You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే అతి పెద్ద దోపిడీ, రూ. 4,455 వేల కోట్ల విలువైన డిజిటల్ టోకెన్ల చోరీ
క్రిప్టో కరెన్సీ చరిత్రలో అత్యంత భారీ దోపిడీ జరిగింది. ఈ చోరీలో హ్యాకర్లు సుమారు 60 కోట్ల డాలర్లు ( సుమారు రూ. 4,445 కోట్లు) దొంగలించారు.
ఇది గతంలో ఎన్నడూ జరగనంత భారీ దోపిడీ. హ్యాకర్లు పోలీ నెట్‌వర్క్‌కు చెందిన బ్లాక్ చైన్ సైటులోని లోపాలను కనిపెట్టి ఎథర్ లాంటి కొన్ని వేల డిజిటల్ టోకెన్‌లను దొంగలించినట్లు ఆ సంస్థ తెలిపింది.
హ్యాక్ చేసి కొల్లగొట్టిన ఆస్తులను వెంటనే తిరిగి ఇవ్వాలని పోలీ నెట్‌వర్క్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన లేఖలో హ్యాకర్లను కోరింది.
ఈ దోపిడీ ఇటీవల కాయిన్ చెక్, ఎమ్‌టీ గోక్స్ లాంటి ఎక్స్చేంజీలలో జరిగిన అతి పెద్ద మోసాలతో సమానం.
డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ చరిత్రలో ఈ దోపిడీ అత్యంత పెద్దది అని పోలీనెట్ వర్క్ తమ లేఖలో పేర్కొంది.
" ప్రపంచంలో ఏ దేశ చట్ట వ్యవస్థలైనా సరే ఈ నేరాన్ని తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి నేరస్తులను అదుపులోకి తీసుకుంటాయి" అని తెలిపింది.
"ఈ డబ్బు కొన్ని వేల మంది క్రిప్టో కరెన్సీ సభ్యులది. అంటే ప్రజల సొమ్ము" అని పేర్కొంది.
పోలీ నెట్‌వర్క్‌లో ఉన్న కాంట్రాక్ట్ కాల్స్‌లో ఉన్న లోపాలను హ్యాకర్లు కనిపెట్టి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీ నెట్‌వర్క్ నిర్వహించిన ప్రాథమిక పరిశోధనలో తేలినట్లు తెలిపింది.
హ్యాకర్లు కొన్ని కోట్ల విలువైన టోకెన్లను ఇతర క్రిప్టో కరెన్సీ వాలెట్‌లకు తరలించినట్లు తెలియడంతో, కాయిన్ డిపాజిట్లను బ్లాక్ చేయమని వివిధ ఎక్స్చేంజీలను కోరింది.
హ్యాకర్లు సుమారు 267 మిలియన్ డాలర్ల ఎథెర్ కరెన్సీ, 252 మిలియన్ డాలర్ల బినాన్స్ కోయిన్లు, 85 మిలియన్ డాలర్ల యూఎస్డీసీ టోకెన్లను చోరీ చేశారు.
ఈ హ్యాకింగ్ గురించి తమకు తెలుసనీ, తాము చేయగలిగేది చేస్తున్నామని బినాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చాంగ్ పెంగ్ ఝావ్ చెప్పారు.
"ఈ విషయంలో సహాయం చేసేందుకు సంస్థకు సంబంధించిన సెక్యూరిటీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం" అని చెప్పారు.
"అయితే, ఇవి తిరిగి లభిస్తాయనే గ్యారంటీ లేదు" అని అన్నారు.
పోలీ నెట్‌వర్క్ యూజర్లను ఒక బ్లాక్ చైన్ నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్ కి క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్ చేసుకునే వీలు కల్పిస్తుంది.
ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో..
ఎథెర్, బినాన్స్ లాంటి క్రిప్టో కరెన్సీ విధానాలను స్వతంత్రంగా అభివృద్ధి చేశారు.
దాంతో, అవి ఒకదానితో ఒకటి అనుసంధానమై పని చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ రంగంలో జరిగిన మోసాల వల్ల ఈ ఏడాది మొదటి 7 నెలల్లోనే 47.4 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఇది ఇప్పటి వరకు జరిగిన అత్యధిక స్థాయిలో జరిగిన నష్టం అని సైఫర్ ట్రేస్ సంస్థ మంగళవారం చెప్పింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)