బిట్‌కాయిన్‌: ఫిన్‌లాండ్, స్విట్జర్లాండ్‌, అర్జెంటీనా దేశాల కంటే ఎక్కువ కరెంట్ వినియోగించే కరెన్సీ

బిట్‌కాయిన్‌ను ఒక దేశంగా పరిగణిస్తే, ఫిన్‌లాండ్, స్విట్జర్లాండ్ లేదా అర్జెంటీనా దేశాలు ఏడాదిలో సగటున వాడే విద్యుత్తు కంటే అధికంగా వినియోగిస్తుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ (సీసీఏఎఫ్) విశ్లేషణలో వెల్లడైంది.

ఈ క్రిప్టోకరెన్సీ 'మైనింగ్'కి వాడుతున్న భారీ సర్వర్లు నిరంతరం పనిచేస్తూ అధికంగా విద్యుత్తును వినియోగిస్తుండటమే ఇందుకు కారణమని తెలిపింది.

పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం బిట్‌కాయిన్ మైనింగ్‌కి ఏటా రికార్డు స్ధాయిలో సుమారు 121.36 టెరావాట్ గంటల విద్యుత్ వాడుతున్నారు. ఇవి ఈ ఏడాది ఫిబ్రవరి నాటి లెక్కలు. ప్రస్తుతం బిట్‌కాయిన్ మైనింగ్ మరింత పెరిగింది. దాంతో ఈ విద్యుత్ వినియోగం కూడా పెరిగింది.

ఎన్నో దేశాలు ఏటా వాడుతున్న సగటు కరెంటు కంటే ఇది చాలా ఎక్కువ. ఇంత భారీ స్థాయిలో విద్యుత్ వాడకం వాతావరణంపైనా ప్రభావం చూపుతోంది.

బిట్‌కాయిన్ రేట్లు విపరీతంగా పెరగడంతో కొత్త కాయిన్స్‌ జనరేట్ చేయడానికి కంప్యూటర్ల వినియోగం భారీ స్థాయిలో పెరిగింది.

బిట్‌కాయిన్ ధర పెరిగే కొద్దీ, అది వినియోగించే విద్యుత్ కూడా పెరుగుతుందని సీసీఏఎఫ్‌లో పరిశోధకులుగా ఉన్న మైఖేల్ రౌచ్స్ పేర్కొన్నారు.

ఈ రకమైన అంచనాలను లెక్కించేందుకు వీళ్లు ఒక ఆన్‌లైన్ టూల్ తయారు చేశారు.

'ఎక్కువ కరెంటును వినియోగించేలా బిట్‌కాయిన్‌ను రూపొందించారు' అని రౌచ్స్ బీబీసీకి చెప్పారు. 'బిట్‌కాయిన్ ధర భారీగా పడిపోతే తప్ప భవిష్యత్‌లో కూడా దీన్ని మార్చలేం' అని వెల్లడించారు.

కేంబ్రిడ్జి బిట్‌కాయిన్‌ విద్యుత్ వినియోగ సూచిక (సీబీఈసీఐ)ను అధ్యయనకారులు తమ పరిశోధనకు ఆధారంగా తీసుకున్నారు.

బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తున్న కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు శక్తిసామర్ధ్యాలు కలిగినవని సీబీఈసీఐ సూచిక భావిస్తుంది. ఆ మేరకు బిట్‌కాయిన్ ఎంతమేర కరెంటును వినియోగిస్తుందో అంచనా వేస్తుంది.

ఒక కిలోవాట్ అవర్ విద్యుత్‌కు సగటున అయ్యే ఖర్చు, బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌కు ఎంత కరెంట్ అవసరంపడుతుందో పోల్చి చూస్తూ, మొత్తం మీద ఎంత విద్యుత్ వాడకం జరుగుతుందో సీబీఈసీఐ సూచిక అంచనా వేస్తుంది.

బిట్‌కాయిన్ ఎందుకంత విద్యుత్ వినియోగిస్తుంది?

బిట్‌కాయిన్లను మైనింగ్ చేసే కంప్యూటర్లు క్రిప్టోకరెన్సీ నెట్‌వర్క్‌కు అనుసంధానించి ఉంటాయి. వినియోగదారులు జరిపే ట్రాన్సాక్షన్లను పర్యవేక్షించడమే వీటి పని. అందులో భాగంగా అవి క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరిస్తుంటాయి.

ఇందుకుగానూ, మైనింగ్ చేస్తున్న వారికి అప్పుడప్పుడు కొంత మొత్తంలో బిట్‌కాయిన్లు వస్తుంటాయి. అయితే, ఇవి అందరికీ రావు. అందుకే దీన్ని ఒక లాటరీగా భావిస్తారు.

బిట్‌కాయిన్ల మైనింగ్ చేసేవారు పెద్ద సంఖ్యలో కంప్యూటర్లను వాడతారు. ఇవి గణిత సమస్యలను పరిష్కరించేందుకు రాత్రింబవళ్లు పని చేస్తూనే ఉంటాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.

విద్యుత్ వినియోగం vs కర్బన ఉద్గారాలు

విద్యుత్ వినియోగానికి, విడుదలవుతున్న కర్బన ఉద్గారాలకు మధ్య భారీ తేడా ఉందని క్యాసిల్ ఐలాండ్ వెంచర్స్ సహవ్యవస్థాపకుడు నిక్ కార్టర్ వాదించారు.

'మనం కేవలం విద్యుత్ వినియోగాన్ని మాత్రమే పరిశీలిస్తే మొత్తం కథను చెప్పడం లేదనే అర్థం' అని ఆయన బీబీసీతో చెప్పారు.

విద్యుత్‌లో ఎక్కువ మొత్తం శిలాజ ఇంధనాలైన బొగ్గు, ఆయిల్, గ్యాస్ ద్వారా తయారవుతోంది. ఇవి ఎక్కువ మొత్తంలో కాలుష్యాన్ని కలుగజేస్తాయి. పునరుత్పాదకత కలిగిన హైడ్రో ఎలక్ట్రిక్ లేదా న్యూక్లియర్ శక్తిని కూడా విద్యుత్ తయారీకి వాడుతున్నారు.

చైనాకు చెందిన బిట్‌కాయిన్ మైనింగ్ చేసేవారు, ఆ దేశంలో అదనంగా ఉన్న జలవిద్యుత్ శక్తిని వినియోగిస్తున్నారని కార్టర్ ఓ ఉదాహరణగా చెప్పారు. వారు దాన్ని వాడకపోతే, ఆ శక్తి నిరర్ధకంగా మారుతుందన్నారు.

చైనాలోని సిచువాన్, యునాన్ ప్రావిన్సుల్లో బిట్‌కాయిన్ పెరుగుదలకు కారణమిదేనని తెలిపారు.

ఆయిల్ వెలికితీతలో బయటకు వస్తున్న మిథేన్ వాయువు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారని, ఆ తరహా విద్యుత్‌ను కూడా బిట్‌కాయిన్ మైనర్లు వాడుతున్నారని చెప్పారు.

అయితే, ఇవి కొన్నిచోట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయని పర్యావరణ కార్యకర్తలు పేర్కొంటున్నారు. వీటి ఆధారంగా బిట్‌కాయిన్ ఇండస్ట్రీపై ఉన్న పర్యావరణ బాధ్యత తొలగిపోదని చెప్పారు.

బిట్‌కాయిన్ మైనింగ్ మరికొన్ని సంవత్సరాల్లో ముగిసిపోతుందని కార్టర్ పేర్కొన్నారు. గణిత సమస్యలను పరిష్కరించే విధానం ఏదో ఒక చోట ఆగిపోయేలా వ్యవస్థను రూపొందించారని తెలిపారు. ఇప్పటికే 88శాతం ఈ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఇకపై మైనింగ్‌ కొనసాగించడం అతి కష్టమని వివరించారు.

అయితే, బిట్‌కాయిన్ ధరలు పెరుగుతున్నన్నాళ్లు విద్యుత్ వినియోగం కూడా భారీగానే పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)