You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్‌లో ఆ మహిళలు ఎందుకు తుపాకులు పట్టుకున్నారు
- రచయిత, అజీజుల్లా ఖాన్
- హోదా, బీబీసీ ఉర్దూ కోసం
‘‘తాలిబన్లు మంచి పనులు చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. మేం కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లలేం. అందుకే మేమంతా అఫ్గాన్ నేషనల్ ఆర్మీకి మద్దతిస్తూ తాలిబన్లను ఎదుర్కోవాలని అనుకుంటున్నాం’’
మహిళలు తమ హక్కుల కోసం తుపాకులు పట్టుకోవడాన్ని సమర్ధిస్తున్న కాబూల్ యూనివర్సిటీ విద్యార్ధిని, సామాజిక కార్యకర్త సయీద్ ఘజ్నీవాల్ అన్న మాటలివి.
‘‘తాలిబన్ విధానాలు, ప్రభుత్వం గురించి మాకు అవగాహన ఉంది’’ అన్నారామె.
దేశంలో ఉద్రిక్తతలు, తాలిబన్ల దాడులు పెరుగుతున్నవేళ అఫ్గానిస్తాన్‌లో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొనడంతో కొంతమంది మహిళలు రంగంలోకి దిగారు.
ఇటీవల అఫ్గాన్‌లో సాయుధులైన మహిళల ఫొటోలు తరచూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. వారి చేతిలో అఫ్గానిస్తాన్ జెండా, కలష్నికోవ్ రైఫిల్ కనిపిస్తున్నాయి.
వీరంతా అఫ్గాన్ నేషనల్ ఆర్మీకి మద్దతుగా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఒంటరిగా తాలిబన్లతో పోరాడలేదని, అందుకే తాము వారికి సహాయంగా ఉండేందుకు సిద్ధమయ్యామని వారు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఈ ఫొటోలు జోజ్జన్, గౌర్ ప్రాంతాల నుంచి వచ్చాయి. అయితే, ఈ రెండు ప్రాంతాలే కాక, కాబూల్, ఫర్యాబ్, హెరాత్ సహా పలు నగరాల్లో కూడా మహిళలు ఇలా సైన్యానికి మద్ధతిస్తున్నారు.
సయీదా ఘజ్నీవాల్ కాబూల్ నివాసి. ఆమె నిరసనల్లో పాల్గొనలేదు. కానీ, ఆ మహిళల పోరాటానికి ఆమె మద్దతిస్తున్నారు.
తాలిబన్లకు వ్యతిరేకంగా ఏకమవడం ఇప్పుడు ఆవశ్యకమని సయీదా బీబీసీతో అన్నారు. తాలిబన్ల అణచివేత చర్యలకు, హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని, స్వేచ్ఛ కోసం నిలబడాలని ఈ మహిళలు కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు.
‘అఫ్గాన్ మహిళలు తాలిబన్లను నమ్మరు‘
డాక్టర్ షుక్రియా నిజామీ పంజ్‌షీర్ నివాసి. కానీ, ఈమధ్య ఆమె కాబుల్‌లోనే నివసిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న అతి కొద్ది మహిళలల్లో ఆమె ఒకరు.
ప్రభుత్వం ఒంటరిగా ఉగ్రవాదులతో పోరాడలేదని, ప్రజల మద్దతు కూడా అవసరమని ఆమె అన్నారు.
ప్రజలు ఐక్యంగా ఉండడం శుభసూచకమని ఆమె భావిస్తున్నారు. మహిళలు అఫ్గాన్ సైన్యం వెనక ఉన్నారని, ఇది సైన్యంలో స్థైర్యాన్ని పెంచుతుందని డాక్టర్ నిజామీ అన్నారు.
‘‘అఫ్గానిస్తాన్ తాలిబన్ల నుంచి పూర్తిగా విముక్తి పొందేంత వరకూ ఈ మహిళల పోరాటం ఆగదు. 30 సంవత్సరాల క్రితం మా దేశాన్ని చుట్టుముట్టిన చీకటిని మళ్లీ దేశంలో కమ్ముకోనివ్వం” అని ఆమె అన్నారు.
అఫ్ఘానిస్తాన్లోని అనేక జిల్లాల్లో తాలిబన్లకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇరుపక్షాలూ విజయం మాదే అని ప్రకటనలు చేస్తున్నాయి.
దేశ ప్రజల్లో భయం నెలకొని ఉంది. తాలిబన్ల విజయధ్వానాలు చూస్తుంటే మళ్లీ ఆ దేశంలో చీకటి రోజులు కమ్ముకొచ్చేలా ఉన్నాయని ఆ మహిళలు గ్రహించారు.
తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరుగుతుండేవి.
ఖతార్‌లోని తాలిబాన్ రాజకీయ కార్యాలయానికి, అఫ్గానిస్తాన్ సాయుధ కార్యకలాపాలకు పాల్పడిన తాలిబాన్లకు తేడా లేదని, రెండూ ఒకేలా ఉన్నాయని సయీదా ఘజ్నీవాల్ అన్నారు.
"మాకు తాలిబన్ల మీద నమ్మకం లేదు. ఎందుకంటే తాలిబన్ల చరిత్ర, వారి పాలన గురించి మాకు బాగా తెలుసు. ఈ యుద్ధం అంతం కాదు. దేశం నాశనమైపోతుంది" అని ఆమె అన్నారు.
తాలిబన్లు మళ్లీ బలవంతంగా వారి విధానాలను అమలు చేస్తారా?
ఖతార్‌లోని తాలిబన్ రాజకీయ కార్యాలయ ప్రతినిధి సుహైల్ షాహీన్ మహిళల విషయంలో తాలిబన్ల పాలసీ గురించి మాట్లాడుతూ.. "మహిళలకు చదువుకుని, ఉద్యోగం చేసే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ, వారు ఇస్లాం పద్ధతులను సంపూర్ణంగా పాటించాలి. హిజాబ్ ధరించాలి" అని వివరించారు.
తాలిబన్ల నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని, అన్ని సంస్థలూ తమ తమ ఇస్లామిక్ సంప్రదాయాలు, శైలులను కొనసాగించవచ్చని అన్నారు.
గతంలో హిజాబ్ ధరించని మహిళలకు శిక్షలు విధించేవారు. ఇప్పుడు కూడా హిజాబ్ ధరించనివారి పట్ల అలాగే ప్రవర్తిస్తారా? అనే ప్రశ్నకు జవాబిస్తూ.. "సమయం వచ్చినప్పుడు తమ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడలేను" అని షాహీన్ అన్నారు.
మీడియా రిపోర్టులను అబద్ధాలుగా, నెగటివ్ ప్రోపగాండాగా వర్ణిస్తూ అఫ్గన్ తాలిబన్లు ఒక ప్రకటన జారీ చేశారు.
"తాలిబన్ల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో మీడియాపై, మహిళలపై అధిక ఆంక్షలు విధించారనుకోవడం ఒక అపోహ. ఆ ప్రాంతాల్లో పౌరులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఆ ప్రాంతాల్లో ప్రజలు తమ ఇస్లాం మత విశ్వాసాలకు అనుగుణంగా దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు" అని సుహైల్ షాహీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళలు ఎవరికి, ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
అఫ్గాన్ మహిళలు ఆయుధాలు చేతబట్టడం ఇదే మొదటిసారి. ఇదొక ప్రతీకాత్మక సూచన లాంటిదని, మహిళలు ఆయుధాలు పట్టుకుని రోడ్లపైకి రావడం ద్వారా తాలిబన్లను తాము వ్యతిరేకిస్తున్నట్లు బలంగా తెలియజేస్తున్నారని స్థానిక జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
"మహిళలు ఆయుధాలు చేపట్టడం రెండు సందేశాలను ఇస్తోంది. ఒకటి మా ప్రభుత్వానికి, సైన్యానికి వారి మద్దతు ఉందని తెలుపుతోంది. ఇది సైన్యానికి మరింత బలం చేకూరుస్తుంది. రెండోది, అఫ్గానిస్తాన్‌లో మహిళలు తాలిబన్ల అధికారాన్ని కోరుకోవట్లేదని అంతర్జాతీయ స్థాయిలో పొరుగు దేశాలకు ఇస్తున్న సందేశం" అని కాబూల్‌కు చెందిన జర్నలిస్టు అసద్ సమీమ్ అన్నారు.
తాలిబన్లు ఎవరికీ ఏమీ అడ్డు చెప్పరని, ఎన్జీవోలు చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు యధావిధిగా కొనసాగించవచ్చునని అఫ్గన్ తాలిబన్లు పదే పదే చెబుతున్నారు.
అయితే, ప్రస్తుత పరిస్థితి అఫ్గన్ మహిళలకు మరోసారి పెద్ద పరీక్ష కాబోతోంది. గతంలో అఫ్గానిస్తాన్ నుంచి పెద్ద యెత్తున ప్రజలు వలస వెళ్లి పోయినప్పుడు అఫ్గాన్ మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. పొరుగు దేశాల్లో కూడా వారికి కష్టాలు తప్పలేదు.
ఇవి కూడా చదవండి:
- ఒసామా బిన్ లాడెన్ తల్లి: నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు
- మోదీ మంత్రివర్గ విస్తరణ: రాజీనామా చేసిన పలువురు మంత్రులు
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ఏకే-47తో కాల్పులు జరిపిన ఆ అమ్మాయి చంపింది తాలిబన్లనా? తన భర్తనా?
- 'స్టాన్ స్వామి కస్టోడియల్ డెత్‌కు ప్రభుత్వానిదే బాధ్యత', వెల్లువెత్తుతున్న విమర్శల
- భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలు జరిగి మూడేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
- ‘బిన్ లాడెన్ బాడీగార్డు’కు జర్మనీలో జీవన భృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)