You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కంగన రనౌత్ కేసులో బాంబే హైకోర్టు ఆగ్రహం: 'పౌరులపై ప్రభుత్వ సంస్థలు బలప్రయోగం సరికాదు' - NewsReel
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన కార్యాలయ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, అందువల్ల అందులో కొంత భాగాన్ని కూల్చేస్తామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇచ్చిన నోటీసులను బాంబే హైకోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వ సంస్థలు పౌరులపై బలప్రయోగం చేయడం సరికాదని ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అధికారుల చర్య చట్టాలన్ని దుర్వినియోగం చేయడమేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ముంబై పాలిహిల్స్‌లోని కంగనా బిల్డింగ్‌లో కొంతభాగాన్ని సెప్టెంబర్ 9న బీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన నోటీసుపై కంగనా కోర్టుకు వెళ్లగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పటికే బిల్డింగ్ కొంతభాగం కూల్చి వేసినందున బీఎంసీ తనకు రూ. 2 కోట్లు పరిహారం ఇవ్వాలని కంగనా తన పిటిషన్‌లో కోరారు.
అయితే జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ఒక అధికారిని నియమిస్తామని, మార్చికల్లా దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు వెల్లడించింది.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా తీవ్రమైన విమర్శలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కంగనాల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు నడిచాయి.
సరిగ్గా అదే సమయంలో, కంగనా అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ బీఎంసీ నోటీసులు ఇవ్వడంతో ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అన్న ఆరోపణలు వినిపించాయి.
ఆమె ఆఫీసు బిల్డింగ్‌లో కొంత భాగాన్ని కూల్చివేసిన వెంటనే కంగనా ఆ వీడియోను విడుదల చేసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తన నోరు నొక్కాలని చూస్తోందని ఆరోపించారు.
కూల్చివేతకు 15 రోజులు ముందు నోటీసు ఇవ్వాలని నిబంధన ఉన్నా అధికారులు దాన్ని పట్టించుకోలేదని, అలా నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు.
అయితే బీఎంసీ ఈ వాదనను తిరస్కరించగా, కంగనా కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు బీఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అక్రమ కట్టడాలన్నింటిపైనా ఇదే వేగంతో చర్యలు చేపట్టి ఉంటే ఈ రోజు ముంబయి నగరం మరింత అందంగా ఉండేదని వ్యాఖ్యానించింది.
కాకినాడ-ఉప్పాడ తీరంలో బంగారం వేట... తుపాను వస్తే తీర ప్రాంతంలో బంగారం దొరుకుతుందా?
నివర్ తుపానుతో ఆంధ్రపదేశ్ తీర ప్రాంతా జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. రహదారులు తెగిపోయాయి. అయితే, ఇదే సమయంలో కాకినాడ తీరంలో ప్రజలు బంగారం కోసం వేట సాగిస్తున్నారు.
కాకినాడ- ఉప్పాడ మధ్యలో పలువురు మత్స్యకారులకు ఇప్పటికే బంగారం ముక్కలు లభించినట్లు చెబుతున్నారు. సూర్యారావుపేటకు చెందిన మల్లాడి అంజమ్మ బీబీసీతో మాట్లాడుతూ, "నిరుడు కూడా కొందరికి దొరికాయి. ఇప్పుడు కూడా తుపాన్లు వచ్చినప్పుడు దొరుకుతాయని అంతా అంటున్నారు. అందుకే మేము కూడా ప్రయత్నిస్తున్నాం" అని చెప్పారు. రెండు రోజులుగా వెతికినా తమకైతే ఏమీ దొరకలేదని చెప్పారు. "అయితే, మా పేటలో కొందరికి దొరికింది. అదేమిటో తెలియదు" అని ఆమె అన్నారు.
సముద్ర తీరంలో బంగారం దొరకడంపై స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి అనుభవాలున్నాయని కాకినాడకు చెందిన ముమ్మిడి లక్ష్మణ్ అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "ఏటా వివిధ సందర్భాల్లో ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న పలు నివాసాలు కొట్టుకుపోతున్నాయి. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో అందులో కలిసిపోతున్నాయి అలాంటి సమయంలో ఇళ్లల్లో దాచుకున్న బంగారం సహా పలు వస్తువులు కొట్టుకుపోతుంటాయి. ఇక వరదల సమయంలో కూడా అనేక చోట్ల ఇళ్లల్లో వస్తువులు సముద్రంలోకి కొట్టుకు వస్తాయి. వాటిలో విలువైన వస్తువులు కూడా ఉండడంతో వాటిని వెదికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు" అని చెప్పారు.
సముద్రంలో స్నానానికి వచ్చే వారు కొందరు ఏవో వస్తువులను కోల్పోతుంటారు. ఉంగరాలు, చెవి రింగులు వంటివి జారిపోతుంటాయి. అవి ఇలాంటప్పుడు తీరానికి కొట్టుకొచ్చే అవకాశం ఉంటుందని, వాటి కోసమే ప్రజలు వెతుకులాట కొనసాగిస్తున్నండవచ్చని లక్ష్మణ్ అన్నారు.
'బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజి ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ ఖాళీ చేస్తా'
జో బైడెన్‌ను తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ధ్రువీకరిస్తే తాను వైట్‌హౌస్ వీడుతానని డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడానికి ఆయన నిరాకరించారు. దానికి అంగీకరించడం కష్టమని ఆయన గురువారం విలేఖరులకు చెప్పారు.
ఓటింగ్‌లో మోసాలు జరిగాయని మరోసారి ఆయన నిరాధార ఆరోపణలు చేశారు.
అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ ప్రకారం ట్రంప్‌కు 232 ఓట్లు రాగా, బైడెన్ 306 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
అధ్యక్షుడుగా ఎన్నికవడానికి 270 ఓట్లు కావాలి. పాపులర్ ఓటింగ్‌లో కూడా బైడెన్ 60 లక్షలకు పైగా ఆధిక్యం సంపాదించారు.
జనవరి 20న జో బైడెన్ అధ్యక్షుడుగా ప్రమాణం చేయనుండడంతో, అధికారికంగా ఓటు వేయడానికి ఎలక్టర్స్ వచ్చే నెలలో సమావేశం కానున్నారు.
అధ్యక్షుడు ట్రంప్, ఆయన మద్దతుదారులు ఈ ఎన్నికలను సవాలు చేస్తూ ఎన్నో పిటిషన్లు వేశారు. కానీ వాటిలో చాలా పిటిషన్లను కొట్టివేశారు.
కొన్ని వారాల అనిశ్చితి తర్వాత, ఈ వారం ప్రారంభలో ట్రంప్ చివరికి అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్, ఆయన టీమ్‌కు అధికార మార్పిడికి అంగీకరించారు.
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కోల్పోతే వైట్ హౌస్ విడిచి వెళ్లడానికి మీరు ఒప్పుకుంటారా అని విలేఖరులు గురువారం అడిగిన ప్రశ్నకు ఆయన "కచ్చితంగా, కచ్చితంగా వెళ్తాను. మీకది తెలుసు. వాళ్లు అలా చేస్తే (జో బైడెన్‌ను ఎన్నుకుంటే), వారు పొరపాటు చేసినట్టే" అన్నారు.
ఓటమిని అంగీకరించేది లేదని ఆయన సూచించారు. "దాన్ని అంగీకరించడం చాలా కష్టం. ఎందుకంటే, అక్కడ భారీ ఎత్తున మోసం జరిగినట్లు మనకు తెలుస"ని ఆయన ఏ ఆధారాలూ లేకుండానే ఆరోపించారు..
జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానా, లేదా అనేది ట్రంప్ చెప్పలేదు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- చాందసవాద ఇస్లాంను మార్చేందుకు ఫ్రాన్స్ ఏం చేస్తోంది?
- గంగా నదిలోకి ఘరియల్ మొసళ్లను వదులుతున్నారు.. ఎందుకంటే...
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)