You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జురాంగ్ రోవర్‌ను అంగారక గ్రహంపై దించిన చైనా
చైనా రోవర్ ‘జురాంగ్’ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శనివారం ప్రకటించింది.
ఆరు చక్రాల జురాంగ్ రోబో మార్స్ ఉత్తరార్ధగోళంలో విస్తారమైన భూభాగం యుటోపియా ప్లానెటియాను లక్ష్యంగా చేసుకుని పని చేస్తుంది.
ఒక రక్షణ కవచం, పారాచూట్, రాకెట్ ప్లాట్‌ఫార్మ్ సహాయంతో ఈ రోవర్ మార్స్‌పై దిగింది.
ఇప్పటివరకు అమెరికన్లు మాత్రమే అంగారక గ్రహంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దించగలిగారు. ఇతర దేశాలు ప్రయత్నించినప్పటికీ ఏవీ విజయం సాధించలేదు.
ఈ నేపథ్యంలో చైనా సాధించిన ఈ విజయం అపురూపమైనది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ మిషన్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
"ఇదొక అద్భుత విజయం. ఈ సవాలును ధైర్యంగా స్వీకరించి, అంతరిక్ష పరిశోధనలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు" అని కొనియాడారు.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైన్స్ విభాగం అధిపతి థామస్ జుర్బూకెన్ కూడా చైనా అంతరిక్ష పరిశోధకుల బృందాన్ని అభినందించారు.
"అంగారక గ్రహం గురించి అవగాహన పెంచే రీతిలో ఈ మిషన్ అందించే సమాచారం కోసం అంతర్జాతీయ సైన్స్ సమాజంతో పాటూ నేను కూడా ఎదురుచూస్తున్నాను" అని ఆయన అన్నారు.
జురాంగ్ మార్స్‌పై ఎలా దిగింది?
బీజింగ్ కాలమానం ప్రకారం, శనివారం 7 గంటల 18 నిమిషాలకు జురాంగ్ మార్స్‌పై దిగింది. దిగిన తరువాత 17 నిమిషాలకు భూమికి సిగ్నల్ పంపింది.
జురాంగ్ అంటే అగ్ని దేవుడు. ఫిబ్రవరిలో జురాంగ్‌ను మార్స్ కక్ష ‘టియాన్వెన్-1’లో ప్రవేశపెట్టారు.
అప్పటినుంచీ రోవర్ ఆ కక్షలో తిరుగుతూ మార్స్‌ను సర్వే చేసింది. రోబో దిగేందుకు అనుకూలమైన ప్రదేశాన్ని అన్వేషించింది.
భూమి నుంచి మార్స్‌కు 320 మిలియన్ కి.మీ. దూరం ఉంటుంది. అంటే అక్కడి నుంచి భూమికి రేడియో సందేశాలు అందేందుకు సుమారు 18 నిమిషాలు పడుతుంది. అందుచేత రోవర్ కదలికలను ఈ టైం లాగ్‌ను దృష్టిలో పెట్టుకుని పరిశీలించాల్సి ఉంటుంది.
ఎయిరోషెల్ నుంచి రోవర్ బయటకువచ్చి మెల్లిగా తొమ్మిది నిముషాల పాటూ మార్స్ ఉపరితలంపై దిగింది. అక్కడ ఉన్న గాలిని పైకి నెడుతూ నెమ్మదిగా దిగింది. అదే సమయంలో పారాచూట్ తెరుచుకుని వేగాన్ని తగ్గిస్తూ ల్యాండింగ్‌కు సహాయపడింది. చివరిగా జురాంగ్ రాకెట్‌తో నడిచే బెంచ్‌పై దిగి మార్స్ ఉపరితలంపైకి జారుకుంది.
అంగారక గ్రహంపై దిగడం చాలా సవాలుతో కూడుకున్నపని.
అయితే, ఇటీవల కాలంలో చైనా అంతరిక్ష పరిశోధనలో వేగంగా ముందుకు వెళుతోంది. చంద్రుడిపైకి రోవర్లను పంపించింది. అవి చంద్రుడి ఉపరితలంపై నుంచి నమూనాలను సేకరించి భూమికి పంపించాయి.
ఈ రోవర్ మార్స్‌పై కనీసం 90 రోజుల పాటూ పరిశోధన కొనసాగిస్తుందని, అది అందించిన సమాచారంతో అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మార్స్‌పై ఒకరోజు అంటే 24 గంటల 39 నిముషాలు. జురాంగ్ రోవర్ 240 కేజీల బరువు ఉండి, సోలార్ ప్యానల్స్ సహాయంతో దానికి కావలసిన శక్తిని గ్రహిస్తుంది.
రోవర్ ముందుకు కదిలేందుకు సహాయం చేసే విధంగా, అక్కడి చిత్రాలను తీయగలిగే విధంగా రోవర్‌కు పొడవైన కెమేరాలు ఉంటాయి.
అంగారక గ్రహంపై రాళ్లల్లో మినరాలజీ (ఖనిజశాస్త్రం)ని, అక్కడి వాతార్వరణ స్వభావాన్ని, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఐదు అదనపు సాధనాలను అమర్చారు.
రాళ్లపై రాపిడి కలిగించడానికి, వాటి రసాయన స్వభావాన్ని అధ్యయనం చేయడానికి అనువుగా జురాంగ్‌కు లేజర్ సాధనాలు అమర్చారు. అమెరికా రోవర్లకు కూడా ఇదే విధమైన పరికరాలు ఉంటాయి.
అక్కడి ఉపరితలం అడుగున ఉండే నీటిని లేదా మంచును గుర్తించేందుకు ఒక రాడార్ ఉంటుంది.
యుటోపియా ప్లానెటియా ప్రాంతంలోనే 1976లో అమెరికా కూడా వికింగ్-2 మిషన్‌ను మార్స్‌పై దించింది. మార్స్ చరిత్ర తెలుసుకునే తొలి పరిశోధనలకు ఈ మిషన్ ఎంతో ఉపయోగపడింది.
మార్స్‌పై ఒకప్పుడు సముద్రం ఉండే అవకాశం ఉందని ఈ మిషన్ చేసిన పరిశోధనలు సూచించాయి. మార్స్ లోపలి పొరల్లో తగినంత మంచు ముద్దలు ఉన్నట్లు రిమోట్ సెన్సింగ్ సాటిలైట్లు సూచించాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)