హోర్ముజ్ జలసంధి: భారీ నౌకను హైజాక్ చేసిన సాయుధులు

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో సాయుధ వ్యక్తులు భారీ ఓడను హైజాక్ చేశారు.

అనంతరం ఇరాన్‌కు ప్రయాణించాల్సిందిగా ఆదేశించినట్లు లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ ధ్రువీకరించింది.

పెట్రోలియం ముడి పదార్థాలను రవాణా చేసే ఆస్పాల్ట్ ఓడ రద్దీగా ఉండే హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది.

అయితే ఈ హైజాక్ ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు.

కానీ ఇది ఇరాన్ బలగాల పనిగా అనుమానిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే, ఇరాన్ సైన్యం మాత్రం ఇందులో తమ ప్రమేయం లేదని అంటోంది.

ఇజ్రాయెల్ నౌకపై డ్రోన్ దాడి జరిగిన వారం లోపలే..

వారం కిందటే ఇజ్రాయెల్‌ కంపెనీకి చెందిన ఆయిల్ ట్యాంకర్‌‌పై డ్రోన్ దాడి జరిగింది.

ఈ ఘటనలో బ్రిటన్, రొమేనియన్ దేశాలకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

అది మర్చిపోక ముందే తాజాగా ఆస్పాల్ట్ ప్రిన్సెస్ నౌక అపహరణకు గురైంది.

దీనిపై యూఎస్, యూకే, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌ను నిందించాయి. దాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది.

ఎంవీ ఆస్పాల్ట్ ప్రిన్సెస్ నౌక ఎవరిది?

'ఎంవీ ఆస్పాల్ట్ ప్రిన్సెస్ నౌక దుబాయ్‌కి చెందిన ఒక కంపెనీకి సంబంధించినది. రెండేళ్ల క్రితం ఈ కంపెనీకి చెందిన ఒక నౌకను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హైజాక్ చేశారు' అని బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్ ఫ్రాంక్ గార్డ్‌‌నర్ చెప్పారు.

'నివేదికల ప్రకారం ఆస్పాల్ట్ ప్రిన్సెస్ ఓడ హోర్ముజ్ జలసంధిలోకి రాగానే సాయుధులైన 9మంది నౌకలోకి ప్రవేశించారు. ఈ జలసంధి ద్వారానే ప్రపంచంలోని ఐదో వంతు చమురు రవాణా అవుతుంది' అని ఆయన వెల్లడించారు.

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఫుజైరా వద్ద నౌకాయానం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అంతకుముందే యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) సూచించింది.

యూఏఈ తీరంలో జరిగిన ఈ సంఘటనపై అత్యవసరంగా దర్యాప్తు చేస్తున్నట్లు బ్రిటన్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి చెప్పారు.

ఈ ఘటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

'మంగళవారం అనేక నౌకల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని, టెహ్రాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి తప్పుడు వాతావరణం సృష్టించవద్దని వారిని హెచ్చరించినట్లు' ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)