తాలిబన్లు: 'మేం తలచుకుంటే రెండు వారాల్లో మొత్తం అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంటాం'

"తాలిబన్‌లు తలుచుకుంటే రెండు వారాల్లో అఫ్గానిస్తాన్ మొత్తాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోగలరు" అని తాలిబన్ రాజకీయ ప్రతినిధుల బృందం ముఖ్య సభ్యుడు షాహాబుద్దీన్ దిలావర్ మాస్కో పర్యటన సందర్భంగా అన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆ మాటలన్నారు దిలావర్.

గురువారం జో బైడెన్ వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ, అఫ్గానిస్తాన్ భద్రతా దళాలపై తనకు నమ్మకం ఉందని అన్నారు. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకుంటారన్న వాదనను ఖండించారు.

తాలిబన్‌ల వద్ద ఉన్న 75వేల మంది సాయుధులు, మూడు లక్షలమంది అఫ్ఘాన్ సైనికులతో పోటీ పడలేరని బైడెన్ అన్నారు.

తాలిబన్‌ల స్పందన ఏమిటి?

బైడెన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని తాలిబన్‌లు అన్నారు. అఫ్గానిస్తాన్ నుంచి శాంతియుతంగా వైదొగిలిగే అవకాశం విదేశీ సైనికులకు దక్కిందని షాహాబుద్దీన్ దిలావర్ అన్నారు.

షాహాబుద్దీన్ దిలావర్ నేతృత్వంలో తాలిబాన్ ప్రతినిధి బృందం గురువారం రష్యా రాజధాని మాస్కో చేరుకుంది. ఈ పర్యటనకు రష్యా తమను అధికారికంగా ఆహ్వానించిందని వారు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం, ఇరాన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఓ సమావేశంలో పాల్గొనేందుకు ఈ బృందం టెహ్రాన్ వెళ్లింది.

బైడెన్ తాలిబన్ గురించి ఏమన్నారు?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్‌లో ఇచ్చిన ప్రసంగంలో, అఫ్గానిస్తాన్‌లో మరో ఏడాది యుద్ధం చేయడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని, పైగా అక్కడ నిరవధికంగా యుద్ధం కొనసాగడానికి అది ఒక కారణం అవుతుందని అన్నారు.

అఫ్గానిస్తాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకోవడం జరిగే పని కాదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 75వేల మంది తాలిబన్‌లు మూడు లక్షల మంది అఫ్ఘాన్ సైనికుల ముందు నిలబడలేరని అన్నారు.

అమెరికా భద్రతా దళాలు అఫ్ఘానిస్తాన్ నుంచి వైదొలిగినప్పటికీ 650 నుంచి 1000 మంది సైనికులు అక్కడే ఉంటారని భావిస్తున్నారు.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబార కార్యాలయం, కాబుల్ విమానాశ్రయం భద్రత కోసం వీరిని అక్కడే ఉంచుతారని సమాచారం.

ఇటీవల అమెరికాలో జరిపిన కొన్ని సర్వేలలో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై భారీ మద్దతు లభించింది.

కాగా, సైన్యాన్ని వెనక్కు రప్పించడంపై అనేకమంది రిపబ్లికన్ మద్దతుదారులకు ఇంకా సందేహాలు ఉన్నాయని ఈ సర్వేలో తేలింది.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా భద్రతా దళాలకు సహాయం చేసే అనువాదకులు, దుబాసీలు, ఇతర అఫ్గాన్లను ఆ దేశం నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బైడెన్ తెలిపారు.

వీరి కోసం 2500 స్పెషల్ మైగ్రెంట్ వీసాలు జారీ చేశామని, అయితే, ఇప్పటివరకు వీరిలో సగం మందే అమెరికా చేరుకోగలిగారని చెప్పారు.

చైనాకు తాలిబన్ సందేశం

అమెరికా పత్రిక 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్‌'లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, గతంలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న చైనాలోని వీగర్ తిరుగుబాటు బృందాలతో తాలిబన్‌కు చారిత్రక సంబంధం ఉంది. ఇది చైనాకు ఆందోళన కలిగించే విషయం.

కానీ ఇప్పుడు చిత్రం మారిపోయింది. తాలిబన్, చైనా ఆందోళలను శాంతింపజేసే ప్రయత్నాలు చేస్తోంది. తమ ప్రభుత్వాన్ని చైనా గుర్తించాలని ఆరాటపడుతోంది.

చైనా, అఫ్గానిస్తాన్‌కు మిత్ర దేశంగా తాము భావిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ తెలిపారని చైనా ప్రభుత్వ వార్తాపత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' ప్రచురించింది.

అఫ్ఘాన్ పునర్నిర్మాణ కార్యక్రమాలలో చైనా పెట్టుబడుల గురించి చర్చించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు.

దేశంలో 85 శాతం ప్రాంతాలు తమ నియంత్రణలోనే ఉన్నాయని, చైనా పెట్టుబడులకు, కార్మికులను పూర్తి రక్షణ కల్పిస్తామని సుహైల్ షాహీన్ హామీ ఇచ్చారు.

"మేము వారిని స్వాగతిస్తున్నాం. వారు పెట్టుబడులతో మా దేశానికి వస్తే పూర్తి రక్షణ కల్పిస్తాం. వారి భద్రత మాకు చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)