You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను ప్రోత్సహించేందుకు సతమతమవుతున్న దేశాలు
- రచయిత, స్టెఫానీ హెగార్టీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండు అంతర్జాతీయ సూపర్ పవర్ దేశాలు ఈ మధ్య కాలంలో ఒక కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితిలో చిక్కుకున్నాయి. అమెరికా, చైనా దేశాల తాజా జనాభా గణాంకాలు అక్కడి జనాభా తగ్గుముఖం పట్టినట్లు సూచిస్తున్నాయి.
ఈ తగ్గుదల వారు ఊహించినదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. రెండు దేశాలలో పునరుత్పత్తి రేటు వేగంగా తగ్గిపోతోంది. అలాంటప్పుడు దేశంలోని ప్రజలు తొందరగా వృద్ధులుగా మారిపోతే ఆర్ధిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వాలు తప్పించుకోవాలనే అనుకుంటాయి.
చైనా, అమెరికా ఇంకా అలాంటి స్థితికి ఏమీ చేరుకోలేదు. కానీ, పునరుత్పత్తి రేటును పెంచాలని ఆలోచిస్తున్న దేశాల అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకోవా ల్సిన పరిస్థితులైతే ఉన్నాయి.
ఇది అంత సులభంగా పరిష్కారాలు దొరకని ఒక చిక్కుముడి లాంటి సమస్య. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు రష్యా భారీగానే నిధులను వెచ్చించింది.
పిల్లలను కనేందుకు దంపతులకు ధన రూపంలో ప్రోత్సాహకాలు ప్రకటించింది. కానీ, ఇలాంటి విధానాలు అరుదుగా పని చేస్తాయి.
పిల్లలను కనే దంపతులకు అంత కంటే ఉత్తమమైన విధానం ఏదైనా కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను కనేందుకు ప్రభుత్వం ఎలా ఒప్పించగలదు?
1. పిల్లల పోషణకు ప్రభుత్వ పథకాలు
జపాన్‌లో నాగి చో అనే ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలో జననాల సంఖ్య బాగా తగ్గిపోవడంతో, గత 9 సంవత్సరాల నుంచి అక్కడి కుటుంబాలకు స్నేహపూర్వకంగా అండగా నిలిచే విధానాలను అమలు చేశారు. ఫలితంగా అక్కడ ద్వారా జననాల రేటు రెట్టింపైంది.
పిల్లలను కన్న కుటుంబాలకు బేబీ బోనస్‌లు, పిల్లల అలవెన్సులు ఇస్తారు. కానీ, ఒక చిన్నారిని నర్సరీ చదువుకు పంపించడానికి జాతీయ సగటులో సగం ఖర్చు అవుతుంది.
ఇక్కడ జననాల విషయంలో సాధించిన విజయం అసాధారణమైనది. కానీ, ఇదొక చిన్న గ్రామీణ పట్టణం.
మిగిలిన తూర్పు ఆసియా ప్రాంతాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అక్కడివారు తమ కుటుంబానికి, పనికి మధ్య సమతుల్యం పాటించలేక సతమతవుతున్నారు.
ప్రపంచంలోనే అతి తక్కువ పునరుత్పత్తి రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. ఈ దేశంలో గృహకల్పన, ఉచిత పిల్లల సంరక్షణ లేదా ఐవిఎఫ్ లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 130 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లలను కనడం కోసం ప్రత్యేక సెలవులు కూడా ఇచ్చింది. కానీ, ఈ పథకాలేవీ ఇక్కడ పని చేస్తున్నట్లు లేదు.
కిమ్ జియే సియోల్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు పిల్లలను కనే ఆసక్తి లేదు. కానీ, ఆమెకు తల్లితండ్రుల నుంచి పిల్లల్ని కనమనే ఒత్తిడి వస్తోంది. ప్రస్తుతం ఆమెకు మూడేళ్ళ కొడుకు ఉన్నారు. ఆమెకు పిల్లలను చూసుకునేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు వస్తున్నప్పటికీ అవి మరో సారి పిల్లల్ని కనేందుకు ప్రభావితం చేస్తాయని ఆమె అనుకోవడం లేదు.
పెద్ద పెద్ద నగరాలలో ప్రభుత్వం నిర్వహించే పిల్లల సంరక్షణ కేంద్రాలు తక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు అందులో చేర్చడం కోసం సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ప్రైవేటు సంస్థలు చాలా ఖరీదుతో కూడుకుని ఉంటాయి.
"ఒకళ్ళను పెంచడానికే కష్టంగా ఉన్నప్పుడు ఇంకొకరిని కనడానికి ఇష్టం లేదు. నాకు ఉన్న కొడుకు మీదే దృష్టి పెట్టాలని ఉంది. కుటుంబ జీవితానికి ఆటంకం కలిగించే పని విధానాలు ఉన్న తూర్పు ఆసియా దేశాల్లో ప్రభుత్వ విధానాలేవీ పని చేయవు" అని ఆమె అన్నారు.
కొరియాలో మాకు చట్టబద్ధమైన పని గంటలు, తగినంత మెటర్నిటీ, పెటర్నిటీ సెలవులు ఉన్నాయి. కానీ, వీటిని ఉపయోగించుకునే వారు చాలా తక్కువ" అని సియోల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిన్ హై ఓన్ కిమ్ చెప్పారు.
2. పని సంస్కృతి సరళం కావాలి
చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో పని సంస్కృతికి, కుటుంబ జీవితానికి మధ్య ఘర్షణ తలెత్తుతోంది.
పార్ట్ టైం ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్న దేశాల్లో అధిక పునరుత్పత్తి రేటు ఉంటోంది. అయితే, ఇలాంటి ఉద్యోగాలను ఎక్కువగా మహిళలు చేస్తారు. దాని వల్ల లింగ సమానత్వం దెబ్బ తింటోంది.
కానీ, ఎక్కువ వయసు వారు అధికంగా ఉన్న దేశాల్లో ఇది ఆచరణీయం కాదు. దీనివల్ల పని చేసే వారు తగ్గిపోతారు.
మహిళలను పని చేయనిస్తూనే పునరుత్పత్తిని కూడా పెంచవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో స్వీడన్ అనుసరిస్తున్న స్నేహపూర్వక కుటుంబ విధానాలను అందరూ మెచ్చుకుంటున్నారు.
"చాలా మంది మహిళలు పురుషులు తమ పిల్లలతో గడపాల్సి ఉంటుందని మేము అర్ధం చేసుకోగలం" అని స్టాక్ హాం యూనివర్సిటీలో ప్రొఫెసర్ గున్నార్ ఆండర్సన్ అన్నారు.
"పని గంటలు తగ్గించకుండా ఉండకుండా కూడా పనిని సరళం చేయవచ్చు" అని ఆయన అనాన్రు.
జర్మనీలో బ్రాడ్ బ్యాండ్ అందుబాటులో ఉండటం వల్ల విద్యావంతులైన మహిళలలో అధిక జననాలు ఏర్పడినట్లు 2017లో చేసిన ఒక అధ్యయనం చెబుతోంది.
ఇంటి దగ్గర నుంచే పని చేస్తూ వారు పిల్లలతో ఎక్కువ సేపు గడిపే అవకాశం పొందుతున్నారు.
అయితే, నిరక్షరాస్యుల్లో ఇది పెద్ద ప్రభావం చూపలేదు.
"ఇలాంటి విధానమే ఇప్పుడు ఫిన్లాండ్ లో పని చేస్తోంది" అని పునరుత్పత్తి పై ప్రభుత్వ సలహాదారు ప్రొఫెసర్ అనా రోట్ క్రిచ్ చెప్పారు.
ఫిన్లాండ్ చాలా సులభంగా ఆన్లైన్ విద్యావిధానానికి మారినట్లు చెప్పారు.
3. పురుషులకు కూడా ఇంటి పని
అధ్యయనం జరిపిన చాలా దేశాల్లో మహిళలకు పురుషుల కంటే తక్కువ ఖాళీ సమయం దొరుకుతుందని తేలింది. వారు చేసే ఇంటి పనికి వేతనం ఉండదు.
ఇంటి పనుల్లో పురుషులు కూడా పాలుపంచుకున్నపుడు పునరుత్పత్తి సామర్ధ్యం పెరిగినట్లు ఎరిన్ చెప్పారు.
స్వీడన్ లో కూడా 2000 సంవత్సరంలో పిల్లల సంరక్షణకు విపరీతమైన సబ్సిడీలు ఇవ్వడం వల్ల పునరుత్పత్తి రేటు పెరిగింది.
అలాగే, ఆ దేశంలో పిల్లల్ని కన్న వెంటనే తల్లితండ్రులకు ఎక్కువగా సెలవులు కూడా ఇచ్చారు.
పిల్లల బాల్యంలో అమలైన పథకాలు వారు పెద్ద అయ్యేవరకు ఉంటాయి.
స్వీడన్ లో 73 శాతం మహిళలు 56 శాతం మంది పురుషులు ప్రతి రోజు ఒక గంట సేపు ఇంటి పని చేస్తారు.
"మీకు మేమున్నాం అంటూ పంపే రాజకీయ, సామాజిక సంకేతాలు చాలా ప్రాధాన్యం వహిస్తాయి. మీరు ఒంటరి కారు. మీరు ఈ పనిని నిర్వహించగలరు అనే భరోసా అవసరం" అని ప్రొఫెసర్ రోట్ క్రి చ్ అన్నారు.
కానీ, గత దశాబ్ద కాలంగా స్కాండినేవియా దేశాల్లో పునరుత్పత్తి రేటు తగ్గుతూ వస్తోంది.
"జనాభా అధ్యయనాల ప్రకారం చూస్తే, ఇది సమస్యే కాదు" అని ఆక్స్‌ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ ఏజింగ్ లో ప్రొఫెసర్ అన్నారు.
పశ్చిమ యూరోప్ లో 1970ల నుంచీ పునరుత్పత్తి రేటు తక్కువే ఉన్నప్పటికీ జనాభా పెరుగుతూనే ఉంది" అని ఆయన అన్నారు.
"జనాభా తగ్గుదల వల్ల వాతావరణ మార్పుల పై కూడా సానుకూల ప్రభావమే చూపిస్తుంది. మన తాత ముత్తాతలకు ఉన్నంత మంది పిల్లలు ఇప్పుడు లేకపోవడం వల్ల ప్రపంచానికి ఊపిరి తీసుకునే స్థలం దొరుకుతోంది" అని ప్రొఫెసర్ లీసన్ అన్నారు.
పునరుత్పత్తి అంశాలను పరిపూర్ణంగా గమనిస్తే ప్రభుత్వానికి చాలా లాభాలు ఉంటాయి.
దక్షిణ కొరియా వారంలో పని గంటలను 44 నుంచి 40 గంటలకు తగ్గించినప్పుడు పురుషులు వృద్ధ తల్లితండ్రులను చూసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఎరిన్ చెప్పారు.
ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు కావల్సినంత మంది పిల్లల్ని కనేందుకు సహాయం చేసేలా ఉండాలి అని ప్రొఫెసర్ రోట్ క్రిచ్ అన్నారు.
"ప్రభుత్వ విధానాలు పిల్లల సంక్షేమం, పిల్లలు ఉన్న వారి సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి. పుట్టిన పిల్లలు మంచి జీవితం గడిపేలా చూడటం చాలా ముఖ్యం."
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: యోగీ ఆదిత్యనాథ్ జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)