకూ, మహిళలు తాత్కాలికంగా ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నామన్నారు.

మహిళా ఉద్యోగులు ప్రస్తుతానికి ఇళ్లలోనే ఉంటారని, వాళ్లు తమ ఉద్యోగులేనని, వారికి వేతనాలు కూడా అందుతాయన్నారు.

సమగ్ర వ్యవస్థ ఏర్పాటైన తర్వాత మహిళా ఉద్యోగులు విధుల్లోకి రావాల్సిందేనన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)