అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రోదసి యాత్ర విజయవంతం

    • రచయిత, పాల్ రికన్
    • హోదా, సైన్స్ ఎడిటర్

ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ అంతరిక్షయానం విజయవంతమైంది.

అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ బృందం 'న్యూ షెపర్డ్' రాకెట్‌లో రోదసి యాత్ర పూర్తి చేసుకుని భూమికి చేరుకుంది.

భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు 'న్యూ షెపర్డ్' రాకెట్ నింగిలోకి ఎగిరింది.

కర్మన్ లైన్ దాటి వెళ్లడంతో రోదసిలోకి వెళ్లినట్లయింది. సుమారు 11 నిమిషాలలో యాత్ర పూర్తి చేసుకుని భూమికి చేరుకున్నారు.

తొలుత రాకెట్ భూమికి చేరుకోగా అనంతరం కొద్ది నిమిషాలకు జెఫ్ బెజోస్ బృందం ఉన్న క్యాప్యూల్ సురక్షితంగా భూమిని తాకింది.

తన సోదరుడు మార్క్ బెజోస్, 82ఏళ్ల వాలీ ఫంక్, 18ఏళ్ల విద్యార్థి ఒలివెర్ డేమెన్‌‌తో కలిసి బెజోస్ ఈ అంతరిక్ష యానం చేశారు.

అంతరిక్ష పర్యటకంపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని అవకాశాలుగా మార్చుకోవడమే లక్ష్యంగా బెజోస్ సంస్థ బ్లూ ఆరిజన్.. న్యూ షెపర్డ్ వ్యోమనౌకను తయారుచేసింది.

న్యూ షెపర్డ్‌ తీసుకెళ్లే క్యాప్సుల్‌కు ముందువైపు భారీ అద్దాలున్నాయి. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వీటిలోంచి భూమి అందాలను ఆస్వాదించొచ్చు.

‘‘ఆందోళనగా ఉందా? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అసలు లేనే లేదు. చాలా ఉద్వేగంతో ఉన్నా. కొత్త అంశాలు నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉన్నా. మేం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకోవాలని అనుకుంటున్నా’’అని అంతరిక్ష యానానికి ముందు సీబీఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెఫ్ బెజోస్ చెప్పారు.

‘‘దీని కోసం మేం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. వ్యోమ నౌక కూడా సిద్ధమైంది. సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నాం. ఇది నిజంగా అద్భుతమైన బృందం. చాలా చక్కగా అనిపిస్తోంది’’ అన్నారు బెజోస్.

‘‘నా కల నిజం అవుతోంది. దీని కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. అంతరిక్షంలోకి వెళ్లాలనేది నా చిరకాల స్వప్నం’’అని ఫంక్ చెప్పారు. భారరహిత స్థితిలో ఉన్నప్పుడు, తాను తలకిందకి కాళ్లు పైకి లేపి విన్యాసాలు చేస్తానని అన్నారామె.

1960ల్లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న మెర్క్యురీ- 13 బృందంలో ఫంక్ కూడా ఒకరు. ఆ జట్టులోని మిగతా పురుషులతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఆమె శిక్షణ తీసుకున్నారు. అయితే, అప్పట్లో ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఆమె అంతరిక్ష యానం కల సాకారం కాలేదు.

బ్రిటిష్ కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రయోగం జరుగుతుంది. అంటే భారత కాలమానంలో సాయంత్రం 6.30కి ఈ ప్రయోగం నిర్వహిస్తారు. టెక్సస్‌లోని వ్యాన్‌హార్న్ ప్రాంతంలో బెజోస్ సొంత ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.

76 కి.మీ. (2,50,000 అడుగుల) ఎత్తుకు వెళ్లిన తర్వాత బెజోస్ సోదరులు, ఫంక్, విద్యార్థి ఒలివెర్ డేమెన్‌లు ఉండే క్యాప్సుల్.. బూస్టర్ నుంచి వేరుపడుతుంది.

ఈ రాకెట్ మళ్లీ ప్రయోగ వేదిక నుంచి 2 మైళ్ల దూరంలో సిద్ధంచేసిన ప్రాంతంలో సురక్షితంగా కాలుమోపుతుంది. మరోవైపు క్యాప్సుల్ 106 కి.మీ. ఎత్తుకు చేరుకునే వరకు పైకి వెళ్తుంది.

‘‘భార రహిత స్థితిలో మేం దాదాపు నాలుగు నిమిషాలు ఉంటాం. అప్పుడు సీట్ బెల్టులు తీసేసి గాల్లో తేలుతాం. భూమి అందాలను కిటికీలో నుంచి ఆస్వాదిస్తాం’’అని సీబీఎస్ న్యూస్‌తో బెజోస్ చెప్పారు.

‘‘అది నిజంగా అద్భుతంగా ఉండబోతోంది. భూమిపై ప్రయోగాలతో భార స్థితిలోకి వెళ్లినా, నిజమైన భార రహిత స్థితిని అనుభవించడం చాలా బావుంటుంది’’అని బెజోస్ అన్నారు.

గరిష్ఠ ఎత్తుకు చేరుకున్న అనంతరం క్యాప్సుల్ వెనుదిరుగుతుంది. పారాచ్యూట్ సాయంతో ఇది ఎడారిలో సురక్షితంగా దిగుతుంది.

ఈ ప్రయోగాన్ని ‘‘బిలియనీర్ స్పేస్ రేస్’’గా మీడియా అభివర్ణిస్తోంది. అంతరిక్ష యానంలో బెజోస్‌కు గట్టి పోటీనిచ్చే సర్ రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొమ్మిది రోజుల తర్వాత తాజా ప్రయోగం జరుగుతోంది.

వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక సాయంతో బ్రాన్సన్ విజయవంతంగా రోదసిలోకి అడుగుపెట్టారు.

అయితే, బెజోస్‌తో పోటీ పడటం తన ఉద్దేశం కాదని ‘‘స్టీఫెన్ కోల్బెర్ట్ షో’’లో బ్రాన్సన్ చెప్పారు. అంతేకాదు ఆయన బెజోస్‌కు సూచన కూడా ఇచ్చారు. ‘‘ఈ అనుభూతిని ఆస్వాదించండి. జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది’’అని బ్రాన్సన్ అన్నారు.

అంతరిక్షాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ వాణిజ్య అంతరిక్ష యాత్రలను తీసుకొస్తున్నట్లు వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజన్ లాంటి సంస్థలు చెబుతున్నాయి. 2,50,000 డాలర్లకు తాము అంతరిక్ష యాత్రను అందుబాటులోకి తెస్తున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ తెలిపింది. అయితే, తమ టికెట్ ధర ఎంత ఉంటుందో ఇప్పటివరకు బ్లూ ఆరిజన్ వెల్లడించలేదు.

200 బిలియన్ డాలర్లతో ప్రపంచ సుసంపన్నుల్లో అగ్రగామిగా జెఫ్ బెజోస్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన అమెజాన్ సీఈవో పదవికి రాజీనామా చేశారు. బ్లూ ఆరిజన్‌తోపాటు తామ కంపెనీ కొత్తగా తీసుకొచ్చే కార్యక్రమాలపై దృష్టి సారించేందుకే ఈయన ఈ పదవి నుంచి తప్పుకున్నారు.

జెఫ్ బెజోస్ సోదరుడు మార్క్‌ కూడా సొంతంగా ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని స్థాపించారు. న్యూయార్క్ చెందిన స్వచ్ఛంద సంస్థ రాబిన్ హూడ్‌కు ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

ప్రస్తుత అంతరిక్ష యానంలో పాలుపంచుకోబోతున్న నాలుగో వ్యక్తి డచ్ ఈక్విటీ సంస్థ సోమెర్‌సెట్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ వ్యవస్థాపకుడు జోయిస్ డేమెన్ కుమారుడు. ఒలివెర్‌కు తొలుత రెండో యాత్రలో అవకాశం ఇస్తామని బెజోస్ సంస్థ చెప్పింది. అయితే, ఓ వ్యక్తి బృందం నుంచి తప్పుకోవడంతో ఒలివెర్‌కు ఈ అవకాశం దక్కింది.

మొదటగా ఈ నాలుగో వ్యక్తి స్థానం కోసం వేలం వేశారు. 28 మిలియన్ డాలర్లు చెల్లించి న్యూ షెపర్డ్ తొలి యాత్రలో భాగమయ్యేందుకు తాను సిద్ధమని ఓ వ్యక్తి ముందుకువచ్చారు కూడా. అయితే, ఆయన తప్పు కోవడంతో, ఒలివెర్‌ను ఈ అంతరిక్ష యానంలోకి తీసుకున్నారు.

అంతరిక్షాన్ని కూడా వ్యాపారంగా మార్చేస్తున్నారని అటు బెజోస్, ఇటు బ్రాన్సన్.. ఇద్దరిపైనా ఆన్‌లైన్‌లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ డబ్బులను కరోనావైరస్ కట్టడికి కళ్లెం వేసేందుకు ఉపయోగించాలని చాలా మంది సూచిస్తున్నారు.

‘‘నేను విమర్శకులను అర్థం చేసుకోగలను. అయితే, దీనివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన లేకే వారు అలా మాట్లాడుతున్నారు’’అని బ్రాన్సన్ వ్యాఖ్యానించారు.

‘‘తరిగిపోతున్న అటవీ సంపద, ఆహార పంపిణీ లాంటి అంశాల్లో ఉపగ్రహాలు ఎంతో సాయం చేస్తున్నాయి. వాతావరణ మార్పులపై పోరాటంలోనూ దోహదపడుతున్నాయి. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరగాలి’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)